-

రైతును మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ..

20 Feb, 2019 03:49 IST|Sakshi

కొండవీడు రైతు మృతిపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆవేదన

రైతు మృతిపై వైఎస్సార్‌ సీపీ నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు

నేడు కొండవీడులో కమిటీ పర్యటన

ఉద్యోగుల ఐఆర్‌లోనూ బాబు దగా

సాక్షి, హైదరాబాద్‌: గుంటూరు జిల్లా కొండవీడులో బీసీ రైతు కోటేశ్వరరావు (కోటయ్య) మృతిపై ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతు మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన తీరును ఆయన తప్పుబట్టారు. అసలు చంద్రబాబు ఎందుకింతగా దిగజారారని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. మంగళవారం అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశమై రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించారు. కోటయ్య మృతి విషయంలో నిజనిర్ధారణ కోసం శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జగన్‌ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వోద్యోగులను చంద్రబాబు మోసం చేస్తున్న తీరుపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. చంద్రబాబు ప్రకటించిన మధ్యంతర భృతి (ఐఆర్‌) విషయంలో నిజాయితీ ఎంత అనేది ఉద్యోగులకు అర్థం అవుతోందని జగన్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ప్రకటించి జూన్‌లో ఇస్తాం అనడం ప్రభుత్వోద్యోగులను మోసం చేయడమేనన్నారు. అధికారం లేని అంశంలో చంద్రబాబు ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికలయ్యాక వచ్చే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటే.. ఇప్పుడు చంద్రబాబు ఎలా ప్రకటన చేస్తారు? ఇది దగా చేయడం కాదా? జగన్‌ ప్రశ్నించారు. 

నేడు నిజనిర్ధారణ కమిటీ పర్యటన
రైతు కోటయ్య మరణంపై మరిన్ని వివరాలు తెలుసుకుని ఆ కుటుంబానికి పూర్తి భరోసా ఇచ్చేందుకు ఉమ్మారెడ్డి నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ బుధవారం కొండవీడును సందర్శిస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నిజనిర్ధారణ కమిటీలో పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మహ్మద్‌ ముస్తఫా, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని, మర్రి రాజశేఖర్, విడదల రజని, లావు శ్రీకృష్ణదేవరాయలు, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, గాంధీ సభ్యులుగా ఉన్నారు.

ఈ రాక్షసత్వం ఏమిటి?
కొండవీడులో బీసీ వర్గానికి చెందిన రైతు కోటయ్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే చంపేశారని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొండవీడులో ఒక బీసీ (ముత్రాసి) రైతు, కోటయ్యను మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ.. కొట్టి కొన ఊపిరితో ఉన్న రైతును అమానుషంగా అక్కడే వదిలేశారు. మీ హెలీకాప్టర్‌ దిగటానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటి చంద్రబాబు గారూ?’ అని జగన్‌ ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు