పిల్లల జీవితాలతోనూ ఆటలా బాబూ?

4 Oct, 2018 02:37 IST|Sakshi
విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరిగిన బహిరంగ సభలో కనుచూపు మేరంత పరుచుకున్న అశేష జన ప్రవాహం. ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైస్‌ జగన్‌

నెల్లిమర్ల సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మండిపాటు 

ఉద్యోగం లేదా రూ.2 వేల భృతి ఇంటింటికీ ఇస్తానని మొండి చెయ్యి

1.70 కోట్ల ఇళ్లకుగాను కేవలం 2.15 లక్షల ఇళ్లకు మాత్రమే భృతి ఇస్తారట  

అదీ ఎన్నికలొస్తున్నాయని.. అదికూడా రూ.వెయ్యి మాత్రమేనట 

ఇచ్చే భృతి రూ.21.50 కోట్లు.. పబ్లిసిటీ ఖర్చు మాత్రం రూ.6. 40 కోట్లు

పైగా శిక్షణ పేరుతో ఒక్కొక్కరిపై రూ.12 వేలు దోచుకుంటావా? 

ఉద్యోగం మాట దేవుడెరు.. ఉద్యోగులకే భద్రత లేదు 

దళితుల భూములను మీ బినామీలు దోచేస్తున్నారు 

ఇసుక, మట్టి మొదలు అన్నింట్లోనూ దోపిడే 

కలెక్టర్ల నుంచి చినబాబు, పెదబాబు దాకా లంచాలు 

మనందరి ప్రభుత్వం రాగానే పేదలందరినీ ఆదుకుంటాం 

పోలీసులకు వారాంతపు సెలవు 

వైఎస్‌ జగన్‌ హామీ 

దేశంలో 130కి పైగా ఎయిర్‌పోర్టులుంటే అందులో 126 ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తోంది. అలాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను ఈ పెద్ద మనిషి పక్కనపెట్టారంటే ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? ఈ అవినీతిలో  సాక్షాత్తు ఇదే జిల్లాకు చెందిన, గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన అశోక్‌ గజపతిరాజు పేరు వినిపిస్తోంది. 

ఇదే పెద్దమనిషికి సంబంధించిన మంత్రిత్వ శాఖను చంద్రబాబు బరితెగించి ఇంతటి స్థాయిలో అవినీతిమయం చేస్తే నిలదీయాల్సింది పోయి, చంద్రబాబు తానా అంటే ఇతను తందానా అంటాడా? ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు ఇదే మంత్రి చంద్రబాబుకు బాకులా పనిచేశాడు. నాలుగేళ్లుగా బీజేపీతో కాపురం చేసినప్పుడు ఈ మంత్రి కేబినేట్‌ మీటింగ్‌కు వెళ్తాడు. కానీ రైల్వే జోన్,ప్రత్యేక హోదా గురించి మాత్రం అడగడు.ఇంత అన్యాయమైన మంత్రి ఉన్నాడని జిల్లా ప్రజలు బాధపడుతున్నారు.  

ఇక్కడి ఇసుక విశాఖ వెళ్తోందని, లారీరూ.30 వేలకు అమ్మకుంటున్నారని ప్రజలు చెబుతుంటే.. చంద్రబాబు మాత్రం  ఇసుక ఉచితంగా ఇస్తున్నామని చెబుతున్నాడు. మీకు ఇసుక ఉచితంగా ఇస్తున్నారా? ఎవరికిస్తున్నారో తెలుసా? చంద్రబాబు బినామీలకు. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారు. అవి చినబాబు దగ్గరకు పోతున్నాయి. అక్కడి నుంచి పెదబాబు దగ్గరకెళ్తున్నాయి. వ్యవస్థ ఇంతగా దిగజారింది.  
 
ఇవాళ ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. జేఎన్‌టీయూ లెక్చరర్లు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల సిబ్బంది. ఏఎన్‌ఎమ్‌లు, సెకెండ్‌ ఏఎన్‌ఎమ్‌లు, విద్యుత్‌ రంగంలోని కార్మికులు, మోడల్స్‌ స్కూళ్ల సిబ్బంది, ఆదర్శ రైతులు, గోపాలమిత్రలు, ఆయుష్‌ ఉద్యోగులు, వీఏవోలు, సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు, అంగన్‌వాడీలు.. ఇలా అందరిలోనూ అభద్రత నెలకొంది. ఆసుపత్రుల సర్వీసులనూ ప్రైవేటుపరం చేస్తున్నారు.   

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పిల్లల జీవితాలతో కూడా చంద్రబాబు ఆడుకుంటున్నారని, వాళ్లను అడ్డం పెట్టుకుని కుంభకోణాలు చేస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబు రాకపోతే ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల ముందు ఊదరగొట్టిన ఈ పెద్ద మనిషి.. 54 నెలలుగా ఇవ్వనే లేదని, ఇప్పుడు ఎన్నికలు మరో నాలుగు నెలలున్నాయని భృతి పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. రూ.2 వేల నిరుద్యోగ భృతి కాస్తా రూ.వెయ్యి అయిపోయిందని ధ్వజమెత్తారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 277వ రోజు బుధవారం ఆయన విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఉద్యోగాల పరిస్థితి దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగులకూ భద్రతలేని దారుణమైన పాలన సాగుతోందని నిప్పులు చెరిగారు. ఇలాంటి వ్యక్తిని ఇంకా ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

నిరుద్యోగులకు టోకరా 
ఎన్నికల ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు.  ప్రతి ఇంటికీ జాబు ఇస్తానన్నాడు. ఉపాధి ఇస్తానన్నాడు. ఈ రెండూ రాకపోతే ప్రతి ఇంటికీ రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడా? లేదా? ఆయన సీఎం అయ్యి 54 నెలలవుతోంది. ఈ లెక్కన ప్రతి ఇంటికీ 1.08 లక్షలు బాకీ పడ్డాడు. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని కేవలం 4 నెలల ముందు  ఈ పెద్దమనిషి నిరుద్యోగ భృతి అంటూ డ్రామాలు మొదలు పెట్టాడు. ఆ రూ.2 వేలు కాస్తా రూ.వెయ్యి అయింది. రాష్ట్రంలో 1.70 కోట్ల ఇళ్లకు నిరుద్యోగ భృతి అందాల్సి ఉండగా, దాన్ని కాస్తా 10 లక్షలకు తగ్గించారు. ఇప్పుడా సంఖ్య మరింత తగ్గిపోయింది. కేవలం 2.15 లక్షల మందినే ఎంపిక చేశారని పత్రికల్లో చూశాం. 2.15 లక్షల మందికి ఈయన ఇచ్చే నిరుద్యోగ భృతి నెలకు రూ. 21.50 కోట్లు. ఈ పథకం కోసం ఆయన ఎల్లో మీడియాకు ఇచ్చిన ప్రకటన ఖర్చు అక్షరాల రూ.6.40 కోట్లు. ఈయన పిల్లల జీవితాలతో ఆడుకుంటూ కుంభకోణాలు చేస్తున్నాడు. పిల్లల పేరు చెప్పి, వారికి శిక్షణ ఇస్తానంటూ ఒక్కొక్కరి పేరు మీద నెలకు రూ.12 వేలు దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పిల్లలకు ఇచ్చేది నెలకు వెయ్యి అయితే, శిక్షణ పేరుచెప్పి ఈ మనిషి దోచుకునేది నెలకు రూ.12 వేలు. 

ఉద్యోగమడిగితే అణిచివేస్తారా? 
చంద్రబాబు పాలన ఎలా ఉందంటే.. పిల్లలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి ముందుకు వస్తే రాక్షసంగా అడ్డుకుంటాడు. అనంతపురంలో లాఠీచార్జీ చేయించాడు. విజయవాడలో బయటకు వస్తే ఆంక్షలు విధించాడు. శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా శిబిరాలు తొలగించాడు. పైగా ఈ పెద్దమనిషి విశాఖలో మీటింగ్‌ పెట్టి.. ఏకంగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని ఊదర గొడుతున్నాడు. ఇవి మీకు ఎక్కడైనా కనిపించాయా? జ్యూట్‌ మిల్లులు, ఫెర్రో అల్లాయిస్,  స్పిన్నింగ్‌ మిల్లులు మూతపడుతున్నాయి. నష్టాల్లోకి వెళ్తున్నాయి. సహకార రంగంలో ఉన్న చక్కెర మిల్లులు వరసగా నష్టాల పాలవుతున్నాయి. పాలిషింగ్‌ యూనిట్లు మూతపడుతున్నాయి. ఉద్యోగాలు రావడం దేవుడెరుగు. చంద్రబాబు వచ్చాక కరెంటు రేట్లు బాదుడే బాదుడు. దీంతో ఉన్న పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి.  

పేదలకు ఇంత అన్యాయమా? 
నెల్లిమర్ల జ్యూట్‌ మిల్లు దగ్గర చిన్న చిన్న గుడిసెలేసుకున్న పేదలు నా దగ్గరకొచ్చి ఈ పాలనలో జరిగే అన్యాయం చెప్పారు.  దశాబ్దాల క్రితం ఆ భూమి  లీజుకు ఇచ్చారని, లీజు కాలం అయిపోయిందన్నారు. మిల్లు యాజమాన్యం ఆ భూములు తమవంటూ, మమ్మల్ని వెళ్లిపొమ్మంటున్నారని బావురు మన్నారు. వెళ్లగొట్టే అర్హత ఆ యాజమాన్యానికెక్కడిదని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈ తరహాలో అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణం. పక్కనే ఉన్న రామతీర్థ సాగర్‌ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి భావించారు. పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల్లోని 49 గ్రామాల్లో 8 వేల ఎకరాలకు స్థిరీకరణ జరుగుతుందని, 24,710 ఎకరాలకు  సాగునీరందుతుందని, పట్టణంలో తాగునీటి సమస్య పూర్తిగా తొలగిపోతుందని ఆయన అనుకున్నారు. ఇదే ప్రాజెక్టుకు  చంపావతిపై బ్యారేజీ కట్టి, అక్కడి నుంచి డైవర్షన్‌ కెనాల్‌ తీసుకుని కుమిలి కెపాసిటీ పెంచి రామతీర్థసాగర్‌ ప్రాజెక్టుకు రూ.220 కోట్లతో ఆయన హయాంలోనే పనులు ప్రారంభించారు. 30 శాతం పూర్తయ్యాయి కూడా. చంద్రబాబు వచ్చాడు.. ఆ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసిన ఈ పెద్ద మనిషి  ఈ ప్రాజెక్టుకు ఉన్న చిన్న టన్నెల్‌కు అనుమతులు తేవాడానికి నాలుగేళ్లు పట్టింది.  

ఇసుక మాఫియా..చినబాబు, పెదబాబుకు వాటాలు 
ఆ రోజుల్లో ఈ జిల్లాలో నాన్నగారు 23 వేల ఇళ్లు కట్టించారు. చంద్రబాబు ముఖ్యమంతి అయ్యాక ఊరికి కనీసం మూడు నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. హుద్‌హుద్‌ తుపాన్‌ వచ్చినప్పుడు అక్షరాలా 12 వేల ఇళ్లు ధ్వంసమైతే, ఒక్క ఇల్లూ కట్టిన పాపాన పోలేదని ఇక్కడి ప్రజలు చెప్పారు. ఈ పాలనలో సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని బాధపడ్డారు. నియోజకవర్గంలో ఆస్తులను మాత్రం కనికరం లేకుండా దోచేస్తున్నారన్నారని చెప్పారు. చంపావతిలో ఇసుకను ఏ మాత్రం వదలడం లేదని, డెంకాడ, లక్కపేట, ముంగినాపల్లి, నాతవలస, చొల్లంగిపేట, కోట భోగాపురం కొప్పెర్లలలో పొక్లెయిన్లు పెట్టి ఇష్టానుసారంగా ఇసుకును దోచేస్తున్నారని తెలిపారు. పూసపాటిరేగ మండలం కొవ్వాడలో దళితుల పరిస్థితి దారుణం. ఎవరైనా దళితులకు భూములివ్వాలని ఆరాటపడతారు. కానీ కొవ్వాడలో దళితుల భూములు లాక్కొని ఎమ్మెల్యే బంధువులకు చెందిన ఓ అనామక కంపెనీకి కట్టబెట్టారు. ఆ దళితులు హైకోర్టు నుంచి స్టే తెచ్చినా కనీసం పట్టించుకోని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి?  

రుణమాఫీ పేరుతో మోసం 
చంద్రబాబు రైతులను నిలువునా ముంచాడు. ఎన్నికలప్పుడు రైతులకు రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానన్నాడు. వడ్డీలో కనీసం నాల్గోవంతు కూడా మాఫీ కాని విధంగా ఉంది ఆయన రుణమాఫీ పథకం. ఆయన చేసిందేంటో తెలుసా? సున్నా వడ్డీ రుణాలు రాకుండా చేశాడు. బ్యాంకులు ముక్కు పిండి రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. అక్కచెల్లెమ్మల పొదుపు రుణాలూ ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. సున్నా వడ్డీకే డబ్బులు వచ్చే పరిస్థితి పోయి.. రూపాయిన్నర, రెండు రూపాయలు వడ్డీతో అపరాధ రుసుం కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

ఉద్యోగులకు భద్రతేది? 
చంద్రబాబు హయాంలో పని చేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు. కంటిమీద కునుకు లేదు. ఉన్న ఉద్యోగాలను ఎలా ఊడగొడదామని దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నాడు. పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్రంలో 40 వేల మంది ఉన్నారు. వారికి మంచి చేయాల్సిందిపోయి.. వారిని తొలగించి, బినామీ కాంట్రాక్టర్లకు ఇవ్వాలని, లంచాలు తీసుకోవాలని వారందరినీ తొలగించడానికి పెద్దమనిషి ముందుకు వచ్చాడు. వారు 53 రోజుల నుంచి స్ట్రైక్‌ చేస్తున్నారు. వారి ఉద్యోగాలను ఊడగొట్టడానికి జీవో 272 తెచ్చిన  ఈయన అసలు మనిషేనా? 

పేదలకందని విద్య, వైద్యం 
ఇవాళ ఇంజినీరింగ్, డాక్టర్‌ లాంటి చదువులు చదవాలంటే పరిస్థితేంటి? ఫీజులు చూస్తే ఆకాశాన్నంటుతున్నాయి. ఇంజినీరింగ్‌కు లక్షల్లో ఫీజులు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చూస్తే ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తున్నారు. అది కూడా సరిగ్గా ఇవ్వడం లేదని పిల్లలు చెబుతున్నారు. ఏడాదికి రూ.70 వేలు అదనంగా కట్టాలంటే తల్లిదండ్రులు ఇల్లు, పొలాలు అమ్ముకోవాల్సిందే. ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా పడకేసింది. హైదరాబాద్‌కి పోతే ఆరోగ్యశ్రీ కట్‌ అట. అక్కడ ఆరోగ్య శ్రీ వర్తించదంట. ఇదే జిల్లాలో 27 అంబులెన్సులుంటే 10 షెడ్డు కెళ్లాయి. ఇవాళ రేషన్‌షాపుల్లో బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. జగన్‌ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు కాబట్టి,  ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. రేషన్‌ షాపుల్లో ఇప్పుడు ముష్టేసినట్లు కందిపప్పు, చక్కెర ఇస్తున్నారు.  

పేదల భూములే టార్గెట్‌ 
భోగాపురం ఎయిర్‌ పోర్టు వస్తే మంచి జరుగుతుందనుకున్నామని, కానీ పరిస్థితి మరోలా ఉందని ఇక్కడి ప్రజలు చెప్పారు.  ఎయిర్‌పోర్టు చుట్టుపక్కలున్న మంత్రి గారు, ఎంపీగారి భూములేవీ ముట్టుకోలేదని, వాళ్లంతా అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేసుకున్నారని తెలిపారు. కానీ రైతుల భూములను మాత్రం బలవంతంగా లాక్కుని ఎయిర్‌పోర్టు కట్టాలని చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల రియల్‌ ఎస్టేట్‌ భూముల ధరలు పెంచుకుంటారు. బినామీల చేత భూములు కొనిపించుకుంటారు. వాటిని మాత్రం ముట్టకోరు. రైతుల భూములను మాత్రం లాక్కుంటారట. ఇదే ఎయిర్‌ పోర్ట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. రాష్ట్రానికి ఎక్కువ రెవెన్యూ వాటా ఇస్తామని, రాష్ట్రానికి మేలు చేస్తామని ముందుకొచ్చింది. కానీ వాళ్లకివ్వలేదు. వాళ్లకిస్తే లంచాలు రావని ఇదే పెద్దమనిషి ఆ టెండర్లను రద్దు చేశాడు. మళ్లీ టెండర్లు పిలిచి, అందులో ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అర్హత పొందకుండా నిబంధనలు పెట్టాడు. 

ఇదా గ్రామ స్వరాజ్యం? 
చంద్రబాబు హయాంలో నిన్న జరిగిన గాంధీ జయంతి చూసి ఆశ్చర్యం వేసింది. గాంధీ అంటే గుర్తుకు వచ్చేది గ్రామ స్వరాజ్యం.   చంద్రబాబు పాలనలో ఏ ఊరికెళ్లినా.. మినరల్‌ వాటర్‌ ఉండదు కానీ వీధి వీధికి, గుడి, బడి, ఇళ్ల పక్కన మద్యం షాపులు కనిపిస్తున్నాయి. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో మాఫియా నడుస్తోంది. పెన్షన్లు, మరుగుదొడ్లు.. ఏది కావాలన్నా లంచం.  పాలన ఇంత దారుణంగా ఉంది. చంద్రబాబు పాలనలో కనిపించేది మోసం, అధర్మం. మరికొద్ది నెలల్లో ఎన్నికలొస్తున్నాయి. మీకెలాంటి నాయకుడు కావాలో మీరే ఆలోచించుకోండి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ రావాలి. అది ఒక్క జగన్‌ వల్ల సాధ్యం కాదు. నాకు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. 

అన్నింటిలోనూ దోపిడే.. బాదుడే బాదుడు.. 
పోలవరం అందరికీ వరప్రసాదం. అలాంటి ప్రాజెక్టు నత్తనడకన నడుస్తోంది. పునాదులు దాటి ముందుకు కదలని పరిస్థితి. అక్కడంతా అవినీతే. ఇసుక, బొగ్గు, మట్టి, కరెంటు కొనుగోళ్లలో అవినీతి, రాజధాని భూముల్లో అవినీతి, దళితుల భూములనూ వదలడం లేదు. విశాఖ భూముల్లోనూ, గుడి భూముల్లోనూ అవినీతే. కరెంటు చార్జీలు, పెట్రోల్, డీజిల్‌ ధరలు.. ఆర్టీసీ బస్సు చార్జీలు, ఇంటి పన్నులు, స్కూళ్లు, కాలేజీల ఫీజులు.. ఏది ముట్టుకున్నా బాదుడే బాదుడు. మరోవైపు రేషనలైజేషన్‌ పేరుతో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు మూసేస్తున్నారు. 20 వేల టీచరు పోస్టులను భర్తీ చేయరు. స్కూళ్లకు మార్చిలో రావాల్సిన పుస్తకాలు.. ఆగస్టు దాటినా దిక్కులేదు. నాసిరకం యూనిఫామ్‌ ఇస్తున్నారు. దగ్గరుండి  ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను నాశనం చేసి తన బినామీ నారాయణకు మేలు చేసే పరిస్థితి తెచ్చారు. 

మధ్యాహ్న భోజనానికీ ముప్పే 
మధ్యాహ్న భోజన పథకాన్ని గొప్పగా అమలు చేస్తున్న 85 వేల మంది అక్క చెల్లెమ్మలను ఆదుకోవాల్సింది పోయి.. వారిని తీసేయడానికి, పథకాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. వారికి నాలుగు నెలలుగా జీతాల్లేవు.. కొన్న సరుకులకు బిల్లుల్లేవు. మరోవైపు చంద్రబాబు చెడిపోయిన నాసిరకం బియ్యం, కోడిగుడ్లు సరఫరా చేస్తున్నాడు. ఆ వ్యవస్థను కూడా తన బినామీలకు కాంట్రాక్టు ఇప్పించుకోవడానికి, దాంట్లో కమీషన్లకు కక్కుర్తిపడి వీరిని రోడ్డున పడేయాలని చూస్తున్నాడు. ఇవాళ ఏ ఒక్క ఉద్యోగికీ ఉద్యోగ భద్రత లేదు. కనీస పనికి కనీస వేతనం లేదు. ఫోన్‌ కొడితే 108 అంబులెన్స్‌లు రావడం లేదు. ఆ సిబ్బందిలోనూ అభద్రత.  108 వాహనాలు నాశనమైపోతున్న పరిస్థితి. టైర్లు ఉండవు, రిపేర్లు ఉండవు.. బండ్లకు కనీసం ఇన్సూరెన్స్‌ కూడా లేని పరిస్థితి. దగ్గరుండి ఆ వ్యవస్థను కుప్పకూలుస్తున్నారు. 

అక్కచెల్లెమ్మలకు చేయూతనిస్తా 
చంద్రబాబు చెప్పిన మాటలు విని పొదుపు సంఘాల అక్క, చెల్మెమ్మలు మోసపోయారు. వీరికి ఒక్క రూపాయి రుణం కూడా మాఫీ కాలేదు. గతంలో రూ.14,204 కోట్ల రూపాయల అప్పులుంటే ఇప్పుడవి తడిసి మోపెడై రూ.20,600 కోట్లకు చేరాయి. సున్నా వడ్డీ రుణాలూ ఇవ్వడం లేదు. అందుకే చెబుతున్నా.. ఎన్నికల తేదీ నాటికి పొదుపు సంఘాల రుణం ఎంత ఉందో.. ఆ మొత్తాన్ని రేపు మనందరి ప్రభుత్వం రాగానే నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తాం. అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ కుటుంబాల్లో 45 ఏళ్లు దాటిన అక్కలందరికీ తోడుగా ఉండేందుకు వైఎస్సార్‌ చేయూత పథకాన్ని తీసుకువస్తున్నాను. కార్పొరేషన్ల వ్యవస్థలో సమూల మార్పులు చేస్తాం.

45 ఏళ్లు నిండిన ప్రతి అక్కకు రూ.75 వేలు ఈ పథకం ద్వారా రెండవ ఏడాది నుంచి నాలుగు దఫాలుగా అందిస్తాం. వారిని చెయ్యి పట్టుకుని నడిపిస్తాం. గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి మీ గ్రామానికి చెందిన పది మందికి ఉద్యోగాలిస్తాం. అక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసిన వారికి 72 గంటల్లో అందేలా చేస్తాం. దీంట్లో కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడం. అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తిస్తాం. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం. ఆ ఇంటిని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్టర్‌ చేయిస్తాం. ఆ ఇంటిపై అవసరమైనప్పుడు బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకి రుణం ఇప్పించే ఏర్పాటు చేస్తాం. 2019లో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఐదేళ్లకు అంటే 2024లో మళ్లీ ఎన్నికలు వస్తాయి. ఆ రోజుకు రాష్ట్రంలో మద్యం అనేది లేకుండా చేసిన తర్వాతే మిమ్మల్ని ఓట్లు అడుగుతాను. మందు కావాలంటే స్టార్‌ హోటళ్లలోనే దొరికే పరిస్థితి తెస్తాను’’అని జగన్‌ అన్నారు.

ఆటోకు దారివ్వండన్నా.. 
జననేత పిలుపునకు వెంటనే స్పందించిన జనం
కిక్కిరిసిన జనం.. అడుగేయడమే కష్టం.. మరో పక్క వైఎస్‌ జగన్‌ ఉద్విగ్నభరిత ప్రసంగం సాగుతోంది. అదే సమయంలో ఓ గర్భిణి ఆటోలో ఆ దారిగుండా వెళ్లాల్సి వచ్చింది. ఆ దృశ్యాన్ని గమనించిన జగన్‌.. ప్రసంగాన్ని ఆపేసి మరీ స్పందించారు. కుయ్‌ కుయ్‌ మంటూ పరుగులు పెట్టే 108 తెరమరుగై ఇలా ఆటోలో ఇబ్బంది పడుతూ వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి వచ్చిందంటూ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘అన్నా... ఆటోకు దారివ్వండన్నా...’ అంటూ పదేపదే మైక్‌లో చెప్పారు. జననేత అభ్యర్థనతో అభిమానులు సైనికుల్లా క్రమశిక్షణతో పక్కకు జరిగి ఆటోకు దారి ఇచ్చారు. జననేత స్పందనపై అక్కడున్న వారందరూ హర్షం వ్యక్తం చేశారు.  

పోలీసులకు వారాంతపు సెలవు 
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ హామీ 
‘పిల్లలతో ఉన్న వారికి వారంలో ఒక్క రోజు సెలవు లేకపోతే ఎలా? వాళ్లు పిల్లలతో ఇంకెప్పుడు గడుపుతారు? కొంచెమైనా మానవత్వంతో ఆలోచించకపోతే ఎలా? 365 రోజులు విధి నిర్వహణలో ఉంటే కుటుంబం మంచి చెడ్డలు ఏంటి?’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పందించారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారంలో ఒక రోజు పోలీసులకు కచ్చితంగా సెలవు ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. నెల్లిమర్ల నియోజకవర్గం కొండవెలగాడ గ్రామంలో కొందరు కానిస్టేబుళ్లు వారి సమస్యలను జననేత దృష్టికి తీసుకువచ్చినప్పుడు జగన్‌ పైవిధంగా స్పందించారు. జననేత ప్రకటనపై పోలీసుల నుంచి హర్షం వ్యక్తమైంది.   

మరిన్ని వార్తలు