జనం మధ్యలో జగన్‌ సంక్రాంతి సంబరాలు

17 Jan, 2018 05:41 IST|Sakshi

హరిదాసులు, ముత్యాల ముగ్గులు, గంగిరెద్దులు, పూరిళ్లు, కొలువు దీరిన గొబ్బెమ్మలు, బంతిపూల హరివిల్లులు... సంక్రాంతి పర్వదినం సందర్భంగా సోమవారం వైఎస్‌ జగన్‌ బస చేసిన శిబిరం వద్ద కనిపించిన దశ్యాలివి. తెలుగింట పెద్ద పండగ అయిన సంక్రాంతి సందర్భంగా ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటించిన జగన్‌.. తాను బస చేసిన శిబిరం వద్ద ప్రజలు, బంధు మిత్రులు, ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషుల మధ్య వేడుకలు జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. పల్లె వాతావరణాన్ని తలపించేలా వేసిన రెండు పూరిళ్ల మధ్య ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నమస్కరించారు. సంప్రదాయబద్ధంగా పెద్దలకు బట్టలు పెట్టారు. పండగ సందర్భంగా కోలాటాన్ని, భజనలను, పతంగుల ఎగురవేతను ప్రత్యక్షంగా తిలకించారు.

హరిదాసులు శ్రావ్యంగా కీర్తనలు ఆలపించారు. మహిళలు సంప్రదాయ నృత్యాలు చేశారు. గంగిరెద్దుల వాళ్లు తమ ఆటలతో అలరించారు. ఈ సందర్భంగా జగన్‌ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. జగన్‌ను వేదపండితులు ఆశీర్వదించారు. ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రోజా, సునీల్‌ కుమార్, నారాయణ స్వామి, పార్టీ నేతలు బియ్యపు మధుసూదనరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ఆదిమూలం, జే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు