హస్తిన వేదికగా హోదా పోరు!

3 Mar, 2018 13:04 IST|Sakshi

5న సంసద్‌ మార్గ్‌ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా..

పార్టీ నేతలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

పార్టీ నేతల ఢిల్లీ యాత్రను జెండా ఊపి ప్రారంభించిన జననేత

సాక్షి, ప్రకాశం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది. హోదా కోసం దేశ రాజధాని ఢిల్లీ వేదిక ధర్నా నిర్వహించబోతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ.. ఈ నెల 5న ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌ వద్ద వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతున్నారు.

ఈ నేపథ్యంలో తాళ్లూరుకు చేరుకున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సమావేశమైన వైఎస్‌ జగన్‌.. ఢిల్లీలో నిర్వహించబోయే ధర్నా, ప్రత్యేక హోదా పోరాటం గురించి చర్చించి.. నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతల ఢిల్లీ యాత్రను వైఎస్‌ జగన్‌ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

ప్రత్యేక హోదాయే లక్ష్యంగా తాము ఢిల్లీ యాత్ర చేపడుతున్నామని, హోదా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయడమే ఈ యాత్ర ఉద్దేశమని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. హోదా కోసమే ఢిల్లీలో ధర్నా చేపడుతున్నామని తెలిపారు. హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నామని, అదేవిధంగా హోదాను డిమాండ్‌ చేస్తూ పార్టీ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తెలిపారు. ప్రత్యేక హోదా పోరాటంలో చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని పార్టీ నేతలు నిలదీశారు. గతంలో ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ బాగుందన్న చంద్రబాబు ఇప్పుడు తాను ఆ మాటలు అనలేదని మాట మారుస్తున్నారని తప్పుబట్టారు.

మరిన్ని వార్తలు