ఈ దోపిడీ పాలన ఇంకా కావాలా? 

19 Aug, 2018 03:06 IST|Sakshi
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన జనవాహినిలో ఒక భాగం. అభివాదం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ఆలోచించుకోవాలని ప్రజలను కోరిన ప్రతిపక్ష నేత  

బాబు అవినీతి పాలనపై నర్సీపట్నం బహిరంగ సభలో నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌ 

బినామీలకు కాంట్రాక్టులు.. ఖనిజ దోపిడీలో కమీషన్లు 

బాబు రాగానే జాబులు రాలేదు.. ఉన్నవి పోతున్నాయి

మధ్యాహ్న భోజన కార్మికులకూ భద్రత కరవు

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘రాష్ట్రంలో అన్యాయమైన పాలన నడుస్తోంది. ఎక్కడ చూసినా అవినీతే. భూగర్భంలోని ఖనిజాలను దోచేస్తున్నారు. కమీషన్లు తీసుకుని పంచుకుంటున్నారు. ప్రైవేటు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి అన్నం వండిపెట్టే ఆయాలనూ పీకేస్తామంటున్నారు. గిరిజనులను కూడా వదలడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే ఈ చంద్రబాబు సర్కారు అడుగడుగునా వేధిస్తోంది. పెన్షన్లు పీకేస్తోంది. ఊళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిపేస్తోంది. పన్నుల మీద పన్ను లేసి జనం నడ్డి విరుస్తోంది. నాలుగేళ్లుగా దగా, నయ వంచన, అవినీతి, అక్రమాలు చేస్తున్న ఈ చంద్రబాబు పాలన అవసరమా?’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆరు నెలల్లో ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఎలాంటి నాయకుడు కావాలో తేల్చుకోండని ప్రజలకు సూచించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 239వ రోజు శనివారం విశాఖ జిల్లా నర్సీపట్నంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

చంద్రబాబుకు బుద్ధొచ్చేలా ప్రశ్నిస్తున్నా.. 
‘‘నర్సీపట్నంలో పాదయాత్ర చేస్తుంటే ఇక్కడి వాళ్లు అన్నమాటలేంటో తెలుసా? చంద్రబాబు నాయుడికీ, ఆయన పార్టీకి ఎన్నికలప్పుడే మేం గుర్తుకొస్తామన్నా.. ఆ తర్వాత మరచిపోతారన్నా.. అని తెలిపారు. ఇదే వేదిక నుంచి మీ తరఫున చంద్రబాబు నాయుడుకు బుద్ధొచ్చేలా ప్రశ్నిస్తున్నా.. ఈ నియోజకవర్గానికి మీరు, మీ మంత్రి ఇచ్చిన హామీలు ఏమేరకు నిలబెట్టుకున్నారు? వాళ్లేం చేశారో చెప్పండని ఇక్కడి ప్రజలనూ అడుగుతున్నా.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జన్మభూమి కోసం ధర్మసాగరం వచ్చాడు. అప్పుడాయన.. నర్సీపట్నంలో సెజ్‌ పెడతానన్నాడు. పరిశ్రమలు తెస్తానన్నాడు.

ఉద్యోగాలైతే అడిగినవన్నీ ఇస్తానన్నాడీ పెద్దమనిషి. మీరే చెప్పండి. పరిశ్రమలు, ఉద్యోగాలు వచ్చాయా? నర్సీపట్నాన్ని మోడల్‌ టౌన్‌ చేస్తానన్నాడు. చేశాడా? ఈ పట్టణం పక్కనే పెదబొడ్డేపల్లి ఆశ్రమ పాఠశాలుంది. దాన్ని రెసిడెన్షియల్‌ కాలేజీగా చేస్తానని చెప్పాడు. చేశాడా? నాతవరం మండలం సరుగుడు పంచాయతీ శివారు గ్రామాల వరకూ రింగ్‌ రోడ్డు వేస్తానన్నాడు. వేశాడా? ఇక్కడి మంత్రి గారు.. నాతవరం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా చేస్తామన్నారు. చేశారా? 

అవినీతిని అడ్డుకుంటే వేధింపులు 
ఇచ్చిన హామీలన్నీ ఇలా గాలికి వదిలేసిన ఈ పెద్ద మనుషులు.. ఇక్కడ చేస్తున్న అవినీతి అంతా ఇంతా కాదు. రాష్ట్రం మొత్తం చర్చించుకునేలా ఉంది. నాతవరం మండలం సరుగుడు దగ్గర బినామీల పేరుతో లైసెన్స్‌లు తీసుకుని, పరిమితికి మించి భారీ ఎత్తున లేటరైట్‌ తవ్వకాలు చేస్తున్నారని ఇక్కడి ప్రజలు నాతో చెప్పారు. టీడీపీ నాయకులు ఇందులో ప్రతీ లారీకి 30 శాతం కమీషన్‌గా తీసుకుంటున్నారని తెలిపారు. ఈ అవినీతిని అరికట్టాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదన్నా.. గిరిజనులమైన మేమే రంగంలోకి దిగి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సొచ్చిందని చెప్పారు. ఇందుకు ప్రతీకారంగా గ్రామాల్లో పెన్షన్లు కత్తిరించారట. అవినీతిని అడ్డుకున్నందుకు సుందరకోట, అసనగిరి, భమిడికలొద్దు, ముంతమామిడి, దద్దుగుల, కొత్తసిరిపురం గ్రామాలకు కరెంట్‌ కత్తిరించారట.

ఈ అవినీతిని చూసి టీడీపీ నాయకులు సిగ్గుతో తలవంచుకోవాలి. ఇదే నియోజకవర్గంలో నీరు–చెట్టు పేరుతో వంద చెరువుల్లో పూడిక మట్టిని దోచేస్తున్నారని ప్రజలు చెప్పారు. రెండు మూడడుగుల మట్టి తీస్తే మంచి జరుగుతుందని, కానీ ఏకంగా తాటి చెట్టంత లోతుగా గుంతలు తవ్వుతున్నారని వాపోయారు. మట్టిని దోచేసుకుని ట్రాక్టర్‌ ఐదొందలకు అమ్ముకుంటున్నారని జనం చెప్పారు. మట్టిని తవ్వుకుంటూ, ప్రభుత్వం దగ్గర బిల్లులు తీసుకుంటున్నారని, ఇంతకన్నా అన్యాయమైన రాజకీయాలుంటాయా అని ప్రశ్నిస్తున్నారు.  

మంత్రి ఇలాఖాలోనే తాగునీళ్లకు దిక్కులేదు 
ఇక్కడి తాగునీటి సమస్యను ప్రజలు నా దృష్టికి తెచ్చారు. వరాహ నదిపై దుగ్గాల వద్ద నిర్మించిన ప్రాజెక్టే నర్సీపట్నం తాగునీటికి ఆధారమన్నారు. 20 ఏళ్ల క్రితం ప్రాజెక్టు ఇది.. ఇప్పుడు ఇక్కడి జనాభా 65 వేలు దాటింది.. దీంతో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నా ఈ పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. అప్పట్లో వేసిన పైపులైన్‌ తుప్పు పట్టి లీకులొస్తున్నాయని, కుళాయిల్లో బురద నీరొస్తోందని, ఆ బురద నీళ్లు కూడా రోజు విడిచి రోజు ఇస్తున్నారని వాపోయారు. తన నియోజకవర్గానికి తాగునీళ్లు కూడా ఇప్పించలేని అధ్వాన పరిస్థితిలో ఈ ప్రాంతానికి చెందిన మంత్రి ఉండటం దారుణం. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో స్థానికులు వివరించారు. మున్సిపాలిటీకి ఆనుకుని ఉన్న పెదబీడుపల్లి, బయ్యపురెడ్డి పాలెం, అప్పన్న దొరపాలెం, జోగినాథపాలెం శివార్లలోని కాలనీల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని అనేక మంది ఆవేదన వ్యక్తం చేశారు.  

చంద్రబాబు తల దించుకోవాలి.. 
చంద్రబాబు నాయుడి హయాంలో పన్నులు బాదుడే బాదుడని జనం చెప్పారు. గతంలో రూ.200 కట్టే ఇంటి పన్ను రూ.800 కట్టాల్సి వస్తోందని తెలిపారు. రూ.100 వచ్చే కరెంట్‌ బిల్లు ఇప్పుడు రూ.500 వస్తోందన్నారు. రూ.300 వచ్చే నీటి పన్ను రూ.వెయ్యి వస్తోందని కన్నీరు మున్నీరయ్యారు. ఇక్కడే 150 పడకల ఏరియా ఆసుపత్రి ఉందన్నా.. అక్కడ 19 మంది డాక్టర్లకు గాను 14 మందే ఉన్నారని, 36 మంది నర్సులుండాల్సిన చోట 25 మంది కూడా లేరని తెలిపారు. అంబులెన్స్‌ను పిలిస్తే డీజిల్‌ కూడా రోగులే చెల్లించాల్సిన దారుణమైన పరిస్థితి ఉందన్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో పరిస్థితే ఇలా ఉంటే.. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటని ఇక్కడి ప్రజలు సానుభూతి చూపిస్తున్నారు. నిజంగా చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి.
 
పేదోడి ఇల్లూ దోచేస్తావా బాబూ? 
ఊరికి నాలుగైదు ఇళ్లు కూడా కట్టలేని అధ్వానమైన పాలన రాష్ట్రంలో సాగుతోంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారి పాలనలో బయ్యపురెడ్డి పాలెం, బలిఘట్టం గ్రామాల వద్ద పేదలకు ఇవ్వడానికి 22 ఎకరాలు సేకరించారు. ఈ చంద్రబాబు సర్కారు దీన్ని పేదలకు ఉచితంగా ఇవ్వాల్సింది పోయి తనే తీసేసుకుంది. అక్కడ పేదలకు ఫ్లాట్లు కట్టిస్తానంటూ మోసం చేస్తున్నారు. ఆ పేరుతో లంచాలు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదలకు 300 అడుగుల ఫ్లాట్లు కడతారట. అడుగుకు రూ.2 వేల చొప్పున పేదలకు అమ్ముతారట. ఒక్కో ఫ్లాటు కట్టడానికి ఎంతవుతుందో బిల్డర్‌ను అడగండి. ప్రభుత్వ భూమే కాబట్టి కొనుగోలు చేయాల్సిన పనే లేదు. ఇసుక కూడా ఫ్రీగా వస్తోంది. సిమెంట్‌ సబ్సిడీకి వస్తోంది కాబట్టి ఫ్లాట్‌ కట్టడానికి అడుగుకు రూ.వెయ్యికి మించదని బిల్డర్లే చెబుతున్నారు.

ఎందుకంటే ఆ ఫ్లాట్లలో లిఫ్ట్‌ ఉండదు.. మార్బుల్‌ ఫ్లోరింగ్‌ ఉండదు కాబట్టి. కానీ చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందేంటి? అడుగుకు రూ.వెయ్యికి మించని ఫ్లాట్‌ను పేదలకు అడుగు రూ.2 వేలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. 300 అడుగుల ఫ్లాట్‌ను రూ.6 లక్షలకు అమ్ముతారట. అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షన్నర.. కేంద్ర ప్రభుత్వం రూ.లక్షన్నర ఇస్తాయట. మిగిలిన రూ.3 లక్షలు పేదల పేరుతో అప్పు రాస్తారట. అది నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లపాటు పేదలు కడుతూనే పోవాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబు నాయుడైతే, పేదవాడు మాత్రం 20 ఏళ్లు అప్పు కట్టాలా? ఇది అన్యాయం. మీ అందరికీ ఒకటే చెబుతున్నా. ఎన్నికలొస్తున్నాయి కాబట్టి ఆ ఫ్లాట్లను మీకు పంచుతారు. ఎవరూ వద్దనకండి. తీసుకోండి. రేపు మనందరి ప్రభుత్వం అధికారంలో రాగానే మీరు కట్టాల్సిన రూ.3 లక్షల అప్పును మాఫీ చేస్తాం.  

అన్నం వండిపెట్టే వాళ్లను తీసేస్తారట.. 
ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండిపెడుతున్న వారిని తొలగించి, భోజనం పెట్టే కార్యక్రమాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారు. ఈ పెద్దమనిషి ఎన్నికలప్పుడేమన్నాడు? జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. గెలిచిన తర్వాత ఆయన చేసేది ఇదీ. మధ్యాహ్న భోజన పథకానికి ఐదు నెలల నుంచి డబ్బులివ్వరు. వాళ్లకు జీతాలివ్వరు. పిల్లలకు వండి పెట్టాలని వాళ్లు సరుకులు అప్పుగా తెస్తే.. ఆ బకాయిలు ఐదు నెలలుగా పెండింగ్‌లో పెట్టాడు చంద్రబాబు. అక్కా చెల్లెమ్మలు, పిల్లల జీవితాలతో చెలగాటమాడటమే కాకుండా, వండిపెట్టే వారిని తొలగించే పరిస్థితి ఇవాళ చంద్రబాబు పాలనలోనే చూస్తున్నాం. విద్యుత్‌ బిల్లులు వసూలు చేసే ఉద్యోగులు నా దగ్గరకొచ్చి బాధలు చెప్పుకున్నారు. ప్రతీ నెల విద్యుత్‌ బిల్లులు తీస్తే మీటర్‌కు కాంట్రాక్టర్‌ తమకు రూ.1.50 ఇస్తాడని, కానీ కాంట్రాక్టర్‌కు మాత్రం ఈ ప్రభుత్వం మీటర్‌కు రూ.4.50 ఇస్తుందని వాపోయారు. మాకు రూపాయిన్నర ఇస్తూ.. మిగిలిన మూడు రూపాయలు చంద్రబాబు నాయుడి కొడుకు, కాంట్రాక్టర్‌ పంచుకుని దోచేస్తున్నారని వాళ్లు చెప్పారు.  

మీ ఆశీస్సులు, దీవెనలు కావాలి 
రాష్ట్రంలో అన్యాయమైన పాలన సాగుతోంది. మోసం, అబద్ధాలు, అన్యాయం, అవినీతితో కూడిన చంద్రబాబు పాలన ఇన్నేళ్లూ చూశారు. ఇంకో ఆర్నెల్లల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ  సందర్భంగా మిమ్మల్నో మాట అడుగుతున్నా. మీకు ఎలాంటి నాయకుడు కావాలో గుండెల మీద చేతులేసుకుని ఆలోచించండి. అబద్ధాలు చెప్పి, మోసాలు చేసేవారు నాయకుడిగా కావాలా? చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత రావాలి. ఏ నాయకుడైనా ఫలానా పని చేస్తానని చెప్పి, చెయ్యకపోతే అలాంటి వ్యక్తి రాజీనామా చేసి ఇంటికెళ్లే పరిస్థితి తీసుకురావాలి. ఈ మార్పు రావాలంటే అది జగన్‌ ఒక్కడి వల్లే సాధ్యమయ్యేది కాదు. నాకు మీ అందరి తోడు కావాలి. మీ బిడ్డకు మీ అందరి ఆశీస్సులు, దీవెనలు కావాలి. అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థ మారుతుంది’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.   

వానొస్తేనేం.. వణుకొస్తేనేం.. 
వానొస్తున్నా.. వణుకు పుడుతున్నా.. వరదొస్తున్నా సరే.. వైఎస్‌ జగన్‌ సభ కెళ్లాల్సిందే అన్నట్లుగా విశాఖ జిల్లా నర్సీపట్నం సభలో జన స్పందన కనిపించింది. నిజానికి శనివారం ఉదయం నుంచే ఈ ప్రాంతంలో వర్షం. రోడ్లన్నీ బుదరమయమ్యాయి. జగన్‌ బస చేసిన శిబిరం వద్ద పరిస్థితి మరీ ఘోరం. టెంట్‌ వద్ద అడుగు లోతు నీళ్లున్నాయి. అతి కష్టం మీద బురదలో అడుగులేస్తూనే రోడ్డు మీదకొచ్చారు. అక్కడి నుంచి దారిపొడవునా జనమే జనం. మరోవైపు జల్లులు పడుతున్నా జననేత పాదయాత్ర కొనసాగించారు. పరుగెత్తే జనం అడుగులు జారుతున్నాయి. కొంతమంది కింద కూడా పడిపోయారు.

వాళ్లు అవేవీ లెక్కజేయలేదు. పూర్తిగా తడిసిపోయిన వాళ్లు.. చాలా సేపటి నుంచి వర్షంలో తడిసి వణికిపోతున్న వాళ్లు.. మొత్తంగా ఇసుకేస్తే రాలనంత జనం నర్సీపట్నం సభాస్థలిలో కనుచూపు మేర కనిపించింది. వర్షంలో గొడుగు పట్టుకుని తదేకంగా అభిమాన నేత ప్రసంగంపైనే దృష్టి పెట్టారు. ‘ఈ వర్షం మమ్మల్నేం చేస్తుంది? ఒక్కరోజు తడిస్తే మొలకెత్తుతామా? జగనన్న చెప్పేది వినకపోతే ఎలా?’ అంటూ ఎంతో మంది ఎదురు ప్రశ్నించారు. యువత.. సభ పరిసర ప్రాంతాల్లో మిద్దెలు, మేడలు ఎక్కి జగన్‌ ప్రసంగం విన్నారు. వర్షపు చినుకులతో మెట్లు, గోడలు తడిసిపోయి జర్రున జారుతున్నా వాళ్లు పరుగులు పెట్టారు. జనం చేతులెత్తి హర్షం వెలిబుచ్చినప్పుడు వర్షపు నీరు వారి మోచేతుల మీదుగా కారుతుండటం కనిపించింది. జగన్‌ ప్రసంగం ముగిసే వరకు ఎవరూ అక్కడి నుంచి కదల్లేదు.  

మరిన్ని వార్తలు