సీఎం కేసీఆర్‌తో వైఎస్‌ జగన్‌ భేటి

25 May, 2019 17:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. గవర్నర్‌తో భేటీ తర్వాత నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకున్న జగన్‌కు కేసీఆర్‌తో పాటు తెలంగాణ మంత్రులు స్వాగతం పలికారు. సతీసమేతంగా వైఎస్‌ జగన్‌ ప్రగతి భవన్‌కు రాగా.. కేసీఆర్‌ పుష్పాగుచ్చాలిచ్చి.. జగన్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు. ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జగన్‌కు స్వీట్‌ తినిపించి శుభాకాంక్షలు తెలపడంతో పాటు శాలువాతో సత్కరించారు. ఓ జ్ఞాపికను కూడా అందజేశారు. కేటీఆర్‌ జగన్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకోగా.. ఆయన సతీమణి శైలిమ వైఎస్‌ భారతీకి సంప్రదాయంగా బొట్టు పెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్‌.. జగన్‌కు కుటుంబ సభ్యులు, మంత్రులు, టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలను పరిచయం చేశారు.  

ఈ నెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో జరగనున్న ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావాలని కేసీఆర్‌ను జగన్‌ ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకత గురించి కూడా చర్చించారు. వైఎస్‌ జగన్‌తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డిలు కేసీఆర్‌ను కలిశారు. కాగా మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సాఆర్‌ సీపీ 151, తెలుగుదేశం పార్టీ 23, జనసేన పార్టీ 1 స్థానాన్ని గెలిచిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు