ప్రభుత్వ బడులకు పాతర

10 Dec, 2018 04:03 IST|Sakshi
శ్రీకాకుళం జిల్లా ఆదివారంపేటలో పాదయాత్ర చేస్తూ ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

‘కార్పొరేట్‌’కు లబ్ధికోసం సర్కారీ స్కూళ్లను మూసేయిస్తున్నారు  

చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదుచేసిన విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు  

జగన్‌ ఉద్యోగాల విప్లవం ప్రకటనతో యువతలో హర్షాతిరేకాలు  

సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేదంటున్న 104 సిబ్బంది  

వైఎస్‌ హయాంలోవ్యవసాయం పండగ.. నేడు దండగ 

గిట్టుబాటు ధరలు లేవంటూ అన్నదాతల ఆందోళన  

అందరికీ అండగా ఉంటానన్న ప్రతిపక్ష నేత

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సర్కారీ చదువులకు పాతరేస్తూ.. ప్రైవేటు విద్యకు పెద్దపీట వేస్తున్నారు.. ఉద్యోగాల్లేవు.. ఉన్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జీతాలూ లేవు. ఆరోగ్యశ్రీని అటకెక్కించారు.. 104 సర్వీసు నిర్వీర్యమైంది.. వ్యవసాయాన్ని దండగ చేశారు.. అంటూ వివిధ వర్గాల ప్రజలు ప్రతిపక్ష నేత ఎదుట వాపోయారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 317వ రోజు ఆదివారం శ్రీకాకుళం శివారులోని పేటలో ప్రారంభమై.. కొత్తరోడ్డు జంక్షన్‌ మీదుగా రాగోలు, దూసిరోడ్డు వరకు సాగింది. యాత్ర సాగిన దారి పొడవునా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఊరూరా మేళతాళాలతో, బాణసంచా కాలుస్తూ తమ గ్రామాల్లోకి ఆహ్వానించారు. అక్కచెల్లెమ్మలు మంగళ హారతులు పట్టారు. వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున మహిళాలోకం తరలివచ్చింది. అధికారంలోకొచ్చిన వెంటనే ఉద్యోగాల విప్లవం తెస్తామని, గ్రామ సచివాలయాల ఏర్పాటు, గ్రామ వలంటీర్ల నియామకంతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం సభలో చేసిన ప్రకటన పట్ల యువత హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది.  

మోడల్‌ స్కూళ్ల టీచర్లకు వేతనాలివ్వడం లేదన్నా.. 
చంద్రబాబు విధానాలు సర్కారీ చదువులకు శాపంగా మారాయని, కార్పొరేట్‌ స్కూల్‌ యాజమాన్యాల జేబులు నింపేలా ఉన్నాయని పలువురు విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, మోడల్‌ స్కూల్స్‌ అధ్యాపకులు వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదుచేశారు. సరిపడా హాజరు లేదన్న సాకుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ పిల్లల్ని అనివార్యంగా కార్పొరేట్‌ స్కూళ్లకు పంపేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌కు దీటుగా ఉన్న మోడల్‌ స్కూళ్లను కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందన్నారు. ఈ మేరకు పలువురు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యావేత్తలు వైఎస్‌ జగన్‌కు వినతిపత్రాలు అందజేశారు. గ్రామీణ పేద విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందించాలనే ఆశయంతో వైఎస్సార్‌ మోడల్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తే.. వాటిలో పనిచేస్తున్న 2100 మంది టీచర్లకు కొంతకాలంగా వేతనాలివ్వడంలేదని మోడల్‌ స్కూల్స్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు జి.లక్ష్మీనారాయణ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.  

బంగారు తల్లి పథకంలో కాగితాలేగానీ కాసులివ్వడం లేదు.. 
తెలగ కులాన్ని బీసీలలో చేర్చాలని, విశ్వబ్రాహ్మణులకు, వైశ్య, పూసల కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ఆయా కులాల ప్రతినిధులు కోరారు. బంగారు తల్లి పథకం కింద కాగితాలు తప్ప కాసులివ్వడం లేదని, పోస్టల్‌ శాఖలో గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న సిబ్బందికి కమలేష్‌ చంద్ర కమిటీ సిఫార్సుల ప్రకారం వేతనాలివ్వాల్సి ఉన్నా అమలు చేయడం లేదని, కేశవరెడ్డి స్కూల్లో విద్యా పథకం కింద తాము డిపాజిట్‌ చేసిన మొత్తాలను తిరిగి ఇప్పించేలా చూడాలని ప్రతిపక్ష నేతకు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు ఫీజురీయింబర్స్‌మెంట్‌ చేయడం లేదని, పింఛన్లు ఇవ్వడం లేదని, ఆరోగ్యశ్రీ అమలుకాలేదని, సంక్షేమ పథకాల అమల్లో రాజకీయ వివక్ష చూపుతున్నారని.. ఇలా పలు ఫిర్యాదులందాయి. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న జగన్‌.. మనందరి ప్రభుత్వం రాగానే అందరికీ మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు. 

ఉచిత విద్యుత్‌తో అన్నదాతను ఆదుకున్న వైఎస్సార్‌ 
పదకొండేళ్లుగా పనిచేస్తున్న 104 సిబ్బందికి కనీస వేతనాలివ్వడం లేదని ఉద్యోగుల సంఘం నేతలు వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. 151వ జీవో ప్రకారం వేతనాలిస్తామని 2016లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఇంతవరకూ అమలుకాలేదని సంఘం నేత చింతాడ వరుణ్‌కుమార్‌ చెప్పారు. వైఎస్‌ హయాంలో వ్యవసాయాన్ని పండగ చేశారని, ఇప్పుడు కనీసం గిట్టుబాటు ధర కూడా లేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నామని పలువురు అన్నదాతలు ప్రతిపక్ష నేత ఎదుట వాపోయారు. ఉచిత విద్యుత్‌ ఇచ్చి రైతులను ఆదుకున్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. వ్యవసాయ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని అగ్రికల్చరల్‌ బీఎస్సీ చదివిన విద్యార్థులు జగన్‌ను కోరారు. 

ఎన్‌ఆర్సీ సిబ్బందిని వీధిన పడేశారన్నా.. 
న్యూట్రిషన్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్లలో (ఎన్‌ఆర్‌సీ) ఏడేళ్లుగా పనిచేస్తున్న సిబ్బందిని వీధినపడేశారంటూ ఆ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది వైఎస్‌ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎన్‌ఆర్సీలను రద్దు చేశారని వాపోయారు.  

అన్యాయంగా భూములు తీసుకుంటున్నారన్నా..
జాతీయ రహదారి నిర్మాణం పేరిట అన్యాయంగా రైతుల భూములను తీసుకుంటున్నారన్నా. పోలవరం నియోజకవర్గ పరిధిలో రాజువరం, ఎర్రంపేట, పొంగుటూరు, ఆరిపాటి, కొయ్యలగూడేం గ్రామాలకు చెందిన 200 మంది రైతులకు సంబంధించి 800 ఎకరాల భూమిలో రహదారులు నిర్మిస్తామంటున్నారు. అక్కడ ఎకరా రూ.లక్షల్లో ఉంటే.. పరిహారం మాత్రం తక్కువగా ఇస్తున్నారు.  కుటుంబాలతో కలిసి మేం దీక్షలు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదు. మా భూములకు తగిన విధంగా నష్టపరిహారం అందేలా చూడండన్నా.. 
–గంజిమాల దేవి, దాసర రాణి, కొయ్యలగూడెం, పోలవరం, పశ్చిమగోదావరి జిల్లా 

వైఎస్సార్‌ వల్లే నేను బతికాను   
నా ప్రాణదాత వైఎస్సార్‌. ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాకు తలకు సంబంధించిన జబ్బు వచ్చింది. అప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా విశాఖలో రూ.5.50 లక్షలతో ఆపరేషన్‌ చేయించారు. ఆరోగ్యశ్రీ లేకపోతే నేను బతికి ఉండేవాడిని కాదు. ఏటా ఇడుపులపాయ వెళ్లి వైఎస్‌ సమాధిని సందర్శిస్తూ ఉంటాను.      
–ఎ.ఎరకయ్య, విజయనగరం  

షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించరూ..
సార్‌.. రైతుల కష్టాన్ని ప్రభుత్వం దోచుకుంటోంది. పండించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేటప్పుడు రవాణా చార్జీలు చెల్లించడం లేదు. నాలుగేళ్లలో ప్రభుత్వం రైతులకు రూ.64 కోట్లు బాకీపడి ఉంది. వైఎస్‌ హయాంలో రవాణా చార్జీలు సక్రమంగా అందేవి. టీడీపీ పాలనలో మూతబడిన ఆమదాలవలస షుగర్‌ ఫ్యాక్టరీని మీరు తెరిపించాలి.. 
– బోర చిన్నంనాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్, చింతాడ గ్రామం, ఆమదాలవలస మండలం 

మరిన్ని వార్తలు