బీసీలకు పెద్దపీట

18 Mar, 2019 03:23 IST|Sakshi
ఇడుపులపాయలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఎంపీ అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తున్న బాపట్ల పార్లమెంట్‌ అభ్యర్థి నందిగం సురేశ్‌. చిత్రంలో సీనియర్‌ నాయకులు ధర్మాన ప్రసాదరావు, ఎంపీలు వేమిరెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు

ఒకే రోజు ఎమ్మెల్యే, ఎంపీల పూర్తి జాబితా

41 అసెంబ్లీ 7 ఎంపీ టికెట్లు

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైఎస్‌ జగన్‌

బీసీ గర్జన, ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా వారి అభ్యున్నతికి హామీ

వారు రాజకీయంగా ఎదిగి పదవుల్లో ఉండాలని జగన్‌ ఆకాంక్ష

బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తన భవిష్యత్‌ ప్రణాళికను సుస్పష్టం చేసిన జగన్‌

మొత్తం 175 మంది అసెంబ్లీ స్థానాలకూ ఒకేసారి అభ్యర్థుల ప్రకటన

25 మంది ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించిన వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘బీసీలు, పేదవారు రాజకీయంగా ఎదగాలి... పదవుల్లో ఉండాలి... మీ రాజకీయ ఎదుగుదల కోసం నా కృషి కొనసాగుతుంది..’ అని ఫిబ్రవరి 17వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో ఇచ్చిన మాటను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌  నిలబెట్టుకున్నారు. తన మాటకు జగన్‌ అక్షరాలా కట్టుబడ్డారు అనే విషయం  ఆదివారం ఇడుపులపాయలో విడుదల చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాలతో సుస్పష్టమయ్యింది. వచ్చే ఎన్నికలకు లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక విషయమై చేసిన కసరత్తులో ఎక్కడా రాజీపడకుండా బీసీ వర్గాలకు అగ్రతాం బూలం ఇచ్చారు. తన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెనుకబడిన వర్గాల వారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే తాను మరో అడుగు ముందుకు వేస్తానని చెప్పిన మాటను జగన్‌ నిలబెట్టుకున్నారు. మొత్తం 175 శాసనసభా స్థానాల్లో 41 మంది బీసీలకు పార్టీ అభ్యర్థులుగా అవకాశం కల్పించారు.

అలాగే మొత్తం 25 లోక్‌సభ సీట్లలో ఏడుగురు బీసీలకు స్థానం కల్పించి వారి అభ్యున్నతి విషయంలో తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. శనివారం రాత్రి ప్రకటించిన పార్లమెంట్‌ అభ్యర్థుల తొలి జాబితాలో విడుదల చేసిన 9 మందిలో ముగ్గురు బీసీలకు స్థానం కల్పించి ఆదివారం విడుదల చేయబోయే జాబితాలో తాను బీసీలకు ఎంతటి ప్రాధాన్యం ఇవ్వబోతున్నానో ముందుగానే సంకేతాలిచ్చారు. ఆదివారం ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి సాక్షిగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాతో భవిష్యత్తులో తాను ఎలాంటి మార్గాన్ని అనుసరించబోతున్నాననేది స్పష్టం చేశారు. పధ్నాలుగు నెలల పాటు అనేక ఒడిదుడుకులను ఓర్చుకుంటూ తాను చేసిన సుదీర్ఘమైన, చారిత్రక ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా.. బీసీల ఆత్మీయ సమ్మేళనాల్లో బీసీలకు రాజకీయంగా సముచిత స్థానాన్ని కల్పిస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. అంతే కాదు, రాయలసీమలో పర్యటించేటప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్క పార్లమెంటు సీటును ఖచ్చితంగా బీసీలకు కేటాయిస్తానని చెప్పారు.

కానీ చెప్పిన దానికన్నా ఒక సీటు ఎక్కువగా మూడు సీట్లు కేటాయించారు. అనంతపురం లోక్‌సభ సీటును వాల్మీకి కులానికి చెందిన తలారి రంగయ్య (మాజీ డ్వాక్రా ప్రాజెక్టు డైరెక్టర్‌)కు, హిందూపురం లోక్‌సభ సీటును కురబ కులానికి చెందిన గోరంట్ల మాధవ్‌ (మాజీ పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌)కు కర్నూలు సీటును డాక్టర్‌ సింగరి సంజయ్‌కుమార్‌ (చేనేత)కు కేటాయించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం అభ్యర్థిగా కాళింగ కులానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్‌ను, విజయనగరం అభ్యర్థిగా తూర్పు కాపులకు చెందిన బెల్లాన చంద్రశేఖర్‌ను, అనకాపల్లి అభ్యర్థిగా గవర కులానికి చెందిన డాక్టర్‌ కె.వి.సత్యవతిని, రాజమండ్రి అభ్యర్థిగా గౌడ కులానికి చెందిన మార్గాని భరత్‌ను ప్రకటించారు. ఈ ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులకు సీట్లివ్వడం ద్వారా 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించినట్లయింది. 

జగన్‌పై విశ్వాసానికి ఆస్కారం
బీసీ గర్జనలోనే జగన్‌ మరో మాట ఇచ్చారు. ‘దేవుడి ఆశీర్వాదంతో... ప్రజలందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ... ప్రభుత్వ పరిధిలోని మార్కెట్‌ కమిటీల సభ్యులు, వాటి ఛైర్మన్లు, ట్రస్టు బోర్డు సభ్యులు, ట్రస్టు బోర్డు చైర్మన్‌ పదవులు, దేవాలయ కమిటీలు, కార్పొరేషన్‌ పదవులు.. ఇలా ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇస్తాం. ఈ మేరకు మొదటి శాసనసభా సమావేశంలోనే చట్టం తీసుకొస్తాం. ఒక్క నామినేటెడ్‌ పదవులే కాదు, నామినేషన్‌ కింద ఇచ్చే పనుల్లో యాభై శాతం పనులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందేలా చట్టం తెస్తాం’ అని జగన్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల జాబితాలో జగన్‌ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా రిజర్వేషన్ల హామీ సైతం నిలబెట్టుకుంటుందని బీసీలు, బలహీనవర్గాల ప్రజలు విశ్వసించడానికి ఆస్కారం ఏర్పడింది. 

మాట తప్పడు... మడమ తిప్పడు 
‘మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు జగన్‌... ఆయన ఒకసారి మాట ఇచ్చారంటే తప్పడు’ అని గర్జన సభలో ప్రసంగించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య జోస్యం చెప్పారు. ‘జగన్‌ తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీల సమస్యలు ఏవైనా ఉంటే తక్షణం పరిష్కారానికి పూనుకునే వారు. ఇప్పుడు జగన్‌ కూడా బీసీలకు బంగారు భవిష్యత్తు ఉండేలా వారికి అన్నింటా ప్రాధాన్యత ఇస్తానని, సాధికారత కల్పిస్తానని చెబుతున్నారు. ఇక ఆయనకు మద్దతు నిచ్చే బాధ్యత మన బీసీలపైనే ఉంది. చంద్రబాబు ప్రలోభాలకు లొంగవద్దు..’ అని కృష్ణయ్య అన్నారు. ఇప్పుడు కృష్ణయ్య మాటలను నిజం చేస్తూ జగన్‌ అభ్యర్థుల ప్రకటనలో బీసీలకు పూర్తిగా న్యాయం చేశారు కనుక, ఇక ఆయనకు మద్దతునిచ్చే బాధ్యత బీసీలపైనే ఉందనే అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది. మొత్తం జాబితాను పరిశీలిస్తే.. బీసీలతో పాటుగా ముస్లిం, కాపు, బలిజ, చేనేత, వైశ్య, బ్రాహ్మణ కులాలకు సముచిత స్థానం కల్పించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జనసామాన్యంలో భేష్‌ అనిపించుకుంది. 31 మంది కాపులు, ఐదుగురు ముస్లిం మైనారిటీలు, నలుగురు బలిజ, నలుగురు బ్రాహ్మణ, ముగ్గురు వైశ్య కులానికి చెందిన అభ్యర్థులకు శాసనసభ జాబితాలో చోటు కల్పించారు.

విధేయతకు పట్టం
తన తొమ్మిదేళ్ల రాజకీయ ప్రస్థానంలో పార్టీ స్థాపించిన నాటి నుంచీ నమ్ముకుని పార్టీకి విధేయులుగా ఉన్న వారిపై వైఎస్‌ జగన్‌ తన సంపూర్ణ విశ్వాసం ఉంచారు. కష్టకాలంలో పార్టీలో క్రియాశీలంగా పనిచేసిన వారిని విస్మరించకుండా అవకాశం కల్పించారు. సామాజిక సమతౌల్యం పాటించడం కోసం, గెలుపు గుర్రాల అన్వేషణ వంటి అంశాల్లో చివరి దాకా కసరత్తు చేసి సాధ్యమైనంత మేరకు 75 శాతం మంది విధేయులకు, పార్టీని నమ్ముకున్న వారికి స్థానం కల్పించారు. టిక్కెట్ల కేటాయింపులో ఎంతోమంది సామాన్యులకు అవకాశం లభించింది. జాబితాను వెల్లడించడానికి ముందు ఆయన పార్టీ కోర్‌ కమిటీ సభ్యులతో విస్తృతంగా సంప్రదింపులు, సమాలోచనలు జరిపారు. గెలుపు గుర్రాలను ఖరారు చేసే విషయంలో పార్టీలో ఎలాంటి మొహమాటాలకు గాని, ఒత్తిడులకు గాని తావివ్వలేదని జగన్‌ నిరూపించారు. ఆయన పులివెందుల నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

పార్టీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌.కె.రోజా, అంబటి రాంబాబు, ఆనం రామనారాయణరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, కొలుసు పార్థసారథి, బాలినేని శ్రీనువాసరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి వంటి హేమాహేమీలందరూ శాసనసభ ఎన్నికల బరిలోకి దిగారు. లోక్‌సభ ఎన్నికల బరిలో మాగుంట శ్రీనువాసులురెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి వంటి వారు తలపడుతున్నారు. గత లోక్‌సభలో పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఐదుగురు మాజీ ఎంపీల్లో మళ్లీ ఇద్దరికి అవకాశం లభించింది. ఒకరికి అసెంబ్లీకి పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. మొత్తం 44 మంది ఎమ్మెల్యేల్లో 40 మందికి తిరిగి పోటీ చేయడానికి పార్టీ టికెట్లు లభించాయి. 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితా విడుదల
సాక్షి ప్రతినిధి కడప: వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. అసెంబ్లీకి సంబంధించి 175 మంది పార్టీ అభ్యర్థులను ఒకే దఫాలో ప్రకటించడం గమనార్హం. హైదరాబాద్‌ నుంచి ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో వైఎస్సార్‌ జిల్లా కడప చేరుకున్న జగన్‌.. రోడ్డు మార్గంలో ఇడుపులపాయ చేరుకున్నారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద తండ్రి, దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించి కాసేపు మౌనంగా ప్రార్థించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఎంపీ అభ్యర్థులను ఎస్సీ నేత నందిగం సురేష్‌తోనూ, ఎమ్మెల్యే అభ్యర్థులను సీనియర్‌ బీసీ నేత ధర్మాన ప్రసాదరావుతోనూ ప్రకటింపజేశారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కాపులను కూడా కలిపి బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చినట్లుగా చెప్పుకుంటారని, వైఎస్సార్‌సీపీ మాత్రం 41 మంది బీసీ నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించినట్లు వివరించారు. కాగా తొమ్మిది లోక్‌సభా స్థానాలకు అభ్యర్థులను శనివారం నాడే ప్రకటించగా, వారితో కలిపి మొత్తం 25 మంది ఎంపీ అభ్యర్థులను ఆదివారం ప్రకటించారు. బీసీలకు 7 లోక్‌సభ స్థానాలు కేటాయించారు. అలాగే మహిళలకు 15, ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, ముస్లిం మైనార్టీలకు 5 స్థానాలు కేటాయించడం ద్వారా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించారు. అదే సమయంలో విద్యావంతులు, యువత, అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులకు పెద్దపీట వేశారు. సమావేశంలో పార్టీ సీనియర్‌ నేత విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు