ఏం చేశావని నీకు ఓటెయ్యాలి బాబూ? 

12 Dec, 2018 03:55 IST|Sakshi
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున హాజరైన జనసందోహంలో ఓ భాగం. ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ను బతకనివ్వొద్దని పిలుపునిచ్చావు

అదే కాంగ్రెస్‌తో జతకట్టావు 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్,రింగ్‌ రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఈయన ఘనతేనట

ఇవి వైఎస్సార్‌ హయాంలోనే వేశారని అందరికీ తెలుసు 

తన ఎల్లో మీడియాలో దొంగ సర్వేలను ఊదరగొట్టించారు 

లగడపాటి అనే ఆయనతో ఎగ్జిట్‌పోల్‌..ఈయనెప్పుడు విశ్లేషకుడయ్యాడో 

ఇలాంటి బాబును నమ్మి ఎవరైనా ఓట్లు వేస్తారా?

బాబు ఎక్కడ పాదం పెడితే అక్కడ బూడిదే..

చంద్రబాబు వ్యవహార శైలి చూస్తే మనందరం నివ్వెరపోతాం. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఎన్నికలు చూశాం. చంద్రబాబునాయుడు గారి ఎల్లో మీడియా సామ్రాజ్యం చూపిన, రాసిన రాతలు, వార్తలు చూస్తుంటే అసలు చంద్రబాబే యుద్ధం చేస్తున్నారా లేక, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 9,టీవీ5.. వీళ్లంతా యుద్ధం చేస్తున్నారా అనేది అర్థం కాకుండా పోయింది. నిజంగా ఏదో జరిగిపోతోందనే స్థాయిలో ఆ యుద్ధాన్ని చూపించారు. ఆ ఎన్నికల ఫలితాలు ఈ రోజు (మంగళవారం) వచ్చాయి. పరీక్షలు రాయడానికి ముందు పోజులు కొట్టారు. డ్రామాలాడారు. ఫలితాలు వచ్చాక ఏమనిపించిందో తెలుసా? భస్మాసురుడు చేయి పెట్టినా, చంద్రబాబు నాయుడు కాలు పెట్టినా అంతా బూడిదే. మన రాష్ట్ర ప్రజలకే కాదు తెలంగాణ ఎన్నికల ఫలితాలతో దేశ ప్రజలందరికీ కూడా ఈ విషయం బాగా అర్థమైపోయింది.  

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘చంద్రబాబు నాయుడి అనైతిక పొత్తుకు తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. ఏం చేశారని ఈ పెద్దమనిషికి ఓటెయ్యాలి? చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మమే’నని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. భస్మాసురుడు చేయి పెట్టినా, చంద్రబాబు కాలు పెట్టినా అంతా బూడిదేనని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడి నక్కజిత్తుల వేషాలు, డ్రామాలు ఏమిటో ఇప్పుడు దేశ ప్రజలందరికీ తెలిసి వచ్చాయన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 319వ రోజు మంగళవారం ఆయన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బాబు తీరును తూర్పారబడుతూ సాగిన జగన్‌ ప్రసంగానికి జనం నుంచి పెద్దపెట్టున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ఊసరవెల్లి కూడా ఇంతగా రంగులు మార్చదేమో! 
‘‘ఎవరైనా ఎక్కడైనా ఓటు వేసినప్పుడు ఎవరికి ఓటు వేస్తున్నాం.. ఎలాంటి పాలనకు వేస్తున్నాం.. అని ఆలోచిస్తారు. ఇలా ఆలోచించే.. ప్రజల్ని ఇష్టం వచ్చినట్టుగా, తాను ఏమి చెప్పినా పడి ఉంటారని, ఎన్ని అబద్ధాలు చెప్పినా తనను నమ్ముతారని, వాళ్ల చెవుల్లో పువ్వులు పెట్టినా పడి ఉంటారనే నాయకుడికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. 2014 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 25 శాతం, తెలుగుదేశం పార్టీకి 14 శాతం మొత్తంగా 39 శాతం ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌కు 34 శాతం ఓట్లు వచ్చాయి. అంటే దాని అర్థం చంద్రబాబునాయుడు, కాంగ్రెస్‌ పార్టీ రెండూ కలిస్తే 39 శాతమని, కేసీఆర్‌కు 34 శాతమే కాబట్టి 5 శాతం ముందంజతో వీళ్లిద్దరూ (టీడీపీ, కాంగ్రెస్‌) ఎన్నికల వ్యవహారం మొదలుపెట్టారు. కానీ ఇవాళ ఏం జరిగింది? ఆ 5 శాతం లీడ్‌ కాస్తా ఎక్కడికో వెళ్లిపోయింది. అనైతిక పొత్తుకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల జిమ్మిక్కులు ఒక్కసారి చూడండి.

