మన ప్రభుత్వం రాగానే.. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ 

25 Mar, 2019 03:20 IST|Sakshi
ఆదివారం కృష్ణా జిల్లా తిరువూరులో జరిగిన బహిరంగ సభకు పోటెత్తిన జనసందోహంలో ఓ భాగం. ప్రసంగిస్తున్న వైఎస్‌ జగన్‌

వైఎస్‌ జగన్‌ సభల్లో జన ప్రభంజనం

ఎండను సైతం లెక్కచేయకుండా తరలివస్తున్న జనం  

సీఎం.. సీఎం.. సీఎం అంటూ నినాదాల హోరు 

ప్రతిఏటా జనవరి ఒకటిన ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ విడుదల 

పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా చట్టం  

ప్రతి జిల్లాకో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం  

ప్రస్తుత ఉపాధి అవకాశాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు   

జాబు రావాలంటే బాబు పోవాలి అని యువత నినదిస్తున్నారు 

చంద్రబాబు పాలనపై ఎన్నికలు జరిగితే టీడీపీకి డిపాజిట్లు కూడా రావు   

తన పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చంద్రబాబుకు తెలుసు  

అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి కుట్రలకు తెరతీశాడు  

శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం.  

రేపల్లె, చిలకలూరిపేట, తిరువూరులో వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం

మద్యం వల్ల అక్కచెల్లెమ్మలు ఎదుర్కొంటున్న కష్టాలు నాకు తెలుసు. అందుకే మన ప్రభుత్వం వచ్చాక మద్యపానాన్ని మూడు దశల్లో నిషేధిస్తాం. మీ గ్రామాల్లో మద్యం దుకాణాలను తీసేసిన తర్వాతే మళ్లీ ఐదేళ్ల అనంతరం మిమ్మల్ని ఓట్లు అడుగుతా.  
– చిలకలూరిపేట సభలో...

‘‘జాబు రావాలంటే బాబు పోవాలి అని ఏ గ్రామంలో చూసినా యువత ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న యువతకు చెబుతున్నా. మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన క్యాలెండర్‌ విడుదల చేస్తాం’’  

‘‘రైతన్న మనకు వెలుగునిస్తూ తాను కాలిపోతున్నాడు. మనకు అన్నం పెట్టే రైతన్నకు తిండి లేక కడుపు మాడిపోతోంది. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అన్నదాతలకు మిగిలింది కష్టం, నష్టం, దు:ఖం తప్ప ఇంకేమీ లేదు. అన్నదాతలను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి దళారులకు నాయకుడిగా మారాడు. రైతులు పండించిన పంటలు చేతికొచ్చేసరికి తన సొంత కంపెనీ హెరిటేజ్‌ లాభాల కోసం ధరలను పతనం చేస్తున్నాడు’’ 
– రేపల్లె సభలో..

సాక్షి, అమరావతి బ్యూరో:  ‘‘రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాథన్‌ కమిషన్‌ స్పష్టం చేసింది. ఈ ఐదేళ్లలో ఉద్యోగ విరమణల వల్ల ఏర్పడి ఖాళీలను కూడా కలుపుకుంటే మొత్తం ఖాళీల సంఖ్య 2.30 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌ సెంటర్లలో చేరుతున్నారు. ఐదేళ్లు నిరీక్షించినా ఉద్యోగాలు భర్తీ చేయక నిరాశ చెందుతున్నారు. జాబు రావాలంటే బాబు రావాలి అని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు అన్నాడు. ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా జాబు రావాలంటే బాబు పోవాలి అని యువత ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న యువతకు చెబుతున్నా. మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ విడుదల చేస్తాం. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా శాసనసభలో చట్టాన్ని తీసుకొస్తాం. మన పిల్లల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు జిల్లాకో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం గుంటూరు జిల్లా రేపల్లె, చిలకలూరిపేట, కృష్ణా జిల్లా తిరువూరులో బహిరంగ సభల్లో మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఎన్నికల బరిలో దిగిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మూడు బహిరంగ సభల్లో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే...  

రైతుల బాధలు వింటే గుండె చెరువే  
రేపల్లె సభలో..
3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. పాదయాత్రలో రైతన్నల కష్టాలు, వారు పడుతున్న బాధలను ప్రత్యక్షంగా చూశాను. రైతన్న మనకు వెలుగునిస్తూ తాను కాలిపోతున్నాడు. మనకు అన్నం పెట్టే రైతన్నకు తిండి లేక కడుపు మాడిపోతోంది. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అన్నదాతలకు మిగిలింది కష్టం, నష్టం, దు:ఖం తప్ప ఇంకేమీ లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు ఉండేవి. వడ్డీలు తడిసిమోపెడై ఆ రుణాలు ఇప్పుడు రూ.1.50 లక్షల కోట్లకు చేరాయి. చంద్రబాబు చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోలేదు. రైతులకు ఇవాళ సున్నా వడ్డీ రుణాలు, బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందడం లేదు.

రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. అన్నదాతల బాధలను వింటే గుండె చలించిపోయింది. వెబ్‌ల్యాండ్‌ పేరిట రైతుల భూములను కొట్టేయడానికి చంద్రబాబు ప్రతి గ్రామంలో తన మాఫియాను పెట్టాడు. అది సరిపోదని భూములు గుంజుకోవడానికి భూసేకరణ చట్టానికి సవరణలు చేశాడు. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. ఈ ఐదేళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర రాలేదు. రైతులను ఆదుకోవాల్సిన సీఎం దళారులకు నాయకుడిగా మారాడు. రైతులు పండించిన పంటలు చేతికొచ్చేసరికి తన సొంత కంపెనీ హెరిటేజ్‌ లాభాల కోసం ధరలను పతనం చేస్తున్నాడు.  

వ్యవసాయాన్ని మళ్లీ పండుగలా మారుస్తాం  
రైతుల కష్టాలు నాకు తెలుసు. అందుకే మీకు నేనున్నాను అని భరోసా ఇస్తున్నా. రాష్ట్రంలో వ్యవసాయాన్ని మళ్లీ పండుగలా మారుస్తాం. మన ప్రభుత్వం వచ్చాక పెట్టుబడులు కోసం రైతన్నలు అప్పులు చేయాల్సిన పని ఉండదు. పెట్టుబడి కోసం ప్రతి ఏడాది మే నెలలోనే రూ.12,500 ఇస్తాం. ప్రతి రైతు కుటుంబానికి నాలుగేళ్లలో రూ.50 వేలు అందజేస్తాం. పంటల బీమా ప్రీమియంను మేమే చెల్లిస్తాం. రైతులకు వడ్డీలేని పంట రుణాలు ఇస్తాం. ఉచితంగా బోర్లు వేయిస్తాం. వ్యవసాయానికి పగటి పూటే 9 గంటలు కరెంటు సరఫరా చేస్తాం. ఆక్వా రైతులకు కరెంటు చార్జీలను తగ్గిస్తాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. అంతేకాదు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ గ్యారంటీ ఇస్తామని గట్టిగా చెబుతున్నా. ఫలానా పంటను ఫలానా ధరకు కొంటామని పంట వేసే ముందే ప్రకటిస్తాం. రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం.

రైతులను ఆదుకుంటాం. ప్రతి మండలంలోనూ కోల్డ్‌ స్టోరేజీలు నెలకొల్పుతాం. అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. మన ప్రభుత్వం రాగానే మొదటి ఏడాదిలో సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. రెండో ఏడాది నుంచి సహకార డెయిరీలకు పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్‌కు రూ.4 చొప్పున సబ్సిడీ అందజేస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు పన్ను, టోల్‌ ట్యాక్స్‌లు లేకుండా లేకుండా చేస్తాం. రైతులు ప్రమాదవశాత్తూ మరణించినా, ఆత్మహత్య చేసుకున్నా వారి కుటుంబాలను ఆదుకోవడానికి ‘వైఎస్సార్‌ బీమా’ ద్వారా రూ.7 లక్షలు అందజేస్తాం. ఆ డబ్బులపై అప్పుల వాళ్లకు ఎలాంటి హక్కు ఉండదంటూ అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొస్తాం. అగ్రిగోల్డ్‌ బాధితులందరికీ చెబుతున్నా.. మీకు తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా.  

డబ్బు మూటలతో వస్తారు జాగ్రత్త!   
ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి చంద్రబాబు చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు. రోజుకొక డ్రామా ఆడుతాడు. రాబోయే రోజుల్లో ఈ డ్రామాలు, మోసాలు, అబద్ధాలు మనకు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. మనం చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియాతోనూ పోరాటం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో చంద్రబాబు ప్రతి గ్రామానికీ డబ్బు మూటలు పంపిస్తాడు. ప్రతి ఓటర్‌ చేతిలో రూ.3 వేలు పెట్టి, ప్రలోభాలకు గురిచేస్తాడు. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని ప్రతి ఒక్కరికీ చెప్పండి. 20 రోజులు ఓపిక పట్టండి, మన అందరి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, అన్నను ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పండి.

అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ‘అమ్మఒడి’ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తాడని అక్కచెల్లెమ్మలకు చెప్పండి. ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళలకు రుణం ఎంతైతే ఉందో అంతే సొమ్మును 4 దఫాల్లో నేరుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాడని, ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారులను చేస్తాడని తెలియజేయండి. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద నాలుగు దఫాల్లో రూ.75 వేలు ఇస్తాడని చెప్పండి. పెట్టుబడి కోసం ‘రైతు భరోసా’ కింద ప్రతి ఏడాది మే నెలలో ప్రతి రైతన్న చేతిలో రూ.12,500 పెడతాడని చెప్పండి. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తాడని చెప్పండి. పెన్షన్‌ను రూ.3 వేల దాకా పెంచుకుంటూ పోతాడని ప్రతి అవ్వాతాతకు చెప్పండి. మనం ప్రకటించిన నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లండి.  

పంటలకు విరామం ప్రకటించాల్సిన దుస్థితి   
రేపల్లె ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. రెండు రోజులకోసారి ఇక్కడ నీరు సరఫరా చేస్తున్నారు. అది కూడా కేవలం 25 నిమిషాలే. గతంలో రెండు పంటలు పంచించిన ఈ ప్రాంతంలో ఇవాళ పంటలకు విరామం ప్రకటించాల్సిన అధ్వాన్నమైన పరిస్థితి కొనసాగుతోంది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 6 లిఫ్టులతో 15,000 ఎకరాల్లో వ్యవసాయానికి సాగునీరు సరఫరా చేశారు. మరో రెండు లిఫ్టులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నా ఐదేళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలేదు. నిజాంపట్నం హార్బర్‌ అభివృద్ధికి నోచుకోలేదు. పడవలు నిలుపుకోవడానికి కూడా అక్కడ స్థలం లేదు. అక్కడికి వెళ్లడానికి సరైన రోడ్డు కూడా లేదు.

మత్స్యకారులకు సబ్సిడీపై తెల్ల కిరోసిన్, డీజిల్‌ అందడం లేదు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన రూ.4 వేలను ప్రభుత్వం సక్రమంగా ఇవ్వకపోవడం దారుణం. రేపల్లె ప్రాంతంలో 18 వేల ఎకరాల్లో ఆక్వా సాగు ఉంది. బాబు పాలనలో ఆక్వా రైతుల పరిస్థితి ఎలా ఉందో మీరే ఆలోచించండి. ఆక్వా పంట చేతికొచ్చేసరికి దళారులంతా ఏకమై ధరలను ఒక్కసారిగా తగ్గిస్తున్నారు. వ్యవసాయ రంగంలోనూ ఇలాంటి దుస్థితే కొనసాగుతోంది. 

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలలు గన్న జలయజ్ఞాన్ని పూర్తిచేస్తామని హామీ ఇస్తున్నా. పోలవరం, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం, జలకళ తీసుకొస్తాం. రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతన్న కన్నీరు పెడితే అది రాష్ట్రానికి అరిష్టం.

చంద్రబాబు పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి చేశారు. విద్యార్థిని రిషితేశ్వరిని హత్య చేశారు. విజయవాడలో కాల్‌మనీ–సెక్స్‌రాకెట్‌ నడిపించారు. అయినా నిందితులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆడవాళ్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. ఆడవాళ్లపై చేయి వేసినవారు బాధపడేలా చేస్తాం.  

అక్కచెల్లెమ్మలు కన్నీరు పెడితే అరిష్టం  
చిలకలూరిపేట సభలో..
చంద్రబాబు పాలనలో రైతన్నలు, అక్కచెల్లెమ్మలు పడుతున్న బాధలను నా సుదీర్ఘ పాదయాత్రలో చూశా. అక్కచెల్లెమ్మలు కన్నీరు పెడితే ఇంటికి అరిష్టం. పొదుపు సంఘాల్లోని మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. దాంతో మహిళలు రుణాలు తిరిగి చెల్లించలేదు. రుణాలు మాఫీ చేయకుండా చంద్రబాబు మోసం చేశాడు. బాబు సీఎం అయ్యే నాటికి పొదుపు సంఘాల మహిళల రుణాలు రూ.14,200 కోట్లు ఉండేవి. బాబు నిర్వాకం వల్ల అవి వడ్డీలతో కలిపి ఇప్పుడు అక్షరాలా రూ.26,000 కోట్లకు చేరాయి. సున్నా వడ్డీకి రుణాలు రావడం లేదని మహిళలు చెప్పారు. ప్రతి అక్కచెల్లెమ్మకూ చెబుతున్నా.. మీకు నేనున్నా.  

పేదరికం పోయే రోజులు త్వరలోనే వస్తాయి  
మహిళలు విద్యాపరంగా, సామాజికంగా ఎదగాలి. వారిని బాగు చేయడానికి నవరత్నాలను ఇప్పటికే ప్రకటించా. చంద్రబాబు పసుపు–కుంకుమ అంటూ చిల్లర విసిరేస్తూ మహిళలను మోసం చేస్తున్నాడు. రేపు మన ప్రభుత్వం వచ్చాక.. ఎన్నికల నాటికి మీకు రుణాలు ఎంతైతే ఉన్నాయో అంతే సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా మీ చేతికే ఇస్తా. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. పేదరికం పోయే రోజులు త్వరలోనే వస్తాయని హామీ ఇస్తున్నా. పిల్లలను బడికి పంపిస్తే చాలు ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తాం. హాస్టల్‌లో ఉండి చదువుకునే పిల్లలకు మెస్‌ చార్జీల కోసం ఏటా రూ.20 వేలు అందజేస్తాం. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద నాలుగు దఫాల్లో రూ.75 వేలు ఇస్తాం. 

మూడు దశల్లో మద్యపానం నిషేధిస్తాం..
మద్యం వల్ల అక్కచెల్లెమ్మలు ఎదుర్కొంటున్న కష్టాలు నాకు తెలుసు. అందుకే మన ప్రభుత్వం వచ్చాక మద్యపానాన్ని మూడు దశల్లో నిషేధిస్తాం. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక ఐదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు వస్తాయి. మీ గ్రామాల్లో మద్యం దుకాణాలను తీసేసిన తర్వాతే మళ్లీ మిమ్మల్ని ఓట్లు అడుగుతా. 

బాబు కుట్రలు క్లైమాక్స్‌కు చేరాయి  
ఇవాళ వ్యవస్థలు దిగజారిపోయాయి. విలువలు లేని రాజకీయాలు వచ్చాయి. 20 రోజులుగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును గమనించండి. గత ఐదేళ్లలో ఫలానా మంచి పని చేశాను, నాకు ఓటు వేయండి అని అడగలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నాడు. ఆయన పాలనపై ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావు. ఆ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే తన పాలనపై, తాను చేసిన అన్యాయాలు, దుర్మార్గాలు, మోసాలపై చర్చ జరగకూడదని కుట్రలు సాగిస్తున్నాడు. బాబు కుట్రలు క్లైమాక్స్‌కు చేరాయి. మా చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిని చంద్రబాబు చంపించినప్పుడు కుట్ర క్లైమాక్స్‌కు వచ్చింది. తానే చంపిస్తాడు, తన పోలీసులతోనే దర్యాప్తు జరిపిస్తాడు. హత్య ఘటనను తానే వక్రీకరించి, తన పత్రికలు, చానళ్లలో చూపిస్తాడు. బాబును ఒక్కటే అడుగుతున్నా.. అయ్యా చంద్రబాబూ! నీలో కల్మషం లేకపోతే, నువ్వు హత్య చేయించకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నావని ప్రశ్నిస్తున్నా.  

అక్రమాలపై విచారణ జరిపిస్తాం.. 
నా పాదయాత్ర చిలకలూరిపేట గుండా సాగింది. ఆ రోజు మీరు చెప్పుకున్న బాధలు, కష్టాలు నాకు గుర్తున్నాయి. మీ ఆవేదనను ఎప్పటికీ మర్చిపోలేను. చిలకలూరిపేటలో ఇళ్లు లేని నిరుపేదల కోసం దివంగత మహానేత వైఎస్సార్‌ 52 ఎకరాలను కొనుగోలు చేసి, అందులో పేద ప్రజలకు పట్టాలు ఇచ్చారు. దౌర్జన్యంగా ఆ భూములను చంద్రబాబు ప్రభుత్వం లాక్కుంది. జీ+3 పేరుతో కనీస సదుపాయాలు లేని ఫ్లాట్లను మార్కెట్‌ రేటు కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. చంద్రబాబు ఇచ్చే ఫ్లాట్లను తీసుకోండి. ఫ్లాట్ల కొనుగోలు కోసం పేద ప్రజలు చెల్లించాల్సిన రూ.3 లక్షల రుణాన్ని రేపు మన ప్రభుత్వం వచ్చాక మాఫీ చేస్తాం. యడవల్లిలో 416 ఎకరాల దళితుల భూములను గద్దల్లా ఆక్రమించుకున్నారు. ఆ భూములన్నీ దళితులకు తిరిగి ఇచ్చేస్తాం. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలులో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికారుల అండతో బినామీల పేర్లతో రూ.600 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను మంత్రి కాజేయాలని చూస్తున్నాడు. ఈ అక్రమాలపై మన ప్రభుత్వం వచ్చాక విచారణ జరిపిస్తాం.  

ఆ యాక్టర్‌.. కుట్రల్లో పార్టనర్‌  
తన పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చంద్రబాబుకు తెలుసు. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి, విడగొట్టడానికి చంద్రబాబు చేస్తున్న కుట్రలను గమనించండి. మీకొక యాక్టర్‌ కనిపిస్తాడు, చంద్రబాబు పార్టనర్‌ కనిపిస్తాడు. చంద్రబాబు ఏది చెబితే ఆ యాక్టర్, పార్టనర్‌ మైకులో అదే చెబుతాడు. చంద్రబాబు చెప్పిన వారికే టిక్కెట్లు ఇస్తాడు. చంద్రబాబు ఎలా చెబితే అలా నడుచుకుంటాడు. ఆ యాక్టర్, పార్టనర్‌ నామినేషన్లు వేసినప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపిస్తాయి. అయ్యా యాక్టర్, పార్టనర్‌.. నువ్వు ముసుగు కప్పుకొని చంద్రబాబుకు ఎందుకు సపోర్టు చేస్తున్నావని అడుగుతున్నా. చంద్రబాబుతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే తనకు కూడా డిపాజిట్లు సైతం రావని ఆ యాక్టర్, పార్టనర్‌కు తెలుసు. అందుకే ప్రతి అడుగులోనూ కుట్రలు చేస్తున్నారు. సామాజికవర్గాల వారీగా కుట్రలు పన్నుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి, చంద్రబాబుకు మేలు చేయాలన్న తాపత్రయంతో కొత్తకొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఆ పార్టీలేమిటో మీకు తెలుసు. ఆ పార్టీలు వేసుకునే కండువాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కండువాల్లాగే ఉంటున్నాయి. ఆ పార్టీలకు చంద్రబాబే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలకు ఆయనే డబ్బులిస్తున్నాడు. సామాజిక న్యాయం కోసం తన సీటును త్యాగం చేసిన మర్రి రాజశేఖర్‌ అన్నను మంత్రిని చేస్తాం.  

ప్రతి జిల్లాకో నైపుణ్యాభివృద్ధి కేంద్రం 
తిరువూరు సభలో...   
నా పాదయాత్రలో నిరుద్యోగుల ఆవేదన విన్నాను. రాష్ట్రం విడిపోయేనాటికి 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాథన్‌ కమిషన్‌ నివేదిక ఇచ్చింది. ఈ ఐదేళ్లలో ఉద్యోగ విరమణల వల్ల ఏర్పడి ఖాళీలను కూడా కలుపుకుంటే మొత్తం ఖాళీల సంఖ్య 2.30 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత వేలాది రూపాయలు వెచ్చించి కోచింగ్‌ సెంటర్లలో చేరుతున్నారు. ఐదేళ్లు నిరీక్షించినా ఉద్యోగాలు భర్తీ చేయక నిరాశ చెందుతున్నారు. జాబు రావాలంటే బాబు రావాలి అని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు అన్నాడు. ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా జాబు రావాలంటే బాబు పోవాలి అని యువత నినదిస్తున్నారు.

మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ విడుదల చేస్తాం. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా శాసనసభలో చట్టాన్ని తీసుకొస్తాం. పరిశ్రమల్లో పనిచేయడానికి సరిపోయే విధంగా మన పిల్లల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు జిల్లాకో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం. ప్రస్తుత ఉపాధి అవకాశాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాం.  

వాహనాల కాంట్రాక్టు నిరుద్యోగ యువతకే..  
ప్రభుత్వ కార్యాలయాల్లో కారు దగ్గర నుంచి ఆర్టీసీ బస్సుల వరకూ ప్రతి కాంట్రాక్టును నిరుద్యోగ యువతీ యువకులకే ఇస్తాం. ఆ వాహనాన్ని కొనుగోలు చేయడానికి నిరుద్యోగ యువతకు సబ్సిడీ కింద రుణాన్ని సైతం మంజూరు చేస్తాం. నామినేషన్‌ కింద ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం కాంట్రాక్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కట్టబెడతాం. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అప్పగిస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వారికే మద్దతిస్తామని తేల్చి చెప్పి, మన హక్కును సాధించుకుందాం.   

ఇంత కంటే అన్యాయమైన పాలన ఉంటుందా?  
తిరువూరు నియోజకవర్గంలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరువూరులో తాగునీటి సమస్యలు తీర్చడానికి కృష్ణా జలాలు తీసుకొస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఐదేళ్లపాటు ఆయనకు ప్రజల సమస్యలు గుర్తుకు రాలేదు. ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకు వచ్చే ఇలాంటి నాయకులు మనకు అవసరమా? ఎ.కొండూరు మండలంలో కిడ్నీ బాధితులు నిరుడు 30 మంది మృత్యువాత పడ్డారు. అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. ఇంత కంటే అన్యాయమైన పాలన ఎక్కడైనా ఉంటుందా?   

72 గంటల్లో పథకం మంజూరు  
ఉద్యోగాలు కల్పించేందుకు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. చదువుకున్న 10 మంది యువతీ యువకులకు స్వగ్రామంలోనే ఉద్యోగం లభించేలా చేస్తాం. ప్రభుత్వ పథకాలను గ్రామ సచివాలయం ద్వారా ప్రజల ఇంటి వద్దకే తీసుకెళ్తాం. నవరత్నాల్లోని ఏ పథకం కావాలన్నా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే, 72 గంటల్లో మంజూరు చేస్తాం. గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమిస్తాం. ఆ వాలంటీర్‌కు నెలకు రూ.5 వేలు వేతనం ఇస్తాం. చదువుకున్న యువతీ, యువకులు సేవాదృక్పథం కలిగిన వారు గ్రామ వాలంటీర్‌గా ఉండొచ్చు. ఈ వాలంటీర్‌ గ్రామ సచివాలయానికి అనుసంధానంగా పనిచేస్తాడు. వాలంటీర్‌ ద్వారా సంక్షేమ పథకాలను డోర్‌ డెలివరీ చేస్తాం. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండదు. కులం, మతం, రాజకీయాలతో ప్రమేయం లేకుండా ప్రతిఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తాం.  

జగన్‌ సభల్లో జన ప్రభంజనం
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన మూడు బహిరంగ సభలకు ప్రజలు ప్రభంజనంలా తరలి వచ్చారు. మూడు సభలు జనసంద్రాన్ని తలపించాయి. తమ అభిమాన నేతను చూడగానే జేజేలు పలికారు. జగన్‌ ప్రసంగిస్తున్నంత సేపూ సీఎం... సీఎం.. సీఎం.. అంటూ నినదిస్తూనే ఉన్నారు. వైఎస్‌ జగన్‌ ఆదివారం గుంటూరు జిల్లా రేపల్లె, చిలకలూరిపేట, కృష్ణా జిల్లా తిరువూరులో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. మూడు చోట్ల ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా తమ అభిమాన నాయకుడి రాక కోసం జనం ఎదురు చూశారు. జగన్‌ను చూడాలన్న ఆరాటం, ఆయన చెప్పేది వినాలన్న ఆసక్తితో రెండు గంటల ముందే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. తమ అభిమాన నేతను చూడగానే అదిగో అన్న వస్తున్నాడంటూ పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జగన్‌ ప్రసంగంలోని ప్రతి వాక్యానికి మద్దతు తెలియజేస్తున్నట్లుగా సభా ప్రాంగణాలు ‘జై జగన్‌’ నినాదాలతో హోరెత్తిపోయాయి. నేను విన్నాను... నేను ఉన్నాను అంటూ జగన్‌ భరోసా ఇచ్చినప్పుడు నినాదాల హోరు రెట్టింçపయ్యింది. 

అడుగడుగునా హర్షాతిరేకాలు 
జగన్‌ ప్రచార సభల్లో యువత, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు, చేతి వృత్తుల వారు, మహిళలు... ఇలా అన్ని వర్గాల ప్రజలు కనిపించారు. రేపల్లె సభలో తాగునీటి కష్టాలు, పంటల సాగుకు విరామం గురించి ప్రస్తావిస్తూ, సమస్యలను పరిష్కరించడానికి అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటానని ప్రతిపక్ష నేత చెప్పినప్పుడు ప్రజలు విశేష రీతిలో స్పందించారు. ఆక్వా రైతులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చినప్పుడు అపూర్వ∙స్పందన లభించింది. చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలపై తాము అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తానని జగన్‌ ప్రకటించినప్పుడు... తమ ఆమోదాన్ని తెలియజేస్తూ జనహోరు తీవ్రస్థాయిలో కనిపించింది. తిరువూరులో తాగు, సాగునీరు ఇస్తామని జగన్‌ హామీ ఇవ్వడాన్ని జనం తమ హర్షధ్వానాలతో స్వాగతించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటానని, గ్రామ సచివాలయంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రకటించినప్పుడు... యువత చేసిన ‘జై జగన్‌.. సీఎం జగన్‌’ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది.  

మాట ఇస్తే శిలాశాసనమే
నమ్మకానికి నిలువెత్తు రూపం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. మాట ఇస్తే మడమ తిప్పని నైజం ఆ నాయకుడి సొంతం. తాను ఇచ్చిన మాటను నిలుపుకొనేందుకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో అభ్యర్థులను మార్చాల్సి వచ్చినప్పుడు అన్యాయానికి గురైన వారికి ఏదో ఒక పదవి అప్పగిస్తామని నాలుగు గోడల మధ్య హామీ ఇచ్చి, తర్వాత విస్మరించడం నేటి రాజకీయాల్లో పరిపాటే. కానీ, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నేత మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవి ఇస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఎన్నికల ముందే ఒక పార్టీ అధినేత మంత్రి పదవిపై ఇలా బహిరంగ ప్రకటన చేసిన దాఖలాలు లేవని, పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేసిన వారికి ఆయన ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

సామాజిక న్యాయం కోసం త్యాగం చేసినందుకు..: గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ను మార్చి, అక్కడ బీసీ మహిళ అయిన విడదల రజనిని వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీలో నిలిపారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంతోపాటు మంత్రిని చేస్తానని మర్రి రాజశేఖర్‌కు జగన్‌ హామీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చిలకలూరిపేటకు వచ్చిన వైఎస్‌ జగన్‌.. మర్రి రాజశేఖర్‌ సామాజిక న్యాయం కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేశారని, ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటానని సభలో ఉద్వేగంగా మాట్లాడారు. చిలకలూరిపేటలో మన పార్టీ అభ్యర్థిని గెలిపించండి, మర్రి రాజశేఖర్‌ను మంత్రిని చేస్తానని ప్రజలకు పిలుపునిచ్చారు. 

జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి..: గురజాల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి స్థానంలో కాసు మహేష్‌రెడ్డికి టిక్కెట్‌ కేటాయించారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి జంగా కృష్ణమూర్తి తనకు అండగా నిలిచారని, ఆయన తనకు తండ్రితో సమానమని, జంగాను చట్టసభకు పంపించి, న్యాయం చేస్తానని జగన్‌ బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్యేల కోటాలో వైఎస్సార్‌సీపీకి లభించిన ఒకే ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని జంగాకు ఇస్తున్నానంటూ ఏలూరు బీసీ గర్జన సభలో జగన్‌ ప్రకటించడం.. జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ కావడం చకచకా జరిగిపోయాయి. జగన్‌ను నమ్ముకున్నవారికి ఎప్పటికీ అన్యాయం జరగదనే విషయం మరోసారి రుజువైంది.  

మరిన్ని వార్తలు