293వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

24 Oct, 2018 08:19 IST|Sakshi

సాక్షి, సాలూరు (విజయనగరం జిల్లా) : రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 293వ రోజు పాదయాత్ర బుధవారం ఉదయం సన్యాసిరాజుపేట శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి బాగువలస మీదుగా నక్కడవలస క్రాస్‌, తడిలోవ, మక్కువ మండలంలోని గునికొండవలస మీదుగా చప్ప బుచ్చమ్మపేట వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది.

వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని గ్రామాల్లోని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు.

పాదయాత్రలో మరో మైలురాయి...
ప్రజా నాయకుడిగా ప్రజల పక్షాన నిలిచేందుకు, కష్టనష్టాల్లో వారికి తోడుగా నిలుస్తానని భరోసా నింపేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో ఘనత సొంతం చేసుకుంది. బుధవారం ఉదయం సన్యాసిరాజుపేట శివారు నుంచి మొదలైన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర బాగువలస వద్ద 3,200 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన బాగువలసలో ఒక మొక్కను నాటి అభిమానులు, కార్యకర్తలతోడుగా ముందుకు కదిలారు.

వాల్మీకి జయంతి  సందర్భంగా సన్యాసిరాజు పేటలో  నివాళులర్పిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

మరిన్ని వార్తలు