ఇన్ని మోసాలు దేశంలో ఏ సీఎం చేయరు: వైఎస్‌ జగన్‌

28 Nov, 2017 19:00 IST|Sakshi

పొదుపు సంఘాల మహిళలకు 4 విడతల్లో రుణాలు చెల్లిస్తాం

పింఛన్‌ రూ. 2 వేలకు పెంచుతాం

ఏపీలో చదువుల విప్లవం సృష్టిస్తాం

పులికనుమ ప్రాజెక్టు పూర్తి చేస్తాం

గోనెగండ్ల బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

సాక్షి, గోనెగండ్ల : చంద్రబాబు నాయుడు పాలనలో మోసపోయిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, విశ్వసనీయత అనే మాటకు కట్టుబడి ఉన్న తనను ఆశీర్వదించాలని వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబే అంటున్నారని, ఆయనకు మళ్లీ అవకాశం ఇచ్చామంటే.. ఈ సారి మన వద్దకు వచ్చి ఏమంటారో తెలుసా.. ఇంటింటికి కేజీ బంగారం, మారుతి కారు ఇస్తానని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని వైఎస్‌ జగన్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను ఎండకట్టేందుకు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా 20వ రోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాలనపై వైఎస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు. నాలుగేళ్ల పాలన తర్వాత ఇన్ని మోసాలు చేసి, ఇన్ని అబద్దాలు ఆడిన ప్రభుత్వం దేశంలో ఏది ఉండదని ఆయన విమర్శించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సాగునీటిని అందించి సస్యశ్యామలం చేస్తానన్న జననేత.. ఇటీవల తాను ప్రకటించిన నవరత్నాలు ఆవశ్యకథను వివరించారు. 

వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

  • ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు చేనేత రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. నిజంగానే రుణాలు మాఫీ అయ్యాయా? ప్రతి చేనేత కార్మికుడికి ఇల్లు, షెడ్డు కట్టిస్తానని, దాంతో పాటుగా వారికి లక్ష రుపాయల రుణం ఇస్తామన్నారు. కానీ చేనేత కార్మికుల కష్టాలు పెరిగాయి. 
  • బీసీల మీద ప్రేమ అంటే నాలుగు కత్తెర్లు ఇస్తే అది ప్రేమ అవుతుందా. నిజమైన ప్రేమ చూపించిన వ్యక్తి ఎవరంటే.. ఒక్క దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని గర్వంగా చెబుతున్నా. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తీసుకొచ్చి ఉన్నత చదువులు చదివించి భరోసా కల్పించారు. 
  • కానీ చంద్రబాబు పాలనతో పేద విద్యార్థులు ఇవాళ డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యే అవకాశాలు లేవు. చిన్న పిల్లలను కూడా నేనే చదివిస్తానని హామీ ఇస్తున్నాను. ప్రతి అక్క, చెల్లెమ్మకు చెబుతున్నాను. మీరు చేయాల్సిందల్లా పిల్లలను బడులుకు పంపించాలి. వారి చదువుల కోసం ప్రతి ఏటా రూ.15000 ఇచ్చి చదువుల విప్లవాన్ని సృష్టిస్తాను.
  • ప్రతి పేదవారికి అండగా నిలిచేందుకు పింఛన్‌ రూ.2 వేలు చేస్తాను. పింఛన్‌ వయసు 45 ఏళ్లకే తగ్గిస్తానని మీ అందరికి చెబుతున్నాను. 
  • తాను సీఎం కాగానే బిల్లులు తగ్గిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు దారుణంగా మోసం చేశారు. నాలుగేళ్ల క్రితం రూ.50, 60, 70 మాత్రమే వచ్చే కరెంటు బిల్లు ఇవాళ చంద్రబాబు హయాంలో రూ.500, 1000 చొప్పున వస్తుంది.
  • నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో పొదుపు సంఘాల్లోని అక్క చెల్లెమ్మల రుణాలు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. ఇవాళ బ్యాంకుల వద్ద నుంచి నోటీసులు వస్తున్నాయి. నేను అధికారంలోకి వస్తే మీ రుణాలను నాలుగు విడతలుగా పూర్తిగా మాఫీ చేస్తాను.
  • జాబు రావాలంటే బాబు రావాలని గొప్పలు చెప్పారు. జాబు ఇవ్వకపోతే ఇంటింటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఈ 45 నెలల్లో ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీ పడ్డారు.
  • రేషన్‌ షాపులో బియ్యం, కందిపప్పు, కిరోసిన్, పామాయిల్, చక్కెర, చింతపండు వంటి 9 రకాల నిత్యావసరాలు ఇచ్చేవారు. బాబు హయాంలో ఇవాళ బియ్యం తప్ప వేరేవి ఇవ్వడం లేదు. ఆ బియ్యం కూడా వేలిముద్రలు పడటం లేదని కోత వేయడం దారుణం
  • నీళ్లు లేవు. గిట్టుబాటు ధర లేదు. కర్ణాటక నుంచి రావాల్సిన నీళ్లు రావడం లేదు. ఈ ప్రాంతంలో వ్యవసాయానికి నీళ్లు లేవు. పులికనుమ ప్రాజెక్టు మనకళ్ల ముందే కనిపిస్తోంది. వైఎస్‌ఆర్‌ హయాంలో పులికనుమ ప్రాజెక్టుకు రూ.260 కోట్లు ఖర్చు చేసి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు చంద్రబాబుకు మనసు రావడం లేదు.
  • బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే, వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు రావాలన్నారు. నాలుగేళ్లు అవుతున్నా బంగారం ఇంటికి వచ్చిందా? పైగా చంద్రబాబు చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదు.
  • చేనేత కార్మికుల గురించి ఆలోచిస్తే బాధనిపిస్తోంది. మొన్న ధర్మవరం వెళ్లాను. నేను వెళ్లేనాటికి ఆడవాళ్లు సహా ఎంతో మంది 34 రోజులుగా నిరాహారదీక్షలు చేస్తున్నారు. కారణం ఏంటంటే.. కార్మికులకు సబ్సిడీ అందడం లేదట. చంద్రబాబు రెండేళ్ల క్రితం వెయ్యి రూపాయల సబ్సిడీ ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదు.
  • నవరత్నాలపై ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే ఈ పాదయాత్రలో సూచనలు ఇవ్వండి. విశ్వసనీయత కోరుకుంటున్న ఏపీ ప్రజలు తనను గెలిపించి రాష్ట్ర అభివృద్ధి కోసం మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని వైఎస్‌ జగన్‌ కోరారు.
మరిన్ని వార్తలు