ఏం చేశావో చెప్పి ఓటు అడిగే దమ్ముందా?

21 Mar, 2019 04:41 IST|Sakshi
బుధవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం. ప్రసంగిస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూటి ప్రశ్న  

ప్రజలకు మంచి పరిపాలన అందించలేక రోజుకో మోసమా?

ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడంలో నిన్ను మించిన వారే లేరు

మా చిన్నాన్నను పోగొట్టుకున్నాం.. తిరిగి మాపైనే విమర్శలా?  

చంద్రబాబు లాంటి దిక్కుమాలిన వ్యక్తి ప్రపంచంలో ఎవరూ ఉండరు  

వివేకానందరెడ్డి హత్యలో బాబు ప్రమేయం లేకపోతే సీబీఐ విచారణకు ఆదేశించరెందుకు?  

చంద్రబాబు వచ్చాడు..కరువు కూడా వచ్చింది   

సాగునీరు లేదు, తాగునీరు లేదు.. గిట్టుబాటు ధరలు లేవు  

ఆయన హయాంలో సీఎం అంటే క్రిమినల్‌ మినిస్టర్‌  

చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం ఓటేద్దాం  

వైఎస్సార్‌సీపీని గెలిపించుకుందాం.. సంక్షేమ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం  

టంగుటూరు, కావలి,పలమనేరులో వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం

చంద్రబాబు ఐదేళ్లుగా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఒక దోపిడీ ముఠాలాగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకున్నాడు. ప్రజల భూములను, ఆస్తులను, సహజ సంపదను, చివరకు నదులను కూడా వదిలి పెట్టలేదు. సొంత బావమరిది హరికృష్ణ శవం పక్కనే పెట్టుకుని టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం డీల్‌ మాట్లాడాడు. కుదరదు, నీతో పొత్తు పెట్టుకోం అని టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పారు.అదే టీఆర్‌ఎస్‌పై తాను పోరాడుతున్నానంటూ బాబు ఇవాళ మన ముందు బిల్డప్‌లు ఇస్తున్నాడు.
– కావలి సభలో..

మరో 20 రోజులు ఓపిక పట్టండి, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, మన అందరి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను పెద్ద చదువులు ఉచితంగా చదివిస్తాడని చెప్పండి. డ్వాక్రా మహిళలకు, రైతన్నలకు, అవ్వాతాతలకు మేలు చేస్తాడని చెప్పండి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం ఓటు వేద్దామని చెప్పండి.
– టంగుటూరు సభలో..

చంద్రబాబు జీవితమంతా అన్యాయాలు, మోసాలే. అధికారం కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు. తన అధికారానికి అడ్డొస్తున్నాడనుకుంటే ప్రధానమంత్రిని కూడా వదిలిపెట్టడు. రాష్ట్రంలో ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు. వ్యవస్థలో ప్రతిచోటా తనకు సంబంధించిన అధికారులను నియమించుకున్నాడు. బాబుకు ఓటు వేయడం అంటే అది హత్యా రాజకీయాలకు, మాఫియా సామ్రాజ్యానికి ఓటు వేయడం లాంటిదే.చంద్రబాబు పాలనలో సీఎం అంటే చీఫ్‌ మినిస్టర్‌ కాదు, సీఎం అంటే క్రిమినల్‌ మినిస్టర్‌ అనే పరిస్థితి చలామణి అవుతోంది.
– పలమనేరు సభలో..

అయ్యా చంద్రబాబూ.. మీ పరిపాలన చూపించి ఎందుకు ఓటు అడగలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నా. మీ అందరికీ తెలిసిన సామెత ఒకటుంది. చేతకాని వాడికి కోపం ఎక్కువట, పని చేయలేని వాడికి ఆకలి ఎక్కువట. చంద్రబాబు పరిస్థితి నిజంగా అలాగే ఉంది. చంద్రబాబు, ఆయన కుమారుడు కలిసి ఐదేళ్లుగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశారు. వారు చేయని అన్యాయాలు, మోసాలు లేవు. 

చిన్నాన్నను పోగొట్టుకున్నది మేము, పైగా మాపైనే విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు కంటే దిక్కుమాలిన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? చంద్రబాబు ఏ తప్పూ చేయకపోతే సీబీఐకి, ఈడీకి, ఐటీ విభాగానికి, చివరకు తెలంగాణ పోలీసులకు కూడా ఎందుకు భయపడుతున్నాడు?

నువ్వు నేరగాడివి కాకపోతే నీపై వేసిన ప్రతి పిటిషన్‌పై సాంకేతిక కారణాలు చూపుతూ కోర్టుల నుంచి ఎందుకు స్టేలు తెచ్చుకున్నావని ప్రశ్నిస్తున్నా. చంద్రబాబును మించిన దుర్మార్గుడు, భ్రష్టుడు, నీచుడు ఎవరూ ఉండరని ఎన్టీ రామారావు అన్నారు.


సాక్షి ప్రతినిధి ఒంగోలు/నెల్లూరు/సాక్షి, తిరుపతి:  
టంగుటూరు సభలో... 
‘‘ముఖ్యమంతిచంద్రబాబు ప్రతిరోజూ జగన్‌ అనే పేరును 100 సార్లు స్మరిస్తున్నాడు. ఆయన తన ఐదేళ్ల పరిపాలనను చూపించి ప్రజలను ఎందుకు ఓటు అడగలేకపోతున్నాడు? చంద్రబాబు, ఆయన కుమారుడు కలిసి గతంలో ఎప్పుడూ లేనంత దుష్టపాలన సాగిస్తున్నారు. వీరి పరిపాలన గురించి టీవీ చానళ్లలో, పత్రికల్లో చర్చ జరగకుండా మేనేజ్‌ చేశారు. అధికారంలో లేనివాళ్ల గురించి, మా గురించి గత 10 రోజులుగా టీవీ చానళ్లలో చర్చా కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం ప్రకాశం జిల్లా టంగుటూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, చిత్తూరు జిల్లా పలమనేరులో బహిరంగ సభల్లో పట్టపగలు మండుటెండలో కిక్కిరిసిపోయిన జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, సంక్షేమ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు  ఇంటెలిజెన్స్‌ పోలీసుల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నాడని జగన్‌ ఆరోపించారు.

మూడు సభల్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే...   ‘‘మరో 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మీరొక్కసారి గుండెలపై చేయి వేసుకుని ఆలోచన చేయాలి. చంద్రబాబు సీఎం హోదాలో అసెంబ్లీ సాక్షిగా ప్రకాశం జిల్లాకు ఎన్నో హామీలిచ్చాడు. ఈ జిల్లాకు వచ్చినప్పుడు కూడా పలు హామీలు గుప్పించాడు. అవి అమలయ్యాయో లేదో మీరే చెప్పాలి. దొనకొండలో పారిశ్రామిక నగరం, చీమకుర్తిలో మైనింగ్‌వర్సిటీ, ఒంగోలులో ఎయిర్‌పోర్టు, కనిగిరిలో జాతీయ పెట్టుబడుల ఉత్పత్తి జోన్, రామాయపట్నం పోర్టు, ఫుడ్‌పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. ఒంగోలును స్మార్ట్‌ సిటీగా మారుస్తామన్నారు. వెటర్నరీ యూనివర్సిటీ, ఉద్యానవన యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటీ కూడా నెలకొల్పుతామన్నారు. వీటిలో ఒక్కటంటే ఒక్కటైనా ఎక్కడైనా కనిపించిందా?(లేదు లేదు అంటూ జనం కేకలు) చంద్రబాబు సీఎం హోదాలో ఇచ్చిన హామీలకే దిక్కు లేకుండా పోయింది.  

బాబు వచ్చాడు.. అంతా నాశనమే  
చంద్రబాబు వచ్చాక రుణాలు మాఫీ కాలేదు, సున్నా వడ్డీకి రుణాలు రావడం ఆగిపోయింది. బాబుతోపాటు కరువు కూడా వచ్చింది. సాగునీరు లేదు, తాగునీరు లేదు. గిట్టుబాటు ధరలు లేవు. తన సొంత కంపెనీ హెరిటేజ్‌ లాభాల కోసం రాష్ట్ర రైతాంగాన్ని అమ్మేశాడు. పొగాకు కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతి సంవత్సరం జగన్‌ వచ్చి ధర్నా చేస్తే తప్ప ధరలు పెరగని పరిస్థితి చూస్తున్నాం. బాబు వచ్చి కాలేజీ ఫీజులను విపరీతంగా పెంచేయడం మొదలుపెట్టాడు. ఇంజనీరింగ్‌ చదవాలంటే ఏడాదికి రూ.లక్షకు పైగానే ఖర్చవుతోంది. బాబు వచ్చాడు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అడ్డగోలుగా కోతలు విధించాడు. బాబు వచ్చాడు, ఆస్తులు అమ్ముకుంటే తప్ప పిల్లలు పెద్ద చదువులు చదువుకోలేని పరిస్థితి తీసుకొచ్చాడు. బాబు వచ్చాడు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను మోసం చేశాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి వారిని మళ్లీ మోసం చేయడానికి పసుపు–కుంకుమ అని సినిమా తీస్తున్నాడు.

బాబు వచ్చాక ‘108’కు ఫోన్‌ కొడితే అంబులెన్స్‌ వస్తుందో రాదో తెలియడం లేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చాడు. పేదవాడు ఆస్తులు అమ్ముకుంటే గానీ వైద్యం పొందలేకపోతున్నాడు. బాబు వచ్చాడు (జాబు రాలేదంటూ జనం ప్రతిస్పందన) జాబు రావాలంటే(బాబు పోవాలి అని జనం సమాధానం) బాబు వచ్చాడు, కరువు మండలాల ప్రకటనలో అలసత్వం, రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహించాడు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీలు ఎగవేశాడు. రైతుల బతుకులను దారుణంగా మార్చాడు. గడ్డి కూడా దొరక్క పశువులను అమ్ముకుంటున్న అన్యాయమైన పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా రైతులు ఉన్నారు. ప్రతిఏటా లక్షలాది మంది ఈ జిల్లా నుంచి వలస పోతున్నారు. బాబు వచ్చాడు, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సర్వనాశనం చేశాడు. నీరు–చెట్టు అని పేరు పెట్టి ఉపాధి హామీ పథకం నిధులను దోచేశాడు. ఎన్నికలకు రెండు నెలల ముందు రామాయపట్నం పోర్టు అంటూ అక్కడికెళ్లి టెంకాయ కొట్టాడు. వెలుగొండ, సంగమేశ్వర ప్రాజెక్టులను పట్టించుకోలేదు.  


అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం..  
ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ప్రతి గ్రామానికి ఇంటెలిజెన్స్‌ పోలీసులతో మూటల కొద్దీ డబ్బులు పంపిస్తాడు. వారిని తన వాచ్‌మెన్‌ల కంటే దారుణంగా వాడుకుంటున్నాడు. ప్రతి ఓటర్‌ చేతిలో రూ.3,000 పెడతాడు. చంద్రబాబు ఇచ్చే సొమ్ముకు మోసపోవద్దని చెప్పండి. మరో 20 రోజులు ఓపిక పట్టండి, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, మన అందరి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను బడికి పంపిస్తే చాలు సంవత్సరానికి రూ.15,000 ఇస్తాడని ప్రతి అక్కచెల్లెమ్మకు చెప్పండి. ఎన్ని రూ.లక్షలు ఖర్చయినా సరే మన పిల్లలను అన్న పెద్ద చదువులు ఉచితంగా చదివిస్తాడని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల నాటికి మీకు ఎంత అప్పు ఉంటే అంత సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా మీ చేతికే ఇస్తాడని పొదుపు సంఘాల మహిళలకు చెప్పండి. సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాడని చెప్పండి. ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు రూ.75,000 నాలుగు దఫాల్లో అన్న ఇస్తాడని తెలియజేయండి. అన్నను ముఖ్యమంత్రి చేసుకుంటే పెట్టుబడి సాయం కోసం ప్రతి సంవత్సరం మే నెలలో ‘రైతు భరోసా’ కింద రూ.12,500 ఇస్తాడని ప్రతి రైతన్నకు చెప్పండి. నాలుగేళ్లలో మొత్తం రూ.50,000 అందజేస్తాడని చెప్పండి. పంటలకు గిట్టుబాటు ధరలకు గ్యారంటీ ఇస్తాడని చెప్పండి. పెన్షన్‌ను రూ.3,000 దాకా పెంచుకుంటూ పోతాడని ప్రతి అవ్వాతాతకు చెప్పండి. మీరంతా దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన చూశారు. అంతకంటే గొప్ప పరిపాలన అందించడానికి కృషి చేస్తా.  

ధర్మం, అధర్మానికి మధ్య యుద్ధం  
ఐదేళ్ల చంద్రబాబు పరిపాలన చూశాం. మనకు ఎలాంటి నాయకుడు కావాలో మీరే ఆలోచించుకోండి. అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసాలు చేసేవాళ్లు నాయకులుగా కావాలా అని అడుగుతున్నా(వద్దు వద్దు అంటూ జనం సమాధానం) ఎన్నికలయ్యేదాకా చంద్రబాబు చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు. వేయని డ్రామా ఉండదు, చూపని సినిమా ఉండదు. ఈ 20 రోజుల్లో మనం యుద్ధం చేసేది కేవలం చంద్రబాబు ఒక్కరితోనే కాదు, ఆయనతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అమ్ముడుపోయిన చానళ్లతోనూ యుద్ధం చేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం రెండు పార్టీల మధ్య కాదు. ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది. వంచనతో కూడిన రాజకీయాలతో యుద్ధం చేస్తున్నాం. 

చంద్రబాబు నోట నిత్యం.. జగన్నామస్మరణ
కావలి సభలో...  
ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. గత 10 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నోటినుంచి ప్రతినిత్యం కనీసం 100 సార్లు ఒకే పేరు వినిపిస్తోంది(జగన్‌ జగన్‌ జగన్‌ అంటూ జనం సమాధానం).. చంద్రబాబు రోజూ జగన్‌ పేరే స్మరిస్తున్నాడు. అయ్యా చంద్రబాబూ.. మీ పరిపాలన చూపించి ఎందుకు ఓటు అడగలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నా. మీ అందరికీ తెలిసిన సామెత ఒకటుంది. చేతకాని వాడికి కోపం ఎక్కువట, పని చేయలేని వాడికి ఆకలి ఎక్కువట. చంద్రబాబు పరిస్థితి నిజంగా అలాగే ఉంది. చంద్రబాబు, ఆయన కుమారుడు కలిసి ఐదేళ్లుగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశారు. వారు చేయని అన్యాయాలు, మోసాలు లేవు. గతంలో ఎప్పుడూ లేనంత దుష్టపాలన సాగిస్తున్నారు. వీరి పరిపాలన గురించి టీవీ చానళ్లలో, పత్రికల్లో చర్చ జరగకుండా మేనేజ్‌ చేశారు. అధికారంలో లేనివాళ్ల గురించి, మా గురించి గత 10 రోజులుగా టీవీ చానళ్లలో చర్చా కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. చంద్రబాబు దుర్మార్గ పాలన, అన్యాయమైన పాలన చూసి ఆయన వద్దకు ఎవరూ రావడం లేదు. టీడీపీ కండువాలు కప్పుదామని ఆయన ఎదురు చూస్తున్నా వచ్చేవాళ్లే లేరు. చంద్రబాబుకు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో మనకు తెలుసు. 2014 ఎన్నికల సమయంలో ఏం చెప్పాడు, అధికారంలోకి వచ్చాక ఏం చేశాడో మనందరికీ తెలుసు. 

వెబ్‌సైట్‌లో టీడీపీ మేనిఫెస్టో మాయం  
2014లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో అంటూ 500 పేజీల పుస్తకం విడుదల చేశాడు. అందులో దాదాపు 650 హామీలిచ్చాడు. ఈ మేనిఫెస్టోలో 12వ పేజీలో 12 వాగ్దానాలు ఇచ్చాడు, సంతకం కూడా పెట్టాడు. అంతటితో ఆగలేదు. ఇంటింటికీ ఒక లేఖ కూడా పంపించాడు. రైతులకు రుణమాఫీ పథకంపై మొట్టమొదటి సంతకం చేస్తానన్నాడు. బాబు అధికారంలోకి వచ్చేనాటికి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉండేవి. చంద్రబాబు చేసిన రుణమాఫీ రైతులకు కనీసం వడ్డీలు కూడా సరిపోలేదు. ఆయన నిర్వాకం వల్ల వ్యవసాయ రుణాలు వడ్డీలతో కలిపి ఇప్పుడు ఏకంగా రూ.1.30 లక్షల కోట్లకు ఎగబాకాయి. అలాగే పగటి పూటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తానన్నాడు. డ్వాక్రా సంఘాల మహిళల రుణాలను పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చాడు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద వారి పేరిట బ్యాంకులో రూ.25,000 డిపాజిట్‌ చేస్తానన్నాడు. జాబు రావాలంటే బాబు రావాలని అన్నాడు. ఇంటికో ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తానని చెప్పాడు. అలా కల్పించకపోతే ఇంటింటికీ ప్రతినెలా రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చాడు.

ఈ హామీల్లో ఒక్కటైనా నెరవేరిందా?(లేదు అంటూ జనం సమాధానం) 60 నెలల పాలనకుగాను నిరుద్యోగ భృతి కింద చంద్రబాబు ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు బాకీ పడ్డాడు. ఎన్టీఆర్‌ సుజల పథకం కింద రూ.2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ సరఫరా చేస్తానన్నాడు. బీసీలకు సబ్‌ప్లాన్‌ కింద ప్రతి సంవత్సరం రూ.10 వేల కోట్లు కేటాయిస్తానని చెప్పాడు. పేదలకు 3 సెంట్ల స్థలం, ఉచితంగా పక్కా ఇల్లు ఇస్తానన్నాడు. ఈ హామీల్లో ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలేదు. గత ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి మాయం చేశాడు. ఇప్పటిదాకా చేసిన మోసాలు సరిపోవన్నట్టుగా మళ్లీ ఇలాంటి హామీలే ఇస్తాడు. 70 ఏళ్ల చంద్రబాబు 25 ఏళ్ల యువకుడి మాదిరిగా ఫొటో దిగి, దాన్ని టీడీపీ మేనిఫెస్టోపై ముద్రించి విడుదల చేస్తాడు. ఎన్నికల మేనిఫెస్టో అంటే గర్వంగా చెప్పుకునేలా ఉండాలి. ఇవిగో నేను చెప్పినవన్నీ చేశాను కాబట్టి మళ్లీ నాకు ఓటు వేయండి అని అడిగేలా ఉండాలి.  

పొత్తు పెట్టుకుందామనుకున్నాడు... పోరాడుతున్నాడట!  
చంద్రబాబు ఐదేళ్లుగా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఒక దోపిడీ ముఠాలాగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకున్నాడు. ప్రజల భూములను, ఆస్తులను, సహజ సంపదను, చివరకు నదులను కూడా వదిలి పెట్టలేదు. సొంత బావమరిది హరికృష్ణ శవం పక్కనే పెట్టుకుని టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం డీల్‌ మాట్లాడాడు. కుదరదు, నీతో పొత్తు పెట్టుకోం అని టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పారు. అదే టీఆర్‌ఎస్‌తో తాను పోరాడుతున్నానంటూ బాబు ఇవాళ మన ముందు బిల్డప్‌లు ఇస్తున్నాడు.   

పాలనపై ఎల్లో మీడియాలో చర్చ ఏదీ?  
టీడీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేక జాబితాను ఒకేసారి ప్రకటించలేని చంద్రబాబు ఇప్పుడు తన అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ వాళ్లు బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నాడు. చంద్రబాబు 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొనేశాడు. చంద్రబాబు నిజంగా ప్రజలకు మంచి పరిపాలన అందిస్తే ఎల్లో మీడియాలో దానిపై చర్చ పెట్టకుండా ప్రతిరోజూ మాపై ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు మంచి పాలన అందించలేక రోజుకొక మోసం చేస్తున్నాడు, అబద్ధం చెబుతున్నాడు. 

సొంత బావమరిది హరికృష్ణ శవం పక్కనే పెట్టుకుని టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం డీల్‌ మాట్లాడాడు. కుదరదు, నీతో పొత్తు పెట్టుకోం అని టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పారు. అదే టీఆర్‌ఎస్‌తో తాను పోరాడుతున్నానంటూ బాబు ఇవాళ మన ముందు బిల్డప్‌లు ఇస్తున్నాడు. చంద్రబాబు చేస్తున్న మోసాలను గుర్తించాలని కోరుతున్నా. 

గోబెల్స్‌కు అసలు సిసలు వారసుడు  
పలమనేరు సభలో...  
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అన్యాయాలు, దుర్మార్గాలు, మోసాలు చేశాడు. అబద్ధాలు చెప్పాడు. ఒక సినిమాలో విలన్‌ చేసే పనులన్నీ చంద్రబాబు చేసేశాడు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పడంలో ఆయనను మించిన వాళ్లు ఎవరూ ఉండరు. గోబెల్స్‌కు అసలు సిసలు వారసుడు చంద్రబాబు లాంటి అన్యాయస్థుడు తప్ప ప్రపంచంలో మరొకరు ఉండరు.  బాబు జీవితమంతా అన్యాయాలు, మోసాలే. అధికారం కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు.తనకు అడ్డొచ్చే వారిని ఎవరినీ వదిలిపెట్టడు. తన అధికారానికి అడ్డొస్తున్నాడనుకుంటే ప్రధానమంత్రిని కూడా వదిలిపెట్టడు. వ్యవస్థలో ప్రతిచోటా తనకు సంబంధించిన అధికారులను నియమించుకున్నాడు. వ్యవస్థలను దుర్వినియోగం చేసేవారిలో మొదటి వ్యక్తి చంద్రబాబే. బాబుకు ఓటు వేయడం అంటే అది హత్యా రాజకీయాలకు, మాఫియా సామ్రాజ్యానికి ఓటు వేయడం లాంటిదే. చంద్రబాబు రాష్ట్రమంతటా మాఫియా సామ్రాజ్యం స్థాపించాడు. ఆయన రాష్ట్రానికి పెద్ద దిక్కుగా పెద్ద మనసుతో పరిపాలన చేసిన రోజు ఒక్కటి కూడా లేదు. చంద్రబాబు పాలనలో సీఎం అంటే చీఫ్‌ మినిష్టర్‌ కాదు, సీఎం అంటే క్రిమినల్‌ మినిష్టర్‌ అనే పరిస్థితి చలామణి అవుతోంది.  

చిత్తూరు జిల్లా పలమనేరు బహిరంగ సభకు హాజరైన భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వైఎస్‌ జగన్‌ 

నేరగాడివి కాకపోతే ‘స్టే’లు ఎందుకో?  
మా చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిని పోగొట్టుకున్నాం. ఆయనను చంద్రబాబే చంపించాడు. ఆ హత్యపై దర్యాప్తు చేసేది చంద్రబాబు కింద ఉన్న పోలీసులే. వివేకానందరెడ్డి హత్యపై చంద్రబాబు చెప్పినట్టు రాసేవి, చూపించేవి, వక్రీకరించేవి వాళ్ల పత్రికలే, టీవీ చానళ్లే. ఇలాగైతే న్యాయం ఎలా జరుగుతుందో ప్రజలే చెప్పాలి. మా చిన్నాన్నను చంద్రబాబు హత్య చేయించకపోతే సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?  చంద్రబాబు నేరగాడు కాకపోతే దేశంలోని అత్యున్నత వ్యవస్థల్లో తన మనుషులను ఎందుకు నియమించుకున్నాడు? నువ్వు నేరస్థుడివి కాకపోతే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, హైదరాబాద్‌ను వదిలేసి ఎందుకు పారిపోయి వచ్చావని చంద్రబాబును అడుగుతున్నా. నువ్వు నేరగాడివి కాకపోతే నీపై వేసిన ప్రతి పిటిషన్‌పై సాంకేతిక కారణాలు చూపుతూ కోర్టుల నుంచి ఎందుకు స్టేలు తెచ్చుకున్నావని ప్రశ్నిస్తున్నా. చంద్రబాబును మించిన దుర్మార్గుడు, భ్రష్టుడు, నీచుడు ఎవరూ ఉండరని ఎన్టీ రామారావు అన్నారు.   

బాబూ.. నీ అరాచకాల చిట్టా ఇదిగో... 
చంద్రబాబు పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. రిషితేశ్వరి అనే విద్యార్థిని మృతికి కారణమైన బాబూరావు అనే వ్యక్తిని అరెస్టు చేయడానికి కూడా చంద్రబాబుకు మనసు రాలేదు. ఇలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి అని చెప్పుకుందామా? ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు మహిళా తహసీల్దార్‌ వనజాక్షిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు చంద్రబాబు మళ్లీ టిక్కెట్‌ ఇచ్చాడు. బాబు అరాచకవాది, హింసావాది కాబట్టే విజయవాడలో కాల్‌మనీ–సెక్స్‌రాకెట్‌ను నడిపిన మానవ మృగాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ మృగాలు ఇప్పుడు కాలర్‌ ఎగరేసుకుంటూ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. కాల్‌మనీ–సెక్స్‌రాకెట్‌ అరాచకాలపై ప్రశ్నించిన మా ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారు. రాజధానిలో భూములు ఇవ్వని రైతుల పొలాలను చంద్రబాబు దగ్గరుండి మరీ తగలబెట్టించాడు. నిజాలను బయటకు చెబుతున్న అక్కడి ఏఎస్పీని బదిలీ చేయించాడు. చివరకు దళితులపై దొంగ కేసులు పెట్టించాడు.

2014 ఎన్నికల సమయంలో మాకు ఇచ్చిన హామీలను అమలు చేయండి అని అడిగిన కాపులను, నాయీ బ్రాహ్మణులను, మత్స్యకారులను, ముస్లింలను, అంగన్‌వాడీలను, కాంట్రాక్టు కార్మికులను, అగ్రిగోల్డ్‌ బాధితులను కొట్టించి, నిర్బంధించి, కేసులు పెట్టించి, వేధించిన వ్యక్తి చంద్రబాబు కాదా? ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఎదుటే ఆయన గన్‌మన్‌పై టీడీపీ ఎమ్మెల్యే చేయి చేసుకుంటే ఎందుకు కేసు పెట్టలేదని చంద్రబాబును అడుగుతున్నా. చంద్రబాబు అరాచకవాది కాబట్టే కర్నూలు జిల్లా పత్తికొండలో ఆ పార్టీ అభ్యర్థి నారాయణరెడ్డిని నరికి చంపించాడు. అనంతపురం జిల్లా రాప్తాడులో మా పార్టీ నాయకుడు భూమిరెడ్డి ప్రసాద్‌రెడ్డిని పోలీసుస్టేషన్‌ సమీపంలోనే ఎమ్మార్వో కార్యాలయంలో చంపేశారు. తాడిపత్రిలో సింగిల్‌ విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిని ప్రభుత్వ కార్యాలయంలోనే దారుణంగా నరికి చంపారు. ఐదేళ్ల పాలనలో ఎంతోమంది వైఎస్సార్‌సీపీ నేతలను, కార్యకర్తలను చంపించిన వ్యక్తి చంద్రబాబు కాదా? చంద్రబాబు హయాంలోనే విజయవాడలో వంగవీటి రంగా, రాఘవేంద్రరావు, పింగళి దశరథరామ్‌ హత్యకు గురయ్యారు. అలాంటి వ్యక్తి పరిపాలన చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉంటాయా? సామాన్యులకు రక్షణ ఉంటుందా? 

మరిన్ని వార్తలు