చిరు, పవన్‌లకు జగన్‌ ఆహ్వానం

29 May, 2019 11:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ సంచలన విజయానికి సారథ్యం వహించి ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారానికి జాతీయ, రాష్ట్ర నాయకులకు స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానం పలుకుతున్నారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలకు ఫోన్‌ చేసి తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని కోరారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు, సీపీఐ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలను కూడా ఆహ్వానించారు. సినీ నటుడు చిరంజీవి, కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రరావులకు ఫోన్ చేసి ఆహ్వానించారు. మంగళవారం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి ఫోన్‌ చేసిన వైఎస్‌ జగన్‌ తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం 12.23 గంటల ముహూర్తానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. (చదవండి: రేపే పదవీ స్వీకారం)

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విజయవాడ చేరుకున్న గవర్నర్‌
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ బుధవారం విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం 11 గంటల ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌, కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడలోని గేట్‌వే హోటల్‌కు గవర్నర్‌ చేరుకున్నారు. ఈరోజు ఆయన అక్కడే బస చేస్తారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు