ఏయ్‌ తమ్ముడూ.. మాట్లాడొద్దు!

4 Jan, 2018 06:37 IST|Sakshi

జన్మభూమి సభలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న సీఎం చంద్రబాబు

సాక్షి, కడప: జన్మభూమి–మాఊరు కార్యక్రమం సందర్భంగా బుధవారం పులివెందులలో ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీకి చెందిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పట్ల సీఎం చంద్రబాబు గద్దింపు ధోరణిలో వ్యవహరించటం అందరినీ నివ్వెరపరిచింది. గండికోట ప్రాజెక్టు నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు రూ.1,300 కోట్లతో ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేయగా దివంగత వైఎస్సార్‌ హయాంలోనే దాదాపు రూ.1,100 కోట్లు ఖర్చు చేశారని ఎంపీ అవినాష్‌రెడ్డి చెప్పినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

జనం అంతా ఉత్సాహంగా నిల్చుని వైఎస్‌ అవినాష్‌రెడ్డికి మద్దతుగా చప్పట్లు, ఈలలు, కేకలు వేయటంతో సీఎం చంద్రబాబు అసహనానికి గురయ్యారు. వెంటనే మైక్‌ తీసుకుని ‘ఏయ్‌ తమ్ముడూ.. గండికోటకు ఎవరెంత పెట్టారో.. ఎవరేం చేశారో నేను మాట్లాడటం లేదు.. మీరూ మాట్లాడవద్దు’అంటూ అవినాష్‌రెడ్డి వద్ద ఉన్న మైక్‌ను ఇవ్వు తమ్ముడూ అంటూ పట్టుబట్టారు. ఇతరులు ఆయన వద్ద మైకును తీసుకునేవరకు ఊరుకోలేదు. వైఎస్‌ అవినాష్‌రెడ్డి ప్రసంగం మొదలైన రెండు నిమిషాలకే వేదికపై కూర్చున్న చంద్రబాబు లేచి అడ్డుకోవటం గమనార్హం.

వైఎస్‌ పేరు ప్రస్తావించగానే 
జన్మభూమి–మాఊరు గ్రామసభలో సీఎం చంద్రబాబు దాదాపు గంటన్నరసేపు ప్రసంగించినా జనాల్లో ఉత్సాహం కనిపించలేదు. 4.15 గంటల సమయంలో ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రసంగిస్తూ గండికోట ద్వారా పులివెందులకు నీరు తెచ్చేందుకు వైఎస్సార్‌ చేపట్టిన సంకల్పం గురించి వివరించినప్పుడు ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది.  దీంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు ముందుకొచ్చి   ఎంపీ ప్రసంగాన్ని అడ్డగించి అతని మైక్‌ లాక్కునే వరకు ఊరుకోలేదు.

ఏయ్‌ తమ్ముడూ.. మాట్లాడొద్దు!

మరిన్ని వార్తలు