మూడు నెలలుగా చంద్రబాబు కొత్త డ్రామాలు: వైఎస్‌ భారతి

4 Apr, 2019 14:20 IST|Sakshi
సభకు హాజరైన మహిళలు (ఇన్‌సెట్‌లో) మాట్లాడుతున్న వైఎస్‌ భారతీరెడ్డి

వైఎస్సార్‌ ఆసరా పేరుతో వెనుకబడిన మహిళలకు ఉచితంగా రూ.75 వేలుప్రతి ఒక్కరికీ ఇల్లు, మహిళ పేరుతో రిజిస్ట్రేషన్‌ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా జగన్‌ అదరలేదు, బెదరలేదు

కేజీ నుంచి పీజీ వరకు మీ పిల్లల చదువుకు జగన్‌ భరోసా 

సాక్షి, కడప : ఈ నెల 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌ రెడ్డికు అమూల్యమైన ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి ఓటర్లను కోరారు. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి సతీమణి సమతారెడ్డితో కలిసి వైఎస్సార్‌ జిల్లా వేంపల్లెలోని షాదీఖానాలో జెడ్పీటీసీ సభ్యుడు షబ్బీర్‌ కుమారుడు ఎస్‌ఎం అయాన్‌ తొలి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అక్కడికి వచ్చిన మహిళలతో భారతీరెడ్డి ఆత్మీయంగా మాట్లాడారు. ‘నేను కూడా ఈ ప్రాంతంలో పుట్టా. మీ కష్టాలు చూశా. జగన్‌ సీఎం అయితే అందరి కష్టాలు తీరుతాయి. ఐదేళ్లుగా చంద్రబాబు పాలనలో మహిళల కష్టాలు పరిష్కారం కాలేదు’అన్నారు. పొదుపు సంఘాలను బాగా చూసుకుంటున్నామంటూ మళ్లీ మోసం చేసేందుకు బాబు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ఎన్నికల్లో రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకపోవడంతో అప్పులపై వడ్డీలకు వడ్డీలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన సొమ్ములపై వసూలు చేసిన వడ్డీల మొత్తాన్నే తీసుకొచ్చి పసుపు–కుంకుమ పేరుతో ఇస్తున్నట్లు చంద్రబాబు కొత్త నాటకాలు ఆడుతున్నారన్నారు. వడ్డీలేని రుణాల్లేవు, రుణమాఫీ లేదు, చంద్రబాబుది మాటల గారడీ అని, మహిళలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. జగన్‌ అధికారంలోకి వస్తే వైఎస్సార్‌ ఆసరా ద్వారా పొదుపు సంఘాల మహిళల సొమ్ము 2019 ఎన్నికల నాటికి ఎంత ఉందో అంత మొత్తాన్ని 4 విడతల్లో తిరిగి చెల్లిస్తారని చెప్పారు.

అధికారంలోకి వస్తే 25 లక్షల ఇళ్లు
రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లులేని ప్రతి నిరుపేదకు ఇళ్లు కట్టిస్తామని, రాష్ట్రంలో దాదాపు 25 లక్షల ఇళ్లు కట్టడమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌కు ప్రణాళిక ఉందని భారతీరెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్లలో ఎవరికైనా ఇళ్లు వచ్చాయా? అని ఆమె ప్రశ్నించగా మహిళలంతా రాలేదంటూ జవాబిచ్చారు. ఆడవాళ్లు కష్టపడవద్దు, సంతోషంగా ఉండాలని వైఎస్‌తో పాటు జగన్‌ కూడా అంటుంటారని వివరించారు. ఆయన అధికారంలోకి రాగానే ఇల్లు కట్టించి పట్టా, ఇల్లు ఆ ఇంటి యజమాని అయిన మహిళ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తారని వివరించారు.

పిల్లల చదువుకు భరోసా
వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే పిల్లల చదువుకు భరోసా ఉంటుందని భారతీరెడ్డి తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు చదువుకయ్యే ఖర్చంతా జగనే భరిస్తారని భరోసా ఇచ్చారు. మొదటగా పిల్లల తల్లి ఖాతాలో ఏటా రూ.15 వేలు వేస్తారన్నారు. తర్వాత ఇంటర్‌ అనంతరం వారి హాస్టల్‌ ఫీజులతోపాటు చదువుకయ్యే ఫీజులు భరిస్తారని చెప్పారు. రాష్ట్రంలో పేదలు ఎలాంటి జబ్బు వచ్చినా రూ.వెయ్యి దాటితే దాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి అత్యుత్తమ వైద్యం అందించే బాధ్యత వైఎస్‌ జగన్‌ తీసుకుంటారని తెలిపారు. 

వెనుకబడిన వర్గాల మహిళలకు చేయూత
వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా వెనుకబడిన వర్గాల మహిళలను ఆదుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించారని, అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని 45 ఏళ్లు నిండిన మహిళలకు రూ.75 వేలు ఉచితంగా ఇవ్వనున్నట్లు భారతీరెడ్డి పేర్కొన్నారు. దశల వారీగా మద్య నిషేదం అమలుకు అధికారంలోకి రాగానే వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకుంటారని తెలిపారు. 

తొమ్మిదిన్నరేళ్లుగా నిత్యం ప్రజల్లోనే..
వైఎస్‌ జగన్‌ పులివెందులకు రాలేదని టీడీపీ ఆరోపిస్తోందని, పులివెందులకే కాదు.. ఆయన నిత్యం తొమ్మిదిన్నరేళ్లుగా ప్రజల్లోనే ఉండడంతో ఇంటికి కూడా రాలేదన్నారు. కేవలం ప్రజల మధ్య ఉండడం చూడలేకనే కుట్రలు, కుతంత్రాలు చేశారని చెప్పారు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత బాధపెట్టినా వెరవకుండా ప్రజల బాగుకోసం పరితపిస్తున్న నాయకుడు జగన్‌ అని తెలిపారు. అనంతరం కడప లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి సతీమణి సమతారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు కుట్రలకు ఎవరూ లొంగవద్దని చెప్పారు. వైఎస్‌ జగన్‌కు పట్టం కట్టాలని ఆమె కోరారు. రాష్ట్రంలో హిట్లర్‌ పాలన కొనసాగుతోందని, అందుకు చరమగీతం పాడాలన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకురాలు జింకా విజయలక్ష్మి, వేంపల్లె ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు షబ్బీర్, మండల కన్వీనర్‌ చంద్ర ఓబుల్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. 

మరిన్ని వార్తలు