నిస్సిగ్గుగా టీడీపీతో కలసి పోటీ చేస్తారా?

4 Dec, 2018 04:09 IST|Sakshi

కాంగ్రెస్‌ తీరుపై నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

చంద్రబాబును ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడన్నారే.. 

‘చార్జిషీట్‌’ పేరుతో ఏకంగా ఓ పుస్తకమే వేశారే

అవినీతి సొమ్ములో కొంత ఇస్తాననగానే తెలంగాణలో కలిసి పని చేస్తున్నారు 

నాలుగేళ్లు సంసారం చేసిన బీజేపీకి బాబు విడాకులిచ్చి కాంగ్రెస్‌తో కలిశారు 

గాడ్సేతో పోల్చిన సోనియా దేవత అయిందా? 

రాహుల్‌ను మొద్దబ్బాయ్‌ అన్నావ్‌..ఇప్పుడతను మేధావి అయ్యాడా? 

పవన్‌కళ్యాణ్‌.. వివాహ వ్యవస్థను వీధుల్లోకి తేవడమే మగతనమా? 

బాబుతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ నిజం కాదా? 

దర్శకత్వం బాబు.. నిర్మాత లింగమనేని.. నటన నీది

మూడు నెలల క్రితం.. ఆగస్టు 29న నందమూరి హరికృష్ణ గారు చనిపోయారు. హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా చంద్రబాబు గారు అక్కడే.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుమారుడు కేటీఆర్‌తో ఏమన్నారో తెలుసా? టీఆర్‌ఎస్, టీడీపీ కలిసి పోటీ చేస్తే బాగుంటుందన్నారు. తనతో అక్కడ బాబు ఇలా అన్నారని కేటీఆర్‌ సభ పెట్టిమరీ చెప్పారు. అందుకు కేటీఆర్‌ అన్నారంట. అయ్యా.. చంద్రబాబు గారూ.. మనిద్దరం కలిసి పనిచేసే పరిస్థితి ఉండదన్నారట. ఆగస్టు 29న కేటీఆర్‌ ఆ మాట అన్న వెంటనే ఈ పెద్దమనిషి నిస్సిగ్గుగా కేవలం రెండు నెలలైనా కాకముందే అక్టోబర్‌లోనే కాంగ్రెస్‌ పార్టీతో డీల్‌ (పొత్తు) కుదుర్చుకున్నారు. చంద్రబాబు తన అవినీతి సొమ్ము నుంచి తెలంగాణ ఎన్నికలకు కాస్తో కూస్తో డబ్బులు ఇస్తాననగానే కాంగ్రెస్‌ వాళ్లు  సరేనన్నారు. నవంబర్‌లో సీట్లు కూడా సర్దుబాటు చేసుకున్నారు.

అయ్యా.. చంద్రబాబూ! ఆగస్టు 29న నువ్వు టీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేద్దామని కేటీఆర్‌ వద్ద చేసిన ప్రతిపాదనను వాళ్లు ఒప్పుకుని ఉంటే, నేడు తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌ పక్కన నిలబడి కాంగ్రెస్‌ పార్టీ మీద దుమ్మెత్తిపోసి ఉండేవాడివి కాదా? ఈ నీతిమాలిన రాజకీయాలను ఈ పెద్దమనిషి చక్రం తిప్పడం అని అంటారు. ఇంతకన్నా దిక్కుమాలిన వ్యక్తి
ఈ ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా?  

– రాజాం సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌
 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంతటి అవినీతి పరుడు ప్రపంచంలోనే లేడని, ఏపీలో సాగుతున్న దుష్ట పరిపాలన మరెక్కడా లేదని నాలుగైదు నెలల క్రితమే ‘చార్జిషీటు’ పేరుతో ఓ పుస్తకాన్నే విడుదల చేసిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో నిస్సిగ్గుగా టీడీపీతో కలిసి పని చేస్తోందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేద్దామన్న చంద్రబాబు ప్రతిపాదనకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తిరస్కరించగానే కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఇంతకంటే దిగజారుడు తనం మరేదీ ఉండదన్నారు.  కార్లు మార్చినట్లు నలుగురు భార్యలను మార్చి వివాహ వ్యవస్థను వీధుల్లోకి తేవడం మగతనం అవుతుందా? అని పవన్‌ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 311వ రోజు సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గ కేంద్రం రాజాంలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ తీరును తూర్పారబట్టారు. ఈ సభలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

నిజంగా వీరికి సిగ్గూ ఎగ్గూ ఉందా?  
‘‘ మీరంతా 2014 ఎన్నికలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అప్పట్లో ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు.. కాంగ్రెస్‌ను రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ అని నిందించాడు. సోనియా గాంధీని అవినీతి అనకొండ అన్నాడు. ఆ రోజు అవినీతి అనకొండ అని నిందించిన సోనియా గాంధీ ఈ రోజు చంద్రబాబు దృష్టిలో అందాల కొండ.. ఆనందాల కొండగా మారిపోయింది. రాష్ట్రాన్ని విడగొట్టిన సోనియా ఆ రోజు గాంధీని చంపిన గాడ్సే.. ఈ రోజు ఆమె దేవత! ఆ రోజు రాహుల్‌ గాంధీ ఆయన దృష్టిలో ఒక మొద్దబ్బాయి. రాహుల్‌ లాంటి మొద్దబ్బాయ్‌ కూడా దేశాన్ని పరిపాలిస్తాడా? అని ఆరోజు చంద్రబాబు ప్రశ్నించాడు. మరి ఈ రోజు రాహుల్‌గాంధీ అంటే ఆహా... ఏం మేధావి! అని పొగుడుతున్నాడు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అనే పదాలకు చంద్రబాబు పాతరేశాడు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. నిజంగా వీళ్ల రాజకీయాలు ఈ స్థాయికి దిగజారి పోయాయి. నిజంగా ఈ రోజు చంద్రబాబు ఎవరితోనైనా కలిసిపోయే తీరును చూస్తే.. ఎంత దారుణం అనిపిస్తుంది. ఇదే చంద్రబాబు గురించి కాంగ్రెస్‌ పార్టీ ఈ ఏడాది జూన్‌ 8న ఓ పుస్తకం విడుదల చేసింది. నాలుగేళ్ల చంద్రబాబు పాలన మీద, ఆయన అవినీతి మీద, దుష్ట పాలన మీద రాహుల్‌ గాంధీ బొమ్మతో, ‘చార్జిషీటు’ అనే పేరుతో ఆ పుస్తకాన్ని విడుదల చేసింది. చంద్రబాబు అంతటి అవినీతిపరుడు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని, ఇంతటి దుష్టపాలన ఎక్కడా ఉండదని ఆ పుస్తకంలో స్పష్టంగా చెప్పింది. అలాంటిది ఈ రోజు ఆ పార్టీలు నిస్సిగ్గుగా తెలంగాణ ఎన్నికల్లో ఒకే వేదిక మీద నిలబడ్డాయి. రాహుల్‌ పక్కన నిల్చొని చంద్రబాబు మాట్లాడుతున్నారు. నిజంగా వీరికి సిగ్గూ ఎగ్గూ ఉందా? చంద్రబాబు గారి నికృష్టమైన రాజకీయాలు చూస్తుంటే ఏవగింపు కలుగుతోంది.


 
మోదీ అంతటి గొప్ప ప్రధాని లేరన్నావే? 
నాలుగున్నరేళ్లుగా ఈ పెద్దమనిషి చావు తెలివి తేటలు, అబద్ధాలు, మోసాలు చూశాం. కరువుతో రాష్ట్రం అల్లాడి పోతోంది. కరువొస్తే చంద్రబాబు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడు. రుణాలు రీషెడ్యూలింగ్‌ చేయడు. తిత్లీ తుపాను వస్తే షో చేస్తాడు. రాష్ట్రం అతలాకుతలం అవుతున్నా పట్టించుకోడు. ఇంతటి దుర్భరమైన పరిస్థితులు నెలకొని ఉంటే ఈ పెద్దమనిషి ప్రతి రోజూ విమానం ఎక్కి బిల్డప్‌ ఇస్తాడు. బెంగళూరు వెళ్లి కుమారస్వామితో కాఫీ తాగుతాడు.. ఇంకో రోజు చెన్నైకి వెళ్లి స్టాలిన్‌తో కలిసి ఇడ్లీ, వడ తింటాడు. మరో రోజు పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి మమతా బెనర్జీతో టీ తాగుతాడు. అయ్యా.. చంద్రబాబూ! మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది రాష్ట్ర ప్రజలను పట్టించుకోమని. కానీ నువ్వు ఇవాళ రాష్ట్ర ప్రజలను గాలికి వదలేసి ఎవరో ప్రధాన మంత్రి అట.. వాళ్లను ఎలా దింపాలని తిరుగుతున్నావు.
 
జగన్‌ అవినీతిపరుడంటున్నావు.. నువ్వు చూశావా? 
మేం ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాలుగున్నరేళ్ల దుష్ట పరిపాలన, అధర్మం, అన్యాయం, అవినీతి మీద పోరాటం చేస్తున్నాం. ఈ నాలుగున్నరేళ్లుగా ఈ రాష్ట్రంలో ఏం జరిగినా అక్కడ కనిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్‌.. అని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇదే పవన్‌ కళ్యాణ్‌ అనే వ్యక్తి గత నాలుగున్నరేళ్లుగా చంద్రబాబుకు పార్ట్‌నర్‌గా ఉన్నాడు. చంద్రబాబు ప్రభుత్వం మీద ఏదైనా మాట్లాడవయ్యా.. అంటే దాని గురించి తక్కువ మాట్లాడతాడు. కానీ జగన్‌ అవినీతిపరుడు అని అంటాడు. జగన్‌ అవినీతి పరుడు అంటున్నావే.. నువ్వేమైనా చూశావా పవన్‌ కళ్యాణ్‌? అయ్యా.. పవన్‌ కళ్యాణ్‌! నువ్వు రాజకీయాల్లోకి రాకముందు 2004 నుంచి 2009 దాకా ఆ దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన సాగింది. ఆ నేత పాలనను చూసి ప్రజలంతా సంతోష పడ్డారు కాబట్టే 2009లో మళ్లీ వైఎస్సార్‌కు ఓట్లు వేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. 

ఓట్లు సీట్ల కోసమే.. 
చంద్రబాబు 14 ఏళ్లు పాలించాడు. ఈ పెద్దమనిషి ఓట్లు, సీట్ల కోసం మాత్రమే శ్రీకాకుళం జిల్లాను వాడుకున్నాడు. జిల్లాకు గానీ, రాజాం ప్రాంతానికి గానీ ఏం మేలు చేశాడని ఇక్కడి ప్రజలు అడుగుతున్నారు. మాటమాటకి నేను చాలా అనుభవజ్ఞుడిని.. అందరి కన్నా సీనియర్‌నని ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు. మాకేం చేశావని అడిగితే మాత్రం ఆయన నోట్లోంచి మాటలు రావు. అదే ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి పాలన గురించి చెప్పుకొస్తూ ఇదే రాజాం ప్రాంతంలో ఆయన హయాంలోనే రాజాం బస్టాండ్‌ విస్తరణ జరిగిందన్నారు. ‘శ్రీకాకుళం, బొబ్బిలి, విజయనగరం, పాలకొండ నుంచి రాజాంకు రోడ్లు కూడా అప్పుడే పడ్డాయి. మడ్డువలస కాలువ ఆధునికీకరణ కోసం ఆ దివంగత నేత రూ.47 కోట్లు మంజూరు చేస్తే ఈవాళ్టికీ ఆ పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. నాన్నగారి పుణ్యమాని తోటపల్లి ప్రాజెక్టు వచ్చింది. కెపాసిటీ పెరిగింది. విస్తీర్ణం పెరగడంతో రాజాం ప్రాంతంలో ఎకరాలకు ఎకరాలు సాగులోకి వచ్చాయి. కొత్తగా 35 వేల పింఛన్లు మంజూరు చేశారు. 32 వేల ఇళ్లు నిర్మించారు. మడ్డువలసలో రెసిడెన్షియల్‌ కళాశాల వచ్చిందన్నా..’ అని ప్రజలు  చెప్పుకొచ్చారు.   

శాటిలైట్‌ సిటీ మీకేమైనా కన్పించిందా? 
ఇదే రాజాం బస్టాండ్‌లో 2015 జనవరి 6న జన్మభూమి మావూరులో చంద్రబాబు మూడే మూడు నెలల్లో రాజాం రోడ్లు విస్తరిస్తానన్నాడు. ఈ రోడ్ల విస్తరణకు అయ్యే ఖర్చు కేవలం రూ.56 కోట్లు. కానీ ఇంతవరకు ఇచ్చిందెంతంటే æకేవలం రూ.10 కోట్లు మాత్రమే. అందుకే ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రాజాంలో శాటిలైట్‌ సిటీ కడతానన్నాడు. నాలుగు చెరువులను పార్కులుగా అభివృద్ధి చే స్తానన్నాడు. డిగ్రీ కళాశాల భవనాలు నిర్మిస్తానన్నాడు. ఇవి మీకెక్కడైనా కనిపించాయా? తోటపల్లి ఎడమ కాల్వ, కుడికాల్వ ఆధునికీకరణ పనులు చేస్తానన్నాడు. నాలుగున్నరేళ్లుగా ఈ పనులను పట్టించుకోని చంద్రబాబు ఎన్నికలకు మూడు నెలలుండగా టెండర్లు పిలుస్తానంటున్నాడు. టెంకాయ కొట్టి డ్రామా చేయాలని చూస్తున్నాడు. సంతకవిటి, రేగిడి, రాజాం మండలాల్లో రైతులు అష్టకష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదు. పిల్ల కాల్వలు కూడా పూర్తి చేయలేని అధ్వాన పాలన సాగుతోంది. వంగర, రేగడి, సంతకవిటి, జి.సిగడ మండలాల్లో మడ్డువలస కుడి ప్రధాన కాల్వ పనులకు నాన్నగారి హయాంలో రూ.47 కోట్లు మంజూరు చేస్తే ఇవాల్టికీ ఆ పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు హయాంలో చేసిందేమిటంటే జన్మభూమి కమిటీల పేరిట గ్రామాల్లో ఉన్న పింఛన్లను ఊడబెరకడమే. ఇదే నియోజకవర్గంలో 18 స్కూళ్లను మూయించేశాడు. రాజాంలో ఎస్టీ హాస్టల్‌ను, దూలపేటలో బీసీ హాస్టల్‌ను మూయించేశారు. నాలుగు మండలాలకు గాను ఒకే ఒక్క 108 అంబులెన్స్‌ తిరుగుతోంది. నాన్నగారి హయాంలో మండలానికి ఒక అంబులెన్స్‌ ఉండేది. ఇవాళ 104 ఎక్కడ ఉందో కన్పించని పరిస్థితి.  

ఒక్క రాజాంలోనే 17 పరిశ్రమలు మూత  
కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉన్న పరిశ్రమలు మూతపడుతున్న పరిస్థితి. స్టీల్‌ ఇండస్ట్రీ, ఆయిల్‌ మిల్లు, కేబుల్‌ ఇండస్ట్రీ, జ్యూట్‌ మిల్లులు మూతపడ్డాయి. ఒక్క రాజాంలోనే 17 పరిశ్రమలు మూతపడడంతో 20 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందు కరెంట్‌ యూనిట్‌ రేటు రూ.3 ఉండేది. నేడు రూ.8కి ఎగబాకింది. పరిస్థితి ఇలా ఉంటే విశాఖలో మీటింగ్‌లు పెట్టి.. రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి.. 40 లక్షల ఉద్యోగాలొచ్చాయని ఊదరగొడతాడు. సంతకవిటి మండలంలో బసువులు రేవు వద్ద నాగావళిపై వంతెన కోసం 651 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. దాదాపు 80 గ్రామాల సమస్య. ఒక వంతెన కూడా కట్టలేని అధ్వాన పాలన ఇక్కడే చూస్తున్నాం. రేగడి మండలం అంబకండి గ్రామానికి చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తులు నిన్న నా దగ్గరకు వచ్చి బాధపడుతూ మా గ్రామంలో 24 మంది కిడ్నీ వ్యాధి బారిన పడి చనిపోయారని చెప్పారు.

తాగు నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితి అని వాపోయారు. నీరు చెట్టు పేరు చెప్పి ఇదే నియోజకవర్గంలో రూ.20 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పారు. నాగావళి నదిలో బొడ్డువలస, కందిస, సంగ్రాం, రేగిడి, కొత్తూరు, రామచంద్రాపురం, పుర్లి, ఓనిఅగ్రహారం, తామడాల వద్ద ఇష్టానుసారంగా ఇçసుకను దోచేస్తున్నారన్నా అని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. వంగర మండలంలో మడ్డువలస వద్ద పాండవుల కొండను కబ్జా చేసి గ్రానైట్‌ తవ్వకాలు చేస్తున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకుని మెటీరియల్‌ను, యంత్రాలను సీజ్‌ చేస్తే  ఇక్కడి మంత్రి కళా వెంకట్రావు దగ్గరుండి ఆ అ«ధికారిని ట్రాన్స్‌ఫర్‌ చేయించాడు. సీజ్‌ చేసిన గ్రానైట్‌ను, యంత్రాలను వెనక్కి తెప్పించారు. అగ్రిగోల్డ్‌పై సీఐడీ ఎంక్వైరీ అంటారు. ఈ ఎంక్వైరీ ఏ స్థాయిలో జరిగిందంటే.. ఇండీ ట్రేడ్‌ అనే ఒక షేర్‌ బ్రోకర్‌ అక్షరాల రూ.180 కోట్లు దోచేశారు. దీనిపై వేసిన సీఐడీ ఎంక్వైరీ ఏం చేసిందో తెలుసా?  రూ.180 కోట్లు దోచుకున్న టీడీపీ పెద్దనాయకుల దగ్గర నుంచి ఆ సొమ్మును కక్కించి ప్రజలకు ఇవ్వాల్సింది పోయి దమ్మిడీ పైసా కూడా రికవరీ చేసిన పాపాన పోలేదు.  

మన జోగులన్న గురించి మీకు ఓ విషయం చెప్పాలి. కళా వెంకట్రావు అనే మంత్రి ఉన్నాడు కదా.. మన జోగులన్న ఇంటి పక్కనే ఆయన ఇల్లు. 150 గజాల దూరంలో ఉంటాడు. ఆయన రోజు చేసే పని ఏమిటో తెలుసా? జోగులన్న ఇంటికి వచ్చి నీకు రూ.20 కోట్లు ఇస్తా.. రూ.30 కోట్లు ఇస్తా.. నువ్వు రా.. నువ్వు రా.. అని వెంటపడేవాడు. ఇటువంటి అన్యాయమైన రాజకీయాల్లో సైతం జోగులన్న తులసి మొక్కగా నిలబడ్డారు. ప్రలోభాలు పెట్టినా నిజాయితీగా నిలిచాడు. జోగులన్నకు ఎప్పటికీ నా మనసులో స్థానం ఉంటుంది. జోగులన్నను గొప్పగా ఆశీర్వదించమని కోరుతున్నా. 
 

పవన్‌కళ్యాణ్‌.. ఇది మగతనమా? 
పవన్‌కళ్యాణ్‌ ఈ మధ్య మగతనం గురించి మాట్లాడాడు. ఇతను నలుగురు భార్యలను పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల కొకసారి భార్యను మార్చేస్తాడు. ఈ దేశంలో పవిత్రమైన వ్యవస్థ ఏదైనా ఉందంటే.. అది పెళ్లి అనే వ్యవస్థ. అలాంటి పవిత్రమైన వ్యవస్థను పవన్‌కళ్యాణ్‌ రోడ్డు మీదకు తీసుకొచ్చాడు. నిత్య పెళ్లికొడుకు మాదిరిగా.. నాలుగేళ్ల కొకసారి భార్యలను మారుస్తూ నలుగురు భార్యలను పెళ్లి చేసుకోవడం మగతనమా? పవన్‌కళ్యాణ్‌  రెండో భార్య రేణూదేశాయ్‌ అట. ఆయన గురించి ఆమె ఏమనిందంటే.. రేణూదేశాయ్‌తో కాపురం చేస్తుండగానే వేరొక స్త్రీని గర్భిణిని చేసి ఆమెకు పుట్టిన పిల్లవాడిని కూడా ఇంటికి తీసుకొచ్చాడని ఆమె ఏకంగా టీవీల ముందుకు వచ్చి చెప్పారు. ఆయనతో పాటు జీవితాన్ని పంచుకున్న ఆ ఆడపడుచు ఆయన గారిని ఈ మాటలన్నారని.. పవన్‌కళ్యాణ్‌ గారి కార్యకర్తలు ఆమెను సోషల్‌ మీడియాలో వేధిస్తే ఈ పెద్దమనిషి మౌనంగా ఉన్నారు. ఇదా మగతనం అంటే?  పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకొచ్చి నాలుగేళ్లకు ఒకసారి కొత్త కారును మార్చినట్లుగా భార్యలను మారిస్తే.. నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది ధర్మమా? అని ఎవరైనా ప్రశ్నిస్తే, తప్పును ఎవరైనా ఎత్తి చూపిస్తే ఈ పెద్దమనిషి (పవన్‌ కళ్యాణ్‌) ఏం చేస్తాడో తెలుసా! అలా ఎత్తి చూపిన వారి ఇళ్లల్లోని ఆడవాళ్ల మీద లేనిపోని అబద్ధాలు, లేనిపోనివి నిస్సిగ్గుగా సోషల్‌ మీడియాలో పెట్టిస్తాడు. ఇది మగతనమా పవన్‌కళ్యాణ్‌? నువ్వు తీసిన సినిమా అజ్ఞాతవాసి అట. ఇటీవలే వచ్చింది. ఈ సినిమాకు గతంలో ఏ సినిమాకూ ఎప్పుడూ ఇవ్వని విధంగా చంద్రబాబు రాయితీలు ఇచ్చారు. అలాంటి రాయితీలు నీకు మాత్రమే వచ్చాయి. ఆ రాయితీలతో నువ్వు సంపాదించుకున్న కోట్ల రూపాయలు అవినీతి మాదిరిగా కనిపించలేదా? ఇలాంటి వ్యక్తి అవినీతి గురించి, జైలు గురించి మాట్లాడతాడు. జగన్‌ జైలుకు పోతాడని ఈ మనిషి మాట్లాడుతున్నాడు. నిజంగా చంద్రబాబు గారి స్క్రిప్టులో భాగంగానే ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. ఇలాంటి నీచమైన రాజకీయాలు చూసినప్పుడు ఈ వ్యవస్థ మారకపోతే మనందరమూ భ్రష్టు పట్టిపోతామని చెబుతున్నాను.   
 

జగన్‌ సభ సమయంలో విద్యుత్‌ కోత 
రాజాం: అధికార టీడీపీ తన నైజాన్ని విడిచిపెట్టుకోలేదు. శీకాకుళం జిల్లా రాజాంలో సోమవారం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ బహిరంగ సభ ప్రారంభం కాగానే రాజాం పట్టణంతోపాటు నియోజకవర్గంలోని పలు మండలాలకు విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేయించింది. గంటన్నర పాటు విద్యుత్‌ సరఫరా నిలిపి వేశారు. బహిరంగ సభ పూర్తయ్యాక తిరిగి సరఫరాను పునరుద్ధరించారు. ఈ విషయమై రాజాం ఎలక్ట్రికల్‌ ఏడీ బీవీ రమణను ‘సాక్షి’ ప్రస్తావించగా.. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల సరఫరా ఆగి ఉంటుందన్నారు.   

నాలుగేళ్లు బీజేపీతో కలిసి చిలుకా గోరింకల్లా కాపురం చేసినప్పుడు నరేంద్ర మోదీ లాంటి నాయకుడు ఈ ప్రపంచంలోనే లేరన్నావు. అసెంబ్లీ సాక్షిగా ఈ మాటలన్నాడు. జనవరి 27, 2017లో విలేకరుల సమావేశాలు పెట్టి మన రాష్ట్రానికి బీజేపీ చేసినంతగా ఏ రాష్ట్రానికీ చేయలేదని పొగిడాడు. ఆయన (మోదీ) ఈయన్ను(చంద్రబాబును)ను పొగుడుతాడు.. ఈయన(బాబు) ఏకంగా అసెంబ్లీలో తీర్మానాలు చేసి ఆయన్ను (మోదీని)పొగుడుతాడు. వీళ్ల కాపురం చూసి చిలుకా గోరింకలే సిగ్గుపడ్డాయి. ఆ విధంగా సంసారం చేశారు. ఇప్పుడు ప్రజలు..తమను చంద్రబాబు అన్ని విధాలా మోసం చేశాడనుకుంటున్న తరుణంలో తాను చేసిన నేరాన్ని ఎవరి మీదో వేయాలని ఆరాటపడ్డారు. వెంటనే బీజేపీ ప్రభుత్వానికి విడాకులు ఇచ్చేశాడు.  

 

బాబు తీరు శవాలపై చిల్లర ఏరుకుంటున్నట్టుంది.. 
తిత్లీ తుపాన్‌ వల్ల రూ.3,435 కోట్ల నష్టం వాటిల్లిందని, రైతన్నలు, ప్రజలు దెబ్బతిన్నారని చెప్పుకొచ్చారు. రాజాం నియోజకవర్గంలో దాదాపు 1000 ఎకరాల పంట నష్టం జరిగింది. అరటి, పత్తి, వరి పూర్తిగా దెబ్బతిన్నాయి. కానీ చంద్రబాబు ఈ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. రూ.3,435 కోట్ల నష్టానికి గాను ముష్టి వేసినట్టు రూ.520 కోట్లు మంజూరు చేశాడు. దీంట్లో కూడా ఇంతవరకు ఖర్చు చేసింది కేవలం రూ.210 కోట్లే. మరోవైపు భారీగా సాయం చేసినట్లు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఏ ఆర్టీసీ బస్సుపై చూసినా చంద్రబాబు బొమ్మే కన్పిస్తుంది. తిత్లీ తుపాన్‌ బాధితులను ఆదుకున్న చంద్రబాబు.. అని విజయవాడలో చంద్రబాబు ఫొటోలతో ఫ్లెక్సీలు కన్పిస్తాయి. చంద్రబాబు తీరు ఎలా ఉందంటే శవాల మీద చిల్లర ఏరుకున్నట్టుగా ఉంది. రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ కాలేదు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాకపోగా వేలం వేస్తామని నోటీసులొస్తున్నాయి. ఈయన రుణమాఫీ రైతుల అప్పుల వడ్డీకి కూడా సరిపోలేదు. సున్నా వడ్డీ రుణాలు లేవు. తన హెరిటేజ్‌ షాపుల కోసం ఈ పెద్దమనిషే దళారీగా మారడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. సహకార చక్కెర ఫ్యాక్టరీలను దగ్గరుండి మూసేయిస్తున్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. రూ.2 వేల భృతీ లేదు. ఈ లెక్కన ఇంటింటికీ రూ.లక్షా పది వేలు బకాయి పడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. 23 వేల టీచర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికలకు మూడు నెలల ముందు 7,900 టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత సిలబస్‌ మార్చేశారు. షెడ్యూల్‌ మార్చేస్తారు. ఉద్యోగాలు తగ్గిస్తారు. కాంపిటీషన్‌ పెంచుతారు. ఇంతకంటే దిక్కుమాలిన ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా? ఈయన గారి అవినీతి వల్ల పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటలేదు. ఈయన తీరు ఇంటికి పునాది వేసి గృహ ప్రవేశం చేసినట్టుంది. ఆర్టీసీ బస్సు ఎక్కితే బాదుడే. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద భోజనాలు పెట్టే 85 వేల మంది అక్క చెల్లెమ్మలను చంద్రబాబు పుణ్యమాని ఇంటికి పంపేస్తున్నారు. నెలల తరబడి వారికి బిల్లులు ఇవ్వని పరిస్థితి. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారు. రేషన్‌షాపుల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వని పరిస్థితి. వీధి వీధినా బెల్ట్‌ షాపులే. నాలుగు కత్తెరలు, నాలుగు ఇస్త్రీ పెట్టలు ఇచ్చి బీసీలను ఉద్ధరిస్తున్నానంటాడు. కరువు వచ్చి రాష్ట్రం అల్లాడుతున్నా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడు, రుణాలు రీషెడ్యూల్‌ చేయడు’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 


మనందరి ప్రభుత్వం రాగానే ఇలా చేస్తాం..
మన పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లు, ఇతర పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా? ఇంజనీరింగ్‌ చదివించాలంటే ఫీజులు ఏటా రూ.లక్షపైనే ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కేవలం రూ.30 వేలు.. రూ. 35 వేలు. అది కూడా సరిగా అందడం లేదు. ఇదే నియోజకవర్గంలో జీఎంఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల కన్పిస్తోంది. ఆ కళాశాలలో ఏడాదికి రూ.లక్షా 4 వేలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోక విద్యార్థుల తల్లిదండ్రులు నాలుగేళ్లలో రూ.3 లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దాని కోసం ఇల్లు.. వాకిలీ అమ్ముకునే పరిస్థితి ఉంది. పిల్లల చదువుల కోసం పేదలు అప్పులపాలవ్వకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి భరోసాగా నిలిచారు. ఆయన కుమారునిగా నేను రెండడుగులు ముందుకు వేస్తాను. డాక్టర్‌.. ఇంజినీర్‌.. కలెక్టర్‌.. మీ పిల్లలను ఏం చదువులు చదివిస్తారో మీ ఇష్టం. ఎన్ని లక్షలు ఖర్చయినా ఫర్వాలేదు. నేను చదివిస్తా. అంతేకాదు.. వాళ్లకయ్యే హాస్టల్‌ ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. పెద్ద చదువులు చదవాలంటే చిట్టి పిల్లల నుంచే పునాదులు పడతాయి. అందుకే చిన్నారులను బడికి పంపే ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు ఇస్తాం. అవసరమైనన్ని ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. ఇంగ్లీషు మీడియం స్కూళ్ల సంఖ్యను పెంచుతాం. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తా.  

చంద్రబాబు పార్ట్‌నర్‌ పవన్‌ కళ్యాణ్‌ 2014 నుంచి 2018 దాకా నాలుగున్నరేళ్ల పాటు ఆయన (బాబు) గారితో కలిసి కాపురం చేశాడు. చంద్రబాబు చెప్పిన ప్రతి అబద్ధంలో, ఆయన చేసిన ప్రతి మోసంలో, ప్రతి అవినీతిలోనూ భాగస్వామి కాదా? నాలుగున్నరేళ్లు చంద్రబాబుతో కాపురం చేసి తెర ముందు దోస్తీ.. ఇప్పుడు ఎన్నికలు ఆరు నెలలున్నాయనగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుని చంద్రబాబుతో విడిపోయినట్లుగా లాలూచీ రాజకీయం చేస్తున్నారు. ఈ నీతిమాలిన రాజకీయానికి స్క్రిప్టు, డైరెక్షన్‌ చంద్రబాబుదైతే యాక్షన్‌ మాత్రం పవన్‌ కళ్యాణ్‌ది. లింగమనేని అనే వ్యక్తి ఈ సినిమాకు నిర్మాత. పవన్‌ కళ్యాణ్‌ సినిమాకు ఇంటర్వెల్‌ ఎక్కువ.. సినిమా తక్కువ.. చంద్రబాబు ఎప్పుడు పేమెంట్లు ఇస్తే అప్పుడు కాల్‌షీట్లు ఇస్తుంటాడు.  


అయ్యా పవన్‌ కళ్యాణ్‌.. 2004 నుంచి 2009 దాకా నువ్వు రాజకీయాల్లో ఏ రోజూ లేవు. వైఎస్‌ పాలనను చూడలేదు. సినిమాల్లో ఉన్నావు.చూడని పాలన, జరగని అవినీతి గురించి, అవినీతి జరిగిందని ఇవాళ మాట్లాడుతున్నావ్‌.. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి, అన్యాయాలను పక్కన పెట్టి గతంలో జరిగిన వైఎస్‌ పాలన గురించి మాట్లాడుతున్నావంటే ఇంతకన్నా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఇంకేమైనా ఉందా?  

ఓ వైపు ల్యాండ్‌పూలింగ్‌ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నపుడు వారి తరఫున పోరాటం చేస్తున్నట్లు పవన్‌ కళ్యాణ్‌ బిల్డప్‌ ఇస్తాడు.ఓ వైపు ఇలా బిల్డప్‌ ఇస్తూ అదే ల్యాండ్‌ పూలింగ్‌లో తన భూములు పోకుండా స్కెచ్‌ వేసి వేల కోట్ల రూపాయలు లాభపడ్డ చంద్రబాబు నాయుడు గారి బినామీ లింగమ నేని అనే వ్యక్తి వద్ద ఎకరా రూ.4 కోట్లు, రూ.5 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.20 లక్షలకే నువ్వు కొనుగోలు చేయడం నీకు అవినీతిగా కనిపించలేదా?  

మరిన్ని వార్తలు