రైతు కోసం ముందు జగనే

1 Feb, 2019 14:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సంక్షోభంలో ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు నేరుగా ఆర్థిక సాయం అందజేసే పథకాలు తెరపైకి రావడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందజేయడానికి వారి ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేస్తూ.. రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టగా.. తాజాగా కేంద్రంలోని మోదీ సర్కారు కూడా ఇదే పథకాన్ని ప్రకటించింది. రైతులకు ఏడాదికి నేరుగా రూ. ఆరువేల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ పథకం మొదట ప్రకటించింది ఎవరు? ఈ పథకాన్ని మొదట రూపొందించిన దార్శనికత ఎవరిది అన్న చర్చ ఊపందుకుంది. అసలు రైతులకు నేరుగా పెట్టుబడి సాయం అందజేయాలన్న ఆలోచన చేసిన తొలి వ్యక్తి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాల కన్నా ఎంతోముందే.. జూలై 9, 2017లోనే రైతులకు నేరుగా పెట్టుబడి సాయం అందజేస్తానని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. గుంటూరులో జరిగిన పార్టీ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా అన్నదాతలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘వైఎస్సార్‌ రైతు భరోసా’  పథకం ద్వారా నేరుగా ఆర్థిక సాయం అందజేస్తామని, ఏడాదికి రూ. 12,500 చొప్పున రైతులకు ఇస్తామని ప్రకటించారు. 

‘‘అధికారంలోకి రాగానే నేను చేపట్టబోయే తొలి పథకం వైఎస్సార్‌ రైతు భరోసా.. 5 ఎకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ రూ. 50 వేల రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తాను. ఏటా రూ. 12,500ను ఒకేసారి మే నెలలో ఇస్తాం. మే నెలనే ఎందుకంటే వ్యవసాయానికి రైతు సన్నద్దం అయ్యే విధంగా.. నేరుగా రైతుల చేతికే ఇస్తాం. మొత్తం నాలుగు విడతల్లో అందజేస్తాం’’-  9 జూలై 2017న గుంటూరులో జరిగిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు