కుట్రలెన్ని చేసినా.. సడలదు నా సంకల్పం

18 Nov, 2018 04:35 IST|Sakshi
విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఒక భాగం. (ఇన్‌సెట్‌లో) ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

నా చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పరితపిస్తా

పార్వతీపురం బహిరంగ సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

నన్ను అంతమొందించాలని చంద్రబాబు కుట్ర

నాపై హత్యాయత్నం జరిగితే మా అమ్మ, చెల్లి చేయించారంటావా? 

నా పాదయాత్ర మహోన్నత రూపం దాల్చడాన్ని సహించలేకపోయారు 

ఆపరేషన్‌ గరుడ స్క్రిప్టును తెరపైకి తెచ్చి మార్చిలో కుట్రకు శ్రీకారం చుట్టారు 

నాపై హత్యాయత్నం జరిగాక నిందితుడిని సోదా చేస్తే ఎలాంటి లెటర్‌ దొరకలేదు 

సీఎం, డీజీపీలు వెంటనే మీడియా ముందుకు వచ్చి నా అభిమానే చేశారన్నారు 

10 గంటల తర్వాత.. ఇస్త్రీ చేసినట్లున్న ఓ లేఖను తెరమీదకు తెచ్చారు..   

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా నేను ఇంటికి వెళ్లానంటారు..

పోలీసులే దగ్గరుండి నేరుగా ఆస్పత్రికి తీసుకుపోయిన విషయం తెలియదా?

ఎయిర్‌పోర్ట్‌లో రెస్టారెంట్‌ చంద్రబాబు మనిషిది.. 

అతని ప్రమేయం లేకుండానే లోపలకు కత్తులు ఎలా వెళ్లాయి?..

ఈ కుట్ర మీది కాకపోతే స్వతంత్ర సంస్థ దర్యాప్తునకు ఎందుకు ఒప్పుకోవు?

మీ బండారం బయట పడుతుందనే రాష్ట్రంలోకి సీబీఐ రావద్దంటున్నావు కదా?

నాపై హత్యాయత్నం కేసులో అయితేనేమి , రాష్ట్రంలో జరిగిన అవినీతి వెనుక అయితేనేమి, దుర్మార్గాల వెనుక అయితేనేమి, చివరికి అడ్డగోలుగా కోట్ల రూపాయలు డబ్బు ఇస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికి పోయిన అంశంలోనైతే నేమి, వీటన్నింటిపైనా సీబీఐ విచారణ జరిగితే నేరుగా జైలుకు పోతావని చంద్రబాబు వణికి పోతున్నారు. దానిని మభ్య పెట్టేందుకు మోదీపై యుద్ధం అంటూ చిత్రీకరిస్తున్నావు. ఇంత కన్నా అన్యాయమైన, భ్రష్టుపట్టిన రాజకీయ నాయకుడు, నక్క జిత్తుల నాయకుడు బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు.

చంద్రబాబు వంటి దుష్ట శక్తులు ఎన్ని కుట్రలు చేసినా, ప్రజల కోసం నేను చేస్తున్న పోరాటం ఎప్పటికీ ఆగిపోదు. నా సంకల్పం సడలి పోదు. నా ఒంట్లో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకూ ప్రజల కోసం తపిస్తాను. డబ్బులు ఎలా సంపాదించాలనే ఆరాటంతో చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. డబ్బులంటే నాకు వ్యామోహం లేదు. నేను ఒకసారి ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చాక చేసే మంచిని చూసి 30 సంవత్సరాల పాటు ప్రజల గుండెల్లో ఉండాలని కోరుకుంటా. నేను చనిపోయాక కూడా మా నాన్న ఫొటోతో పాటుగా నా ఫొటో కూడా అందరి ఇళ్లలో ఉండాలనేది నా ఆరాటం.

ఇవాళ రాష్ట్రంలో ఇన్ని సమస్యలున్నా కూడా ఈ పెద్ద మనిషి ఇక్కడ కనిపించడు. టీవీల్లో, పత్రికల్లో వేరే రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులతో కనిపిస్తాడు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్‌ పార్టీతో కొత్తగా పెళ్లి చేసుకుని ‘మోదీపై యుద్ధం’అంటున్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ దేశానికి హాని అన్నాడు. మరి ఇవాళ కాంగ్రెస్‌తోనే దేశానికి రక్షణ అట. ఇంతకు ముందు సోనియాగాంధీని గాడ్సే అన్నాడు. అదే సోనియాగాంధీని ఇవాళ దేవత అంటున్నాడు. నాడు కాంగ్రెస్‌ను అవినీతి అనకొండ అన్నాడు. ఇవాళ  ‘ఆనందాల కొండ’ అట. ఇంతకు ముందు బాబు దృష్టిలో రాహుల్‌ గాంధీ మొద్దబ్బాయ్‌.. ఇవాళ మేధావి అట. 

మీ అందరి తరఫున చంద్రబాబును నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా.. అక్టోబర్‌ 25న విశాఖపట్టణం విమానాశ్రయంలో నాపై జరిగిన హత్యాయత్నం మీ కుట్రలో భాగంగా జరుగలేదా? ఇది కుట్ర కాదని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? గత సంవత్సరం నవంబర్‌ 6వ తేదీన నా పాదయాత్ర మొదలైంది. మార్చి నాటికి మహోన్నత రూపం దాల్చింది. నారాసురపాలనకు రాష్ట్రంలో ప్రజలు ముగింపు పలకబోతున్నారని సంకేతాలు రావడంతో.. సరిగ్గా అదే నెలలోనే నన్ను (జగన్‌ను) లేకుండా చేసేదానికి చంద్రబాబు బీజం వేశారు.  
– ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తన ఒంట్లో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకూ ప్రజల కోసమే పరితపిస్తానని, తనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంటి దుష్ట శక్తులు ఎన్ని కుట్రలు పన్నినా తన సంకల్పం చెదిరిపోదని, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగంగా అన్నారు. తనపై గత నెల 25వ తేదీన విశాఖపట్టణం విమానాశ్రయంలో హత్యాయత్నం తర్వాత ప్రజా సంకల్ప యాత్రను ఇటీవల పునఃప్రారంభించిన జగన్‌ 299వ రోజు శనివారం సాయంత్రం విజయనగరం జిల్లా పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. జననేతపై జరిగిన కుట్ర గురించి ఏం చెబుతారో విందామని వేలాదిగా తరలి వచ్చిన జనంతో పార్వతీపురం పాత బస్టాండు కూడలి కిటకిటలాడింది. ఒడిశా నుంచి సైతం యువకులు పెద్ద సంఖ్యలో హాజరు కావడం విశేషం. సుమారు గంటసేపు ప్రసంగించిన జగన్‌ తనపై జరిగిన హత్యాయత్నం ఉదంతాన్ని, దాని వెనుకున్న కుట్రను వివరించారు. ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. అసలు జగన్‌ అనే వ్యక్తి చేసిన తప్పేంటి? ఎందుకు అంతమొందించాలనుకున్నారు? అని సూటిగా ప్రశ్నించారు. తడి గుడ్డలతో గొంతులు కోయడమే చంద్రబాబు రాజకీయ సిద్ధాంతం అని, ఆయన అవసరమైతే ఎవరి కాళ్లు అయినా పట్టుకుంటారని, తిట్టిన నోటితోనే పొగుడుతారని మండిపడ్డారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

ఇది కుట్ర కాక మరేంటి బాబూ? 
‘‘మార్చి మాసంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా కోసం చేసిన పోరాటం ఫలితంగా మార్చి 8న చంద్రబాబు కేంద్రలోని బీజేపీ మంత్రివర్గం నుంచి వైదొలిగారు. మార్చి 22న ‘ఆపరేషన్‌ గరుడ’ అని చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఒక సినీ నటుడిని తెచ్చాడు. ఆ సినినటుడికి ఒక మీడియా అధిపతి కూడా జత కలిశాడు. ఆ సినీనటుడికి శిక్షణ ఇచ్చి అతని చేత విలేకరుల సమావేశం పెట్టించారు. ఆ వివరాలను ఎల్లో మీడియాలో విపరీతంగా ప్రచారం చేయించారు. ఆ సినీనటుడు మార్చి నెలలో చంద్రబాబు చెప్పినట్లుగానే స్క్రిప్టు చదివాడు. చంద్రబాబు చెప్పిన ఆ స్క్రిప్టు ఏమిటో తెలుసా? ప్రతిపక్ష నేత మీద దాడి జరుగుతుందట.. రాష్ట్రం అతలాకుతలం అవుతుందట.. ఫలితంగా ప్రభుత్వం కూలిపోతుందట.. ఇదంతా బీజేపీ చేయిస్తుందట.. ఇదంతా ‘ఆపరేషన్‌ గరుడ’ అట. దీనర్థం ఏమిటంటే.. ఈ హత్యాయత్నంలో  ప్రతిపక్ష నేత చనిపోతే, విమానాశ్రయం భద్రత అనేది చంద్రబాబు పరిధిలో లేని అంశం కాబట్టి తన మీదకు రాదు అని ఉద్దేశం. ఆ హత్యాయత్నం కనుక విఫలం అయితే అది ఆపరేషన్‌ గరుడ అని చెప్పేయొచ్చని కుట్ర పన్నడం నిజం కాదా? హత్యాయత్నం జరిగి గంటసేపైనా కాకుండానే డీజీపీ, హోం మంత్రి, ఇతర మంత్రులూ ముందుకు వచ్చి చంద్రబాబు గారి స్క్రిప్టును చదివారు.

హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి జగన్‌ అభిమానేనంటూ తప్పుడు ప్రకటనలు చేశారు. అయ్యా.. చంద్రబాబూ.. అభిమాని అని నువ్వే చెబుతున్నావు. జగన్‌ ముఖ్యమంత్రి అయి గొప్పగా పని చేయాలని కూడా ఆ వ్యక్తి అనుకున్నాడన్నావ్‌.. మరి జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక చాలా గొప్పగా పరిపాలన చేయాలనుకునే వ్యక్తి ఎందుకు జగన్‌ను చంపడానికి ప్రయత్నిస్తాడు? ఘటన జరిగిన గంట లోపే చంద్రబాబు తప్పుడు ప్రకటనలు చేయించాడు. జగన్‌ అభిమాని అని తన వాళ్లతో ఒక ఫ్లెక్సీని కూడా విడుదల చేయించాడు. వాళ్లు విడుదల చేసిన ఆ ఫ్లెక్సీలో పైభాగంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి , వైఎస్‌ విజయమ్మల ఫొటోలు ఉండవు. పై భాగంలో ఉన్నదేమిటంటే ఓ గరుడపక్షి ఫొటో.

అందులో ఓ వైపున దాడి చేసిన వ్యక్తి ఫొటో, మరో వైపు నా ఫోటో. నాపై హత్యాయత్నం జరిగాక అక్కడే ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు.. వీఐపీ లాంజ్‌లో ఉన్న 30 మంది మధ్యలోనే నిందితుడిని పట్టుకుని అతని జేబులో ఇంకా ఏమైనా ఉన్నాయా? అని వెదికారు. అప్పుడు ఎలాంటి లేఖ కనిపించలేదు. కానీ డీజీపీ మాత్రం ఒక లేఖ ఉన్నట్లు చెప్పారు. అది కూడా గంటలోపే చెప్పారు. కానీ ఆ లేఖను ఆ గంటలోపే విడుదల చేయలేదు. పది గంటల తర్వాత విడుదల చేశారు. ఆ లేఖలో ఏముందో తెలుసా? అందులో రెండు మూడు రకాల చేతి రాతలు ఉండటం ఆశ్చర్యం. పైగా ఆ లేఖ మీద మడతలు కూడా లేవు. ఇస్త్రీ చేసినట్లు ఉంది. ఇవన్నీ మీకు కుట్రగా కనిపించడం లేదా చంద్రబాబూ?  

ఆ రోజు నీకు సీబీఐ ముద్దు.. ఈ రోజు వద్దంటావా?
హత్యాయత్నం జరిగిన వెంటనే ఎవరి మీదా నేను అభాండాలు వేయలేదు. ఎందుకంటే తొందరపడి ఎవరిమీదైనా అభాండాలు వేయడం తప్పు అని భావించాను. డ్రామాలు అంతకన్నా చెయ్యలేదు. రక్తంతో తడిసిన నా షర్టును అక్కడ ప్రథమ చికిత్స చేసినప్పుడు మార్చుకున్నాను. అధైర్యపడకండి.. నేను బాగానే ఉన్నాను.. అని ప్రజలకు తెలియజేస్తూ ఒక ట్వీట్‌ చేయండని మా వాళ్లకు చెప్పాను. పొడిచిన ఆ కత్తికి ఏదైనా విషం పూసి ఉందేమో.. హైదరాబాద్‌లో అయితే మెరుగైన వైద్యం లభిస్తుందని భావించాను. అప్పుడే విమానం ఎక్కడానికి ఫైనల్‌ కాల్‌ రావడంతో  విమానం ఎక్కి నేను నేరుగా హైదరాబాద్‌కు వెళ్లాను. అక్కడ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లాను.

అలా నేను వెళ్లడాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేశాడు. విలేకరుల సమావేశం పెట్టి ఆయన చెప్పిందేమిటో తెలుసా? నేను నేరుగా ఎయిర్‌పోర్టు నుంచి ఆసుపత్రికి పోలేదట. ఇంటికి వెళ్లానట.. బీజేపీ వాళ్లు నాతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత నేను ఆసుపత్రికి వెళ్లానట. ఇంత దారుణంగా ఈ పెద్దమనిషి అబద్ధాలాడాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారే హత్య చేయించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఇతనే దర్యాప్తు చేస్తాడు. నిజంగా ఇందులో న్యాయం జరుగుతుందా? ఎయిర్‌పోర్టులో నాపై హత్యాయత్నం కుట్ర నువ్వు (చంద్రబాబు) చేయక పోతే స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఎందుకు ఒప్పుకోవడం లేదు?  ఆరోజు నాపై కేసుల విషయంలో కేవలం ‘ఓదార్పు..’ అనే ఒక్క మాట కోసం నేను కాంగ్రెస్‌తో విభేదిస్తే.. ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో నువ్వు కుమ్మక్కు అయి మీరిద్దరూ కలిసి నామీద కేసులు పెట్టి సీబీఐ ఎంక్వయిరీ వేయించారు. ఆ రోజు నీకు సీబీఐ ముద్దు.. కానీ ఈ రోజు రాష్ట్రంలో సీబీఐ వద్దంటావా? రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టకూడదని ఏకంగా జీవోనే జారీ చేశావు.  

తడి గుడ్డలతో గొంతు కోస్తారు.. 
2014 ఎన్నికల్లో జగన్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓట్లేసినట్లేనని చంద్రబాబు అన్నాడు. ఇవాళ జగన్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే అంటున్నాడు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో ఇప్పటికే ఉన్న పార్టీలన్నింటి వద్దకు వెళ్లి కలుస్తున్నాడు. వీళ్లంతా బీజేపీ వ్యతిరేక కూటమిగా ఇప్పటికే ఉన్నారు. ఇవాళ కొత్తగా వీళ్లందరినీ ఈయనే ఏకం చేస్తున్నట్లుగా పోజులిస్తున్నాడు. మోదీ పాలనతో జనం విసుగెత్తి పోయారని ఈయన ధర్మపోరాటాలు చేస్తున్నాడట. ఈయన ధర్మం వైపు నిలబడి ఉన్నాడు కాబట్టి, ఆ ధర్మ పోరాటానికి జాతీయ పార్టీలన్నింటినీ తీసుకు రావడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈయన పిలుస్తాడట. వాళ్లంతా (జాతీయ పార్టీల నేతలు) వస్తారట. చంద్రబాబు పిలిస్తే గంగిరెద్దుల్లా తలూపుతూ వచ్చే ఆ జాతీయ పార్టీలను అడుగుతున్నా.. ఇదే రాష్ట్రంలో చంద్రబాబు 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లుగా కొన్నాడు. రాజ్యాంగానికి తూట్లు పొడిచాడు.

ఇటువంటి వ్యక్తి చేసేది ధర్మపోరాటంగా మీకు కనిపిస్తోందా? ఇదే రాష్ట్రంలో దేశంలో ఎక్కడా జరగని విధంగా చంద్రబాబు మంత్రివర్గంలో నలుగురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలను బర్తరఫ్‌ చేయకుండా, అనర్హులుగా ప్రకటించకుండా వారిలో నలుగురిని మంత్రులుగా చేసి కొనసాగిస్తుంటే.. ఆయన దీక్షలకు నిస్సిగ్గుగా వస్తారా? చంద్రబాబు రాజకీయ సిద్ధాంతం ఏమిటో తెలుసా? తిట్టిన నోటితోనే పొగడటం. తడి గుడ్డలతో గొంతులు కోయడం.  సిగ్గూ, శరమూ రెండూ లేవు. ఎవరి కాళ్లైనా పట్టుకోవడమే చంద్రబాబు రాజకీయ సిద్ధాంతం. ఇలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటేనే మన మనసుకు బాధ కలుగుతుంది. తాను రాజకీయంగా ఎదగడం కోసం పోటీలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నాయకుడైనా సరే తొలగించడానికి  ఏ మాత్రం వెనుకాడని మనస్తత్వం గల వ్యక్తి చంద్రబాబు. అయ్యా చంద్రబాబూ.. ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్‌ అనే వ్యక్తి చేసిన తప్పేంటి? నువ్వు చేస్తున్న అన్యాయమైన పాలన గురించి మాట్లాడటమా? ప్రజల తరఫున పోరాటం చేయడమా? అందుకే ప్రతిపక్ష నాయకుడు జగన్‌ను మట్టు పెట్టడానికి ప్రయత్నించావా? 

నాకున్న మొత్తం సెక్యూరిటీ అంతా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వారే. నేను వస్తున్నా.. వెళుతున్నా.. నా ముందు పెట్రోలింగ్‌ కారు ఉంటుంది. ఆ పోలీసు కారే నన్నుతీసుకెళ్తుంది. ఆ పోలీసు వారే నన్ను నేరుగా హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్లిన విషయం నిజంగా నీకు తెలియదా చంద్రబాబూ? కానీ చంద్రబాబు విలేకరుల సమావేశం పెట్టి కుట్రను తప్పుదోవ పట్టించేందుకు వెకిలి నవ్వులు నవ్వుతాడు. 

నేను విశాఖ జిల్లాలో ఆగస్టు నెలలో అడుగు పెట్టాను. అప్పుడే ఆ ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు ఆగిపోయాయి. అవి మూడు నెలల నుంచీ ఆగిపోయే ఉన్నాయని చంద్రబాబు గారికి సంబంధించిన మనుషులు ఇవాళ చెబుతున్నారు. అయ్యా చంద్రబాబు గారూ.. ఇది మీకు కుట్రగా అనిపించడం లేదా? చంద్రబాబు చేసిన అత్యంత హేయమైన, బాధ కలిగించిన పని ఏమిటో తెలుసా? ఈ పెద్దమనిషి కుట్ర చేసి, ఆ కుట్ర మా అమ్మ (విజయమ్మ), మా చెల్లి (షర్మిల) చేసిందని చెప్పిస్తాడు. ఒక చెల్లిని, ఒక అమ్మను ఈ స్థాయిలోకి దిగజార్చిన ఈయన అసలు మనిషేనా?

జంఝావతి కోసం ఒడిశా సీఎంను మాత్రం కలవరు.. 
జంఝావతి ప్రాజెక్టును దివంగత మహానేత రాజశేఖరరెడ్డి గారు ఎవరూ ఆలోచించని విధంగా రబ్బరు డ్యామ్‌తో నిర్మించారు. ఆయన చనిపోయాక ఇవాళ ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పాదయాత్రలో ప్రజలు నాతో చెప్పుకొచ్చారు. చంద్రబాబు స్పెషల్‌ ఫ్లైట్‌ వేసుకుని తిరుగుతూ  సీఎంలను కలుస్తున్నారు కానీ, జంఝావతి ప్రాజెక్టు కోసం పక్కనే ఉన్న ఒడిశా సీఎంను కలవలేదన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన పనులు పూర్తి చేసి ఉంటే 24 వేల ఎకరాలకు సాగునీరందేది. తోటపల్లి ప్రాజెక్టును దివంగత వైఎస్సార్‌ గారు 90 శాతం పూర్తి చేస్తే, మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేని అధ్వాన పాలన ప్రస్తుతం సాగుతోందని రైతులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని లచ్చయ్యపేట చక్కెర ఫ్యాక్టరీని చంద్రబాబు సెనక్కాయలకు, పప్పుబెల్లాలకు ఎన్‌సీఎస్‌ అనే ప్రైవేటు సంస్థకు అమ్మేశారు. పార్వతీపురం మున్సిపాల్టీలో మూడు రోజులకొకసారి తాగునీరొస్తున్నా పట్టించుకోని పరిస్థితి. ఇక్కడి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు దోపిడీ బాగా చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. అన్ని పోస్టులనూ అమ్ముకుంటున్నారు.  

హాయ్‌ల్యాండ్‌ అగ్రిగోల్డ్‌ ఆస్తి కాదట.. 
ఈ ప్రాంతంలో అగ్రిగోల్డ్‌ బాధితులు చాలా ఎక్కువ. బాధితులకు తోడుగా నిలవాల్సిన ఇదే ప్రభుత్వం వారిని మోసం చేస్తోంది. అగ్రిగోల్డ్‌కు చెందిన విలువైన ఆస్తులన్నింటిని చంద్రబాబు బినామీలు, ఆయన కుమారుడు లోకేశ్‌ కాజేస్తున్నారు. ఆగ్రిగోల్డ్‌ ఆస్తులను తగ్గిస్తూ బాధితుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అగ్రిగోల్డ్‌కు చెందిన ఆస్తుల్లో హాయ్‌ల్యాండ్‌ భూములు అత్యంత విలువైనవి. వీటి కోసం చంద్రబాబు ఆడుతున్న కొత్త డ్రామా ఏమిటో తెలుసా? ఈ భూములు అసలు అగ్రిగోల్డ్‌వే కావట. హాయ్‌లాండ్‌ ఎండీ ఆలూరి వెంకటేశ్వరరావును ఎందుకు అరెస్ట్‌ చేయలేదని జడ్జి సీఐడీ అధికారులను ప్రశ్నిస్తే, గవర్నమెంట్‌ ప్రాసిక్యూటర్‌ ఎమన్నాడో తెలుసా? అతను నిందితుడు కాదు కాబట్టి అరెస్ట్‌ చేయలేదని సీఐడీ వారు చెబుతున్నారన్నారు. దోషులను తప్పించేందుకు ఏ స్థాయిలో పన్నాగం పన్నారో ఇంతకంటే నిదర్శనం అవసరమా? 

అబద్ధాలు.. అవినీతి.. మోసం 
రాష్ట్రం మొత్తం ఈవాళ కరవు కాటకాలతో అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదు. ఆయన రెయిన్‌ గన్‌లు ఏమయ్యాయో! పట్టిసీమ నీళ్లేమయ్యాయో! రాష్ట్రంలో 507 మండలాల్లో తీవ్ర కరువు ఉంటే కేవలం 328 మండలాల్లో మాత్రమే కరువు ఉందంటున్నారు. ఖరీఫ్‌లో కరువు కారణంగా రైతులు నష్టపోయారని చెప్పి ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.2 వేల కోట్లు ఇవ్వాలని లెక్కలు తేల్చారు. ఇవాళ రబీ కూడా సగం అయిపోయినా ఆ డబ్బులివ్వలేదు. రుణాలు రీషెడ్యూల్‌ చేయలేదు. రుణాలపై వడ్డీ మినహాయింపు కూడా జరగలేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గడ్డి తింటున్నావని అడుగుతున్నా. దారుణంగా పోలవరాన్ని దోచేస్తున్నందున ఆ ప్రాజెక్టు ముందుకు సాగని పరిస్థితి. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని  ఇదివరికే శంకుస్థాపన చేసిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి మళ్లీ ఇవాళ టెంకాయ కొట్టాడు. నాలుగున్నరేళ్లుగా బాహుబలి, జపాన్, సింగపూర్‌ అంటూ రాజధాని అమరావతి గ్రాఫిక్స్‌ చూపిస్తూనే ఉన్నాడు.

అక్కడ శాశ్వత నిర్మాణాలకు ఒక్క ఇటుకా పడలేదు. రుణాలు మాఫీ కాక రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే వారు సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు. తన హెరిటేజ్‌ సంస్థ కోసం ఈ పెద్దమనిషే దళారి అయినందున ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. నిరుద్యోగులకు చెవిలో పూవులు పెట్టారు. అన్నింటా బాదుడే బాదుడు. ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. రేషన్‌ షాపులో బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు మాఫియాగా మారాయి. అన్నింటికీ లంచాలే.  ఊళ్లలో వీధి వీధినా బెల్టు షాపులే. ఇటువంటి అన్యాయమైన పాలన పోవాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. ఇది జరగాలంటే ఒక్క జగన్‌ వల్లే సాధ్యం అయ్యేది కాదు. నాకు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. ఈ కుట్ర కోణం గురించి చెప్పేటప్పుడు నా మనసు కూడా కలత చెందింది. ఇవాళ బాగా ఆలస్యం అయింది కాబట్టి నవరత్నాలు గురించి వచ్చే సభలో చెబుతాను’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.  

నేటితో 300 రోజులు 
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాహితం కోసం వజ్ర సంకల్పంతో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో (ఆదివారం) 300 రోజుల మైలు రాయిని అధిగమించనుంది. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ వద్ద గత ఏడాది నవంబర్‌ 6వ తేదీన చేపట్టిన పాదయాత్ర 11 జిల్లాలు దాటుకుని ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఊరారా జననేతకు జనం బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ.. సర్కారు బాధితులకు భరోసా కల్పిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 25న విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన విషయం విదితమే. కొద్ది రోజుల విరామం తర్వాత గత సోమవారం నుంచి ఆయన తన యాత్రను పునఃప్రారంభించారు. అశేష జన సందోహం, అపూర్వ ఆదరణలతో జనం మధ్య సాగుతున్న జగన్‌ యాత్రకు రోజు రోజుకూ రెట్టించిన రీతిలో జనం నుంచి మద్దతు లభిస్తోంది.

మరిన్ని వార్తలు