ఇదే తెలంగాణ ఎన్నికల్లో రాహూల్‌ గాంధీ పక్కన చంద్రబాబునాయుడు చక్కగా కనిపించాడు. ఇదే చంద్రబాబు తెలంగాణ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోక ముందు చేసిన పని ఏమిటో తెలుసా? ఈ మధ్య కాలంలో చంద్రబాబు సొంత బావమరిది హరికృష్ణ చనిపోయారు. ఆయన భౌతికకాయం సాక్షిగా ఈ పెద్దమనిషి చంద్రబాబు ఆ సమయంలోనే కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌తో పొత్తుల కోసం బేరాలు ఆడాడు. అందుకు టీఆర్‌ఎస్‌ వాళ్లు మీతో మేము పొత్తు పొట్టుకోము అని చెప్పారు. కానీ ఈ చంద్రబాబు నిస్సిగ్గుగా అసెంబ్లీలో మైకు పట్టుకుని.. టీఆర్‌ఎస్‌తో పొత్తును నరేంద్ర మోదీ అడ్డుకున్నాడని, కలిసి మెలిసి ఉండనివ్వడం లేదని చెప్పాడు. అది ఇవాళ్టికీ  రికార్డుల్లో ఉంది. ఈ మాట అన్న రెండు నెలలకు నిస్సిగ్గుగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీని బతకనివ్వకూడదని గతంలో పిలుపునిచ్చిన ఇదే వ్యక్తి ఇప్పుడు నిస్సిగ్గుగా కాంగ్రెస్‌ పార్టీతో జతకలిశాడు. ఇంతగా ఊసరవెల్లి కూడా రంగులు మార్చదేమో. ఇలా రంగులు మారుస్తుంటే ఎవరయ్యా నిన్ను నమ్మేది? ఎవరయ్యా నిన్ను నమ్మి నీ పార్టీకి ఓట్లేసేది? 

చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తా.. 
ఆమదాలవలస నియోజకవర్గం బౌద్దులు, జైనులకు దర్శనీయ స్థలం. కానీ ఇవాళ అవినీతి, ఇసుక దోపిడీతో పాలకులు కోటానుకోట్లు సంపాదించడంలో, నీరు – చెట్టు పథకం పేరుతో దోపిడీలో, మద్యం పేరు చెప్పి కమీషన్‌లు గుంజడంలో బాగా పేరు పొందింది. అంతేకాదు.. ప్రజలను వెన్నుపోటు పొడవడం, ఇచ్చిన హామీలను గాలికొదిలేయడంలో కూడా పేరొచ్చింది. చంద్రబాబు నాయుడు, ఇక్కడి ఎమ్మెల్యే.. ఇద్దరూ కలిసి ఈ నియోజకవర్గానికి తెచ్చిన పేరిది. చంద్రబాబు వెన్నుపోటు అన్నది ఎలా ఉంటుందనేదానికి ఆమదాలవలస చక్కెర ఫ్యాక్టరీ మంచి ఉదాహరణ. గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ చక్కెర ఫ్యాక్టరీని దగ్గరుండి నష్టాలబాట పట్టించారు.

వందల కోట్ల విలువ చేసే ఈ ఫ్యాక్టరీని నక్కజిత్తులు పన్ని, నష్టాల బాట పట్టించి కేవలం రూ.6.42 కోట్లకు తనకు కావాల్సిన వారికి అమ్మేస్తే, తాము ఎలా బతకాలని రైతులు కోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అప్పుడు చంద్రబాబు రైతులకు మేలు చేసే విధంగా ఆలోచించడానికి బదులు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ఆ తర్వాత నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యాక సుప్రీంకోర్టులో వేసిన ఆ కేసును ఉపసంహరించారు. 2014 ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ ఆయనే ఈ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తానని మాట ఇచ్చాడు. నాలుగున్నరేళ్లుగా అంగుళం కూడా కదల్లేదు. చంద్రబాబుకు మోసం చేయడం కొత్తేమీ కాదు. మొన్న ఏరువాక సందర్భంగా ఆమదాలవలస వచ్చిన ఈ పెద్దమనిషి ఫ్యాక్టరీని తెరిపించడమనేది ముగిసిన అధ్యాయమని చెప్పాడు. రూ.300 కోట్ల విలువ చేసే ఈ ఫ్యాక్టరీ భూములను తన బినామీలకు ఎలా కట్టబెట్టాలని ఆలోచించేందుకు ఏపీఐఐసీని పురమాయించాడు. రేపు మీ అందరి ఆశీర్వాదంతో మన ప్రభుత్వం రాగానే ఈ చక్కెర ఫ్యాక్టరీని నేను తెరిపిస్తానని మాట ఇస్తున్నా.    

స్థానిక ఎమ్మెల్యే చోటా డాన్‌ 
అన్నా.. అవినీతిలో చంద్రబాబు డాన్‌ అయితే ఆయన అవినీతి సామ్రాజ్యంలో ఇక్కడి ఎమ్మెల్యే చోటాడాన్‌ అని ప్రజలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలోని ఎనగాం, కాకాట్యం, ముద్దాలపేట, బోడేపల్లి, సింగూరు, దూసి, తోటాడ, చవ్యాకులపేట, పురుషోత్తపురం ఇసుక రీచ్‌లను విడిచి పెట్టకుండా దోచేస్తున్నారు. ఇక్కడి నుంచి రూ.300 కోట్లు పై చిలుకు సొమ్మును అక్రమంగా దోచేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. దోచుకున్న ఈ సొమ్మును ఎమ్మెల్యే మొదలు, మంత్రులు, చినబాబు, పెదబాబు వరకు పోతున్నాయంటున్నారు. జేసీబీలతో తవ్వుతూ, లారీల్లో తరలిస్తున్నా అధికారులెవరూ నోరు మెదపడం లేదు.  రాత్రికి రాత్రి నదికి వరద రావడంతో పురుషోత్తపురం ఇసుక రీచ్‌ వద్ద అక్రమంగా ఇసుక తరలింపు కోసం ఉంచిన లారీలు, జేసీబీలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో ఇక్కడ ఇసుక దోపిడీ ఎంతగా సాగుతోందో బాహ్య ప్రపంచానికి నదీమ తల్లే చెప్పింది. అయినా ఎమ్మెల్యేకు, చినబాబుకు ఏ శిక్షా ఉండదు.

ఇక రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయంటే కాంకాస్ట్‌ అనే ఫెర్రో ఎల్లాయిస్‌ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో దాదాపు 800 మంది పని చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే, నేతల వేధింపులు భరించలేక ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏకంగా ఆ ఫ్యాక్టరీనే మూసేసి ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా ఎగ్గొట్టి వెళ్లిపోయిన పరిస్థితి. ఈ పెద్దమనిషి పాలనలో కొత్త ఉద్యాగాల కథ దేవుడెరుగు.. ఉన్నవి కూడా పోతున్న పరిస్థితి. మా ఎమ్మెల్యేకు ఎక్కడైనా ప్రభుత్వ భూమి కనిపించిందంటే కళ్లు ఆగవన్నా.. వెంటనే దాన్ని కబ్జా చేసేంత వరకూ ప్రయత్నాలు చేస్తాడన్నా.. అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. సరిబుజ్జుల మండలం వెన్నెలవలస గ్రామంలో 102 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 50 ఎకరాల భూమి ట్రిపుల్‌ ఐటీకి ఇవ్వండని అడిగితే కుదరదని చెప్పారు. కానీ ఇక్కడి ఎమ్మెల్యే మాత్రం తన భార్య పేరున పూలసాగు చేసుకుంటానని దరఖాస్తు చేసి, కొట్టేయబోతుంటే వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్నాలు చేయవలసి వచ్చింది. ఆమదాలవలస పోలీసుస్టేషన్‌ పక్కనున్న ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని కొట్టేసి టీడీపీ కార్యాలయం కట్టేందుకు ప్రయత్నిస్తున్నా అడ్డుకోలేని దుస్థితి. 

రైతులను బాబు ఏనాడూ పట్టించుకోలేదు.. 
వంశధార, నాగావళి నదుల అనుసంధానం ప్రాజెక్టు పనులు ఇవాళ్టికీ నత్తనడకన సాగుతున్నాయి. వంశధార నీటిని హిరమండలంలోని రిజర్వాయర్‌ నుంచి హైలెవెల్‌ కెనాల్‌ ద్వారా నారాయణపురం ఆనకట్టకు తీసుకువచ్చి, కొత్తగా 5 వేల ఎకరాలకు సాగు నీటిని అందించడంతో పాటు 19 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉద్ధేశించిన పథకం ఇది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కావడం లేదన్నా.. అని స్థానికులు అంటున్నారు. వంశధార ప్రాజెక్టుకు సంబంధించి సైడ్‌వ్యూయర్‌ కట్టేందుకు నాన్నగారి హయాంలోనే యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించారు. అయితే ఈ రిజర్వాయర్‌ నుంచి ఒక కాలువ తవ్వి దానికి హైలెవెల్‌ కెనాల్‌ అని పేరు పెట్టి.. దాంతో వంశధార, నాగావళి నదుల అనుసంధానం తానే చేస్తున్నానని చంద్రబాబు గొప్పగా డబ్బా కొట్టుకోవడం మొదలు పెట్టాడు. ఈ పెద్దమనిషి గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంశధార, తోటపల్లి, పోలవరం ప్రాజెక్టులకు ఏ రోజూ తట్టెడు మట్టి ఎత్తి పోసిన పాపాన పోలేదు. ఇలాంటి వ్యక్తిని ఏమనాలి? ఆ రోజుల్లో వంశధార నీటి తరలింపు కోసం గేదెలవానిపేట వద్ద రైల్వే ట్రాక్‌ అడ్డం వస్తే 3 కిలోమీటర్ల వయాడెక్ట్‌ నిర్మించి ఈ నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు చేసిన చరిత్ర డాక్టర్‌ వైఎస్సార్‌ది. 3,200 ఎకరాలకు నీరు అందించడానికి చిత్తశుద్ధితో వైఎస్సార్‌ కృషి చేశారు. ఎచ్చెర్ల, ఆమదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో దాదాపు 37,303 ఎకరాలకు సాగు నీరందించే పథకం నారాయణపురం ఆనకట్ట.

ఈ ప్రాజెక్టు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. 600 క్యూసెక్కుల నీరు కాలువల్లో ప్రవహించాల్సి ఉంటే కేవలం 350 క్యూసెక్కుల నీరు కూడా పారడం లేదు. ఈ ప్రాజెక్టును పునర్నిర్మిస్తానని ఇదే ఆమదాలవలసలో గత ఎన్నికలప్పుడు ఈ పెద్దమనిషి మాటిచ్చారు. ఇదెక్కడైనా కనిపించిందా? వంశధార, నాగావళి నదులు ఆమదాలవలస, గురజ, సరబుజ్జిలి మండలాల్లోని పొలాల గుండా ప్రవహిస్తున్నాయి. ఏటా దాదాపు 10 వేల నుంచి 20 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి.  తిత్లీ తుపానుతో ఈ జిల్లాలో రూ.3,435 కోట్ల నష్టం జరిగినట్టు చంద్రబాబు కేంద్ర హోం శాఖ మంత్రికి లేఖ రాశారు.  కానీ ఇందులో ఈ పెద్దమనిషి ఇచ్చింది కేవలం 15 శాతం. అంటే రూ.500 కోట్లు కూడా మించని అధ్వాన పరిస్థితి.  అయితే జిల్లాలో తిత్లీ బాధితులందరినీ ఆదుకున్నానని విశాఖపట్నం, విజయవాడలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టి గొప్పలు చెప్పుకున్నాడు. ఏ బస్సు చూసినా చంద్రబాబు ఫ్లెక్సీలే.  అయ్యా.. నువ్వు అన్యాయం చేస్తున్నావని ప్రజలు చేతులెత్తి గళం విప్పితే, వారి వెనుక నుంచి ఫొటోలు తీయించి.. ప్రజలు జేజేలు కొడుతున్నారని ఫ్లెక్సీల్లో చూపించుకోవడం విడ్డూరం. నీ తీరు చూస్తుంటే శవాలపై చిల్లర ఏరుకుంటున్నట్టుగా ఉంది. 

సర్వం లంచాల మయం  
రాష్ట్రంలో పెన్షన్‌లు రావాలన్నా, రేషన్‌ కార్డు కావాలన్నా, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం లేనిదే పని జరగడం లేదు. ఇదే నియోజకవర్గంలోని పొందూరు మండలంలో దాదాపు 850 మంది పెన్షన్‌లను నిర్థాక్షిణ్యంగా తీసేస్తే వారిలో 498 మంది కోర్టుకు వెళ్లి తెచ్చుకున్నారు. వీరి బాధ చూసి రూ.49 వేలు బకాయిలతో సహా చెల్లించాలని ఆదేశిస్తూ కోర్టు.. చంద్రబాబు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. కొంచాడ అమ్ములమ్మ అనే అవ్వ జడ్జి గారి వద్దకు వెళ్లి.. నా పేరు అమ్ములమ్మ. నేను చనిపోయాననే సాకుతో పెన్షన్‌ తీసేసేరయ్యా.. నేను బతికే ఉన్నానయ్యా.. నాకు పెన్షన్‌ ఇప్పించండయ్యా.. అని జడ్జి గారిని కోరింది. మెట్ట లక్ష్మీ అనే అక్క.. భర్త చనిపోయి దుఃఖంలో ఉంటే ఆమె భర్త బతికే ఉన్నాడని పింఛన్‌ తీసేశారు. దాంతో ఆమె కోర్టుకు వెళ్లి అయ్యా జడ్జి గారు.. నాకు పెన్షన్‌ అవసరం లేదు.. నా భర్తను ఇప్పించండయ్యా అని వేడుకున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరిట మాఫియా ముఠాలు రాజ్యమేలుతున్నాయి. గ్రామాల్లో వీధి వీధినా బెల్ట్‌షాపులే. ఇలాంటి అన్యాయమైన పాలన పోవాలి. విశ్వసనీయత రావాలి. ఇది జరగాలంటే ఒక్క జగన్‌ వల్లనే సాధ్యం కాదు. మీ అందరి తోడు, దీవెనలు, ఆశీస్సులు కావాలి’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.  

ఈ ఏడాది జూన్‌ 8న అంటే ఐదారు నెలల కిందట చంద్రబాబు నాలుగేళ్ల అవినీతి పాలనపై కాంగ్రెస్‌ పార్టీ పుస్తకం వేసింది. అవినీతి పాలన,దుష్టపాలన అంటూ ఏకంగా చంద్రబాబుపై చార్జిషీట్‌ అని పేరు పెట్టి రాహుల్‌ గాంధీ ఫొటోతో సహా ప్రచురించారు. ఆ తర్వాత రాహుల్‌ గాంధీ, చంద్రబాబునాయుడు చెట్టాపట్టాలు వేసుకుని ఒకే వేదికపై కనిపిస్తారు. ఇటువంటి అన్యాయమైన రాజకీయం చేస్తే ప్రజలు చంద్రబాబు కూటమికి ఎలా ఓట్లేస్తారు? 

ఎన్ని విన్యాసాలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని తెలిసి ఎన్నికలకు 36 గంటల ముందు చంద్రబాబు.. తాను ఎలా చెబితే అలా వినే ఎల్లో మీడియాతో పాటు లగడపాటి అనే వ్యక్తిని తీసుకువచ్చారు. నాకు నిజంగా ఆశ్చర్యమనిపించింది. ఆయన రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడయ్యాడా అనిపించింది. పైగా ఆయనకొక బిరుదు కూడా ఇచ్చారు. ఆంధ్ర ఆక్టోపస్‌ అట. తెలంగాణలో చంద్రబాబు కూటమి స్వీప్‌ చేయబోతోందని ఆ పెద్ద మనిషి చెప్పాడు. దానికి ఆ ఎల్లో మీడియా ఎంతగా పబ్లిసిటీ ఇచ్చిందంటే అక్కడ నిజంగానే ఏదో జరిగిపోతోంది.. కేసీఆర్‌ ప్రభుత్వం పోయి కాంగ్రెస్, చంద్రబాబు కూటమి అధికారంలోకి రాబోతోందన్న భ్రమ కల్పించేలా ఊదరగొట్టారు. మరోవైపు దొంగ సర్వేలు ఇప్పించాడు. పోలింగ్‌ రోజు మధ్యాహ్నం ఒక నకిలీ ఎగ్జిట్‌ పోల్‌ తీసుకువచ్చాడు. టీడీపీ కూటమి ఘన విజయం సాధించబోతోందని ఆ సర్వే చెప్పింది. దానిని ప్రతి సెల్‌ఫోన్‌కు పంపించారు.

ఈ మనిషిని నమ్మి ఎవరు ఓట్లు వేస్తారు? 
మన రాష్ట్రంలో 23 మంది ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు దోపిడీ సొమ్ముతో సంతలో పశువుల మాదిరిగా కొనుగోలుచేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచాడు. వారిలో నలుగురిని మంత్రులను కూడా చేశాడు. అవినీతి సొమ్ముతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన చరిత్ర ఈ పెద్దమనిషిది. అప్పట్లో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘మన వాళ్లు బ్రీఫ్డ్‌ మీ.. నేను అన్నీ చూసుకుంటా’ అని అప్పట్లో చంద్రబాబు అన్న మాటలు అన్ని టీవీ చానల్స్‌లో వచ్చాయి. మనమే కాదు ఆ రాష్ట్రంలో ప్రజలు సైతం చూశారు. అంతగా ఈ విషయం జనానికి తెలిసినప్పటికీ ఈ మనిషి తెలంగాణకు వెళ్లి ఏమంటాడో తెలుసా? పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలు ద్రోహులని, చరిత్రహీనులని వాళ్లను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చాడు. నీతి, న్యాయం లేకుండా ఈ మనిషి మాటలు నమ్మి ఎవరైనా ఓట్లు వేస్తారా? తెలంగాణ గురించి కాస్తో కూస్తో కనీసం మాట్లాడాలంటే 20, 30 ఏళ్ల తర్వాత మాట్లాడితే ప్రజలకు జ్ఞాపకం ఉండదేమో అనుకోవచ్చు. కానీ మొన్ననే రాష్ట్రం విడిపోయింది. ప్రజలందరికీ అన్ని విషయాలు తెలుసు.

ఎవరేమి చేశారో కూడా తెలుసు. అయినా ఈ పెద్ద మనిషి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నేనే కట్టాను.. ఔటర్‌ రింగురోడ్డు నేనే వేశాను.. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌హైవే నేనే కట్టానంటాడు. అసలు ఇవన్నీ కూడా అప్పట్లో ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి గారు కట్టారనే సంగతి అందరికీ తెలుసు. అయినా ఈ వ్యక్తి నిస్సిగ్గుగా అబద్ధాలు చెబితే ఎవరు ఓట్లు వేస్తారు? నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసి చిలకా, గోరింకల్లా కాపురం చేశాడు. ఆయన ఈయన్ని పొగుడుతాడు, ఈయన ఆయన్ని పొగుడుతాడు. అసెంబ్లీలో తీర్మానాలు చేసి మరీ పొగిడాడు. ఆ నాలుగేళ్ల కాలంలో ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, విశాఖపట్నం రైల్వే జోన్‌ రాకపోయినా, దుగరాజుపట్నం పోర్టు కట్టకపోయినా, కడపలో స్టీల్‌ప్లాంట్‌ పెట్టకపోయినా, క్రూడ్‌ ఆయిల్‌ రిఫైనరీ రాకపోయినా ఈ మనిషి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకపోగా వెనకేసుకొచ్చాడు. సరిగ్గా ఎన్నిలకు ఆరు నెలల ముందు బీజేపీకి విడాకులు ఇచ్చాక తానేదో ఎప్పటి నుంచో బీజేపీపై పోరాటం చేస్తున్నట్టు రోజూ డ్రామాలాడుతున్నాడు. అదేదో ధర్మపోరాటం అంటూ చెవులు పోయేలా ఊదరగొడుతున్నాడు. నిజంగా ప్రజలను ఇంతగా మోసం చేసే వ్యక్తికి ఓట్లు వేస్తారా? 

తెలంగాణలో పట్టుబడిన డబ్బు ఎంతో తెలుసా? అక్షరాలా రూ.142.62 కోట్లు. తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు కూడా నమోదయ్యాయి.ఆ డబ్బంతా మన జేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే.ఇన్ని చేసిన ఈ వ్యక్తిని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారా?

సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు ఎగ్గొట్టి సున్నం రాశాడు 
రాష్ట్రంలో ఇవాళ రైతన్నలకు సాగు నీరు లేదు. సున్నా, పావలా వడ్డీలు లేవు. వ్యవసాయం ముందుకు సాగడం లేదు. గిట్టుబాటు ధరలు లేవు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు దారి వెంట వరికోసి పనల మీద ఉండటం చూశా. ధాన్యం మద్ధతు ధరేమో క్వింటాల్‌కు రూ.1,750 ఉంది. కానీ రూ.1,100కు కూడా కొనే నాధుడు లేడు. రాష్ట్రంలో 11 జిల్లాలు కరవుతో అల్లాడుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. ఖరీఫ్‌లో రూ.2 వేల కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ లెక్కలు తేల్చినా, రబీ దాటిపోయినా దమ్మిడీ ఇవ్వ లేదు. ఇంతగా అన్యాయం చేసిన ఈయనకు ఎవరైనా ఓట్లు వేస్తారా? గత ఎన్నికలప్పుడు జాబు రావాలంటే బాబు రావాలని అన్నాడు. ఉపాధి, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికీ నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాడు. ఇప్పుడు ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు అదీ రాష్ట్రంలో కోటి 70 లక్షల ఇళ్లు ఉంటే కేవలం 3 లక్షల మందికి భృతి ఇస్తామంటున్నారు. అదీ కూడా రూ.వెయ్యి మాత్రమే. కానీ చంద్రబాబు తెలంగాణ ఎన్నికల సభల్లో ఏమన్నాడో తెలుసా? నిరుద్యోగులంతా తన ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ భృతితో సుఖంగా, సంతోషంగా ఆనందంగా ఉన్నారని చెప్పాడు.

ఇటువంటి వ్యక్తిని నమ్మి ఓట్లు వేస్తారా? ఇక రైతులకు రుణాల మాఫీ అని నామం పెట్టాడు. పొదుపు సంఘాల రుణాల మాఫీ అని చెప్పి దగా చేశాడు. సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు పూర్తిగా ఎగ్గొట్టి సున్నం రాశాడు.   రేషన్‌షాపుల్లో ఇవాళ బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. కరెంటు చార్జీలు, పెట్రోలు, డీజిల్‌ ధరలు, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్నులు, స్కూల్, కళాశాల ఫీజులు బాదుడే బాదుడు. ఇళ్లు ఇవ్వరు. ఇళ్ల స్థలాలు ఇవ్వరు. ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తారని భయపడాల్సిన పరిస్థితి. బీసీలకు నాలుగు కత్తెర్లు, నాలుగు ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడమే ప్రేమ చూపడం అనుకుంటాడు..  ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. హైదరాబాద్‌కు పోతే ఆరోగ్యశ్రీ కట్‌. పోనీ విశాఖపట్నంలో కేజీహెచ్‌కు వెళితే మంచానికి ఇద్దరు. గవర్నమెంటు ఆస్పత్రికి వెళితే కనీస వసతులు ఉండవు. 108కు ఫోన్‌ చేస్తే అంబులెన్స్‌ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. సీపీఎస్‌ రద్దు చేయాలని బోర్డులు పట్టుకుని  నాలుగేళ్లుగా అడుగుతున్న వాళ్ల గురించి ఈ ముఖ్యమంత్రి పట్టించుకోడు. కానీ తమ పార్టీ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తామని తెలంగాణ మేనిఫెస్టోలో పెడతాడు. ఇక్కడ చేసింది లేదు కానీ అక్కడ చేస్తాడట ఈ పెద్దమనిషి. 

మన ప్రభుత్వం రాగానే ఇలా  
- వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌   
ప్రతీ రైతుకు వడ్డీ లేకుండా పంట రుణాలు  
మే నెలలోనే ప్రతీ రైతు కుటుంబానికి రూ.12,500  
రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం.  
పంట వేయడానికి ముందే గిట్టుబాటు ధర. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.   
రూ.4 వేల కోట్ల (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం)తో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు.    
పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి.   
ఆక్వా రైతులకు యూనిట్‌ కరెంట్‌ రూ.1.50కే సరఫరా. 
కోల్డ్‌ స్టోరేజీలు, ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు.  
మూతపడ్డ సహకార డెయిరీలను పునరుద్ధరిస్తాం. వీటికి పాలు పోసే రైతన్నలకు లీటరుకు రూ.4 çసబ్సిడి.   
అనుకోకుండా ఏ రైతు అయినా ఈ లోకాన్ని వీడిపోతే అప్పుల వాళ్లు అతని కుటుంబంపై పడి పీడించకుండా ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. రూ.5 లక్షలు ఆ కుటుంబానికి వారంలోగా అందజేసి తోడుగా ఉంటాం. ఈ రూ.5 లక్షలు ఆ కుటుంబ ఆస్తిగా పరిగణిస్తాం.  
రైతన్నల వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌ నుంచి మినహాయింపు ఇస్తాం. ముఖ్యమంత్రి స్థానంలో తన కొడుకే ఉన్నాడని భావించేలా రైతన్న కుటుంబానికి తోడుగా ఉంటాను.   

మరిన్ని వార్తలు