చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే.. అరాచకమే

28 Mar, 2019 04:36 IST|Sakshi
బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం. ప్రసంగిస్తున్న వైఎస్‌ జగన్‌

ఐదేళ్లలో బాబు మోసాలను ప్రజలంతా గుర్తు చేసుకోవాలి: వైఎస్‌ జగన్‌

ఆయన మాటలు నమ్మి ఇప్పటికే మోసపోయాం  

బాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పరిపాలన అనేదే ఉండదు  

తనను వ్యతిరేకించే వారిని బతకనివ్వడు

మనుషులను చంపినా కేసులు ఉండవు  

సీబీఐ, ఈడీలను రానివ్వడు 

ప్రజల భూములు, ఇళ్లు లాక్కుంటాడు  

ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, పొలాలు, నదులు ఏవీ మిగలవు  

పార్వతీపురం, పాయకరావుపేట,ముమ్మిడివరం, మండపేటలో వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం

మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో ప్రతి ఒక్కరికీ చెప్పండి. 15 రోజులు ఓపిక పట్టండి, మన అందరి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తాడని చెప్పండి.  ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను అన్న ఒకేసారి భర్తీ చేస్తాడని తెలియజేయండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు అన్న ఇల్లు కట్టిస్తాడని చెప్పండి.
– పార్వతీపురం సభలో..

చంద్రబాబుపై ఐదేళ్లు పోరాడిన నాపై 22 కేసులు పెట్టారు. ఏడాదిగా చంద్రబాబుపై పోరాటం చేస్తున్నానని చెప్పుకుంటున్న ఆయన పార్టనర్, యాక్టర్‌పై ఎన్ని కేసులు పెట్టారో తెలుసా? అక్షరాలా సున్నా. 
– ముమ్మిడివరం సభలో..

కేవలం రూ.3 లక్షల లోపే అయ్యే ఫ్లాట్‌ను అక్షరాలా రూ.6 లక్షలకు ప్రభుత్వం పేదలకు విక్రయిస్తోంది. పేదలు తమ వాటా రూ.3 లక్షలను ప్రతినెలా రూ.3 వేల చొప్పున 20 ఏళ్లపాటు చెల్లించాలట. ఫ్లాట్ల నిర్మాణం పేరిట లంచాలు మింగేది చంద్రబాబు. ఆ భారాన్ని భరించేది మాత్రం పేదలా? పేదలు చెల్లించాల్సిన రూ.3 లక్షల రుణాన్ని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాఫీ చేస్తాం.
– మండపేట సభలో..

సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి, విశాఖపట్నం/అమలాపురం/మండపేట:  ‘‘చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో చేసిన మోసాలను ప్రజలంతా గుర్తు చేసుకోవాలి. ఆయన మాటలు నమ్మి ఇప్పటికే ఒకసారి మోసపోయాం. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే రాష్ట్రంలో పరిపాలన అనేదే ఉండదు. అరాచకమే రాజ్యమేలుతుంది. తనను వ్యతిరేకించే వారిని ఎవరినీ బతకనివ్వడు. మనుషులను చంపినా కేసులు ఉండవు. సీబీఐ, ఈడీలను రాష్ట్రంలోకి రానివ్వడు. ప్రజల భూములు, ఇళ్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు లాక్కుంటాడు. ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, పొలాలు, నదులు ఏవీ మిగలవు. డ్వాక్రా సంఘాల రుణాలపై వడ్డీలు పెంచేస్తాడు, సున్నా వడ్డీకి రుణం అనే పథకమే ఉండదు. బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు రాకుండా చేస్తాడు. సంక్షేమ పథకాలను రద్దు చేస్తాడు. రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ఉండదు. ఆర్టీసీని, కరెంటును కూడా మిగలనివ్వడు. అన్నింటినీ ప్రైవేట్‌కు అమ్మేస్తాడు. మనం ఏ సినిమా చూడాలో, టీవీలో ఏ చానల్‌ చూడాలో, ఏ పత్రికలు చదవాలో కూడా జన్మభూమి కమిటీ సభ్యులే నిర్ణయిస్తారు.

