కోటయ్య మృతిపై నిజనిర్ధారణ కమిటి వేసిన వైఎస్‌ జగన్‌

19 Feb, 2019 18:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చారిత్రక కొండవీడు కోటలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా కోటయ్య అనే రైతు మృతి చెందిన సంగతి తెలిసిందే. కోటయ్య మృతిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రాక సందర్భంగా పంట నాశనం చేయొద్దని బతిమిలాడిన కోటయ్యపై పోలీసులు అమానుషంగా దాడి చేసి అక్కడే వదిలేశారని ఆరోపించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కోటయ్య మృతి, ఉద్యోగులకు మధ్యంతర భృతి పేరుతో చంద్రబాబు మోసంపై నాయకులతో చర్చించారు. (సీఎం సభ కోసం రైతును చంపేశారు)

కోటయ్య మృతి వెనుక అసలు కారణాలేమిటి? అనేది తేల్చేందుకు, మృతుని కుంటుంబానికి భరోసానిచ్చేందుకు సీనియర్‌ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ వేశారు. కొండవీడులో ఈ కమిటీ రేపు (బుధవారం) పర్యటించనుంది. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ విమర్శలు గుప్పించారు. ఉద్యోగులకు ప్రకటించిన మధ్యంతర భృతిలో నిజాయితీ లేదని అన్నారు. భృతి ఇప్పుడు ప్రకటించి జూన్‌లో ఇస్తామనడం మోసమేనని వ్యాఖ్యానించారు. తనకు అధికారంలేని బడ్జెట్‌పై బాబు ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రజలు, దేవుడి ఆశీస్సులతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని, ఉద్యోగులకు న్యాయం జరిగేది తమ ప్రభుత్వంలోనే అని వైఎస్‌ జగన్‌ ఉద్ఘాటించారు.

కమిటీలో సభ్యులు వీరే..
నిజనిర్ధారణ కమిటీలో గుంటూరు జిల్లాకు చెందిన ఐదుదురు ఎమ్మెల్యేలు.. ముస్తాఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ, పార్థసారథి, కొడాలి నాని, మర్రి రాజశేఖర్‌, విడదల  రజనీ, శ్రీ కృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, మోపిదేవి వెంకటరమణ, మోపిదేవి వెంకటరమణ, లేళ్ల అప్పిరెడ్డి, గాంధీ, మేరుగ నాగార్జున ఉన్నారు. బాధిత రైతు కుంటుంబాన్ని పరామర్శించడమే కాకాండా వారికి అండగా నిలబడాలని పార్టీ అధ్యక్షుడు నాయకులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు