నాడు మహిషాసురుడు.. నేడు నారాసురుడు 

18 Oct, 2018 02:34 IST|Sakshi
విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఒక భాగం. (ఇన్‌సెట్‌లో) ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌.

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

డ్వాక్రా రుణాలు మాఫీ చేశానంటూ బాబు పచ్చి అబద్ధాలు

మాఫీ చేయలేదని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొన్నాక కూడా వంచన 

రుణ మాఫీ పథకం రైతుల అప్పుల వడ్డీలో నాలుగో వంతుకు కూడా సరిపోలేదు 

రాజ్యకాంక్షతో ధర్మం తప్పి పాలన సాగిస్తున్న ఇలాంటి నాయకుడు అవసరమా? 

ప్రజలు ఆలోచించాలని జననేత పిలుపు

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిషాసురుడిని తలపిస్తూ నారాసురుడిగా మారారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తనకు ఎవ్వరూ ఎదురుండకూడదన్న అహంతో, తానేమి చేసినా చెల్లుబాటవుతుందన్నట్టుగా వ్యవహరిస్తున్నారని దునుమాడారు. విలువల కోసం ప్రాణాలు అర్పించిన తాండ్రపాపారాయుడు బతికిన బొబ్బిలి గడ్డపైనే ఓ రాజు నీతి తప్పి వ్యవహరించారని స్థానిక ఎమ్మెల్యేనుద్దేశించి ధ్వజమెత్తారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 288వ రోజు బుధవారం ఆయన విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాలన తీరును చీల్చి చెండాడారు. మహిషాసురుడు ఎక్కడ అడుగుపెడితే అక్కడ చీకటి ఆవరిస్తుందని, అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతోనే రాష్ట్రం కరువు, తుపాన్‌లతో అల్లాడుతోందని విమర్శించారు. ఈ సభలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
 

ఆ మహిషాసురుడికి ఈ నారాసురుడికి ఇదీ పోలిక 
రేపు దసరా. మహిషాసురుడు ఏ విధంగా అంతమొందాడో మనందరికీ తెలిసిన కథే. రాష్ట్రంలో పరిపాలన గురించి మాట్లాడేటప్పుడు, చంద్రబాబు పాలన గురించి మాట్లాడేటప్పుడు ఆ రాక్షసుడు మహిషాసురుడికీ ఈ చంద్రబాబుకు ఉన్న పోలిక మీకు చెప్పాలి. గతంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన మోసం చేయడానికి ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారేవాడు. దేవతలు, మనుషుల చేతిలో తనకు చావే లేకుండా ఉండాలని ఒక వరం కూడా పొందాడు. ఆ తర్వాత మహిషాసురుడు రెచ్చిపోయాడు. ప్రజలను నానా హింసలకు గురిచేశాడు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు పాలన మహిషాసురుడి పాలనను తలపిస్తోంది. చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఏ గడ్డి అయినా తినడానికి వెనకాడని వ్యక్తి. ఏపార్టీతోనైనా పొత్తు పెట్టుకోవడానికి సిగ్గు పడడు.

ఏ వ్యవస్థను మేనేజ్‌ చేయడానికైనా ఏమాత్రం మొహమాటపడడు. ఎన్ని వందల అబద్ధాలనైనా ఆడతాడు. ఎన్ని వందల అబద్ధపు హమీలైనా ఇచ్చి అధికారాన్ని మాత్రం వదులుకునేందుకు ఇష్టపడడు ఈ నారాసురుడు అనే వ్యక్తి.  మహిషాసురుడు దుర్మార్గాలు చేసేందుకు దేవుడిచ్చిన శక్తుల్ని వాడితే.. మన ముఖ్యమంత్రి చంద్రబాబు అనే నారాసురుడు ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రజల్నే పీడించారు. శాసనసభలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని సంతలో పశువుల్లా కొనుగోలు చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. మహిషాసురుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ చీకటి. మన నారాసురుడు అధికారంలోకి వస్తే చాలు ఆయనతో పాటు వచ్చేవి కరవు లేదా తుపాన్లు. ఆ మహిషాసురుడు మగువలు తననేమీ చేయలేరని చులకనగా చూసేవాడు.

  

మన నారాసురుడు మహిళలను ఇలా మోసం చేశాడు.. 
అక్కా చెల్లెమ్మలకు ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లో ఉన్న 14,206 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తానని చెప్పి ఎగ్గొట్టిన ఘనత ఈ నారాసురుడిది. మహిళా సంఘాలపై బ్యాంకు సిబ్బంది వచ్చి దాడులు చేస్తున్న పరిస్థితి. మహిళలను కోర్టు మెట్లు ఎక్కిస్తున్న పరిస్థితి. ఇదే నారాసురుడు ప్రతి అక్కచెల్లెమ్మకు రూ. పది వేలు ఇస్తామని ప్రచారం చేసుకుంటున్నాడు. మళ్లీ అదే పది వేలను అప్పుగా బ్యాంకుల చేత ఇప్పిస్తూ దానికొక పేరు పెట్టాడు. అదే పసుపు కుంకుమ. బ్యాంకులతో అప్పులు ఇప్పించి వాటి మీద వడ్డీలు వసూలు చేయిస్తున్నాడు ఈ మాయావి నారాసురుడు. 2016 అక్టోబర్‌ 16 నుంచి బ్యాంకులకు సున్నావడ్డీ కింద డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆ సొమ్మును కట్టడం పూర్తిగా మానేయడం వల్ల మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు రాని పరిస్థితిని మనం చూస్తున్నాం. అయినా ఈ పెద్దమనిషి నిస్సిగ్గుగా ఈ మాదిరిగా (ప్రకటనను ప్రజలకు చూపిస్తూ) పేపర్లలో ప్రకటన ఇస్తాడు.

ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత దారుణంగా మోసం చేస్తే ఈ ముఖ్యమంత్రి మీద ఏమి కేసు పెట్టాలని మిమ్మల్నే అడుగుతాను ఇదేమిటో చెప్పిన తర్వాత. ఆడపడుచులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రన్న పసుపు కుంకుమట ఈ ప్రకటన. స్వయం సహాయక సంఘం సభ్యులకు పసుపు– కుంకుమ కింద రూ.10 వేల బహుమతట. ఇప్పటి వరకు మూడు విడతలుగా రూ.8 వేలు ఇచ్చారట. చివరి విడతగా దసరా సందర్భంగా ప్రతి మహిళా సభ్యురాలికి రూ.రెండు వేలు విడుదలట. ఇదే ప్రకటనలో మరో పక్కన వడ్డీ రాయితీ ఉంది. వడ్డీ రాయితీ ఇప్పటి వరకు చేసింది రూ.2,514 కోట్లట. నాలుగున్నరేళ్లల్లో పసుపు కుంకుమ, వడ్డీ రాయితీల కింద చేసిన సహాయం రూ.11,118 కోట్లట. ఈ ప్రకటన చూసిన వారికెవరికైనా ఏమనిపిస్తుంది? పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు పది వేల రూపాయలు బహుమతిగా ఉచితంగా ఇచ్చినట్టు అనిపించదా? ఈ పెద్దమనిషి  పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు కట్టాల్సిన సున్నా వడ్డీకి సంబంధించిన మొత్తం ఈ నాలుగేళ్లలో పూర్తిగా కట్టేసినట్టుగా అనిపిస్తుందా లేదా?

 

40 లక్షల ఉద్యోగాలు మీకు కనిపించాయా? 
రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ అన్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఈ వ్యవసాయ రుణాల మాఫీ కథ దేవుడెరుగు.. అవి ఈవేళ వడ్డీమీద వడ్డీ పడి రూ.1,26,000 కోట్లకు చేరుకున్నాయి. కానీ ఈ పెద్ద మనిషి వ్యవసాయ రుణాలను మాఫీ చేశానని చెబుతాడు. ఈయన చేసిన మాఫీ పథకం వడ్డీలలో నాలుగో వంతుకు కూడా సరిపోలేదు. రైతులకు గతంలో వడ్డీ లేని రుణాలు వచ్చేవి. ఈ మనిషి ముఖ్యమంత్రి అయ్యాక రైతుల తరఫున బ్యాంకులకు కట్టాల్సిన డబ్బుల్ని పూర్తిగా మానేశాడు. రైతుల అప్పులు తడిసి మోపెడయ్యాయి.

ఈ పెద్దమనిషే తన హెరిటేజ్‌ షాపుల కోసం దళారీ అవతారం ఎత్తడంతో గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. మరోవైపు ఎన్నికలప్పుడు ఇంటికో ఉద్యోగం లేదా ఉపాధి అన్నాడు. లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి అని చెప్పాడు. ఇంటికో ఉద్యోగం రాకపోగా ఉన్నవి పోతున్నాయి. ఆయుష్‌లో పని చేస్తున్న వారిని తీసేస్తున్నారు. సాక్షర భారత్‌లో పని చేస్తున్న వారికి 14 నెలలుగా జీతాలు లేవు. మున్సిపల్‌ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు లేవు. చివరకు వాళ్లు సమ్మె చేస్తుంటే వాళ్లను తీసేస్తున్నారు. ఆరోగ్య శ్రీలో పని చేస్తున్న వారికి గానీ, 104 సర్వీసులో ఉన్న వారికి గానీ జీతాలు లేవు. మోడల్‌ స్కూళ్లలో పని చేస్తున్న వారికి  మూడు నెలలుగా జీతాలు లేవు. ఈ పెద్దమనిషి విశాఖపట్నంలో మీటింగ్‌లు పెట్టి 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఊదరగొడతాడు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వమే దగ్గరుండి నీరుగారుస్తోంది.  ఈ పెద్ద మనిషి తన బినామీలైన నారాయణ, చైతన్య స్కూళ్లను పెంచిపోషిస్తున్నాడు. ఆరోగ్యశ్రీ పూర్తిగా పడకేసింది. ఫోన్‌ చేస్తే 108 అంబులెన్స్‌ రాదు’ అని జగన్‌ అన్నారు.

చదువుల విప్లవాన్ని తీసుకువస్తాం 
ఇవాళ మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా? ఇంజనీరింగ్‌ చదివించాలంటే ఫీజులు ఏటా రూ.లక్షపైనే ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కేవలం రూ.30 వేలు.. రూ. 35 వేలు.  ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోక విద్యార్థుల తల్లిదండ్రులు నాలుగేళ్లలో రూ.3 లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు చేశారు. నాన్న గారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే నేను రెండడుగులు ముందుకు వేస్తాను. రేపు మీ పిల్లలను ఏం చదువులు చదివిస్తారో మీ ఇష్టం. ఎన్ని లక్షలు ఖర్చయినా ఫర్వాలేదు. నేను చదివిస్తా. అంతేకాదు.. వాళ్లకయ్యే హాస్టల్‌ ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. పెద్ద చదువులు చదవాలంటే చిట్టి పిల్లల నుంచే పునాదులు పడతాయి. అందుకే చిన్నారులను బడికి పంపే ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు ఇస్తాం. మన ప్రభుత్వం రాగానే అవసరమైన చోట ప్రభుత్వ పాఠశాలలను తెరిపిస్తాం. ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తాం. ఖాళీ టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తాం. నారాయణ, చైతన్య లాంటి స్కూళ్ల ఫీజులన్నింటినీ తగ్గిస్తాం.  

ఇవీ వాస్తవాలు.. 
నేను చూపిస్తున్న ఈ పేపరు అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్న 4002కు
లిఖిత పూర్వకంగా సంబంధిత మంత్రి ఇచ్చిన సమాధానం.
 
అంటే దీనర్థం పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని సాక్షాత్తు చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రే అసెంబ్లీకి లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానం. పేపర్లలో ఇచ్చిన ప్రకటన ప్రకారం పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు పసుపు–కుంకుమ కింద రూ.10 వేలు బహుమతిగా ఇచ్చానన్న దానికి సంబంధించిన వివరాలు ఒక్కసారి గమనించండి. ప్రతి డ్వాక్రా సభ్యురాలికి రూ.10 వేలు చొప్పున పొదుపు సంఘాల ద్వారా సంఘ నిధిని జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం సంఘ సభ్యులు అప్పులు తీసుకునేందుకు మాత్రమే ఈ నిధిని జమ చేస్తారు.  ఈ డబ్బు సంఘం నిధిలో కలిసిపోయి సభ్యులందరూ పెద్ద మొత్తంలో అప్పు తీసుకోవడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ పెద్దమనిషి ఇచ్చింది తప్పుడు ప్రకటన కాదా?  ఇదే పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల దగ్గర్నుంచి ఈ మాదిరిగా (లెటర్‌ చూపుతూ) లెటర్లు తీసుకుని చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామంటూ సంతకాలు పెట్టి ఇవ్వాలట. ఈ లెటర్లలో ఏమి రాశారంటే ఇంతకూ ఇవ్వవలసిన వడ్డీ రాయితీ మొత్తం 2,275 కోట్లు కూడా త్వరలో ఇవ్వడం జరుగుతుంది అని రాశారు. 

అంటే దానర్థం 2016 అక్టోబర్‌ నుంచి అక్కచెల్లెమ్మలకు సంబంధించిన వడ్డీ డబ్బులు కట్టలేదని ఒప్పుకున్నట్లేగా? ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తిని మహిషాసురుడు అనాలా.. నారాసురుడు అనాలా లేక 420 అనాలా?  

ఎవరి అభివృద్ధి కోసం పార్టీ మారారు? 
బొబ్బిలి నియోజకవర్గానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఆ చరిత్ర ఏమిటో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు. ఆ రోజుల్లో బొబ్బిలి కోటపై అన్యాయంగా యుద్ధం చేశారని, పరాయి సేనలతో చేతులు కలిపారని, వంచనతో తమ వారందర్నీ చంపేశారని విజయనగరం అధిపతి విజయ రామ గజపతిని.. తాండ్రపాపారాయుడు అంతం చేయడం మనందరికీ తెలిసిన కథే. చివరి క్షణాలలో తాండ్ర పాపారాయుడు విజయ రామ రాజు గజపతిని చంపుతుండగా ఆయన్ను ప్రలోభపెటాలని చూశాడు. అయినా విలువలు తప్పలేదు తాండ్ర పాపారాయుడు. ఎత్తిన కత్తిని దింపలేదు. కానీ ఇక్కడి ఇప్పటి పాలకులు ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నారు? అభివృద్ధి కోసం పార్టీని వీడానని చెబుతున్నారు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్పిందేమిటంటే.. అన్నా.. అభివృద్ధి అన్నది ఆ కుటుంబానికి జరిగిందేమో కానీ మాకు ఏమీ జరగలేదన్నా అని వాపోయారు. అభివృద్ధి కథ పక్కన బెట్టి ఇక్కడ మంత్రి పదవులు తీసుకున్న వారు చేస్తున్నదేమిటంటే ఇదే జిల్లాలో మాంగనీస్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమంగా 16 గనులకు లైసెన్సులు లేకుండా, రెన్యువల్‌ కాకుండా లక్షల టన్నుల మాంగనీస్‌ అక్రమంగా మైనింగ్‌ జరిగి తరలిపోతుంటే సాక్షాత్తు మైనింగ్‌ శాఖ మంత్రి అయిన ఈ బొబ్బిలి ఎమ్మెల్యే చూస్తూ ఉన్నారు. ఇదే పాత బొబ్బిలిలో ఎకరా కోటిన్నర రూపాయల విలువ జేసే అత్యంత విలువైన గిరిజనుల భూముల్ని లాగేసుకుంటున్న పరిస్థితి.  

ఎక్కడ చూసినా అక్రమ తవ్వకాలే 
 బొబ్బిలిలో వేగావతి, స్వర్ణముఖి చంపావతి, గోస్తనీ, నాగవళి నదుల్లో అక్రమ ఇసుక తవ్వకాలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. చెరువులు కబ్జా అవుతున్నాయి. అభివృద్ధి గురించి మాట్లాడేవారు ఒక్కసారి ఆలోచించాలి. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు తోటపల్లి ప్రాజెక్టును పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్టే కాదు విజయనగరం జిల్లా గురించి కూడా ఆ వ్యక్తి పట్టించుకున్న పాపానపోలేదు. చంద్రబాబు వదిలేసిన తోటపల్లి ప్రాజెక్టును నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యాక పరుగులు పెట్టించారు. ఆ తర్వాత చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యే నాటికి 90 శాతం పూర్తయిన ప్రాజెక్టును చంద్రబాబు పూర్తి చేయించలేక పోయారు. దీంతో 1.35 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాల్సిన ప్రాజెక్టు కేవలం 80 వేల ఎకరాలకు కూడా నీరు అందించలేని అధ్వానస్థితిలో ఉంది. వైఎస్సార్‌ హయాంలో పూర్తి అయిన పెద్దగెడ్డ ప్రాజెక్టు ద్వారా రామభద్రాపురం ప్రాంతంలో చివరి భూములకు సాగునీరు అందడం లేదని, అందుకోసం ఎడమ కాల్వ తవ్వుతామని ఇక్కడి పాలకులు హామీ ఇచ్చారు. ఆ కాల్వను తవ్వారా?  ఇదే పాలకుల హయాంలో 2002లో ప్రభుత్వ ఆధీనంలో నిజాం షుగర్స్‌ ఉండేది. నిజాం షుగర్స్‌కు చెందిన లచ్చయ్యపేట ఫ్యాక్టరీని అప్పట్లోనే కేవలం 25 కోట్ల రూపాయలకు శనక్కాయలకు, బెల్లానికి అమ్మేశారు. ఇక్కడకు వచ్చేటప్పుడు ఆ చక్కెర ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు నా దగ్గరికి వచ్చారు. వాళ్లు చెప్పిందేమిటంటే గత సంవత్సరానికి సంబంధించి ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.12 కోట్లు బకాయిలు పడిందన్నా.. ఇవాల్టికీ ఇవ్వలేదన్నా అని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేశారు.  

అయ్యా మంత్రి గారూ.. ఇదీ మీ ప్రోగ్రెస్‌ రిపోర్టు 
ఇదే బొబ్బిలిలో జూట్‌ మిల్లులు కనిపిస్తాయి. వీటిలో అతి పెద్దది శ్రీలక్ష్మీ శ్రీనివాస జూట్‌ మిల్లు. దాదాపు 2,300 మంది పని చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 2015 జనవరి 23 నుంచి పూర్తిగా మూతపడిన పరిస్థితి. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కోఆపరేటివ్‌ రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలు, డెయిరీలు, చివరకు జూట్‌మిల్లులు కూడా మూతపడతాయి. ఈ పెద్దమనిషి ముఖ్యమంత్రి కాక ముందు వైఎస్‌ హయాంలో జూట్‌ మిల్లులకు కరెంటు చార్జీ యూనిట్‌కు 3 రూపాయల 15 పైసలు ఉంటే ఈ మనిషి వచ్చాక అది ఏకంగా రూ.5.50 అయింది. ఇదే జూట్‌ మిల్లులో కార్మికులకు ఇవ్వవలసిన జీతాలు, గ్రాట్యూటి, ప్రావిడెంట్‌ ఫండ్‌ రూపంలో దాదాపు 15 కోట్ల రూపాయలు బాకాయి ఉన్నాయి. పరిస్థితి ఇంతటి దారుణంగా ఉంటే ఇక్కడి మంత్రి గారు అభివృద్ధి జరుగుతోందని చెప్పి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వెళ్లిపోయానని చెప్పుకుంటున్నారు. బాడంగి మండలం గొల్లాది వద్ద వేగవతి నదిపై బ్రిడ్జి నిర్మిస్తామని, బొబ్బిలిలో వంద పడకల ఆసుపత్ని నిర్మిస్తామని సాక్షాత్తు చంద్రబాబు నాయుడే మాట ఇచ్చారు. ఇవి మీకు ఎక్కడైనా కనిపించాయి?  బొబ్బిలిలో కనీసం రెండు రోజులకు ఒక్కసారయినా తాగు నీరు వస్తోందా? ఇదే బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్‌ హయాంలో 38,150 ఇళ్లు నిర్మిస్తే ఇవాళ ఊరికి 3, 4 ఇళ్లయినా ఇచ్చారా? అని ఇదే మంత్రిగారిని అడుగుతున్నా. అయ్యా మంత్రి గారూ.. మీ ప్రొగ్రెస్‌ రిపోర్ట్‌ ఇదీ.  
 

ఇలాంటి నాయకుడు అవసరమా? 
ఈ నాలుగున్నరేళ్ల పాలనలో మనం చూసిందేమిటంటే అబద్ధాలు, అన్యాయం, అధర్మం, అక్రమాలు, అవినీతి, మోసం. పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్లు, చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి. కింద గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలు మేస్తుంటే పైన చంద్రబాబు నాయుడు ఇసుక, మట్టి, కరెంటు కొనుగోళ్లు, గుడి భూములు, రాజధాని భూములు, చివరకు దళితుల భూములను కూడా వదిలిపెట్టకుండా దోచేస్తున్నారు. ఇలాంటి నాయకుడు అవసరమా? ఆలోచించండి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విలువలు, విశ్వసనీయత రావాలి. అది తీసుకురావడం జగన్‌ ఒక్కడి వల్ల సాధ్యం కాదు. మీ అందరి తోడు, దీవెనలు, సహకారం కావాలి.

విజయదశమి సందర్భంగా పాదయాత్రకు విరామం 
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు విజయదశమి సందర్భంగా గురువారం విరామం ప్రకటించినట్టు పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు. జిల్లా నాయకులు, కార్యకర్తలు, పాదయాత్రలో శ్రమిస్తున్న సిబ్బంది అభ్యర్థన మేరకు వారు విజయదశమి జరుపుకునేందుకు వెసులుబాటునిస్తూ తిరిగి శనివారం నుంచి యథాతధంగా యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు