బీసీలకు నష్టం లేకుండా కాపు రిజర్వేషన్‌కు మద్దతు: వైఎస్‌ జగన్‌

31 Jul, 2018 18:14 IST|Sakshi

సాక్షి, పిఠాపురం : బీసీలకు అన్యాయం జరగకుండా కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్‌ కల్పించే విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాపులకు మొదటినుంచి అండగా నిలుస్తోంది వైఎస్సార్‌ సీపీయేననీ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్‌కు రూ. 10వేల కోట్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.

కాపు రిజర్వేషన్ల విషయంలో తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. ఎల్లో మీడియా మద్దతు ఉందని చంద్రబాబు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాపులను వేధించిన చంద్రబాబు మోసగాడా? లేక కాపులకు అండగా ఉన్న వైఎస్‌ జగన్‌ మోసగాడా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు కాపులకు హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేయలేదా? అని నిలదీశారు. ‘కొత్తగా చంద్రబాబు మరో డ్రామా మొదలుపెట్టారు. కాపు రిజర్వేషన్లపై పార్లమెంటులో గొడవ పడాలని చంద్రబాబు తన ఎంపీలకు చెప్పాడట. చంద్రబాబు డ్రామాలు ఎలా ఉన్నాయో అందరూ గమనించాల’ని సూచించారు.

50శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వలేమని తెలిసినా.. రిజర్వేషన్ల అంశాన్ని టీడీపీ మ్యానిఫెస్టోలో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కాపులకు రిజర్వేషన్‌ అమలు చేస్తామని చెప్పి.. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు మోసం చేస్తూ వచ్చారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. కాపులకు రూ. 5వేల కోట్ల నిధులిస్తామని చెప్పి చంద్రబాబు గత నాలుగేళ్లలో కేవలం రూ. 1340 కోట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. ‘జగన్‌ అనే నేను.. కాపు కార్పొరేషన్‌కు రూ. 10వేల కోట్లు ఇస్తాన’ని ప్రమాణస్ఫూర్తిగా చెప్పారు. యూటర్న్‌ తీసుకునే అలవాటు తనకు లేదనీ, రిజర్వేషన్ల విషయంలో సలహాలు ఇస్తే వైఎస్సార్‌సీపీ తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రతీ కులాన్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు.

అప్పుడు ఏడ్చాడు.. ఇప్పుడు ఏడ్పిస్తున్నాడు..
ఎన్నికల సమయంలో మొసలి కన్నీరు కార్చి.. ఫెక్సీలు పెట్టి.. ఓట్లు వేయించుకున్న పిఠాపురం ఎమ్మెల్యే,  గెలుపొందిన తర్వాత ప్రజలకు కనీళ్లు పెట్టిస్తున్నాడని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. మంచి చేస్తానని ఎన్నికల్లో నమ్మబలికి అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆగడాలు మితిమీరి పోయాయని అన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం పేరుతో నియోజకవర్గంలో 25 చెరువుల్ని తాటిచెట్టు లోతు తవ్వి ఎమ్మెల్యే సొమ్ము చేసుకున్నారనీ, కాంట్రాక్టుల్లో మోసాలకు పాల్పడి 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని వైఎస్‌ జగన్‌ ఆరోపణలు చేశారు.

ట్రస్టు ఆస్తులకు ఎసరు..
నియోజకవర్గంలో అవినీతి ఎంతలా పేరుకుపోయిందంటే.. అధికారులు బదిలీ కావాలన్నా లంచం ఇవ్వక తప్పదు. బదిలీ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే వేధించడంతో పిఠాపురం నియోజక వర్గంలో ఒక ఎంఈవో గుండెపోటుతో మరణించారు. శ్రీపాదవల్లభ స్వామి ట్రస్టుకు చెందిన 100 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేయడానికి టీడీపీ నేతలు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు. పేదల కోసం ట్రస్టు ఆస్పత్రి భవనాన్ని నిర్మించాలనుకుంది. కానీ, దాని కాంట్రాక్టులు టీడీపీ నేతలకు రాలేదని భవన నిర్మాణాన్ని అడ్డుకున్నారని వైఎస్‌ జగన్‌ ఆరోపణలు చేశారు.

ఉప్పుటేరు ఫిషింగ్‌ హార్బర్‌ ఏమైంది..!
ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పూర్తయితే రైతన్నలకు ఎంతో మేలు జరిగేది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో 103 కోట్లతో ఆధునికీకరణ పనులు ప్రారంభమైతే.. చంద్రబాబు పాలనలో ఇంకా ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రాజెక్టు పనులు 40 శాతం కూడా పూర్తికాలేదని వెల్లడించారు. యూ.కొత్తపల్లి మండలం ఉప్పుటేరు వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తామని బాబు ఇచ్చిన హామీ ఏమైందని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

పిఠాపురంలో వైఎస్సార్‌ 15 వేల ఇళ్లు కట్టించి ఇచ్చారు. కానీ, చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో పది ఇళ్లు కూడా కట్టివ్వలేదని ఎద్దేవా చేశారు. ఉప్పాడ ప్రాంతం చీరలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలోని నేతన్నలు చీరలకు గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైస్సార్‌ పాలనలో ఒక్కో చీరకు 1600 రూపాయలు గిట్టుబాటు కాగా, బాబు హయాంలో 800 రూపాయలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు కాకినాడ సెజ్‌ భూములతో జగన్‌కు సంబంధం ఉందని చెప్పి.. ఆ భూముల్లో ఏరువాక చేపట్టిన చంద్రబాబు అధికారంలోకి రాగానే భూములను తిరిగిస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు