కాంగ్రెస్‌తో రెండో పెళ్లికి బాబు పరుగులు

2 Sep, 2018 04:08 IST|Sakshi
విశాఖ జిల్లా చోడవరంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం. ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

నాలుగున్నరేళ్లు సంసారం చేసిన బీజేపీ మంచిది కాదట

చోడవరం సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ధ్వజం

హోదా కోసం జరుగుతున్న ఆత్మహత్యలకు బాధ్యత నీది కాదా బాబూ?

ఈ నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వ స్కూళ్లంటే భయపడేలా చేశారు

మేం అధికారంలోకి రాగానే స్కూలు, కాలేజ్‌ ఫీజులను తగ్గిస్తాం

చంద్రబాబు పాలనంతా అరాచకం.. అన్యాయం.. మోసమే..

నిరుద్యోగ భృతి పేరుతో బాబు కొత్త డ్రామా ఆడుతున్నారు

రైతుల్ని నట్టేట ముంచారు.. చక్కెర ఫ్యాక్టరీలను నష్టాల్లోకి నెట్టారు

సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని జగన్‌ స్పష్టీకరణ

ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నాలుగున్నరేళ్లు సంసారం చేసిన మొదటి భార్య (బీజేపీ) మంచిది కాదని నిందలు వేస్తూ.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి అథోగతి పాల్జేసిన కాంగ్రెస్‌తో రెండో పెళ్లికి చంద్రబాబు పరుగులు పెడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో అంతా అరాచకం, అన్యాయం, అవినీతి, మోసమేనని ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా? అని ప్రజల్ని ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి వాళ్లను బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 251వ రోజు శనివారం విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గకేంద్రంలో అశేషజనవాహినితో కిక్కిరిసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను, చక్కెర కర్మాగారాలను నిర్వీర్యం చేస్తున్న తీరును, రైతుల్ని నిట్టనిలువునా ముంచిన తీరును వివరించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించి రైతుకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీని పక్కాగా అమలు చేస్తామని, స్కూళ్లు, కాలేజీ ఫీజులను నియంత్రిస్తామని.. పిల్లల చదువుకు భరోసా ఇచ్చారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

14 మంది ఎమ్మెల్యేలతో చేసిందేమిటి?
‘‘ఎటు చూసినా ఎక్కడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. మీ అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా. నేను ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ప్రజలు నాకు చెప్పిన మాటేమిటంటే.. విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాలుంటే 2014 ఎన్నికల్లో చోడవరం సహా 12 నియోజకవర్గాలను గెలిపించి చంద్రబాబుకు ఇచ్చాం. ఇవి చాలవన్నట్టు వైఎస్సార్‌సీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి రూ.కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. వీరితో కలిపి మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు పక్కనుంటే.. ఆయన మాకు చేసిందేమిటని ఇక్కడి ప్రజలు అడుగుతున్నారు. వీళ్లు చేసిందేమైనా ఉందంటే.. అది చంద్రబాబు డైరెక్షన్‌లో మట్టినీ, ఇసుకనూ దేన్నీ వదలకుండా సర్వం దోచేస్తా ఉన్నారన్నా.. అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. బుచ్చయ్యపేట మండలం కోమళ్లపూడి, పెద్దమదీనాలోని ప్రభుత్వ భూములు కూడా వీళ్ల కళ్ల నుంచి తప్పించుకోలేకపోయాయన్నా.. పొట్టిదొరపాలెంలో దళితుల భూముల్ని కూడా వదిలిపెట్టలేదన్నా అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. దాదాపు రూ.54 కోట్లు విలువ చేసే 134 ఎకరాల భూమిని టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారని స్థానికులు చెప్పారు.

