అధిక వడ్డీలకు చెల్లుచీటీ

31 Mar, 2019 09:35 IST|Sakshi

వైఎస్సార్‌ రైతు భరోసాతో వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు

వైఎస్‌ జగన్‌ హామీతో అన్నదాతల హర్షాతిరేకాలు 

దేశవ్యాప్తంగా రోజూ 2,035 మంది రైతులు ’ప్రధాన సాగుదారు (మెయిన్‌ కల్టివేటర్‌)’ స్థాయిని కోల్పోతున్నారు. అంటే... దాదాపు వ్యవసాయం నుంచి వైదొలుగుతున్నట్లు లెక్క. వ్యవసాయ సంక్షోభానికి ప్రధానంగా గుర్తించిన అంశాల్లో ఒకటి పరపతి సౌకర్యం లేకపోవడం. గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు  హామీ ఇచ్చిన రుణమాఫీ ఐదేళ్లు గడచినా అమలు కాలేదు. మరోపక్క రైతులకు పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు దక్కడం లేదు. దీంతో సాగు సంక్షోభం రెట్టింపైంది. లక్షలాది మంది రైతులు పెట్టుబడికి డబ్బు లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

నాలుగైదు రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చి నష్టపోతున్నారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న సహకార రంగం నిర్వీర్యమైంది. అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ దశలో రైతులకు స్వర్ణయుగం తెస్తానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేల పెట్టుబడి సాయంతో పాటు వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీకి రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయాన్ని పండగ చేస్తాడని చిన్న సన్నకారు, కౌలుదారీ రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏమిటీ వ్యవసాయ రుణం?

వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో కార్యకలాపాల కోసం ఇచ్చేదే వ్యవసాయ రుణం. భూమిని దున్నడం మొదలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల కొనుగోలు, పంట కోత వంటి వాటి కోసం ఈ రుణాన్ని వినియోగించుకోవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులు ఉత్పాదకత పెంపొందించడం వీటి ప్రధాన ఉద్దేశం. ఇందులో దీర్ఘకాలిక రుణాలను వ్యవసాయ పెట్టుబడుల కోసం, స్వల్పకాలిక రుణాలను ఉత్పత్తి కోసం ఇస్తారు. రాష్ట్ర జనాభాలో అత్యధికులు రైతులున్నందున వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యతా రంగంగా గుర్తించి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలన్నది పాలకుల ఉద్దేశం. వాణిజ్య, ప్రభుత్వ, ప్రైవేటు, ప్రాధమిక సహకార సంఘాలు, గ్రామీణ బ్యాంకులు రైతులకు వ్యవసాయ రుణాలు ఇస్తుంటాయి.

రైతుల్లో అక్షరాస్యత శాతం కూడా తక్కువ ఉంటుందన్న భావనతో డాక్యుమెంటేషన్‌ విధి విధానాలను కూడా సరళతరం చేశారు. రైతులు వ్యవసాయ రుణం పొందాలంటే– రేషన్, ఆధార్‌ వంటి గుర్తింపు కార్డులు, ఆవాస గుర్తింపు కార్డు, భూ యాజమాన్య పత్రాలు, రెవెన్యూ పత్రాలు, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు, రుణ అర్హత పత్రాలు, సాగు ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. చిన్న, సన్న, మధ్య తరహా రైతులు, కౌలు రైతులు, పాలి రైతులు, నోటి మాట ద్వారా కౌలు చేసే వారు కూడా వ్యవసాయ రుణాలకు అర్హులే. లీడ్‌ బ్యాంకులు నిర్ణయించిన లక్ష్యాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు, ప్రాథమిక సహకార సంఘాలు ఈ రుణాలు ఇస్తాయి. వీటికి దరఖాస్తు చేసే రైతులు ఏయే పంట వేయబోతున్నారో, ఏ సీజన్‌లో వేస్తారో తెలియజేయాలి. ఖరీఫ్‌కు ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు, రబీకి అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి మధ్య రుణాలు ఇస్తాయి.

వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ

రైతులు తీసుకునే పంట రుణాల్లో స్వల్పకాలిక, దీర్ఘకాలికమైనవి ఉంటాయి. లక్ష లోపు అయితే ఎటువంటి పూచీ లేకుండా తీసుకోవచ్చు. వీటిని సకాలంలో చెల్లిస్తే వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. పంట రుణాలను తీసుకుని నిర్ణీత తేదీకి (గరిష్టంగా ఒక ఏడాది) చెల్లించే నాటికి రైతులకు పావలా వడ్డీ పథకం వర్తిస్తుంది. 3 లక్షల రూపాయలు దాటే రుణానికి 7 శాతం వడ్డీ ఉంటుంది. వీటిని సకాలంలో చెల్లిస్తే 4 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. మిగతా 3 శాతం రైతులు చెల్లిస్తే సరిపోతుంది. అంటే పావలా వడ్డీ పడుతుంది. ఇందుకు సంబంధించిన వడ్డీని రైతుల తరఫున ప్రభుత్వం చెల్లిస్తుంది. 

బాబు హయాంలో రెండు విధాల నష్టం
చంద్రబాబు అధికారం కోసం బేషరతుగా రుణమాఫీని ప్రకటించారు. దీనిప్రకారం రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ కావాలి. ఐదేళ్లు దాటినా ఆయన ఈ హామీని నిలబెట్టుకోలేదు. ఫలితంగా లక్షలాది మంది రైతులు బ్యాంకుల ఎదుట డిఫాల్టర్లుగా మారారు. మరికొన్ని లక్షల మంది రుణ అర్హత కోల్పోయారు. ఇదొక రకం మోసం ఐతే వారికి జీరో వడ్డీ, పావలా వడ్డీ రుణాలు దక్కకుండా అన్యాయం చేశారు. సున్నా, పావలా వడ్డీ కింద బ్యాంకులకు ప్రభుత్వం తరఫున వడ్డీ మొత్తాలను చెల్లించకపోవడంతో రైతులకు ఈ తరహా రుణాలు ఇవ్వలేమంటూ పరపతి సంఘాలు మొహం చాటేశాయి. 2018–19లో జీరో వడ్డీకి రూ.172 కోట్లు, పావలా వడ్డీకి రూ.54 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్రంలో 85 లక్షల మంది రైతులున్నారు. ఇందులో దాదాపు 32 లక్షల మంది సన్న, చిన్నకారు, కౌలు వ్యవసాయం చేస్తుంటారు. సున్నా, పావలా వడ్డీ రుణాలు తీసుకునేవారిలో ఎక్కువమంది వీరే. వాస్తవానికి వీరి చేతిలోనే 86 శాతం సాగు భూమి ఉంది. పెట్టుబడి సాయం కోసం వీరి కష్టాలు అన్నీఇన్ని కాదు. ఎలాంటి హామీ లేకుండా రూ. లక్ష రుణం ఇచ్చే నిబంధన కౌలుదారీ చట్టంలో ఉన్నా బ్యాంకులు మొహం చాటేస్తున్నాయి. రుణ అర్హత పత్రాలు లేనిదే ఇవ్వబోమని భీష్మిస్తున్నాయి. రాష్ట్రంలో 17 లక్షల మందికి ఈ పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు గడిచిపోగా ప్రభుత్వం 6,13,639 మందికే ఇచ్చింది. నిజానికి ఇందులో నాలుగో వంతు మందికీ రుణాలు అందలేదు.

జగన్‌ హామీతో జరిగే మేలు ఇది...
దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో మాదిరిగా రైతులకు జగన్‌ అండగా ఉంటారు. పెట్టుబడి సాయం కింద ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు ఇవ్వడమే కాక గిట్టుబాటు ధర మొదలు రైతన్నకు వడ్డీ లేని, పావలా వడ్డీ రుణాలు ఇప్పిస్తారు. రైతుల తరఫున బ్యాంకులకు వడ్డీ డబ్బులను సకాలంలో చెల్లించి రైతుకు అండగా నిలుస్తారు. ఈ మేరకు బడ్జెట్‌లోనే కేటాయింపులు చేస్తారు. కౌలు రైతులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారు. తద్వారా రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. సహకార వ్యవస్థను పటిష్టం చేసి రైతుల భాగస్వామ్యం ఉండేలా చూస్తుందని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. – ఆకుల అమరయ్య, సాక్షి, అమరావతి

మరిన్ని వార్తలు