బాబు మళ్లీ సీఎం అయితే మీరు ఏ స్కూల్‌కు వెళ్లాలి, ఏ ఆసుపత్రికి వెళ్లాలి, అక్కడ ఫీజు ఎంత కట్టాలో వాళ్లే నిర్ధారిస్తారు. ఎన్నికల ముందు చంద్రబాబు చూపిస్తున్న సినిమాలు, డ్రామాలను, చేస్తున్న వాగ్దానాలను, టీవీల్లో ప్రసారం చేస్తున్న ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు. నరమాంసం తినే అందమైన రాక్షసిని నమ్మితే ఎలా బలైపోతామో బాబు ప్రచారాన్ని నమ్మితే అలా బలైపోతాం. బాబుకు ఓటు వేస్తే మనం ఎవరం ఇక మిగలం’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురం, విశాఖ జిల్లా పాయకరావుపేట, తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం, మండపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నాలుగు చోట్ల బహిరంగ సభల్లో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందించాలన్న ఆశయంతో ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చంద్రబాబు ఢిల్లీ నుంచి ఫరూక్‌ అబ్దుల్లాను తీసుకొచ్చి, తన గురించి అబద్ధాలు చెప్పించాడని మండిపడ్డారు. బహిరంగ సభల్లో వైఎస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే...  

బాబు మరోసారి సీఎం అయితే..  
పాయకరావుపేట సభలో..
మరో 15 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిన మోసాలు, చెప్పిన అబద్ధాలను ప్రజలంతా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. చంద్రబాబుకు మరోసారి పొరపాటున ఓటు వేస్తే ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఉండదు. ఇప్పటికే 6 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసేశారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పేదలు తమ పిల్లలను బడికి పంపించే పరిస్థితి ఉండదు. నారాయణ స్కూళ్లలో ఇప్పుడు ఎల్‌కేజీ చదవాలంటే రూ.25 వేలు వసూలు చేస్తున్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ స్కూళ్లు ఉండవు, అన్నీ నారాయణ స్కూళ్లే ఉంటాయి. అప్పుడు ఎల్‌కేజీ చదవాలంటే లక్ష రూపాయలు వసూలు చేస్తారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఆర్టీసీని, కరెంటును కూడా మిగలనివ్వడు. అన్నింటినీ ప్రైవేట్‌కు అమ్మేస్తాడు. ఐదేళ్లుగా బాబు పాలనలో కరెంటు చార్జీలను, ఆర్టీసీ చార్జీలను, ఇంటి పన్నులను, పెట్రోల్, డీజిల్‌ రేట్లను విపరీతంగా పెంచేశారు. ఇన్నాళ్లూ ప్రజలను బాదేశారు, బాబు మళ్లీ సీఎం అయితే ఇక వీర బాదుడే. చంద్రబాబుకు ఓటేస్తే అధికారంలోకి రాగానే పింఛన్లు తీసేస్తాడు, రేషన్‌ కార్డుల్లో కోత వేస్తాడు.  

రెచ్చిపోతున్న భూమాయగాళ్లు  
చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్‌ కార్డులు ఉండేవి, బాబు వాటిని 36 లక్షలకు కుదించాడు. రేషన్‌ కార్డులను సైతం తగ్గించాడు. మళ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రమే పెన్షన్లు, రేషన్‌ కార్డుల సంఖ్యను పెంచాడు. బాబు మరోసారి సీఎం అయితే పెన్షన్లు, రేషన్‌ కార్డుల కథ మళ్లీ మొదటికొస్తుంది. ఆయనకు పొరపాటున ఓటు వేస్తే ప్రజల భూములు, ఇళ్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు లాక్కుంటాడు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను బాబు తన అత్తగారి సొత్తు అయినట్టు గుంజుకుంటున్నాడు. వెబ్‌ల్యాండ్‌ పేరుతో ఇప్పటికే భూరికార్డులను తారుమారు చేస్తున్నారు. భూములను మాయం చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే ఇక ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, పొలాలు, నదులు ఏవీ మిగలవు. లారీ ఇసుక ఇప్పుడు రూ.40 వేలు పలుకుతోంది. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే లారీ ఇసుకకు రూ.లక్ష వసూలు చేస్తారు. బాబుకు పొరపాటున ఓటు వేస్తే మీరు ఏ సినిమా చూడాలో, టీవీలో ఏ చానల్‌ చూడాలో, ఏ పత్రికలు చదవాలో కూడా జన్మభూమి కమిటీ సభ్యులే నిర్ణయిస్తారు. ఇప్పటికే గ్రామాల్లో పెన్షన్‌ కావాలన్నా, రేషన్‌ కార్డు కావాలన్నా, ఇళ్లు మంజూరు కావాలన్నా, మరుగు దొడ్లు కావాలన్నా.. మీరు ఏ పార్టీ వాళ్లు అని అడుగుతున్నారు. బాబు మళ్లీ సీఎం అయితే మీరు ఏ స్కూల్‌కు వెళ్లాలి, ఏ ఆసుపత్రికి వెళ్లాలి, అక్కడ ఫీజు ఎంత కట్టాలో కూడా వాళ్లే నిర్ణయిస్తారు.  

‘108’, ‘104’ అంబులెన్స్‌లు ఉండవు  
చంద్రబాబు గత చరిత్రను ప్రజలంతా గుర్తు చేసుకోవాలి. సంపూర్ణ మద్య నిషేధం, రూ.2 కిలో బియ్యం ఇస్తామని హామీ ఇచ్చి 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. తర్వాత చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, 1995లో ముఖ్యమంత్రి అయ్యాడు. రూ.2 ఉన్న కిలో బియ్యం ధరను రూ.3.50కు పెంచాడు. మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశాడు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే డ్వాక్రా సంఘాల రుణాలపై వడ్డీలు పెంచేస్తాడు, సున్నా వడ్డీకి రుణం అనే పథకమే ఉండదు. బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు రాకుండా చేస్తాడు. ఇప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు, చేసిన వాగ్దానాలను ఆయన మళ్లీ సీఎం అయితే రద్దు చేస్తాడు. చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ఉండదు. ‘108’, ‘104’ అంబులెన్స్‌లు కూడా ఉండవు. బాబు మరోసారి సీఎం అయితే కాలేజీల్లో ఫీజులను విపరీతంగా పెంచేస్తారు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నీరుగార్చేస్తారు.

పేదలు సొంతింటి కలను వదులుకోవాల్సిందే. చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే తనను వ్యతిరేకించే వారిని ఎవరినీ బతకనివ్వడు. మనుషులను చంపినా కేసులు ఉండవు. సీబీఐ, ఈడీలను రాష్ట్రంలోకి రానివ్వడు. పత్రికలు, టీవీ చానళ్లు ఇప్పటికే చంద్రబాబుకు అమ్ముడుపోయాయి. బాబు, ఆయన మనుషులు ఎలాంటి నేరాలు చేసినా పత్రికల్లో వార్తలు ఉండవు, టీవీల్లో చూపించరు. తానే చంపిస్తాడు, బంధువులు చంపించారని ప్రచారం చేస్తాడు. చంద్రబాబు పొరపాటున సీఎంగా ఎన్నికైతే రాష్ట్రంలో పాలన అనేదే ఉండదు. వ్యవస్థలు ఇప్పటికే దిగజారిపోయాయి. ఇప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు చూపిస్తున్న డ్రామాలను, చేస్తున్న వాగ్దానాలను, టీవీల్లో ప్రసారం చేస్తున్న ప్రకటనలను నమ్మొద్దు. 

రైతన్నల కష్టాలు మర్చిపోలేను  
పాయకరావుపేట నియోజకవర్గం నుంచి నా పాదయాత్ర సాగింది. అప్పట్లో ఇక్కడి రైతన్నలు చెప్పిన కష్టాలను నేను మర్చిపోలేదు. రైతు ముఖంలో చిరునవ్వు ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. తాండవ, ఏటికొప్పాక సహకార రంగాల్లోని చక్కెర ఫ్యాక్టరీలు నష్టాల్లో కూరుకుపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్, దుబాయ్‌కి వెళ్తాడు, రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని గొప్పలు చెబుతాడు. కానీ, కళ్లెదుటే చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతుంటే పట్టించుకోవడం లేదని రైతులు చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో నాన్నగారి హయాంలో చెరకుకు టన్నుకు 400 బోనస్‌ ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు.

ఇప్పుడు బోనస్‌ మాట దేవుడెరుగు కనీసం సమయానికి పేమెంట్స్‌ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజయ్యపేట, పెంటకోట దగ్గర మినీ జెట్టీలు కట్టిస్తానని చంద్రబాబు మాట ఇచ్చి నిలబెట్టుకోలేదని మత్స్యకారులు చెప్పారు. నక్కపల్లి మండలంలో పరిశ్రమల కోసం 6 వేల ఎకరాలను సేకరించినప్పుడు అధికారులు వస్తే చెట్టుకు కట్టేసి కొట్టాలని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అన్నాడు. కానీ, ముఖ్యమంత్రిఅయ్యాక తమకు పరిహారం ఇవ్వడం లేదని రైతులు నాకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నాయకులు వరాహ, తాండవ నదుల్లో ఇసుకను ఎడాపెడా దోచేశారు. మరోవైపు ఇసుక ఉచితం అంటూ చంద్రబాబు ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. లారీ ఇసుక రూ.40 వేలు పెట్టి కొనాల్సి వస్తోందని ప్రజలు అంటున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో కనీసం డిగ్రీ కాలేజీ కూడా లేకపోవడం దారుణం. కనీసం తాగడానికి నీరు కూడా లేదు.  

బాబు స్వార్థానికి ప్రత్యేక హోదా తాకట్టు 
పార్వతీపురం సభలో..
నా సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలను కలిశాను. ప్రతి కుటుంబం ఆవేదనను, కష్టాన్ని కళ్లారా చూశా. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందక అన్యాయమైపోతున్న ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నా.. మీకు నేనున్నాను. రుణాలు మాఫీ కాక, ప్రభుత్వం ఇస్తామన్న రుణమాఫీ సొమ్ము వడ్డీలకు కూడా సరిపోక, కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక కుంగిపోతున్న రైతన్నలకు భరోసా ఇస్తున్నా.. మీకు అండగా నేనుంటాను. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, చివరికి కాపుల పట్ల చంద్రబాబు చిన్నచూపు చూస్తూ మాట్లాడిన మాటలు విన్నా. పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూశాను. ప్రభుత్వ స్కూళ్లను, కళాశాలలను, ఆరోగ్య కేంద్రాలను చంద్రబాబు మూసేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ పోస్టులను భర్తీ చేయడం లేదు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన  బిల్లులు చెల్లించడం లేదు.
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ గుర్తు అయిన ఫ్యాన్‌ను చూపిస్తూ ప్రసంగిస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ 

ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ తన బినామీలైన నారాయణ పాఠశాలలకు పిల్లలు వెళ్లేలా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ పిల్లలను పెద్ద చదువులు చదివించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు నీరుగార్చారు. ఉపాధ్యాయులు, వీఏఓలు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు జీతాలు పెంచమని వేడుకుంటే ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యం చేయించడం దారుణం. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. ఉద్యోగాలు రావడానికి దోహదపడే ప్రత్యేక హోదాను చంద్రబాబు తన స్వార్థం కోసం తాకట్టు పెట్టాడు. గ్రామాల్లో జన్మభూమి కమిటీ మాఫియాలు రాజ్యమేలుతున్నాయి. పింఛన్‌ కావాలన్నా, రేషన్‌ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా లంచాలు ముట్టజెప్పాల్సిన దుస్థితి దాపురించింది.   

ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తాం..  
ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి చంద్రబాబు ప్రతి గ్రామానికీ డబ్బు మూటలు పంపిస్తాడు. ప్రతి ఓటర్‌ చేతిలో రూ.3 వేలు పెట్టి, ప్రలోభాలకు గురిచేస్తాడు. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో ప్రతి ఒక్కరికీ చెప్పండి. 15 రోజులు ఓపిక పట్టండి, మన అందరి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ‘అమ్మ ఒడి’ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తాడని అక్కచెల్లెమ్మలకు చెప్పండి. ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళలకు అప్పు ఎంతైతే ఉంటుందో అంతే సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాడని, వడ్డీని బ్యాంకులకు అన్న చెల్లిస్తాడని తెలియజేయండి.

45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద నాలుగు దఫాల్లో రూ.75 వేలు ఉచితంగా ఇస్తాడని చెప్పండి. పెట్టుబడి కోసం ‘రైతు భరోసా’ కింద ప్రతి ఏడాది మే నెలలో నేరుగా ప్రతి రైతన్న చేతిలో రూ.12,500 పెడతాడని చెప్పండి. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తాడని చెప్పండి. పంటలకు గిట్టుబాటు ధరలకు గ్యారంటీ ఇస్తాడని చెప్పండి. పెన్షన్‌ను రూ.3 వేల దాకా పెంచుకుంటూ పోతాడని ప్రతి అవ్వాతాతకు చెప్పండి. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను అన్న ఒకేసారి భర్తీ చేస్తాడని తెలియజేయండి. గ్రామ సచివాలయంలో అదే గ్రామానికి చెందిన 10 మంది చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇస్తాడని చెప్పండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు అన్న ఇల్లు కట్టిస్తాడని చెప్పండి. సంవత్సరానికి 5 లక్షల చొప్పున ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తాడని చెప్పండి.   

జిల్లాకు బాబు చేసింది గుండు సున్నా  
ఇవాళ మనం యుద్ధం చేస్తున్నది కేవలం చంద్రబాబు ఒక్కరితోనే కాదు, ఆయనకు వంతపాడుతున్న ఈనాడుతో, ఆంధ్రజ్యోతితో, టివీ5తో, ఇతర అమ్ముడుపోయిన చానళ్లతోనూ పోరాడుతున్నాం. వెనుకబడిన విజయనగరం జిల్లాకు చంద్రబాబు చేసింది గుండు సున్నా. ఈ ప్రాంతానికి ఎవరైనా మంచి చేశారంటే అది దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక్కరే. రూ.450.23 కోట్ల తోటపల్లి ప్రాజెక్టుకు ఆ దివంగత నేత హయాంలోనే రూ.400 కోట్లు ఖర్చు చేసి, 90 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిపోయిన 10 శాతం పనులు పూర్తి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది. 1.20 లక్షల ఎకరాలు సాగు కావాల్సిన ఈ ప్రాజెక్టు కింద 80 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందించలేని పరిస్థితి ఉంది.

ఒడిశాతో వివాదం కారణంగా ఏ ఒక్కరూ జంఝావతి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ముందుకు రాకపోతే, అప్పట్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి రబ్బర్‌ డ్యాంను తీసుకొచ్చారు. అటువంటి జంఝావతి ప్రాజెక్టు పరిస్థితి ఏమిటో మనకు తెలుసు. చంద్రబాబు మాటిమాటికీ ప్రత్యేక విమానంలో టిఫిన్‌ కోసం స్టాలిన్‌ దగ్గరకు తమిళనాడుకు వెళ్తాడు, భోజనం చేయడానికి మమతా బెనర్జీ దగ్గరికి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తాడు. ఇంకా సరిపోకపోతే సాయంత్రం కాఫీ తాగడానికి రాహుల్‌గాంధీ దగ్గరకు వెళ్తాడు. కానీ, ఒడిశా ముఖ్యమంత్రి వద్దకు మాత్రం వెళ్లడు. వెళ్లి మాట్లాడితే ఆ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యేవి. ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారేది.  

అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొట్టేయడానికి కుట్ర  
పార్వతీపురం మున్సిపాల్టీలో తాగునీటి సమస్య ఈనాటికీ పరిష్కారం కాలేదు. నాగావళి నదిలో నేలబావులు పాడైపోతే ఎవరూ పట్టించుకోలేదు. పార్వతీపురం ఏరియా ఆస్పత్రిని వంద పడకల ఆసుపత్రిగా మారుస్తామని టీడీపీ పాలకులు హామీ ఇచ్చారు. చివరకు మాట తప్పారు. అగ్రిగోల్డ్‌ బాధితులు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి బాధితులను ఆదుకోవాల్సింది పోయి వాటిని కాజేయాలని టీడీపీ నేతలు కుట్ర పన్నారు.   

పంటలకు మద్దతు ధర ఇచ్చే  బాధ్యత నాదే  
మండపేట సభలో..
ధాన్యం దళారీల పాలవుతున్న విషయాన్ని మండపేటలో పాదయాత్ర సందర్భంగా రైతులు నాతో చెప్పారు. మనం అధికారంలోకి రాగానే పంటలకు మద్దతు ధర ఇచ్చే బాధ్యత నాదే. ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. ఫీజులు కట్టేందుకు అప్పులు చేస్తున్న తల్లిదండ్రులను చూశా. ఫీజుల భారం పూర్తిగా తగ్గిస్తానని హామీ ఇస్తున్నా. గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ బంగాళాఖాతంలో డ్రిల్లింగ్, డ్రెడ్జింగ్‌ చేస్తోంది. దానివల్ల ఇక్కడ 15 వేల మంది మత్స్యకారులు ప్రభావితం అవుతున్నారు. వారికి నెలకు రూ.6,750 చొప్పున 17 నెలలపాటు ఇస్తామని చెప్పి ఆరు నెలలకే ఇచ్చారు. ఇంకా 11 నెలలకు గాను రూ.130 కోట్లు ఇవ్వలేదు. ఇదే నియోజకవర్గంలో వరి ఎక్కువగా పండిస్తారు. మద్దతు ధర చూస్తే క్వింటాల్‌కు రూ.1,550. కానీ, వచ్చేది రూ.1,250 నుంచి 1,300 మాత్రమే. పంట చేతికి వచ్చినప్పుడు దళార్లు ఏకమవుతున్నారు. రేటు పడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  

అక్రమ రవాణాను అడ్డుకుంటే కేసులా?  
మండపేట నియోజకవర్గంలో కపిలేశ్వరపురం, కోరుమిల్లి, అచ్యుతాపురం, తాతపూడి ఇసుక రీచ్‌లలో వందల లారీలు పెట్టి ఇసుకను దోచుకుంటున్నారు. అక్రమ రవాణాను అడ్డుకుంటే కేసులు పెడుతున్నారు. నీరు–చెట్టు పేరుతో అక్రమంగా మట్టి తవ్వి అమ్ముకుంటున్నారు. డ్వాక్రా మహిళల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయలేదు. ఇక రుణాల వసూలు కోసం బ్యాంకర్లు అక్కచెల్లెమ్మల ఇళ్లకు నోటీసులు అంటించారు.  

రూ.3 లక్షల రుణం మాఫీ చేస్తాం.. 
రూ.3 లక్షల లోపే అయ్యే ప్లాట్‌ను అక్షరాలా రూ.6 లక్షలకు ప్రభుత్వం పేదలకు విక్రయిస్తోంది. ఇందులో రూ.3 లక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయట. మిగిలిన రూ.3 లక్షలను పేదవాడి అప్పుగా రాసుకుంటారట. పేదలు ప్రతినెలా రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలట. ప్లాట్ల నిర్మాణం పేరిట లంచాలు మింగేది చంద్రబాబు. ఆ భారాన్ని భరించేది మాత్రం పేదలా? మరోసారి హామీ ఇస్తున్నా. ప్లాట్ల కోసం పేద ప్రజలు చెల్లించాల్సిన రూ.3 లక్షల రుణాన్ని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాఫీ చేస్తాం.   

నారాసురుడికి ఎన్ని తలలో..
ముమ్మిడివరంలో...
చిన్నప్పుడు రామాయణం, మహాభారతం మనం చదువుకున్నాం. రామాయణంలో రావణాసురుడు అనే రాక్షసుడికి పది తలలు ఉండేవని విన్నాం. రావణాసురుడికి పది తలలు ఒకే చోట ఉంటే, మన రాష్ట్రంలో ఉన్న నారాసురుడు చంద్రబాబుకు తలలు విడివిడిగా ఉంటాయి. చంద్రబాబుకు ఒక తల ఆయనపై మెడపై ఉంటుంది, ఇంకో తల ఆయన పెయిడ్‌ యాక్టర్, పెయిడ్‌ పార్టనర్‌ దగ్గర ఉంటుంది. మరొక తల రాజగురువు రూపంలో ఉంటుంది. తోకపత్రిక యజమాని రూపంలో, ఇతర ఎల్లో మీడియా రూపాల్లోనూ చంద్రబాబు తలలు ఉంటాయి. రాజ్యాంగ వ్యవస్థల్లో చంద్రబాబు తన మనుషులను నియమించుకున్నాడు. అక్కడ కూడా ఆయన తల ఒకటి ఉంటుంది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తు లాంటిదే ఉన్న మరో పార్టీని చంద్రబాబు తీసుకొచ్చాడు. అక్కడ సైతం తన తలను పెట్టాడు. ఇక్కడున్న నాయకులు సరిపోరని ఢిల్లీ నుంచి నాయకులను పిలుచుకొస్తాడు. వాళ్ల రూపంలోనూ తన తలలు పెట్టాడు. ఇన్ని తలలు, ఇన్ని వేషాలు వేసినా.. వీళ్లందరిదీ ఒకటే భాష, ఒకటే డైలాగ్‌. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలపై, ఐదేళ్ల ఆయన మోసపూరిత, దుష్ట పరిపాలనపై చర్చ జరగకూడదన్నదే వీళ్ల ఉమ్మడి లక్ష్యం. ఒకవేళ చర్చ జరిగితే చంద్రబాబుకు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని వాళ్లకు తెలుసు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించడానికి కుట్రలు పన్నుతున్నారు.  రోజుకొక పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, అన్యాయమైన రాజకీయాలు చేస్తారు. పైగా ఎదుటివాడు తన ప్రత్యర్థితో పొత్తు పెట్టుకున్నాడంటూ దానిపైనా చర్చలు జరుపుతారు. 

బాబుతో పోరాడుతున్నట్లు పార్టనర్‌ బిల్డప్‌లు  
తన పార్టనర్, యాక్టర్‌ తెలంగాణలో కేసీఆర్‌ గురించి, కేసీఆర్‌కు జగన్‌కు ఉన్న సంబంధం గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాడని చంద్రబాబు ఇటీవలే కితాబిచ్చాడు. ఆ పార్టనర్‌ నామినేషన్‌ వేసినప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపించాయి. నాలుగేళ్లు చంద్రబాబుతో కలిసి కాపురం చేస్తాడు, ఎన్నికలకు ఏడాది ముందు విడాకులు తీసుకున్నట్లుగా, చంద్రబాబుతో పోరాడుతున్నట్లుగా ఆ పార్టనర్‌ బిల్డప్‌ ఇస్తాడు. చంద్రబాబుపై ఐదేళ్లు పోరాడిన నాపై 22 కేసులు పెట్టారు. రాజధానిలో భూములు కోల్పోతున్న రైతులకు తోడుగా వెళ్లినందుకు 8 కేసులు, ప్రత్యేక హోదా కోసం ధర్నాలు చేసినందుకు 4 కేసులు పెట్టారు. ఏడాది కాలంగా చంద్రబాబుపై పోరాటం చేస్తున్నానని చెప్పుకుంటున్న ఆయన పార్టనర్, యాక్టర్‌పై ఎన్ని కేసులు పెట్టారో తెలుసా? అక్షరాలా సున్నా. చంద్రబాబు పాలన ఎంత అధ్వాన్నంగా ఉందంటే.. ఆయనతో ఎన్నికల్లో ఆ పార్టనర్, యాక్టర్‌తో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేకపోయాడు. చంద్రబాబు గొప్ప పరిపాలన అందించాడన్న నమ్మకం పార్టనర్‌కే లేదు. అందుకే తాను చంద్రబాబుతో విభేదించి, పోరాటం చేస్తున్నట్లు మన అందరినీ మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. రాష్ట్రంలో చంద్రబాబుతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోవాలంటే అందరూ భయపడుతున్నారు. తనపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉండడంతో చంద్రబాబు ఢిల్లీ నుంచి నాయకులను తెచ్చుకుంటున్నాడు. నిన్న ఫరూక్‌ అబ్దుల్లాను తీసుకొచ్చాడు. నాపై ఆయనతో అబద్ధాలు చెప్పించాడు.  

మరిన్ని వార్తలు