రెడీ టు ఓట్‌!

19 Apr, 2019 00:10 IST|Sakshi

బాలీవుడ్‌ జూనియర్స్‌ ఓటింగ్‌ ఎంట్రీ

తొలిసారి ఓటు వేయనున్న యూత్‌ స్టార్స్‌

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలంటే పండుగే. ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఐదేళ్లకోసారి వస్తుంది. అలాంటిది తొలిసారి ఓటు హక్కు వస్తే ఆ కిక్కే వేరబ్బా. యువతలో ఉత్సాహం పొంగిపొరలుతుంది. ఓటుహక్కు వినియోగించుకొని సిరా చుక్క ఉన్న వేలుని చూపిస్తూ సెల్ఫీ దిగితే చాలు.. ఎవరెస్ట్‌ ఎక్కినంత సంబరం. ఈ ఉత్సాహానికి సామాన్యులా, సెలబ్రిటీలా అన్న తేడా లేదు. ఓటింగ్‌ పెంచడానికే ఈసారి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలీవుడ్‌ సెలబ్రిటీలతో కలిసి ఫొటోలు దిగి ప్రచారాన్ని ప్రారంభించారు. మరెందరో బాలీవుడ్‌ నటీనటులు ఓటు వేయండహో అంటూ సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు. రాజకీయ రంగం మాదిరిగానే బాలీవుడ్‌లోనూ వారసులదే హవా. ఈసారి ఏయే తారల నట వారసులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారంటే..

అమితాబ్‌ బచ్చన్, షారుక్‌ఖాన్, శ్రీదేవి వెండితెర సామ్రాజ్యాన్ని ఏలినవారు. వీరి వారసులు కూడా అదే స్థాయిలో రాణిస్తున్నారు. సోషల్‌ మీడియాలో వీరికి కూడా పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. తమ స్టైల్‌తో, సెల్ఫీలతో ఆకట్టుకునే ఈ యంగ్‌ తరంగ్‌లో చాలామంది తొలిసారి ఓటు వేయనున్నారు. ముంబైలో ఈ నెల 29న జరగనున్న పోలింగ్‌లో వీరిలో చాలామంది తొలిసారి తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్న బాలీవుడ్‌ స్టార్‌ వారసులు వీరే...

ఇరా ఖాన్‌
ఆమిర్‌ఖాన్‌ మొదటి భార్య రీనా చిన్న కుమార్తె ఇరా ఖాన్‌. 22 ఏళ్ల ఇరా ప్రచార మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించదు. తండ్రితో బయట కనిపించినప్పుడు మాత్రం వార్తల్లో వారి చిత్రాలు చోటు చేసుకుంటాయి. తొలిసారి ఓటింగ్‌కి ఇరా సిద్ధమవుతోంది.

ఆలియా ఫర్నీచర్‌వాలా
హిందీ, తెలుగు చిత్రాల్లో నటించిన నటి పూజా బేడీ కూతురు ఆలియా. 21 ఏళ్ల ఆలియా సైబర్‌ బుల్లీయింగ్‌పై గళం ఎత్తటంతో గత ఏడాది వార్తాల్లోకి ఎక్కింది. ఈమె ఎక్కువ శాతం విదేశాల్లోనే గడుపుతుంటుంది. అయినా ఓటు వేసే అవకాశం ఉంది. 

ఇబ్రహీం అలీఖాన్‌ 
బాలీవుడ్‌ తారలు సైఫ్‌ అలీ ఖాన్, అమృతాసింగ్‌ల కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌. 18 ఏళ్లు నిండటంతో ఓటు వెయ్యడానికి అర్హత సంపాదించుకున్నాడు. అయితే  ఇబ్రహీం ఓటింగ్‌ తేదీకి నగరంలో ఉంటాడో లేదో స్పష్టత లేదు. 

నవ్య నవేలి నందా
అమితాబ్‌బచ్చన్‌ మనవరాలు నవ్యకి 22 ఏళ్లు. ఢిల్లీలో నివసించే ఈమె మొదటిసారి తన ఓటుని మే 12న వినియోగించుకోనుంది.

అక్కాచెల్లెళ్లు పోలింగ్‌ కేంద్రానికి వెళతారా? 
శ్రీదేవి–బోనీకపూర్‌ల పెద్ద కూతురు జాహ్నవికి ఇప్పుడు 22 ఏళ్లు. ‘ధడక్‌’ హిందీ చిత్రంతో గట్టి ఎంట్రీ ఇచ్చిన జాహ్నవి ఇప్పుడు ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌గా ఒక చిత్రంలో నటిస్తోంది. ఈ ఏడాది తన ఓటు హక్కుని వినియోగించుకోనుంది. ఈమె సోదరి ఖుషీ కపూర్‌కు 19 ఏళ్లు. సెల్ఫీలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తనకంటూ క్రేజ్‌ సంపాదించుకుంది ఖుషీ. అమ్మ, అక్క బాటలో ఈమె త్వరలో చిత్రరంగంలోకి ప్రవేశించనుంది. అక్కాచెల్లెళ్లిద్దరూ తొలిసారి ఓటింగ్‌లో పాల్గొననున్నారు. 

అనన్య పాండే
బాలీవుడ్‌ నటుడు చంకీ పాండే కూతురు అనన్యకి ఇటీవలే 20 ఏళ్లు రావటం తో ఓటెయ్యడానికి సిద్ధమైం ది. సోషల్‌ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2 చిత్రంతో సినీ ప్రవేశం చేస్తోంది. 

అన్నాచెల్లెళ్లకి ఆ స్ఫూర్తి ఉందా? 
ఆర్యన్‌ ఖాన్‌.. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ కుమారుడు. ఈ అబ్బాయి సిటీలోకి వస్తే చాలు పాపారాజీ మొదలు. ఎక్కడికెళ్లినా ఫొటోలు, వీడియోలు తీసి వైరల్‌ చేస్తుంటారు. ఆ పాపారాజీకి చిక్కితే ఆర్యన్‌ తండ్రితో కలిసి ఓటు వెయ్యటం వైరల్‌ వీడియోగా మారొచ్చు. అయితే 21 ఏళ్ల జూనియర్‌ ఖాన్‌ విదేశాల్లో చదువుతున్నందు వల్ల వచ్చి ఓటేసే అవకాశాలపై అనుమానాలున్నాయి. ఇక షారుక్‌ కుమార్తె సుహానా ఖాన్‌.. ఆర్యన్‌లాగే సుహానా ఒక్క ఫొటో దొరికితే చాలు ఇంటర్నెట్‌ అంతా హల్‌చలే. షారుక్, గౌరీ ఖాన్‌ గారాల పట్టి సుహానాకు నిరుడు 18 ఏళ్లు నిండాయి. ఆమె ఈ ఏడాది తొలిసారి ఓటు వెయ్యవచ్చు. 

శనాయా కపూర్‌ 
బాలీవుడ్‌ హీరో అనిల్‌కపూర్‌ తమ్ముడు, హీరో సంజయ్‌ కపూర్‌ కూతురు శనాయా కపూర్‌. ఈమెకి 19 ఏళ్లు. ఈ ఏడాది మొదటిసారి ఓటు హక్కుని వినియోగించుకోనుంది. పెదనాన్న కూతురు సోనమ్‌ కపూర్‌ నటనా స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది శనాయా.   

మరిన్ని వార్తలు