330వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

24 Dec, 2018 09:14 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 330వ రోజు పాదయాత్రను సోమవారం కొత్తూరు క్రాస్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి డీ పోలురు క్రాస్‌, చింతల పోలురు క్రాస్‌, జలకిలింగుపురం, మర్రిపాడు, మిళియపుట్టి మీదుగా చాపర వరకు జననేత పాదయాత్ర కొనసాగిస్తారు. మిళియపుట్టి వద్ద జరిగే బారీ బహిరంగ సభలో జననేత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

అడుగుముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

వైఎస్‌ జగన్‌ను కలిసిన ఆదివాసీలు
జననేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేషమైన ఆధరణ లభిస్తోంది. ఆయనతో కలిసి నడిచేందుకు, తమ కష్టాలను చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సోమవారం పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను ఆదివాసీలు కలిశారు. మెళియపుట్టి మండల కేంద్రంలో మినీ ఐటీడీఏ నిర్మించాలని, ప్రతి ఐటీడీఏ ద్వారా గిరిజనుల కోసం స్పెషల్‌ డీఎస్సీ నిర్వహించాలని కోరారు.

పోడు వ్యవసాయానికి బ్యాంకులు రుణాలివ్వాలని జననేతకు విన్నవించారు. ముకుందాపురం వద్ద మహిళలు వైఎస్‌ జగన్‌ను కలిసి తాగునీరు సరఫరా, రోడ్డు సౌకర్యంలేదని వివరించారు. జోడూరు గ్రామస్తులు, రైతులు వైఎస్‌ జగన్‌ను కలిసి వంశధార, బహుదా నది అనుసంధాన కాల్వ దిశ మార్చాలని కోరారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన చింతలపోలురు గ్రామస్తులు తమ గ్రామంలో మౌళిక వసతులు కల్పించాలని కోరారు.

మరిన్ని వార్తలు