-

వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరపాలి: వైఎస్‌ జగన్

15 Mar, 2019 19:30 IST|Sakshi

సాక్షి, పులివెందుల : తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరపాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని ఆయన అన్నారు. శుక్రవారం వైఎస్‌ జగన్‌ పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ.. హత్య కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం పకడ్బందీగా జరుగుతోందని, హత్య వెనక ఎవరున్నా బయటకు తీయాలని అన్నారు. 35 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన మాజీ ఎంపీని ఇంట్లోకి చొరబడి అతి కిరాతంగా గొడ్డలితో నరికి చంపడమనేది అత్యంత దారుణం, నీచమైన చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. ఘటన తీవ్రతను కూడా పోలీసులు గుర్తించడం లేదని అన్నారు. తన కళ్ల ఎదుట ఎస్పీకి ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ నుంచి ఫోన్లు వస్తున్నాయన్నారు. దర్యాప్తు జరుగుతున్న తీరు బాధకరంగా ఉంది.  చదవండి... (వైఎస్‌ వివేకానందరెడ్డికి జగన్‌ నివాళి)

‘చిన్నాన్న అంతటి సౌమ్యుడు ఎవరు లేరు. ఆయన చనిపోతూ ఒక లెటర్‌ రాశారని, అందులో డ్రైవర్‌ పేరు పెట్టారని పోలీసులు చూపిస్తున్నారు. ఈ హత్యకేసులో చాలామంది ఉన్నారు. బెడ్‌రూంలో అయిదుసార్లు దాడి చేశారు. తలపై గొడ్డలితో విచక్షణారహితంగా నరికారు. ఆయనను బెడ్‌రూంలో చంపి బాత్రూమ్‌ వరకూ తీసుకువచ్చారు. ఆ తర్వాత చిన్నాన‍్న రక్తం కక్కుకుని సహజంగా చనిపోయినట్లు చిత్రీకించేందుకు ప్రయత్నించారు. ఆయన రాసినట్లుగా చూపిస్తున్న లేఖ కూడా కల్పితమే.  (వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యే!)

మా కుటుంబంపై దాడుల్లో చంద్రబాబు పాత్ర ఉంది
ఇక మా నాన్నను కట్టడి చేయడం కోసం తాతను చంపారు. తాతను చంపిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబే. ఇక నాన్న వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదానికి రెండు రోజుల ముందు అసెంబ్లీకి ఎలా వస్తావని చంద్రబాబు సవాల్‌ చేశారు. ఆ తర్వాత నన్ను విమానాశ్రయంలో చంపాలని చూశారు. మా కుటుంబంపై జరిగిన అన్ని దాడుల్లో చంద్రబాబు పాత్ర, కుట్ర ఉంది. వాళ్లే హత్య చేసి వాళ్లే సిట్‌ వేస్తే ఎలా?. సీబీఐ విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుంది. దయచేసి వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సంయమనం పాటించండి. దేవుడున్నాడు... దోషులను తప్పనిసరిగా శిక్షిస్తాడు.’  అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు