సంకల్ప శతకం

1 Mar, 2018 07:12 IST|Sakshi

వందవ రోజు ప్రజాసంకల్ప యాత్రకు వేలాదిగా తరలివచ్చిన జనం

నూరు రోజుల పైలాన్, వైఎస్‌ విగ్రహం ఆవిష్కరణ

జిల్లాలో 12వ రోజు 14.9 కి.మీ. సాగిన వైఎస్‌.జగన్‌ పాదయాత్ర

ఆ అడుగు     రాష్ట్ర చరిత్రను తిరగరాస్తోంది
ఆ నడక      రాజన్న రాజసాన్ని గుర్తు చేస్తోంది
ఆ జాడ      ప్రజాసంకల్పానికి నాంది పలుకుతోంది
ఆ బాట      జనం గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తోంది
ఆ మాట     అవ్వాతాతలకు ఓదార్పునిస్తోంది
ఆ పిలుపు   అక్కాచెల్లెమ్మలకు ఆత్మీయత పంచుతోంది
ఆ భరోసా    కర్షకుడి కన్నీళ్లు తుడిచేలా చేస్తోంది
ఆ హామీ     నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తోంది
ఆ అభయం నవరత్నాల ఆశల్ని చిగురింపజేస్తోందిజన సముద్రంలో తారాజువ్వలా వెలుగుతున్న జననేతకు జనాభిమానం జేజేలు పలుకుతోంది.జగనన్నే రావాలని.. జగమంతా నినదిస్తోంది.సంకల్ప సూర్యుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర బుధవారం 100 రోజులు పూర్తిచేసుకుంది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో 12వ రోజు వైఎస్‌ జగన్‌ 100 రోజుల ప్రజాసంకల్పయాత్రకు సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తిలో జనం పోటెత్తారు. జగన్‌ను చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన జనంతో చీమకుర్తి కిక్కిరిసిపోయింది. పెద్ద ఎత్తున మహిళలు జగన్‌ను చూసేందుకు, ఆయన్ను పలకరించేందుకు ఉత్సాహంగా కదలివచ్చి కిలోమీటర్ల మేర క్యూలో నిల్చోని జగన్‌కు ఘన స్వాగతం పలికారు. కొందరు రోడ్లన్నీ పూలమయం చేశారు. మహిళలు వైఎస్‌ జగన్‌కు స్వాగతమంటూ ముగ్గులు వేశారు. అడుగడుగునా హారతులు పట్టారు. బూచేపల్లి యూత్‌ 300 అడుగుల పార్టీ జెండా పట్టణంలో ప్రదర్శించారు. డ్రమ్స్, బాణాసంచాలు పేల్చి సందడి చేశారు. 100వ రోజు పాదయాత్ర ఆద్యంతం పార్టీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో రంగులమయంగా మారింది. 

ఈ సందర్భంగా ప్రజలు జగన్‌కు పలు సమస్యలు ఏకరువు పెట్టారు. కిడ్నీ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నా ఆరోగ్యశ్రీ సక్రమంగా అందడం లేదని కొందరు, అధికార పార్టీ నేతలు అర్హుల పింఛన్లు తొలగించారని మరికొందరు, తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని ఇంకొందరు ఫిర్యాదు చేశారు. విద్యుత్‌ బిల్లులు వేలాది రూపాయలు వస్తున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు జగన్‌ దృష్టికి తెచ్చారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ రాక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు మొరపెట్టుకున్నారు. పెట్టుబడి నిధి రాలేదని మహిళలు, రుణమాఫీ సక్రమంగా చేయలేదని రైతులు వైఎస్‌.జగన్‌ ఎదుట వాపోయారు. చీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్‌ పరిశ్రమలు అధికంగా ఉన్నాయని, ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని గ్రానైట్‌ ఫ్యాక్టరీలు, క్వారీ యజమానులు వైఎస్‌. జగన్‌ దృష్టికి తెచ్చారు. ప్రధానంగా జీఎస్‌టీని 12 శాతానికి తగ్గించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గ్రానైట్‌ ఫ్యాక్టరీ యజమానులు, అసోసియేషన్‌ నేతలు జగన్‌కు విన్నవించారు. వైఎస్‌ హయాంలో రాయల్టీలు 40 శాతం రాయితీలిచ్చారని చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వారు వైఎస్‌.జగన్‌ దృష్టికి తెచ్చారు. దీంతో పాటు పలు సమస్యలపై ప్రజలు వైఎస్‌. జగన్‌కు ఏకరువు పెట్టారు. మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వస్తూనే అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.  

100వ రోజు యాత్ర ఇలా..
వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర బుధవారం మార్కాపురం నియోజకవర్గం పొదిలి మండలం ఉప్పలపాడు నుంచి ప్రారంభమై కొద్దిసేపటికి సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలేనికి చేరుకుంది. సంతనూతలపాడు నియోజకవర్గంలో 100వ రోజు పాదయాత్ర సందర్భంగా వైఎస్‌ జగన్‌కు అపూర్వ స్వాగతం లభించింది. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కుటుంబంతో పాటు సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌లు భారీ ఏర్పాట్లతో జగన్‌కు ఘనస్వాగతం పలికారు.   జిల్లా నలుమూలల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడి నుంచి బూదవాడ మీదుగా మధ్యాహ్నానికి యాత్ర రామతీర్థం చేరుకుంది. భోజన విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన పాదయాత్ర మధ్యాహ్నానికి చీమకుర్తి పట్టణంలోని పలు వీధుల గుండా బహిరంగ సభా వేదిక వద్దకు చేరింది. పట్టణంలో వైఎస్‌ జగన్‌ గరికమిట్టతో పాటు పలుచోట్ల వైఎస్‌ విగ్రహాలు, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. చీమకుర్తి, ఒంగోలు రోడ్డులో పోలీస్‌స్టేషన్‌ సమీపంలో వంద రోజుల పైలాన్‌తో పాటు వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకు ముందు వైఎస్‌ జగన్‌ బహిరంగ సభలో ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తూనే నవరత్నాలతో పాటు పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 12వ రోజు వైఎస్‌ జగన్‌ 14.9 కి.మీ. మేర పాదయాత్ర సాగించారు.

  జననేతతో కలిసి నడిచిన నేతలు
12వ రోజు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, సంతనూతలపాడు, మార్కాపురం ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ బూచేపల్లి వెంకాయమ్మ,  పార్టీ నేతలు వెన్నా హనుమారెడ్డి, కుందూరు నాగార్జునరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ మారం వెంకారెడ్డి, చీమకుర్తి మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ దాసరి లక్ష్మినారాయణ, చీమకుర్తి పట్టణ కన్వీనర్‌ క్రిష్టిపాటి శేఖర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు.  

జగన్‌కు సమస్యల ఏకరువు
తన కొడుకు గుండెలో రంధ్రం ఉందని, తనకు అధికారులు రేషన్‌ కార్డు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వనందున ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేయడం కుదరదని డాక్టర్లు చెబుతున్నారని చిన్నమలగుండం గ్రామానికి చెందిన చెరుకూరి ఊహ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్యను విన్నవించింది.
నాలుగు సంవత్సరాల పాటు అప్పటి ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చేసినా ఏపీ ప్రభుత్వం తనకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో అష్టకష్టాలు పడి ఫీజులు కట్టాల్సి వచ్చిందని చీమకుర్తి అయ్యపురాజుపాలేనికి చెందిన చిన్నపరెడ్డి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి జగన్‌ను కలిసి సమస్యను విన్నవించారు.
పొదిలి ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు పాదయాత్రలో వైఎస్‌.జగన్‌ను కలిసి సింగిల్‌ డ్యూటీ డ్రైవర్లతో బస్సు ప్రమాదాలు తీవ్రమయ్యాయని ఆ విధానాన్ని రద్దు చేయటం కోసం పోరాడాలని కోరారు.  వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాల కోసం కృషి చేయాలని విన్నవించారు.
మర్రిచెట్లపాలెం ప్రాంతంలో ఉన్న క్వారీల నుంచి వస్తున్న దుమ్ము, ధూళితో వాతావరణం కలుషితమై ఇంటికొకరు చొప్పున అనారోగ్యానికి గురవుతున్నామని షేక్‌.బాజీ వైఎస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
నాలుగేళ్ల నుంచి పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని మర్రిచెట్లపాలెం గ్రామానికి చెందిన ముత్తులూరి సుబ్బులు వైఎస్‌ జగన్‌కు సమస్యను విన్నవించింది.
కరెంట్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయని పొదిలి మండలం వెల్లూరుకు చెందిన మహిళ ప్రమీల వైఎస్‌ జగన్‌ను కలిసి విన్నవించింది.
వివాహ పత్రికలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలు పెట్టడం, వైఎస్సార్‌సీపీ కావడంతో తమకు లోను ఇవ్వడం లేదని దర్శి మండలం రాజంపల్లికి చెందిన దేవరకొండ శ్రీను వైఎస్‌.జగన్‌ను కోరారు.

నేడు ప్రజాసంకల్ప యాత్రకు విరామం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ధర్నా కార్యక్రమాన్ని పురస్కరించుకొని గురువారం నిర్వహించాల్సిన ప్రజా సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని విరామం ప్రకటించామని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు. హోదా ధర్నా కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ముమ్మరంగా పాల్గొనేం దుకు వీలుగా మార్చి 1వ తేదీన ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటించినట్లు చెప్పారు. విరామం అనంతరం వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర మార్చి 2వ తేదీ యధావిధిగా కొనసాగనుంది.

3న వైఎస్సార్‌ సీపీ ప్రజాప్రతినిధుల ఢిల్లీ పయనం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నెల 3వ తేదీన ఢిల్లీ పయనమవుతున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి రఘురామ్‌ తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు వద్ద ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి వాహన శ్రేణికి వైఎస్‌ జగన్‌ జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు.

>
మరిన్ని వార్తలు