చంద్రబాబుకు ఓటేస్తే.. ఏంమిగలవు : జగన్‌

1 Apr, 2019 16:07 IST|Sakshi

చంద్రబాబును నమ్మితే నరమాంసం తినే రాక్షసిని నమ్మినట్టే

తోట వాణి, వంగా గీతలను గెలిపించాలి

పెద్దాపురం బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌

సాక్షి, పెద్దాపురం (తూర్పుగోదావరి) : పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఇసుక, మట్టి, గుట్టలు, కొండలు, పొలాలు, నదులు, సహా ఇక ఏమీ మిగలవని ప్రతపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట వాణి‌‌, కాకినాడ లోక్‌సభ అభ్యర్థి వంగా గీతలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..

‘రాష్ట్రవ్యాప్తంగా 3,648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఆ పాదయాత్రను పూర్తి చేశానని గర్వంగా చెబుతున్నా. ఆ పాదయాత్ర ఇదే పెద్దాపురం మీదుగా కూడా సాగింది. ఆ పాదయాత్రలో గిట్టుబాటు ధరలు లేకుండా ఇబ్బంది పడుతున్న రైతన్నలను చూశాను. ఉత్తరప్రదేశ్‌లో టన్ను చెరుకు రూ.3115 ఉంటే.. ఇక్కడ రూ.2600కు మించి ఇవ్వడం లేదని రైతులు చెప్పారు. క్వింటాల్‌ బెల్లం రూ.260 కూడా రావడం లేదని, దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో రూ. 520 వచ్చాయని తెలిపారు. వైఎస్సార్‌ హయాంలో పోలవరం ప్రాజెక్ట్‌ పనులు పరుగెత్తాయి. ఈ రోజు బాబు పాలనలో పొలవరం ప్రాజెక్ట్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్‌లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుంది. యనమల రామకృష్ణుడు వియ్యంకుడు నామినేషన్‌ పద్దతిలో సబ్‌కాంట్రాక్టులు తీసుకొని పనిచేస్తున్నారు. ఈ జిల్లాలో చేనేతలు కూడా ఎక్కవే. నూలుపై సబ్సిడీ అందడంలేదు. సబ్సిడీ సకాలంలోఇస్తలేడని చెప్పారు. అగ్రిగోల్డ్‌ బాధితులు కూడా ఎక్కువే. ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి అయినా బాధితులకు ఇచ్చింది లేదు. మీ ప్రతి బాధ, ప్రతి కష్టం మీరి చెప్పిందంతా విన్నాను. స్వయంగా చూశాను ఇవ్వాళ మీ అందరికి భరోసా ఇస్తూ చెబుతున్నాను.. మీ అందరికి నేనున్నాను.

పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే..
చంద్రబాబు ఐదేళ్ల పాలనపై ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు గుర్తు తెచ్చుకోవాలి. రాష్ట్రంలో 6 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు. చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఉండదు. నారాయణ స్కూల్‌లో ఎల్‌కేజీ చదవాలన్నా రూ.25 వేలు ఉంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ ఫీజు రూ. లక్ష చేస్తారు. ఆర్టీసీ, కరెంట్‌ కూడా మిగల్చడు.. అన్నీ ప్రయివేట్‌ పరం చేస్తాడు. కరెంట్‌, ఆర్టీసీ, పెట్రోల్‌ సహా అన్నీ చార్జీలు పెంచేస్తాడు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే.. రేషన్‌ కార్డులు, పెన్షన్‌లు కుదించేశాడు. ఇప్పుడిస్తున్న పెన్షన్లను కూడా మళ్లీ అధికారంలోకి రాగానే తగ్గించేస్తాడు. భూములు లాగేస్తాడు. ఇప్పటికే వెబ్‌ ల్యాండ్‌ పేరుతో తన అత్తగారి సొత్తంటూ పేదల భూములు లాగేస్తున్నాడు. భూసేకరణ చట్టాన్ని సవరించాడు. పొరపాటున బాబు అధికారంలోకి వస్తే.. ఇసుక, మట్టి, గుట్టలు, కొండలు, పొలాలు, నదులు, సహా ఇక ఏమీ మిగలవు. ఇప్పటికే లారీ ఇసుక 40 వేలు ఉంది.. పొరపాటున బాబు అధికారంలోకి వస్తే అతి రూ.లక్ష అవుతోంది.



జన్మభూమి కమిటీలదే రాజ్యం..
గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరిట చంద్రబాబు మాఫియాను ఏర్పాటు చేశారు. ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. పొరపాటున చంద్రబాబుకు ఒటేస్తే.. మీరు ఏ సినిమా, టీవీ చానెల్‌ చూడాలన్నా.. ఏ పేపర్‌ చదవాలన్నా జన్మభూమి కమిటీలే నిర్ణయిస్తాయి. ఆఖరికి ఏ ఆసుపత్రికి వెళ్లాలో ఎంత డబ్బులు ఇవ్వాలో కూడా వారే చెబుతారు. ఇదే పెద్దమనిషి మళ్లీ అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాలకు వడ్డీలు పెంచేస్తాడు. సున్నా వడ్డీ రుణాలుండవ్‌. రైతులకు రుణాలే ఇవ్వరు. ఆరోగ్యశ్రీ ఇప్పటికే పడకేసింది.. ఇంకా పూర్తిగా లేకుండా పోతుంది. 108,104లు కనుమరుగవుతాయి.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అటకెక్కుతుంది. ఫీజులు ఆకాశానికి పడుగెత్తుతాయి. చంద్రబాబును వ్యతిరేకించే వారిని ఎవ్వరిని బతుకనివ్వరు. గ్రామం నుంచి రాజధాని వరకు తన పోలీసులే కాబట్టి కేసులు ఉండవు. సీబీఐ, సీఐడీని రానివ్వరు. పత్రికలు, టీవీలు ఇప్పటికే అమ్ముడుపొయ్యాయి. చనిపోయినా ఒక్క వార్త రాదు. వారే చంపించి పైగా బాధిత కుటుంబంపై నెట్టేస్తారు. ఎన్నికలకు మూడు నెలల ముందు చేసిన వాగ్ధానాలు.. పెట్టిన పథకాలను అధికారంలోకి రాగానే ఎత్తేస్తాడు.  చంద్రబాబు గత చరిత్రను మరిచిపోవద్దని కోరుతున్నా. చివరి మూడు నెలలు చూపిస్తున్న సినిమాలు, డ్రామాలు నమ్మవద్దని కోరుతున్నా. వీటన్నిటిని నమ్మితే.. నరమాంసం తినే రాక్షసిని నమ్మినట్టే. ఒకసారి మోసపోయాం.. మళ్లీ అవే మోసాలు, అబద్దాలు చంద్రబాబు చెబుతున్నారు. ఈ సారి కూడా మోసపోతే మనమెవ్వరం ఉండం. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. రాజకీయాల్లో రాజకీయ నాయకుడు పలానా చేస్తానని చెప్పి... అధికారంలోకి వచ్చాక చేయకపోతే రాజీనామా చేసి వెళ్లిపోయే పరిస్థితి రావాలి.

అన్న ఉన్నాడని చెప్పండి..
ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరిని కలిసి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తాడని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో మన పిల్లల చదువుకు ఎంత ఖర్చైనా అన్న భరిస్తాడని చెప్పండి. డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తాడని తెలుపండి. లక్షాధికారులను చేస్తాడని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి.  45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తాడని చెప్పండి. ప్రతి ఏడాది మే నెలలో రూ.12500 చేతుల పెడతాడని ప్రతి రైతన్నకు చెప్పండి. సున్నా వడ్డీ రుణాలు జగనన్న రాజ్యంలోనే సాధ్యమని తెలపండి. గిట్టుబాటు ధరకు గ్యారెంటీ ఇస్తాడని తెలపండి. అవ్వా, తాతలకు మూడు వేల ఫించన్‌ మీ మనవడు ఇస్తాడని చెప్పండి. ఇళ్లు లేవని ప్రతి నిరుపేదను కలవండి. ప్రతి పేదవాడికి ఇళ్లు రావాలంటే జగనన్నతోనే సాధ్యమని తెలపండి. రాజన్న రాజ్యాన్ని జగన్‌ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్‌ జగన్‌ కోరారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు