చేనేత మానేసి హోటళ్లలో పనిచేస్తున్నారు..

10 Apr, 2018 19:35 IST|Sakshi

వైఎస్‌ జగన్‌తో గోడు చెప్పుకున్న నేతన్నలు

సాక్షి, మంగళగిరి: ‘‘అన్నా.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు ఆప్కోకి ఉత్పత్తులు అమ్మితే 15 రోజుల్లో డబ్బులు వచ్చేవి. ఇప్పుడు సంవత్సరాలు గడిచినా డబ్బులు ఇవ్వట్లేదు...’   ‘మేమేమైనా ఉద్యోగాలు అడిగామా? మా వృత్తిని గౌరవంగా చేసుకుంటామనేగా అంటున్నది..’ వైఎస్సార్‌ ఉన్నప్పుడు మగ్గంగుంటలోకి నీళ్లొస్తే ఆ కుటుంబాలకు 20 కేజీల బియ్యం, రేషన్‌ సరుకులను అదనంగా ఇచ్చి ఆదుకునేవారు.. ఇవాళమాత్రం ఆ పరిస్థితి లేదు’ .. ఇవీ.. జననేతతో ముఖాముఖిలో నేతన్నలు చెప్పిన అభిప్రాయాలు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళగిరిలో చేనేత కార్మికులతో సమావేశామైన వైఎస్‌ జగన్‌.. వారి కష్టాలను, సూచనలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మాటిచ్చారు.

హోటళ్లలో పనిచేస్తున్నాం: గౌరి శంకర్, మంగళగిరి నేతన్న
‘‘చేనేత తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. 45 ఏళ్లు నిండిన ఏ ఒక్కరూ పనిచేసే పరిస్థితిలో లేరు. నేత మానేసి హోటళ్లలో పనికి వెళుతున్నాం. అన్నా.. ఈ ప్రభుత్వాన్ని మేము ఉద్యోగాలు ఇవ్వమనలేదే! మా వృత్తిని గౌరవంగా చేసుకుంటామని అడిగామంతే. వైఎస్సార్‌ బతికున్న రోజుల్లో చేనేత సెంటర్లు పెట్టాలనే ఆలోచన చేశారు. అన్నా.. మీరు అధికారంలోకి వస్తే.. ఆ సెంటర్ల ద్వారా వయసు మీదపడిన కార్మికులకు పని కల్పించండి. జీఎస్టీ వల్ల మార్కెట్లు దారుణంగా దెబ్బతిన్నాయి. సబ్సిడీ ఇచ్చినప్పుడే పోటీ తట్టుకుని నిలబడగలుగుతాం. మహానేత ఉన్నప్పుడు ఆప్కోకు బట్టలు అమ్మితే 15 రోజుల్లోపల డబ్బులు అందేవి. ఇవాళ సంవత్సరమైనా డబ్బులివ్వడంలేదు. అడిడితే.. చేనేత వృత్తి మానేసి వేరే పని చూసుకోండని ఎద్దేవా చేస్తున్నారు’’

ప్రత్యేక హోదాతో నేతన్నలు బాగుపడతారు: వెంకటేశ్వర రావు
‘‘ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు, విద్యావకాశాలే కాదు చేనేత కార్మికులు కూడా బాగుపడతారు. హోదా ఉంటే.. నేతకు అవసరమైన రసాయనాల ఉత్పత్తి పరిశ్రమలు ఇక్కడికే వస్తాయి. కార్మికులు నెలంతా కష్టపడినా 4 వేలకు మించి ఆదాయంలేదు. చేనతలు అందరికీ కనీసం నెలకు రూ.15వేల గిట్టుబాట ధర వచ్చేలా చేయాలి’’

వైఎస్సార​ ఆదుకున్నారు: లక్ష్మి
‘‘వర్షా కాలంలో మగ్గం తడిసిపోతే, అది ఆరడానికి నెల పైనే పడుతుంది. ఆ కాలమంతా మాకు ఉపాధి ఉండదు. వైఎస్సార్‌ హయాంలో వర్షాలు కురిసినప్పుడు చేనేత కార్మికులకు 20 కేజీల బియ్యం, నష్టపరిహారం ఇచ్చేవారు. ఇప్పుడు చంద్రబాబు ఏమీ ఇవ్వడంలేదు. డబ్బులు లేని కారణంగా చేనేత కుటుంబాల్లోని పిల్లలు చదువులకు దూరం అవున్నారు’’

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు