‘నారాసురుడు అడుగుపెడితే కరువు, కాటకాలే’

17 Oct, 2018 18:50 IST|Sakshi

సాక్షి, బొబ్బిలి: రాక్షస మహిషాసురుడు ప్రజలను పీక్కుతినేవాడని.. ఇప్పడు ఏపీలో నారాసురుడు(చంద్రబాబు నాయుడు) ప్రజలను కాల్చుక తింటున్నాడని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రాక్షస మహిషాసురుడుకి, ఏపీ నారాసురుడికి ఎలాంటి పోలికలున్నాయో ప్రజలందరికీ తెలుసన్నారు. మోసం చేయడానికి ఆ రాక్షసుడు రూపాలు మార్చేవాడని..ఈ నారాసురుడు అధికారం కోసం ఏ గడ్డైనా తినడానికి వెనుకాడడని మండిపడ్డారు. నారాసురుడు అధికారంలో కరువు, కాటకాలు, ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయన్నారు.  ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 288వ రోజు బుధవారం ఆయన విజయనగరం జిల్లా బొబ్బిలి సభలో భారీ జనసందోహాన్నుద్దేశించి ప్రసంగించారు. ప్రజల కోసమే జీవించాలని.. వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండాలని భావోద్వేగంతో చెప్పారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే.. 

ధర్మం తప్పితే అంతం తప్పదని చెప్పిన నేల ఇది
‘తెలుగు నేల మీద బొబ్బిలి ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ రోజులో బొబ్బిలి కోటపై అన్యాయంగా యుద్దం చేశారని పరాయి సేనలతో చేతులు కలిపారని వంచనతో తనవారందరిని చంపేశారని, అప్పట్లో విజనగరం అధిపతి విజయరామ గజపతిని తాండ్రపాపారాయుడు అంతం చేసిన విషయం తెలిసిందే. విజయరామగజపతిని చంపబోతుంటే చివరి క్షణాల్లో తాండ్ర పాపారాయుడుని ప్రలోభాలు గురిచేశారు. అయినప్పటికీ విలువలు తప్పకుండా, ఎత్తిన కత్తి దింపకుండా రాజ్యకాంక్షతో ఎదుటివారి కోటపై కన్ను వేయరాదని, వెన్నపోటు పొడవరాదని, వంచన చేయరాదని, ధర్మం తప్పరాదని ఒక వేళ ధర్మం తప్పితే చివరికి అంతం తప్పదని చరిత్ర మనకి చెబుతోంది. ఆరోజు తాండ్రపాపారాయుడు బొబ్బిలి నేలపై చెప్పిన విషయాలు ఇవి అయితే.. అదే బొబ్బిలి నేలపై ఇవాళ జరుగుతున్న రాజకీయాలు చూడమని ప్రజలను కోరుతున్నా.

బొబ్బిలి వారసులమని చెప్పుకునే వారే తప్పు చేస్తే..
ఒక పార్టీ నుంచి గెలిచారు ఇంకో పార్టీలోకి దూకారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయకుండానే ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టారు. సాక్షాత్తు బొబ్బొలి వారసులుగా చెప్పుకునే వారికే విలువలు లేకపోతే.. విశ్వసనీయత లేకపోతే, ధర్మం లేకపోతే, న్యాయం లేకపోతే ఇక ప్రజలు ఎవరి దగ్గరికి పోవాలని ప్రశ్నిస్తున్నా. ప్రజలకు ఈ పాలకులు ఏం సందేశం ఇస్తున్నారు. అభివృద్ది కోసం పార్టీ మారమని పాలకులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు బొబ్బిలి ప్రజలు నా దగ్గరికొచ్చి అన్న మాటేంటంటే అభివృద్ది వారి కుటుంబానికి జరగవచ్చు కానీ, మాకైతే ఎలాంటి అభివృద్ది జరగలేదని వాపోయారు. (ప్రజాకోర్టులో మంత్రి సుజయ్‌కు శిక్ష తప్పదు)

అక్రమ మైనింగ్‌.. కబ్జాలు
అభివృద్ది జరగడం అనే విషయం పక్కకుపెడితే. మంత్రి పదవులు తీసుకున్నవారు చేస్తున్న పనులేంటంటే.. ఇదే జిల్లాలో మాంగనీసు తవ్వకాలు జరుగుతన్నాయి. అక్రమంగా పదహారు సంస్థలకు  లైసెన్స్‌లు లేకుండా.. రెన్యువల్‌ కాకుండా లక్షల టన్నుల మాంగనీస్‌ మైనింగ్‌ జరుగుతుంటే ఆనాడు సాక్షాత్తు గనుల శాఖ మంత్రిగా ఉంది బొబ్బిలి ఎమ్మెల్యేనే. ఇదే పాత బొబ్బిలిలో 15 ఎకరాలు గిరిజనులకు సంబంధించిన మిగులు భూములను కబ్జా చేశారు. ఆ భూములను గిరజనుల నుంచి లాక్కొని పరిస్థితి పాత బొబ్బిలి చూశాం. ఇదే బొబ్బిలిలో వేగావతి, స్వర్ణముఖి,  చంపావతి, గోస్తని, నాగావలి నదుల్లో అక్రమ ఇసుక దందా. బొబ్బిలి చెరువుల్లో కబ్జా. (వైఎస్‌ జగన్‌ దసరా శుభాకాంక్షలు)

విజయనగరం మీద బాబుకు చిన్న చూపు
గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు విజయనగరం గురించి గానీ, తోటపల్లి ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. చంద్రబాబు వదిలేసిన తోటపల్లి ప్రాజెక్ట్‌ పనులను దివంగత సీఎం వైఎస్సార్‌ పరుగులెత్తించి 90 శాతం పనులు పూర్తి చేశారు. మరలా చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత మిగిలిన పది శాతం పనులు కూడా చేయలేని అధ్వాన్నమైన పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. లక్షా ముప్పై వేల ఎకరాల సాగుకు ఉపయోగపడే ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేయకుండా ఉన్నారంటే ఎలాంటి పాలన అందిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. (జగన్‌ చెప్పిందే నిజమైంది)

షుగర్‌ ఫ్యాక్టరీ రైతులు, కార్మికుల దుర్భర పరిస్థితి
ఇదే పాలకుల హయాంలో 2002లో ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ఉండేది. ఆ నిజాం షుగర్‌కు చెందిన లచ్చయ్యపేటకు చెందిన ఫ్యాక్టరీని అప్పట్లోనే టీడీపీ ప్రభుత్వం శనిక్కాయలు, బెల్లానికి అమ్మేశారు. ఆ ఫ్యాక్టరీని కొనుగోలు చేసిన యాజమాన్యం గత ఏడాదికి సంబంధించిన 12 కోట్ల బకాయిలు రైతులకు ఇప్పటివరకు ఇవ్వలేదని షుగర్‌ ఫ్యాక్టరీకి చెందిన రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు. చక్కెరను అధిక లాభానికే సమయానికే అమ్ముకుంటున్నారు, కానీ రైతులకు మాత్రం బకాయిలు చెల్లించటం లేదు. ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు సరిగా ఇవ్వటం లేదు. సాక్షాత్తు ఓ మంత్రి ఇలాఖలో ఇంతటి దారణంగా కార్మికులు, రైతుల పరిస్థితుండటం విడ్డూరంగా ఉంది. కనీసం వారి సమస్యలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. బొబ్బిలిలోని పారిశుద్ద్యకార్మికులకు జీతాలు ఇవ్వకుండా.. తీసేస్తున్న దారుణ పరిస్థితి. రెండు నెలలుగా సమ్మె చేస్తున్నా ఏమాత్రం కనికరం లేకుండా వారిని తీసేసే పరిస్థితి ఇక్కడి బొబ్బిలి పాలకుల పనితీరుకు నిదర్శనం. 

బాబు హయాంలో ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి
ఇదే బొబ్బిలిలో అతిపెద్దదైన లక్ష్మీశ్రీనివాస జూట్‌ మిల్‌లో సుమారు 2300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ జూట్‌ మిల్‌ను మూసేశారు. వరుసగా ఫ్యాక్టరీలను మూసేసిన ఘనత చంద్రబాబుదే. జూట్‌ మిల్లులకు కరెంట్‌ చార్జీలు అధికంగా పెంచేయడంతో అవి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాయి. బొబ్బిలిలో వందపడకల ఆస్పత్రి కడతానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. మంత్రిగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గంలో రెండురోజులకోసారి తాగునీరు రావడం హాస్యాస్పదం. దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో ఈ నియోజకవర్గంలో 38,150 ఇళ్లులు కట్టారు. ఈ నాలుగున్నరేళ్లలో ఇక్కడి మంత్రి, ఎమ్మెల్యే కనీసం ఊరికో మూడు ఇళ్లులైనా కట్టారా అన్ని ప్రశ్నిస్తున్నా.

అధికారం కోసం బాబు ఏ గడ్డైనా తింటారు
రేపు దసరా మహిషాసరుడు ఎలా అంతమయ్యాడో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడికి, రాక్షస మహిషాసరుడికి ఎలాంటి పోలికలున్నాయో ప్రజలందరికీ తెలుసు. మోసం చేయడానికి మహిషాసరుడు రూపాలు మారుతూ ఉండేవాడు. చావే లేకుండా ఉండాలని వరం పోంది ప్రజలను నానాహింసలు పెడతాడు. ఇప్పుడు ఏపీలో నారాసురుడు పాలన.. మహిషాసురుడి పాలనను మించిపోయింది. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా తినడానకి సిద్దంగా ఉంటారు. ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవడానికి వెనుకాడరు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడానికి ఆయన మొహమాటం పడరు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అబద్దాలైనా చెబుతారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదని అసెంబ్లీలోనే ప్రభుత్వం చెప్పింది. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని లిఖితపూర్వకంగా చెప్పారు. 

పేదవారికి వైఎస్‌ జగన్‌ భరోసా
ఇంజనీరింగ్‌, డాక్టర్‌ చదవాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి. అందుకే చాలా మంది పేదవారు చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ని లక్షల ఖర్చైనా పేద పిల్లందరిని ఉచితంగా చదివిస్తాం. హాస్టల్‌ ఖర్చుల కోసం ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లుగా చేస్తాం. చిన్న పిల్లలను స్కూల్‌కు పంపిన తల్లులకు ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. బాబు వస్తే జాబు అన్నారు.. లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. జాబు రావడం దేవుడెరుగు..ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు. అధికారంలోకి రాగానే అవసరమైన టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తాం’అంటూ వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు