కాకినాడ రూరల్‌లో జన సునామీ

17 Jul, 2018 18:56 IST|Sakshi

సాక్షి, కొవ్వాడ (కాకినాడ రూరల్‌) : ప్రజాసంకల్పయాత్రతో రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కాలినడక ఇడుపులపాయ నుంచి బయల్దేరిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం లభించింది. ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు కొవ్వాడ గ్రామంలో అడుగుపెట్టబోతున్న వైఎస్‌ జగన్‌కు పార్టీ శ్రేణులు రైల్వే గేటు వద్ద 65 అడుగుల భారీ కటౌట్‌తో ఆహ్వానం తెలుపగా, వందలాది మంది మహిళలు వైఎస్‌ జగన్‌కు హారతి ఇస్తూ నియోజకవర్గంలోకి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సీనియర్‌ జర్నలిస్టు అమర్‌ వైఎస్‌ జగన్‌ను కలుసుకున్నారు. ఆయనతో పాటు అడుగులో అడుగేశారు. తమ సమస్యలు వినేందుకు వచ్చిన వైఎస్‌ జగన్‌ను కలుసుకునేందుకు జనం ఉప్పెనలా తరలివచ్చారు. దీంతో కొవ్వాడ వీధులు జనసంద్రాన్ని తలపించాయి. పాదయాత్ర కొవ్వాడ శివార్లకు చేరుకునే సందర్భంగా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వర్షాన్ని కూడా లెక్కచేయని ప్రజలు వైఎస్‌ జగన్‌తో కలసి నడిచారు.

అనపర్తిలో పాదయాత్ర హీట్‌..
అనపర్తిలో పాదయాత్ర హీట్‌ నియోజకవర్గం నలుమూలలా ప్రతిధ్వనించింది. దాదాపు మూడు రోజుల పైచిలుకు అనపర్తి నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా టీడీపీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటనతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. పెదపూడిని దాటేందుకు దాదాపు రెండు గంటలకు పైగా సమయం పట్టిందంటే ప్రజలు వైఎస్‌ జగన్‌ రాకను ఎంతలా కోరుకుంటున్నారో అర్థం అవుతుంది. జీమామిడాడలో ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్‌వాడీ యానిమేటర్లు తమ సమస్యలను వైఎస్‌ జగన్‌కు విన్నవించగా స్పందించిన జగన్‌ వేతనాల పెంపునకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.


మరిన్ని వార్తలు