రోలుగుంట మండలం జేబీ అగ్రహారంలో కొన్ని దశాబ్దాలుగా పేద రైతులు దున్నుకుంటున్న 412 ఎకరాలకు నకిలీ పట్టాలు సృష్టించి స్వాహా చేసేందుకు ఇక్కడి ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. గజపతినగరం, జుత్తాడ, గవరవరం, గౌరీపట్నం, మంగళాపురం ఇసుక రీచ్‌లలో ప్రొక్లెయినర్లను పెట్టి వేల లారీల ఇసుకను ప్రతిరోజూ దోచుకుతింటున్నారన్నా.. అని స్థానికులు చెబుతా ఉన్నారు. ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని చంద్రబాబు చెప్పినట్టుగా పేపర్లలో చూస్తున్నామన్నా.. కానీ ఎవరికన్నా చంద్రబాబు ఉచితంగా ఇసుక ఇచ్చింది? అని ప్రశ్నిస్తున్నారు. రెండు యూనిట్ల ఇసుకను రూ.16 వేలకు అమ్ముతున్నారన్నా.. అని ఇక్కడి ప్రజలు చెబుతా ఉంటే పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడి ప్రజలు నాతో చెప్పిందేమిటంటే.. ‘అన్నా, తోటకూరపాలెంలో గ్రానైట్‌ను వదిలిపెట్టడం లేదు. దొండపూడి, వీరవల్లి తదితర ప్రాంతాల్లో అనుమతికి మించి మైనింగ్‌ చేస్తుంటే లంచాలు తీసుకుని ఎమ్మెల్యే పబ్బం గడుపుతున్నారు’ అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. నరసాపురం, లక్ష్మీపురం, పెదపూడి, తురకలపూడి, మేడివాడ, కోమళ్లపూడి సహా పలు చెరువుల్లో నీరు–చెట్టు కింద పనులు చేయకపోయినా చేసినట్లు బిల్లులు పెట్టి ఏకంగా రూ.36 కోట్లు కొల్లగొట్టారని చెబుతూ.. తెలుగుదేశం పార్టీ పాలనలో తమ పరిస్థితి ఇలా ఉందన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. 

పింఛన్ల కోసం కోర్టుకు పోవాల్సిన దుస్థితి..
పింఛన్ల మంజూరులోనూ దివ్యాంగులు, అభాగ్యులని చూడకుండా అన్యాయం చేస్తున్నారని స్థానికులు చెబతున్నారు. పెన్షన్ల కోసం కోర్టులకు పోవాల్సిన దుస్థితి. రెండు కళ్లు లేని కండిపల్లికి చెందిన సియాద్రి దుర్గాప్రసాద్, విజయరామరాజు పేటలో పోలియోతో మంచంపై బతుకీడిస్తున్న ఆళ్ల ఆశ అనే బాలిక పింఛన్లు మంజూరు కాక కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందంటే నిజంగా పాలన ఎంత దారుణంగా ఉందో చెప్పవచ్చు. పెదపూడికి చెందిన వియ్యపు సోమనాయుడు నా దగ్గరకు వచ్చాడు. వాళ్ల కుటుంబసభ్యులు చెప్పిన దాని ప్రకారం.. ఒక ప్రమాదంలో రెండు చేతులు, రెండు కాళ్లు కోల్పోయినా.. ఐతంపూడికి చెందిన దివ్యాంగుడు ఐతం శ్రీను ఎంపీడీవో కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటామంటేగానీ పెన్షన్లు ఇవ్వని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పాలన ఉంది. పెన్షన్లు కావాలన్నా ఇవ్వని పరిస్థితుల్లో ఈ పాలన ఉంటే మేము ఎవ్వరికి చెప్పుకోవాలన్నా అని వారు బాధపడతా ఉన్నారు. 

చోడవరం ఫ్యాక్టరీని వైఎస్సార్‌ లాభాల్లోకి తెస్తే.. బాబు మళ్లీ నష్టాల్లోకి నెట్టాడు
రైతులు నా వద్దకు వచ్చి అన్నా.. చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీపై దాదాపు 24 వేల మంది ఆధారపడి ఉన్నారన్నా. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీని రూ.45 కోట్ల నష్టాల్లోకి నెట్టేశారు. సహకారం రంగంలోని ఏ ఫ్యాక్టరీనీ బతకనివ్వడం లేదన్నా. నష్టాల్లోకి పోయేలా చేస్తున్నాడు. ఆ తర్వాత వాటిని తన బినామీలకు పప్పు బెల్లాల్లా.. కారు చౌకగా కట్టబెడతారన్నా అని స్థానికులు చెబుతా ఉన్నారు. గతంలో ఎంవీవీఎస్‌ మూర్తికి సహకార రంగంలోని ఫ్యాక్టరీని అప్పగిస్తే.. కోర్టుకు వెళ్లి అడ్డుకున్నామని  చెబుతున్నారంటే బాబు తీరేమిటో అర్థం చేసుకోవచ్చు. 2004లో నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత షుగర్‌ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించారు. ప్రతి రైతుకూ టన్నుకు మూడు, నాలుగు వందల రూపాయల బోనస్‌ ప్రకటించి తోడుగా నిలిచారు. చోడవరం ఫ్యాక్టరీకి ఉన్న రూ.45 కోట్ల బకాయిలను తీర్చడమే కాకుండా రూ.45 కోట్ల లాభాల్లోకి తీసుకువచ్చిన ఘనత వైఎస్సార్‌దని చెబుతూ.. మా ఖర్మ కొద్దీ చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారన్నా.. ఈ ఫ్యాక్టరీ రూ.100 కోట్ల నష్టాల్లోకి వెళ్లిందన్నా అని చెప్పారు.

టీడీపీ నేతలు దోచుకోవడమే దీనికి కారణమంటున్నారు. ఇదే ఫ్యాక్టరీలో తడిసిన చక్కెర పేరుతో.. ఎలాంటి టెండర్లు లేకుండా నామినేషన్‌ పద్ధతిలో చంద్రబాబు బినామీ అయిన సుజనా చౌదరి బంధువుకు కారు చౌకగా కట్టబెట్టారని చెబుతున్నారు. చక్కెర క్వింటాల్‌ మార్కెట్‌ ధర రూ.3 వేలు ఉంటే సుజనా చౌదరి బంధువుకు రూ.11 వందలకే కట్టబెట్టారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు బినామీలు ఈ ఫ్యాక్టరీ ఆస్తుల్ని దోచేస్తున్నారన్నా అని చెబుతున్నారు. మార్కెట్‌లో టన్ను మొలాసిస్‌ ధర రూ.6 వేలు ఉంటే చంద్రబాబు మొదలు కింది స్థాయి వరకు అందరూ లాలూచీ పడి టన్ను మొలాసిస్‌ను రూ.2,700కే కట్టబెడతా ఉన్నారన్నా అని రైతులు చెబుతున్నారు. గత మూడేళ్లలో మొలాసిస్‌ వల్ల ఈ ఫ్యాక్టరీ సుమారు రూ.20 కోట్లు నష్టపోయింది. ఇక ఈ ఫ్యాక్టరీ లాభాల బాట పట్టేదెప్పుడు? రైతులకు మేలు జరిగేదెప్పుడు? ఈ ఫ్యాక్టరీ బాగుపడాలన్నా, రైతులకు మేలు జరగాలన్నా చంద్రబాబు అనే వ్యక్తిని బంగాళఖాతంలో కలిపినప్పుడే.. అని నేను చెబుతున్నా. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ అనే నేను.. మీ అందరికి హామీ ఇస్తున్నా.. విశాఖ జిల్లాలోని కో–ఆపరేటివ్‌ రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తానని, రూ.వంద కోట్ల నష్టాల్లో ఉన్న చోడవరం ఫ్యాక్టరీని తెరిపించి రైతులకు తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా. 

రైతుల దుస్థితిని అర్థం చేసుకోలేని చంద్రబాబును ఏమనాలి?
చోడవరం ఫ్యాక్టరీకి చెరకు అమ్ముకోలేని పరిస్థితిలో ఇవాళ రైతులున్నారు. బకాయిలు ఎప్పుడొస్తాయో తెలియదు. దీంతో చెరకు అమ్ముకోలేకుండా రైతులున్నారు. రేటు లేదు.. బెల్లం తయారు చేసి అమ్ముకుందామంటే దానికీ గిట్టుబాటు ధర లేదు. అప్పులు భరించలేక వ్యవసాయం మానేస్తున్న పరిస్థితి. 2007–2008లో సీజన్‌ ముగిసే నాటికి అనకాపల్లి మార్కెట్‌కు 5.77 లక్షల క్వింటాళ్ల బెల్లం వస్తే 2017–18 నాటికి అది 3.54 లక్షల క్వింటాళ్లకు పడిపోయింది. ఈ ఏడాదీ రైతులకు ధర రాని పరిస్థితి. క్వింటాల్‌కు రూ.2,500 కూడా రావడం లేదు. ఇదే బెల్లం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ షాపుల్లో కొనాలంటే కిలో రూ.84. అంటే క్వింటాల్‌ రూ.8,400కి అమ్ముతున్నారు. రైతుల దుస్థితిని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు అనుకుంటే ఆయన్ని ఏమనాలి?

మోసం చేసేవాడు నాయకుడిగా కావాలా?
రైవాడ, పెద్దేరు, కళ్యాణపులోవ రిజర్వాయర్ల కాలువల మరమ్మతులకు నాన్న గారు అప్పట్లో రూ.48 కోట్ల నిధులు కేటాయించినా.. ఆ పనులు ఇవాల్టికీ నత్తనడకన సాగుతూనే ఉన్నాయని స్థానికులు చెబుతా ఉన్నారు. నాన్న గారి హాయంలో ఈ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు 25 వేల ఇళ్లు కట్టారని చెబుతుంటే.. ఈ చంద్రబాబు హయాంలో ఊరికి పది ఇళ్లు కూడా కట్టలేదన్నా అని ప్రజలు చెబుతున్నారు. ఇక చోడవరం, వడ్డాది సహా 25 గ్రామాలకు ఇప్పటికీ రక్షిత మంచినీటి సదుపాయం లేదు. పెద్దేరు, కళ్యాణపులోవ రిజర్వాయర్ల నుంచి పైపులైన్ల ద్వారా నియోజకవర్గంలోని గ్రామాలకు తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ పట్టించుకోలేదు. రోడ్ల పరిస్థితి మరీ అధ్వానం. నర్సీపట్నం నుంచి భీమిలీ రోడ్డు విస్తరణ చేయమని అడుగుతున్నా పట్టించుకోలేదు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ఒక్కసారి రాష్ట్రం వైపు చూడమని మీ అందర్నీ కోరుతున్నా. మోసం చేసేవాడు మనకు నాయకుడు కావాలా?

రైతుల వద్ద ఉల్లిపాయలు రూ.4 కొని హెరిటేజ్‌లో రూ.20కు అమ్ముతున్నారు..
ఇవాళ ఏ పంట వేసినా రైతులకు గిట్టుబాటు ధర లేదు. కర్నూలు మార్కెట్‌లో రైతుల నుంచి కేజీ ఉల్లిపాయలు రూ.4 చొప్పున కొంటున్నారు. నెల్లూరులో అయితే బత్తాయి టన్ను రూ.1,200 కూడా పలకడం లేదు. బెల్లం రూ.25కు కూడా అమ్ముకోలేకపోతున్నారు. రైతులు తమ ఉత్పత్తుల్ని ఇలా కారు చౌకగా అమ్ముకోవాల్సి వస్తుంటే.. మరోవైపు వాటిని కొనుక్కోవాలంటే మాత్రం మూడునాలుగింతలు పెట్టాల్సి వస్తోంది. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ షాపులో ఉల్లిపాయలు కిలో రూ.20, బత్తాయిలు కిలో రూ.45. రైతుల నుంచి కొనేది మాత్రం ఉల్లి కిలో రూ.4, బత్తాయిలు కిలో రూ.12. ఇంత దారుణంగా పాలన సాగిస్తా ఉన్నారు. గిట్టుబాటు ధర రాకపోతే ‘నేనున్నాను’ అని భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రే.. దళారీలకు నాయకుడుగా వ్యవహరిస్తే ఇక అన్నదాతలకు దిక్కెవరు? రైతులకు రుణమాఫీ కాలేదు. రూ.87,612 కోట్ల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లాడు.

ఎన్నికలు అయిపోయిన తర్వాత.. రుణమాఫీ కథ దేవుడెరుగు, చివరకు వడ్డీల్లో నాలుగో వంతు కూడా మాఫీ కానీ పరిస్థితిలో రైతులున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో రామయ్య, వడ్రమ్మ అనే దంపతులు ఆత్మహత్య చేసుకున్న తీరును పేపర్లలో చూశాం.  ఇంతకు ముందు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు, రైతన్నలకు వడ్డీలేని రుణాలుందేవి. గత ప్రభుత్వాలు వడ్డీ డబ్బులు బ్యాంకులకు చెల్లించేవి. చంద్రబాబు సీఎం అయ్యాక మాఫీ చేస్తానని చెప్పి చేయకపోవడం మోసమైతే, ఆయన బ్యాంకులకు వడ్డీ డబ్బులు కట్టకపోవడం వల్ల సున్నా వడ్డీలకు, పావలా వడ్డీలకు రుణాలు రాకుండా చేసి అన్యాయం చేశారు. 

నిరుద్యోగ భృతి పేరుతో కొత్త డ్రామా..
మరోవైపు యువతకు ఉపాధి లేదు, ఉద్యోగం లేదు. నిరుద్యోగ భృతి లేదు. బాబు రావాలంటే జాబు రావాలన్నాడు. జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికీ నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. బాబు సీఎం అయ్యి 51 నెలలు దాటింది. నెలకు రూ.2వేల చొప్పున ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.1.02 లక్షలు బాకీ పడ్డారు. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో కొత్త డ్రామా మొదలుపెట్టాడు. రాష్ట్రంలో కోటి 70 లక్షల ఇళ్లుంటే.. ఎన్నికలకు నాలుగు నెలల ముందు నెలకు వెయ్యి చొప్పున కేవలం 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నాడు. ఈ ప్రకటన చేసి మూడు నెలలు అయినా అది కూడా ఇంతవరకు లేదు. 

త్రినాథ్‌ ఆత్మహత్యకు బాబే కారణం..
ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏపీకి 15 ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తానని ఊదరగొట్టారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత దారుణంగా మోసం చేశాడు. లేని ప్యాకేజీలు ఉన్నట్లుగా భ్రమలు కల్పించారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో సంసారం చేశారు. కానీ ఏనాడు ప్రత్యేక హోదా అడగలేదు. ఇప్పుడు విడాకులు తీసుకున్నాడు కాబట్టి నేరం ఎవరో ఒకరిపై నెట్టాలి కనుక మొదటి పెళ్లాం(బీజేపీ) మంచిది కాదంటున్నాడు. వెంటనే రెండో పెళ్లాం కోసం చంద్రబాబు పరుగులు తీస్తున్నారు. ఆ రెండో పెళ్లం మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పార్టీ(కాంగ్రెస్‌). అలాంటి పార్టీతో రెండో పెళ్లికి ఈ పెద్దమనిషి పరుగులు తీస్తున్నాడు. చంద్రబాబు విశాఖలో పారిశ్రామిక సమ్మిట్లు పెట్టి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఊదరగొడుతున్నారు. అవి ఎక్కడైనా కనిపించాయా? అని మిమ్మల్ని అడుగుతున్నా. అటువంటి వ్యక్తి ధర్మ పోరాట దీక్షలంటూ డ్రామాలు ఆడుతున్నారంటే రాష్ట్రంలో న్యాయం, ధర్మం బతికే ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నా. ఈయన చేసిన మోసానికి విశాఖ జిల్లాలోని నక్కపల్లి మండలంలో త్రినాథ్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యేక హోదా సాధనలో ‘చంద్రబాబు ద్రోహి’ అని రాసి ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హోదా కోసం 2015 ఆగస్టు 9న తిరుపతిలో మునికోటి అనే వ్యక్తి మొదట ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోజే చంద్రబాబుకు జ్ఞానోదయమై, మోదీ ప్రభుత్వం నుంచి బయటకొస్తే ఈ రోజుకు హోదా వచ్చి ఉండేది కాదా? అని ప్రశ్నిస్తున్నా. త్రినాథ్‌ ఆత్మహత్యకు చంద్రబాబు కారణం కాదా అని అడుగుతున్నా?

ఏది చూసినా బాదుడే..
పోలవరం ప్రాజెక్ట్‌లో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తుంది. పునాదులు దాటని దుస్థితి. కాంట్రాక్టుల మొదలు ఇసుక, మట్టి, మద్యం వరకు, బొగ్గు నుంచి కరెంటు వరకు, రాజధాని భూములను, విశాఖ భూములను ఏదీ వదిలిపెట్టడంలేదు. అంగుళం అంగుళం చొప్పున మింగేస్తున్నారు. ఈ పెద్దమనిషి చంద్రబాబుకు దేవుడంటే కూడా భయం లేదు. లంచాలు తీసుకుని దేవుడు భూముల్నీ అమ్మేసుకుంటున్నాడు. చంద్రబాబు హయాంలో కరెంటు చార్జీలు, పెట్రోలు, డీజిల్‌ ధరలపై బాదుడే బాదుడు. పక్కరాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ప్రతి లీటర్‌ డీజిల్, పెట్రోల్‌పై రూ.6 వరకు బాదుడే బాదుడు. ఇంటిపన్నులు, స్కూల్‌ ఫీజులు, కాలేజీ ఫీజులు అన్నీ బాదుడే.

ఒక పేదవాడు తన కొడుకును స్కూల్‌కు పంపించాలంటే ఏడాదికి రూ.30 వేలు, 40 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. క్యాపిటేషన్‌ ఫీజులు, ఎగ్జామ్‌ ఫీజులుంటూ స్కూళ్లు ఎడాపెడా వసూలు చేస్తున్నాయి. చివరకు పిల్లల్ని చదివించాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇంటర్‌ ఫీజులు రూ.65 వేలు దాటుతున్నాయి. ఇక, చంద్రబాబు బినామీలైన నారాయణ, చైతన్య కాలేజీల్లో ఇంటర్‌కు రూ.1.60 లక్షలు గుంజుతున్నారు. ఇవి కాకుండా హాస్టల్‌ ఫీజులు వేరు, ఎగ్జామ్‌ ఫీజులు వేరు. వీటన్నిటినీ కలిపితే నారాయణ కాలేజీలో మన పిల్లాడు ఇంటర్‌ చదవాలంటే ఏడాదికి రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది. తన బినామీల విద్యాసంస్థల్లో పిల్లల్ని చేర్పించేందుకు.. బంగారం లాంటి ప్రభుత్వ స్కూళ్లను క్రమబద్ధీకరణ పేరిట మూసివేయిస్తున్నారు. 

బినామీల కోసం స్కూళ్లను నిర్వీర్యం చేశాడు..
20 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా ఈ పెద్దమనిషి డీఎస్సీ పెట్టనంటే పెట్టనంటాడు. మరోవైపు ఆ పిల్లల నుంచి ఫీజు వసూలు చేయడం కోసం టెట్‌–1, టెట్‌–2, టెట్‌–3 అంటాడు. ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. నిరుద్యోగుల నుంచి పరీక్ష ఫీజుల పేరుతో దోచుకోవాలన్న ఆరాటాన్ని చూస్తూ ఉన్నాం ఈ పెద్దమనిషి హయాంలో. ప్రభుత్వ స్కూళ్లలో 20వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు మధ్యాహ్న భోజన పథకం నిర్వహించే వారికి 6 నెలలుగా జీతాల్లేవు. హైస్కూళ్లలో భోజన సరుకులకు సంబంధించి 8 నెలల బిల్లులు బకాయిలున్నాయి. ఎలిమెంటరీ స్కూళ్లలో అయితే 5 నెలల బిల్లులు బకాయి పెట్టారు. ప్రభుత్వ స్కూళ్లకు మన పిల్లల్ని ఎందుకు పంపించాం రా బాబూ.. అనేలా చేసి ప్రైవేటు స్కూళ్లే దిక్కనే స్థితిలోకి తీసుకువెళుతున్నాడు ఈ చంద్రబాబు.

ప్రభుత్వ స్కూళ్లలో మార్చిలో ఇవ్వాల్సిన యూనిఫారం, పాఠ్యపుస్తకాలు ఆగస్టు వచ్చినా 20, 30 శాతం ఇవ్వలేదు. రేపు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే.. జగన్‌ అనే నేను హామీ ఇస్తున్నా... స్కూల్‌ ఫీజులు, కాలేజీ ఫీజులు తగ్గిస్తాను. ఈ పెద్దమనిషి చంద్రబాబు హయాంలో పూర్తిగా నిర్వీర్యమైన ప్రతి ప్రభుత్వ స్కూల్‌ను తెరిపిస్తా. ప్రతి ప్రభుత్వ స్కూలును ఇంగ్లీషు మీడియం స్కూలుగా మారుస్తా అని హామీ ఇస్తున్నా. అంతేకాదు ఖాళీగా ఉన్న ప్రతి టీచర్‌ పోస్టును భర్తీ చేస్తామని మాట ఇస్తున్నా. మీ బిడ్డల్ని స్కూలు పంపించినందుకు ప్రతి అక్కకు, చెల్లెమ్మకు ఏడాదికి రూ.15వేలు ఇస్తానని హామీ ఇస్తున్నా. జనాభా లెక్కల ప్రకారం 32 శాతం మందికి చదువు రాని పరిస్థితి. దీనికి కారణం.. ప్రభుత్వ స్కూళ్లును చంద్రబాబు దగ్గరుండి మూసి వేయించడం, చంద్రబాబు బినామీ స్కూళ్లలో ఫీజుల బాధుడు.. వీటికి  భయపడే చాల మంది తమ పిల్లల్ని స్కూళ్లకు పంపలేని దుస్థితి. రేపు మన ప్రభుత్వం వచ్చాక.. చదువు రాని వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకుండా.. అందరూ చదువుకునేలా చేస్తానని మాట ఇస్తున్నా. 

ఎన్ని రూ.లక్షలయినా మీ బిడ్డల్ని చదివిస్తా..
పేదరికం వల్ల పెద్ద చదువులు చదవలేని వారింట ఒక డాక్టరో, ఇంజనీరో, కలెక్టరో ఉంటే వారికి ఆసరాగా ఉంటుందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అనే గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివేలా భరోసా ఇచ్చారు. సీఎం కుర్చీలో ఉన్నది తన మనిషేనన్న భావన ఉండడంతో ప్రతి పేదవాడూ తన బిడ్డల్ని ఉన్నత చదువు చదివించారు. నాన్నగారు వెళ్లిపోయిన తర్వాత చంద్రబాబు హయాంలో ఆ పథకం పూర్తిగా నిర్వీర్యమైంది. ఇంజనీరింగ్‌ చదవాలంటే ఏడాదికి ఫీజు రూ.లక్ష అవుతుంది. చంద్రబాబు దగ్గరుండి ఇంజినీరింగ్, మెడికల్‌ కాలేజీల ఫీజులు పెంచుతున్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మాత్రం ముష్టి వేసినట్టు రూ.30 వేలు, 35 వేలు ఇస్తున్నారు. అవి కూడా ఏడాదిన్నరగా రావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులపై ఏడాదికి అదనంగా రూ.70 వేల భారం పడుతోంది. ఈ లెక్కన నాలుగేళ్లకు సుమారు రూ.3 లక్షల భారం పడుతుంది. ఇంత ఖర్చు పెట్టగలిగిన స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి? అందుకే చెబుతున్నా.. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్ని రూ.లక్షలు ఖర్చయినా మీ పిల్లల్ని ఇంజనీరు, డాక్టర్, కలెక్టరుగా చదివిస్తానని హామీ ఇస్తున్నా. 

పేదవాడికి ఆరోగ్యశ్రీ ఉండదు గానీ యనమలకు సింగపూర్‌ చికిత్సనా?
చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ పథకం అస్తవ్యస్థంగా తయారైంది. పేదవాడు వైద్యం కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి రాకూడదని.. దివంగత నేత రాజశేఖరరెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. 108కి ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లోపే కుయ్, కుయ్, కుయ్‌ అంటూ అంబులెన్స్‌ వచ్చి ఆ పేదవాడికి ఎన్ని రూ.లక్షలు ఖర్చయినా ఉచితంగా వైద్యం చేయించి ఇంటికి పంపేవారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే... విశాఖ కేజీహెచ్‌ను తీసుకున్నా, విజయవాడ ప్రభుత్వాసుపత్రిని తీసుకున్నా ఒకే బెడ్‌పై ఇద్దరిద్దర్ని పెట్టి వైద్యం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఓ బాలింత రెండ్రోజుల నుంచి ఒకే బెడ్‌పై మరో మహిళా పేషెంట్‌తో పడుకోలేక.. బెడ్‌ మీద నుంచి కిందపడి మరణించింది.

ఇంతటి దారుణమైన పరిస్థితి. ఇక ఉత్తరాంధ్రలో జ్వరాల వల్ల 200 మంది వరకు చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితిల్లో పేదవాడు అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్‌ వెళితే ఆరోగ్య శ్రీ కట్‌ అట. కానీ ఇదే చంద్రబాబు.. మంత్రి యనమల రామకృష్ణుడు పంటి చికిత్స కోసం సింగపూర్‌ వెళితే రూ.3 లక్షలు మంజూరు చేస్తాడు. ఇటువంటి వ్యక్తి పాలనను క్షమిస్తే రేపొద్దున ఏమవుతుందో తెలుసా? ఈ రాజకీయ వ్యవస్థకి అర్థం లేకుండా పోతుంది. రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ రావాలి. ఏదైనా రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళిక తీసుకొచ్చి పలానాది చేస్తామని ఆ పార్టీ నేత మైకు పట్టుకుని చెప్పి.. ఆ తర్వాత మోసం చేస్తే.. ఆ నేత తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి రావాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ రావాలి. అది ఒక్క జగన్‌ వల్లే సాధ్యం కాదు. దానికి మీ అందరి తోడు, ఆశీర్వాదం కావాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చేందుకు బయల్దేరిన మీ బిడ్డను ఆశీర్వదించాలని కోరుతున్నా’’ అని జగన్‌ పేర్కొన్నారు. 

‘‘మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మనందరం ఓటు వేసేటప్పుడు మనకు ఎలాంటి నాయకుడు కావాలో గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి. అబద్ధాలు చెప్పేవారు, మోసాలు చేసేవారు మీకు నాయకుడిగా కావాలా? నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూసి నిర్ణయం తీసుకోండి.’’ 

మరిన్ని వార్తలు