ప్రభుత్వ భవిష్యత్‌ను తేల్చేది ఆ యువతే

23 Feb, 2019 08:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ప్రధానంగా ప్రభావితం చేసింది కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతే. భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసిన విద్య, ఉద్యోగాలు, నైపుణ్యాభివద్ధి, మేకిన్‌ ఇండియా లాంటి హామీలను నమ్మడం వల్ల యువతలో మెజారిటీ ఆ పార్టీకే ఓటువేసి గెలిపించారు. 2018లో కేంద్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2014 నాటి ఎన్నికలకు 2.40 కోట్ల మందికి కొత్తగా ఓటు హక్కు రాగా. ఈసారి ఇప్పటికీ 3.40 కోట్ల మందికి కొత్తగా ఓటు హక్కు వచ్చింది. 2020 నాటికి దేశంలో 45 లక్షల మందికి ఓటు హక్కు వస్తుందని, అప్పటికీ దేశం మొత్తం జనాభాలో 34 శాతం మంది యువతే ఉంటారన్నది నిపుణుల అంచనా. కొత్తగా ఓటు హక్కు వచ్చినవాళ్లు 18 ఏళ్ల నుంచి 23 ఏళ వరకు ఉండవచ్చు. ఓ పార్లమెంట్‌ ఎన్నికల నాటికి ఓ యువకుడు లేదా యువతికి 17 ఏళ్లు ఉంటే మరో ఐదేళ్లకు వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల నాటికి వారికి 23 ఏళ్లు వస్తాయి. కనక మనం వీరందరిని యువతగానే పరిగణిస్తాం.

అధికారిక లెక్కల ప్రకారం యువత అంటే ఎవరు? ఎన్నేళ్ల నుంచి ఎన్నేళ్ల ప్రాయం మధ్యనున్న వారిని యువత అని వ్యవహరిస్తారు ? ఓటు హక్కుతో ప్రమేయం లేకుండా ఐక్యరాజ్య సమితి పరిశోధనా సంస్థలు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు ప్రాయం వారిని యవత కింద పరిగణిస్తున్నాయి. 2003లో ఖరారు చేసిన జాతీయ యువజన విధానం ప్రకారం 13 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ప్రాయం కలిగిన వాళ్లను యువతగా పరిగణిస్తే, 2014లో సవరించిన జాతీయ యువజన విధానం ప్రకారం 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య ప్రాయంగల వారిని యువతగా వ్యవహరిస్తున్నారు. స్టాటస్టిక్స్‌ మంత్రిత్వశాఖ పరిధిలోని నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆపీస్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) 2017లో విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం 15 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కులను యువతగా పరిగణిస్తారు.

18 ఏళ్ల వరకు ఎలాగు ఓటు హక్కు ఉండదు కనుక 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్యనున్న యువతనే గత పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలను ప్రధానంగా ప్రభావితం చేసిందని  ‘ఇండియాస్పెండ్‌’ పరిశోధన సంస్థ విశ్లేషించింది. ముఖ్యంగా యువత ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే కీలకమయ్యాయి. అవి వరుసగా బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు. మొత్తం లోక్‌సభ సీట్లు 543 కాగా, ఈ ఐదు రాష్ట్రాల నుంచే 43 శాతం అంటే, 235 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. గత లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో యువత ఎక్కువగా ఉన్న ఈ ఐదు రాష్ట్రాల్లో ఒక్క పశ్బిమ బెంగాల్‌ మిగతా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ బాగా రాణించింది.

2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోను బీజేపీ విజయం సాధించింది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్‌ యూ, రాష్ట్రీయ జనతాదళ్‌లు కూటమిగా విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జనతాదళ్‌ యూ, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు కలిసి మహా కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో 43 శాతం ఓట్లను సాధించిన బీజేపీ ఏకంగా 71 సీట్లను దక్కించుకుంది. 2017లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది. ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ–ఎస్పీ పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇటీవల జరిగిన రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.

2014 నాటి లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో బీజేపీ 17 శాతం ఓట్లను సాధించినప్పటికీ కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది. కొన్ని సార్లు కొంత శాతం ఓట్లు ఇటు నుంచి అటు తరలి పోయినా ఫలితాలు తలకిందులవుతాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్రలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా ఉండడం, యువతకు ఉద్యోగాల కల్పనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమవడం (గత 45 ఏళ్లలో ఎన్నడు లేనంతగా దేశంలో నిరుద్యోగ సమస్య 6.1 శాతానికి చేరుకుందని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదిక వెల్లడించిన విషయం తెల్సిందే) తదితర కారణాల వల్ల యువత ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక బెంగాల్లో బీజేపీ పరిస్థితి గతం కన్నా మెరుగుపడిన గొప్పగా రాణించే పరిస్థితి ఇంకా అక్కడ లేదు. ప్రధానంగా ఈ ఐదు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొనే పలు సర్వేలు ఈసారి పార్లమెంట్‌లో హంగ్‌ తప్పదని తేల్చాయి.

మరిన్ని వార్తలు