పైడిపాలెం రూపకర్త వైఎస్సార్‌

25 Sep, 2018 13:23 IST|Sakshi
వైఎస్‌ అవినాష్‌రెడ్డికి హారతి ఇస్తున్న మహిళలు

వైఎస్సార్‌ విగ్రహానికి  కృష్ణా జలాలతో అభిషేకం

రాయలసీమ ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలి

వైఎస్‌ జగన్‌కు సంఘీభావంగా  వైఎస్‌ అవినాష్‌రెడ్డి పాదయాత్ర

పాల్గొన్న వైఎస్‌ వివేకానందరెడ్డి, శివప్రకాష్‌రెడ్డి

మొదటి రోజు 18.5కి.మీ సాగిన పాదయాత్ర

పులివెందుల : వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర 3వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. సోమవారం ఉదయం సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం ప్రాజెక్టు వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత శివప్రకాష్‌రెడ్డి కృష్ణా జలాలతో అభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌ అమర్‌ రహే అంటూపెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వైఎస్‌ అవినాష్‌రెడ్డితో కలిసి వైఎస్‌ వివేకానందరెడ్డి, శివప్రకాష్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పైడిపాలెం ప్రాజెక్టు నుంచి ప్రారంభమైన పాదయాత్రకు దారి పొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామ గ్రామాన మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. మొదటి రోజు పైడిపాలెం ప్రాజెక్టు నుండి తొండూరు మండలం బూచుపల్లె వరకు 18.5 కిలోమీటర్లు సాగింది.

ఈ సందర్భంగా వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్ర వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2017 నవంబర్‌లో మొదలుపెట్టి నేటికి 3వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుందన్నారు. ఆయనకు సంఘీభావంగా మూడు రోజులపాటు పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. పైడిపాలెం ప్రాజెక్టు నుంచి పులివెందుల వరకు సాగుతుందన్నారు. పైడిపాలెం ప్రాజెక్టు వద్ద నుంచి మొదలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం పైడిపాలెం ప్రాజెక్టు అనేది ఏ సాగునీటి ఇంజినీరో చేసిన ఆలోచన కాదన్నారు. పైడిపాలెం ప్రాజెక్టు అనేది దివంగత మహా నాయకుడు వైఎస్‌ రాజశేఖరెడ్డి మదిలో పుట్టిన ఆలోచన అన్నారు.దీని గురించి ఆలోచన చేసింది.. ఆచరణలో పెట్టింది ఆయనే అన్నారు. ఆయన హయాంలో దాదాపు రూ.690కోట్లు కేటాయించి.. ఆయన బతికి ఉండగానే రూ.667కోట్ల నిధులు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ప్రాజెక్టు సంబంధించి మెయిన్‌ కెనాల్, చెరువులు, పంప్‌ హౌస్‌లు దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలోనే పూర్తయ్యాయన్నారు. ఆయన మరణానంతరం మిగిలిపోయిన పంట కాలువ పనులను కూడా ఈ ప్రభుత్వం నాలుగున్నర్రేళ్లలో పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వమన్నారు. సంతకొవ్వూరు డిస్ట్రిబ్యూటరీ విడిది 36 కిలోమీటర్లు కాగా.. 9ఏళ్ల క్రితమే 22 కి.మీ పూర్తయితే.. మిగిలినది పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం టీడీపీ అని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదాను బలంగా కోరుకుంటున్నారన్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత నాలుగున్నరేళ్లుగా అనేక కార్యక్రమాల ద్వారా హోదాపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. ప్రజలు ప్రత్యేక హోదాను బలంగా కోరుతుండటంతో చంద్రబాబు చేసేదేమీలేక యూ టర్న్‌ తీసుకున్నారన్నారు. పార్లమెంటులో కూడా హోదా విషయంపై వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిందన్నారు. కేంద్రం స్పందించకపోతే 14నెలల పదవీ కాలం ఉండగానే తమ పార్టీ ఎంపీలందరూ రాజీనామాలు చేసి ప్రత్యేక హోదా డిమాండ్‌ ఎంత బలంగా ఉందో కేంద్రానికి, దేశానికి చాటి చెప్పామన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించిన నికర జలాల కేటాయింపు కూడా సీమ ప్రజలకు, రైతులకు అవసరమన్నారు. పార్లమెంటులో కొశ్చన్‌ అవర్‌లో వైఎస్సార్‌సీపీ ఈ అంశాన్ని ప్రస్తావించిందన్నారు. శ్రీశైలం నుంచి గాలేరు – నగరి, హంద్రీ– నీవా, తెలుగు గంగ, రీ ఎలికేషన్‌ అండ్‌ రీ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫ్‌ కృష్ణా వాటర్‌ చేయాలన్నారు. సుప్రీం కోర్టులో ట్రిబ్యునల్‌కు సంబంధించిన కేసు నడుస్తోందన్నారు. ట్రిబ్యునల్‌ అవార్డు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసేలోగా ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని ప్రత్యేక ఎండార్స్‌మెంట్‌ ఇచ్చి సీమ జిల్లాల్లోని గాలేరు – నగరి కింద వచ్చే గండికోట, సర్వరాయసాగర్, వామికొండ, పైడిపాలెం, చిత్రావతి, మైలవరం, తెలుగుగంగ కింద వచ్చే బ్రహ్మసాగర్‌..హంద్రీ – నీవా కింద వచ్చే ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసినట్లు చెప్పారు.

ప్రధానమంత్రి, కేంద్ర వాటర్‌ రీసోర్స్‌ మినిస్టర్‌ జోక్యం చేసుకుని ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారే కానీ.. అంతకమించి చేసిందేమి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా ముందుకు వచ్చి రీ ఎలికేషన్‌ అండ్‌ రీ డిస్ట్రిబ్యూషన్‌ కృష్ణా వాటర్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి మాట్లాడుతూ దివంగత మహా నాయకుడు వైఎస్సార్‌ రాష్ట్రంలో తలపెట్టిన అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాలన్నారు. 175మంది ఎమ్మెల్యేలు, 25 ఎంపీ స్థానాలలో అత్యధిక స్థానాలు గెలుచుకుని కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారి మెడలు వంచి మన రాష్ట్ర ప్రజలను కాపాడే విధంగా చేసుకోవాలన్నారు. హోదా ద్వారా రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి పెద్ద ఎత్తున రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. అలాగే జిల్లాలో ఉక్కు పరిశ్రమను సాధించవచ్చునన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, బీజెపీ, టీడీపీలు ప్రజల అభీష్టాన్ని పట్టించుకోకుండా ప్రవర్తించాయన్నారు. ప్రత్యేక హోదానే ప్రధాన లక్ష్యంగా ఎన్నికలకు వెళ్లాలన్నారు. భవిష్యత్‌ తరాలకు నికర జలాలు లభించాలంటే రాష్ట్రంలోని ప్రాజెక్టులను నేషనల్‌ ప్రాజెక్టులుగా గుర్తించాలన్నారు. వీటిని సాధించుకోవాలంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలన్నారు.పాదయాత్రలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు పులివెందుల వైఎస్సార్‌సీపీ నాయకుడు టెంకాయల వెంకటరామిరెడ్డి దారిపొడవునా మజ్జిగ, మంచినీటి సదుపాయం కల్పించారు.

మరిన్ని వార్తలు