బడుగు, బలహీన వర్గాలకు బాసట

27 Nov, 2017 01:16 IST|Sakshi
ఆదివారం కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్లలో జరిగిన బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌

     బీసీల ఆత్మీయ సదస్సులో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పునరుద్ఘాటన

     చంద్రబాబు నాయుడు బీసీలను దగా చేశారు  

     సబ్‌ప్లాన్‌కింద నాలుగేళ్లలో రూ.9 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు   

     ప్రతి జిల్లాలో పార్టీ తరఫున బీసీ కమిటీలు వేస్తాం  

     వారి సమస్యలు తెలుసుకుని నివేదిక రూపొందిస్తాం  

     బీసీ గర్జన సభ నిర్వహించి, బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తాం  

     కర్నూలు లేదా అనంతపురం జిల్లా నుంచి బోయలకు ఎంపీ టికెట్‌

ప్రజాసంకల్ప యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బడుగు, బలహీన వర్గాలకు బాసటగా నిలుస్తుందని, ఆయా వర్గాల సంక్షేమం కోసం బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి బలహీనవర్గాల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలను అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఓట్లు దండుకోవడానికి బీసీలకు ఎన్నో వరాలిచ్చిన చంద్రబాబు నాయుడు వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. 

జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఆదివారం 18వ రోజు కర్నూలు జిల్లా పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా కోడుమూరు మండలం గోరంట్లలో బీసీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసాలను ఏకరవు పెట్టారు. వారి కష్టాలు, ఆవేదనను విన్న జగన్‌ చలించిపోయారు. బీసీలకు తాము అండగా ఉంటామని చెప్పారు. ఈ సదస్సులో జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే... 

20% నిధులు కూడా ఇవ్వలేదు.. 
‘‘నాలుగేళ్ల చంద్రబాబు పాలనను చూశాక మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చారా? లేదా? అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎన్నికలప్పుడు మాటలు చెప్పి, ఆ తర్వాత మోసం చేయడం ధర్మమేనా? బీసీ–బిలో ఉన్న కురుమలు, వాల్మీకులు/బోయలను ఎస్టీలుగా... రజకులను ఎస్సీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గద్దెనెక్కాక హామీలను అటకెక్కించడం న్యాయమేనా? బీసీల అభివృద్ధి కోసం సబ్‌ప్లాన్‌ కింద ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తానని చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పారు. ఈ లెక్కన నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు ఇవ్వాలి. వాస్తవానికి రూ.9 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. అంటే 20 శాతం కూడా ఇవ్వలేదు. ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకా కొనసాగితే విశ్వసనీయత అనే పదానికి అర్థం ఉండదు. మోసం చేసిన చంద్రబాబు లాంటి వ్యక్తులను ఇంటికి పంపించే రోజులు రావాలి. చంద్రబాబును ఇలాగే వదిలేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంటికీ కారు, కిలో బంగారం ఇస్తామని చెప్పేందుకు సైతం వెనుకాడరు.  

ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లు ఇస్తేనే బీసీలపై ప్రేమ ఉన్నట్లా?
నాలుగు ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లు ఇచ్చేస్తే బీసీలపై ప్రేమ ఉన్నట్లా? చంద్రబాబు తీరు చూస్తే అలాగే ఉంది. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి బీసీ కుటుంబానికి లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను అమలు చేశారు. బీసీ విద్యార్థులు ఎంతవరకు చదువుకున్నా ఫీజులు వంద శాతం కట్టడానికి ముందుకొచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి ఎంతో మందిని డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి తూట్లు పొడిచారు. ఫీజులను విపరీతంగా పెంచేసి పేద పిల్లలను చదవులకు దూరం చేశారు. ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని, స్కాలర్‌షిప్‌లు రావడం లేదని పాదయాత్రలో పలువురు విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. మనం అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తాం. ప్రతి తల్లికీ ఒకే మాట చెబుతున్నాం. మీ పిల్లలను స్కూళ్లకు పంపించండి. పంపించినందుకే ఏడాదికి రూ.15 వేలిస్తాం. కాలేజీ ఫీజులు ఎంతున్నా భరిస్తాం. ఉండటానికి, తినడానికి అయ్యే ఖర్చు కింద ఏడాదికి రూ.20 వేలు  ఇస్తాం. 

‘108’ తరహాలో ‘102’ తీసుకొస్తాం..
కురుమ సోదరులు పాదయాత్రలో నన్ను కలిశారు. దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో గొర్రెలకు ఇన్సూరెన్స్‌ ఉండే దని, గొర్రెలు చనిపోతే బీమా అందేదని చెప్పారు. చంద్రబాబు వచ్చాక బీమా రావడం లేదన్నారు. మీరేం భయపడకండి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే... గతంలో ‘108’, ‘104’లకు ఫోన్‌ చేయగానే అంబులెన్స్‌లు వచ్చిన విధంగానే ‘102’ను తీసుకొస్తాం. ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి గొర్రెలు, ఆవులను రక్షించుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు లేదా అనంతపురం జిల్లా నుంచి బోయ వర్గానికి ఒక ఎంపీ టికెట్‌ కేటాయిస్తాం. పాదయాత్ర ముగిసేలోగా ప్రతి జిల్లాలో కనీసం నాలుగు చొప్పున పార్టీ తరఫున బీసీ కమిటీలు వేస్తాం. బీసీల సమస్యలు తెలుసుకుని నివేదిక రూపొందిస్తాం. మీ బాధలను ఆ కమిటీ దృష్టికి తీసుకురండి. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిద్దాం. బీసీ గర్జన సభ నిర్వహిస్తాం. బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తాం.’’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు