27వ రోజు పాదయాత్ర డైరీ

6 Dec, 2017 03:13 IST|Sakshi

05–12–2017, మంగళవారం,
కొట్టాలపల్లి, అనంతపురం జిల్లా.

పదవీ విరమణ తర్వాత కూడా ఆర్థిక సమస్యలు దారుణం
ప్రజాసంకల్ప యాత్ర ఈ రోజు తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ నియోజకవర్గంలోకి రాగానే నాకు మా అవ్వగారింటికి వచ్చినట్లు అనిపించింది. ఎందుకంటే అమ్మగారి పుట్టిల్లు ఈ నియోజకవర్గంలోనే ఉంది. అందుకే ఈ ప్రాంతం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మార్గంమధ్యలో గుత్తి పట్టణానికి చెందిన గోల్డెన్‌ కేఫ్‌ యజమాని ఎంతో ప్రేమతో తమ టీని నాకు రుచి చూపించారు. అద్భుతంగా ఉంది. ఒక జంట తమ బిడ్డని తెచ్చి, నాన్నగారి పేరు పెట్టి ఆశీర్వదించాలని కోరింది. నాన్నగారు కుల, మత, వర్గ, పార్టీ భేదాలు చూడకుండా అందరినీ ఆదరించారు. అందుకే ఈ రోజు వేలాది మంది తల్లిదండ్రులు కులాలకు, మతాలకు అతీతంగా తమ చిన్నారులకు నాన్నగారి పేరు పెట్టుకుని, వారిలో ఆయన్ను చూసుకుంటూ మురిసిపోతున్నారు.

ఈ రోజు నన్ను తిప్పయ్య అనే ఆర్టీసీ మాజీ ఉద్యోగి కలిశాడు. ఆయన ఆర్టీసీలో 1981లో చేరి, దాదాపు 35 సంవత్సరాలు పనిచేసి 2015 లో పదవీవిరమణ చేశాడు. తిప్పయ్య అందుకున్న చివరి జీతం 32,600 రూపాయలు. అయితే పదవీ విరమణ తర్వాత ఆయన చేతికొస్తోంది నెలకు కేవలం 2,410 రూపాయలు. నెలకు 32,600 రూపాయల జీతం తీసుకున్న ఉద్యోగి ఆదాయం ఒక్కసారిగా ఇంత దారుణంగా పడిపోతే.. ఆ కుటుంబం ఎలా బతకాలి? అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో లైన్‌మేన్లుగా, జూనియర్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు కలిశారు. వీళ్లు కూడా దాదాపు రూ.30,000 జీతం పొందుతున్న వారే. పదవీ విరమణ తర్వాత కేవలం 2000 రూపాయల పెన్షన్‌తో కుటుం బాన్ని నెట్టుకురావాలంటే ఎం త ఇబ్బందిగా ఉంటుంది? దశా బ్దాల పాటు సంస్థలకే తమ జీవితాలను అంకితంచేసి, సే వచేసి, పదవీ విరమణ చేశాక ఇటువంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి రావడం చాలా దారుణం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణా నంతర ప్రయోజనాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం.. వాళ్లు ప్రశాంతంగా బతకడానికి కావాల్సిన ఆర్థిక ఏర్పాట్లు ఉండేలా కచ్చితమైన చర్యలు తీసుకుంటాం.

ఈ నియోజకవర్గంలో జరిగిన అప్పేచర్ల ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంలో అందరూ చూస్తుండగానే ఒక ప్రజా ప్రతినిధిని దారుణంగా హత్య చేయడం ఎంత ఆటవికం? గత రెండు వారాలుగా సాక్షుల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఉన్నప్పటికీ, పోలీసుల సమక్షంలోనే జేసీబీలు పెట్టి పొలాలను దున్ని, వారి ఆస్తులను, బోర్లను ధ్వంసం చేశారు. వంశపారం పర్యంగా వస్తున్న వాళ్ల పట్టా భూమిని ప్రభుత్వ భూమని చెప్పి లాక్కోడానికి ప్రయత్నించారు. వారి ఇంటిని కూడా జేసీబీలతో కూలగొట్టే ప్రయత్నం చేశారు. ధ్వంసమైన బోర్లను మళ్లీ వేయించుకుని మిగిలిన కొద్దిపాటి పంటనైనా రక్షించుకుందామని అనుమతి కోసం ఎమ్మార్వోగారి దగ్గరికి వెళ్తే.. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలని ఆయన సలహా ఇచ్చారు. ఏ ప్రజాప్రతినిధి ప్రోద్బలంతో ఈ దౌర్జన్యకాండ జరుగుతోందో తిరిగి అనుమతి కోసం అతని వద్దకే వెళ్లమనడం ఎంత దౌర్భాగ్యం? ఇక్కడ అసలు ప్రజాస్వామ్యం ఉందా? ఒక ప్రభుత్వం శాంతి, భద్రతలను కాపాడే విధానం ఇదేనా? ఈ నియోజకవర్గంలో ఫ్యాక్షన్‌ సంస్కృతిని, దౌర్జన్యాలను, రౌడీయిజాన్ని, నియంతృత్వ పోకడలను రూపు మాపాలి. ఈ పాలకుల మైండ్‌సెట్‌ మారాలి.
- వైఎస్‌ జగన్‌

ఓ అభిమాని ఇచ్చిన టీ తాగి, బన్‌ తింటున్న జగన్‌

మరిన్ని వార్తలు