ప్రజాసంకల్పయాత్ర@300వ రోజు

18 Nov, 2018 19:26 IST|Sakshi

సాక్షి, విజయనగరం : వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 300వ రోజు ఈ ఆదివారం విజయనగరం జిల్లా పార్వతీపురం శివారు కోటవానివలస వద్దనుంచి ప్రారంభమైంది. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పార్టీనేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జననేత పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు తమ సంఘీభావం తెలిపారు. పాదయాత్ర ప్రారంభంలో వైఎస్‌ జగన్‌ను రెల్లి కులస్తులు కలిశారు. అన్ని విధాలుగా వెనకబడి ఉన్న తమను ఆదుకోవాలని, ఉద్యోగ, ఉపాధి రాజకీయ రంగాలలో తగిన ప్రాతినిథ్యం కలిగేలా చూడాలని జననేతకు విజ్ఞప్తి చేశారు. తమకు కూడా ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని రెల్లి కులస్తుల స్పష్టం చేశారు.

తమ డిమాండ్లపై జననేత సానుకూలంగా స్పందించారని రెల్లి కులస్తులు హర్షం వ‍్యక్తం చేశారు. ఆ తర్వాత  జననేతను కలిసిన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులు తమ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నప్పటికీ సర్వీసు క్రమబద్ధీకరించడం లేదని, వేతనాలు కూడా సక్రమంగా చెల్లించటం లేదని విపక్షనేతకు వారు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తమ పోస్టులను డీఎస్సీలో చూపి, తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని జననేత వద్ద వారు ఆవేదన వ్యక్తం చేశారు.  ఆ తర్వాత కోటవానివలస మీదుగా బంటువాని వలస చేరుకున్న వైఎస్‌ జగన్‌కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. జననేతను కలిసిన తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ప్రాజెక్టులో రిజర్వాయర్‌ నిర్మాణం కోసం తమ భూములు తీసుకుని నామమాత్రంగా పరిహారం చెల్లించారని, అది ