తలెత్తుకునేలా..!

18 Mar, 2019 13:26 IST|Sakshi
నాయీ బ్రాహ్మణులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సెలూన్‌కు ఏడాదికి ఉచితంగా రూ.10 వేలు

ఆలయాల్లో పని చేసే వారికి ఉద్యోగ భద్రతతో పాటు కనీసవేతనం

ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుతో పాటు నామినేటెడ్‌ పోస్టుల్లో రిజర్వేషన్‌

జగనన్నకు రుణపడి ఉంటామంటున్న నాయీ బ్రాహ్మణులు

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: ప్రజల ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాయీ బ్రాహ్మణుల సెలూన్‌ షాపునకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ప్రత్యేక కార్పొరేషన్‌తో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 15లక్షల మంది నాయీబ్రాహ్మణులు లబ్ధి పొందనున్నారు. ఏలూరులో ఫిబ్రవరి 17న జరిగిన బీసీ గర్జనలో అశేష జనావలి సాక్షిగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై నాయీబ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ బతుకులకు ఒక భరోసా ఇవ్వడంతో పాటు సమాజంలో తలెత్తుకుని తిరిగేలా హామీ ఇవ్వడంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయీబ్రాహ్మణులు అంతా జగనన్న వెంటే నడుస్తామని గర్వంగా చెబుతున్నారు.

దయనీయ స్థితిలో నాయీబ్రాహ్మణులు..
జిల్లాలో సుమారు 18 వేల వరకు సెలూన్‌ షాపులు ఉన్నాయి. కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్న వారు సుమారు లక్షమంది వరకు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నాయీబ్రాహ్మణులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. కులవృత్తిని వదులుకోలేక, ప్రత్యామ్నాయం లేక, మరో పని చేతకాక, ప్రభుత్వ ప్రోత్సాహం లేక బతుకు బండిని భారంగా లాగుతున్నారు. కనీసం రోజుకు రూ.200 నుంచి 300లు కూడా సంపాదించలేని స్థితిలో ఉన్నారు. కడుపు చేతపట్టుకుని పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి అప్పులు చేసి సెలూన్‌ షాపులు నడుపుతున్నారు. పట్టణాల్లో సైతం ఆశించిన మేరకు సంపాదన లేక కనీసం షాపు విద్యుత్‌ బిల్లు చెల్లించలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నాయీబ్రాహ్మణులను బెదిరించిన బాబు..
తమ న్యాయమైన సమస్యలను విన్నవించేందుకు గత ఏడాది జూన్‌ 18న అమరావతిలోని సచివాలయం వద్ద నాయీబ్రాహ్మణ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తమ సమస్యలను మొర పెట్టుకోగా వారిని బెదిరిస్తూ మాట్లాడారు. తోక కత్తిరిస్తానంటూ దారుణంగా  మాట్లాడడం వారిని కలచివేసింది. దీంతో వారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు భరతం పడతామని హెచ్చరించారు.

కనీసవేతనం.. ప్రత్యేక కార్పొరేషన్‌..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయీ బ్రాహ్మణుల కష్టాలను చూసి చలించి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నాయీ బ్రాహ్మణుడి కళ్లలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో వరాలు కురిపించారు. ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో రిజర్వేషన్‌ కల్పించడంతో పాటు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఏ రాజకీయ నాయకుడు తమ కులాన్ని పట్టించుకు న్న దాఖలాలు లేవని, జగనన్న హామీతో మహర్దశ పడుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.

ఎంతోమంది నాయకులు..ఎన్నో ప్రభుత్వాలు మారాయి. కానీనాయీ బ్రాహ్మణుల గురించి పట్టించుకున్నసందర్భాలు మచ్చుకైనా లేవు. గత ఎన్నికల్లోచంద్రబాబు నాయుడు వీరికీ హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక తమ సమస్యలను పరిష్కరించాలని వెళ్లిన నాయీ బ్రాహ్మణులపైనే కన్నెర్రజేశారు. తోక కత్తిరిస్తా అంటూ బెదిరించారు. మరోవైపు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజాసంకల్పయాత్రలో ఉండగానాయీ బ్రాహ్మణులు కలిశారు. వారి సమస్యనుసావధానంగా విన్న ఆయన వారికి ఆర్థిక భరోసా ఇచ్చారు. దీంతో వారంతా వైఎస్సార్‌సీపీఅధికారంలోకి వస్తే తాము తలెత్తుకుని బతకవచ్చనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

స్వాగతిస్తున్నాం..
జిల్లాలో సుమారు 80 వేల మంది నాయిబ్రాహ్మణులు వైఎస్‌ జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తారు. గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు పాలించినా తమను పట్టించుకున్న దాఖలాలు లేవు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మా నాయీబ్రాహ్మణుల కష్టాలను గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్, కనీస వేతనం, ప్రతిషాపునకు ఉచితంగా రూ.10 వేలు ప్రకటించడం హర్షణీయం. దయనీయ స్థితిలో ఉన్న మా జీవితాల్లో జగనన్న హామీతో వెలుగు నింపారు.– భజంత్రీ నాగార్జున, నాయీబ్రాహ్మణ నంద యువసేన జిల్లా అధ్యక్షుడు, తిరుపతి

చంద్రబాబు నమ్మించిమోసం చేశాడు
చంద్రబాబు నాయుడు నాయీబ్రాహ్మణులను నమ్మించి మోసం చేశాడు. ఆలయాల్లో పనిచేసే క్షురకులను ఉద్యోగపరంగా పర్మినెంట్‌ చేస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చి లబ్ధి పొందారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించారు. ప్రతిపక్షనేత అధికారంలోకి రాగానే కనీసవేతనం ఇస్తానని హామీ ఇచ్చారు. దీన్ని మేము స్వాగతిస్తున్నాం.– ఎం.నర్సింహులు, క్షవరవృత్తి దారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు

చారిత్రాత్మక నిర్ణయం..
మా బాధలు చూసిన వైఎస్‌ జగన్‌ మమ్మల్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి షాపునకు రూ.10వేలు ఆర్థికసాయం చేస్తాననడం చారిత్రాత్మక నిర్ణయం. మాకులాన్ని ఇంతవరకు పట్టించుకున్న నాథుడు లేడు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే మా కష్టాలు తీరతాయని విశ్వసిస్తున్నాం.– రమేష్, నాయీబ్రాహ్మణ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు, తిరుపతి

అభినందనీయం..
బీసీల పట్ల అభిమానంతో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీల వల్ల కులవృత్తులకు మళ్లీ మహర్దశ వస్తుంది. టెక్నాలజీ పేరుతో దాదాపు అంతరించిపోతున్న కులవృత్తులను ప్రోత్సహించే దిశగా అడుగులు అభినందనీయం.– సురేంద్రబాబు, ఏర్పేడు

ఆర్థిక ఆసరా..
మా కుటుంబాలకు ఆర్థికంగా ఆసరా కలుగుతుంది. చాలామంది పనులు లేక వేరే పని చేయలేక వలసలు వెళ్తున్నారు. జగన న్న హామీ వల్ల మాకు ఊరట కల్పించినట్లు అవుతుంది. – విజయ్, తిరుపతి

మరిన్ని వార్తలు