బీసీల స్థానాన్ని  బాబు లాక్కున్నాడు

6 Apr, 2019 04:37 IST|Sakshi
చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన బహిరంగ సభకు భారీగా హాజరైన జనసందోహంలో ఓ భాగం. ప్రసంగిస్తున్న వైఎస్‌ జగన్‌

ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం 

చంద్రబాబు పాలనలో మోసపోయామని ప్రజలు చెబుతున్నారు 

కుప్పం నియోజకవర్గానికి చేసిందేమీ లేదని జనం అంటున్నారు 

బీసీ కులానికి చెందిన చంద్రమౌళిని గెలిపించండి 

ఆయనను మంత్రిగా నా క్యాబినెట్‌లో చేర్చుకుంటా.. 

సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో జగన్‌ ఎన్నికల ప్రచారం 

సాక్షి, చిత్తూరు: వెనుకబడిన తరగతుల ప్రజలు ఎక్కువగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని సీఎం చంద్రబాబు లాక్కున్నాడని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. 30 ఏళ్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న బాబు ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. జగన్‌ శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... 

నెగ్గలేమనే భయంతో చంద్రగిరి వదిలేశాడు 
‘‘కుప్పం నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న అగచాట్లు, కష్టాలను చూసినప్పుడు చంద్రబాబు లాంటి అన్యాయమైన మనిషి ప్రపంచంలోనే ఎవరూ ఉండరేమో అనిపిస్తోంది. 1978లో చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచి ఎన్నికయ్యాడు. 2,494 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. మంత్రి అయ్యాడు. మంత్రిగా ఉన్న చంద్రబాబు ఆ తర్వాత 1983లో జరిగిన ఎన్నికల్లో అదే చంద్రగిరి నియోజకవర్గంలో 17,200 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అనంతరం తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు పక్కన చేరాడు. 1985లో బాబు పోటీ చేయలేదు. 1989 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి నెగ్గలేమనే భయంతో ఆ నియోజకవర్గాన్ని వదిలేశాడు. కుప్పంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు, వారిని సులువుగా మోసం చేయొచ్చని ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు. బీసీలకు ఇవ్వాల్సిన ఈ స్థానాన్ని తానే గుంజుకున్నాడు. ఇక్కడి నుంచి 30 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా గెలిచి, పరిపాలన చేశాడు. 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కుప్పంలో చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడో ప్రజలు ఆలోచించాలి. గణేశ్‌పురం వద్ద పాలారు నదిపై పాలారు ప్రాజెక్టు నిర్మాణాన్ని బాబు పట్టించుకోలేదు. కుప్పం అభివృద్ధిపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దృష్టి పెట్టారు. పాలారు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు తమిళనాడు ప్రభుత్వంతో చేతులు కలిపి ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కేసులు వేయించాడు. 

కుప్పంలో అక్షరాస్యత 61.8 శాతమే 
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 67 శాతం మంది అక్షరాస్యులు ఉన్నారు. 30 ఏళ్లుగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అక్షరాస్యత కేవలం 61.8 శాతం మాత్రమే. ఇది సగటు కంటే చాలా తక్కువ. కుప్పంలో చంద్రబాబు ఒక డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేయలేకపోయాడు. కనీసం ఒక పాలిటెక్నిక్‌ కాలేజీ కూడా స్థాపించలేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలోనే వాటిని తీసుకొచ్చారు. 

వైద్యం పొందాలంటే అప్పులు చేయాల్సిందేనా? 
చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందకపోవడంతో ఇక్కడి విద్యార్థులు చదువులు మధ్యలోనే మానేసి, కూలీ పనుల కోసం బెంగళూరుకు వలస వెళ్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లెలోనే ప్రారంభించారు. ఈ పథకాన్ని చంద్రబాబు నీరుగార్చాడు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ అది ఏమాత్రం ఉపయోగపడడం లేదు. పక్షవాతం వచ్చి ఎంతోమంది మంచానికే పరిమితం అయ్యారు. మందుల కోసం వేలాది రూపాయలు ఖర్చవుతున్నాయి. ప్రభుత్వం వారిని ఆదుకున్న పాపాన పోవడం లేదు. అప్పుల పాలైతే తప్ప వైద్యం పొందలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు.  

అంతా ప్రైవేట్‌ పెత్తనమే 
కుప్పంలో పూల సాగు అధికంగా ఉంది. బంతి, చామంతి తదితర పూలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. ధరల్లేక పూలను రోడ్లపైనే పారబోస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ మార్కెట్‌ యార్డు లేదు. ప్రైవేట్‌ మార్కెట్‌ యార్డు కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ ఉంది గానీ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ లేదు. రైతుల కోసం కనీసం కోల్డ్‌ స్టోరేజీలు కూడా లేవు. పట్టుగూళ్లకు కూడా గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఇక్కడ బోర్ల ఆధారంగా వ్యవసాయం చేస్తున్నారు. 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా ఎక్కడా అమలు కావడం లేదు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో కరెంటు సక్రమంగా ఇవ్వలేదు. 

తప్పుడు కేసులను ఉపసంహరిస్తాం.. 
2004 కంటే ముందు చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తొమ్మిదేళ్ల పాలనలో కుప్పం నియోజకవర్గంలో కేవలం 18 వేల ఇళ్లు కట్టించాడు. చంద్రబాబు తర్వాత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇదే నియోజకవర్గంలో అక్షరాలా 43 వేల ఇళ్లు కట్టించి, పేదలకు పంపిణీ చేశాడు. 2014 నుంచి ఈ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు కుప్పంలో 5,500 ఇళ్లు మాత్రమే కట్టించాడు. పేదలపై, బీసీలపై చంద్రబాబుకు ఏమాత్రం ప్రేమ ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రజలను ఎన్నికల కోసం వాడుకోవడం తప్ప వారికి మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు. కుప్పం నియోజకవర్గంలో కొన్ని నెలలపాటు సెక్షన్‌ 30 అమలు చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేశారు. తప్పుడు కేసులు బనాయించారు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తప్పుడు కేసులన్నీ ఉపసంహరిస్తాం. కుప్పంలో ప్రభుత్వ పథకాల అమలులో పక్షపాతం చూపిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. కుప్పం మేజర్‌ పంచాయతీలో కోట్లాది రూపాయల గోల్‌మాల్‌ జరుగుతోంది. 

చంద్రమౌళిని నా క్యాబినెట్‌లో చేర్చుకుంటా
సొంత నియోజకవర్గం చంద్రగిరిలో నెగ్గలేక బీసీల సీటు కుప్పంను లాక్కున్న చంద్రబాబు గత ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్‌సీపీకి అనుకూలమైన ఓట్లను తీసివేయించాడు. ఈ ఎన్నికల్లో కూడా అదే పని చేశాడు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు 119 హామీలు ఇచ్చాడు. వాటిలో ఒక్కటైనా అమలు చేశాడా? టీడీపీ వెబ్‌సైట్‌లో ఆ మేనిఫెస్టో కనిపించకుండా మాయం చేశాడు. ఇలాంటి మోసగాడు, అన్యాయస్థుడు ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాడు. కుప్పం నియోజకవర్గం నుంచి మన పార్టీ తరపున బీసీ కులానికి చెందిన చంద్రమౌళి అనే మాజీ ఐఏఎస్‌ అధికారిని నిలబెడుతున్నాం. ఆయనకు తోడుగా ఉండండి, ఎన్నికల్లో గెలిపించండి. చంద్రమౌళిని మంత్రిగా నా క్యాబినెట్‌లో చేర్చుకుంటానని హామీ ఇస్తున్నా. 

పెద్దన్నా.. నీ పాలన వద్దన్నా 
రాష్ట్రంలో ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అన్యాయానికి గురయ్యామని, మోసపోయామని ప్రజలు చెబుతున్నారు. కుప్పం నుంచి 30 ఏళ్లు ఎమ్మెల్యేగా, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తమకు చేసిందేమీ లేదని ఈ నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. సొంత తమ్ముడినే చిన్నచూపు చూసిన చంద్రబాబు తాను ప్రజలకు పెద్దన్నగా ఉంటానని చెబుతున్నాడు, అలాంటి వ్యక్తి వల్ల ప్రయోజనం ఏమిటని కుప్పంలోని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తల్లికి నలుగురు సంతానం. అందరిలోకి పెద్దకొడుకు చంద్రబాబు. కుటుంబంలో మహిళలకు కూడా ఆస్తిపై సమాన హక్కు కల్పిస్తూ అప్పట్లో ఎన్టీ రామారావు చట్టాన్ని తీసుకొచ్చారు. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ వద్ద తన తల్లి పేరిట ఉన్న ఐదు ఎకరాల భూమి, జూబ్లీహిల్స్‌లో ఒక ఇల్లు.. వీటిని ఈ పెద్దన్న చంద్రబాబు తన చెల్లెళ్లకు, తమ్ముడికి ఇవ్వలేదు. కుమారుడు నారా లోకేశ్‌ పేరిట రాసిచ్చాడు. ఉమ్మడి ఆస్తి విషయంలో సొంత చెల్లెళ్లు, తమ్ముడికే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పెద్ద కుమారుడిగా, పెద్దన్నగా ఉంటానని అంటున్నాడు. ఇక ప్రజల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తన అన్న చంద్రబాబు తనకు అన్యాయం చేశాడని రామ్మూర్తి నాయుడు కొన్ని వందలసార్లు బహిరంగంగా చెప్పాడు.

ఆయన మనోవేదనకు గురై ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఎలా ఉన్నాడో తెలియదు. చంద్రబాబు తన సొంత తమ్ముడిని ఏ స్థాయికి తీసుకొచ్చాడో ప్రజలు గమనించాలి. సొంత అక్కచెల్లెమ్మలకు న్యాయం చేయని చంద్రబాబు ఇక రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తాడు? డ్వాక్రా సంఘాల మహిళలకు చంద్రబాబు ఎన్నో హామీలిచ్చాడు. రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా మహిళలను మోసం చేసిన ఘనత ఈ పెద్దన్న చంద్రబాబుకే దక్కుతుంది.  పసుపు–కుంకుమ పేరుతో మనకు కొత్త సినిమా చూపిస్తున్నాడు. ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని, జెండాను, గుర్తును, ట్రస్టును లాక్కున్నాడు. ఇలాంటి వ్యక్తిని నమ్మొచ్చా? సొంత బావమరిది హరికృష్ణ చనిపోయాడన్న బాధ కూడా లేకుండా ఆయన శవం పక్కనే.. తెలంగాణ ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌తో పొత్తు చర్చలు సాగించాడు. అది కుదరకపోవడంతో ఇప్పుడు తెలంగాణను బూచిగా చూపించి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను రెచ్చగొడుతున్నాడు. వీటిని నీతి నియమాలు లేని రాజకీయాలు అంటారా? లేక సిగ్గూ మానం లేని రాజకీయాలు అంటారా? ప్రజలే చెప్పాలి. సొంత కుటుంబంలోనే మోసాలు, కుట్రలు చేసిన చంద్రబాబును ఎవరైనా తమ పెద్ద కొడుకుగా, అన్నగా భావిస్తారా? 

సొంత బావమరిది హరికృష్ణ చనిపోయాడన్న బాధ కూడా లేకుండా ఆయన శవం పక్కనే.. తెలంగాణ ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌తో పొత్తు చర్చలు సాగించాడు. అది కుదరకపోవడంతో ఇప్పుడు తెలంగాణను బూచిగా చూపించి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను రెచ్చగొడుతున్నాడు. వీటిని నీతి నియమాలు లేని రాజకీయాలు అంటారా? లేక సిగ్గూ మానం లేని రాజకీయాలు అంటారా?   

మరిన్ని వార్తలు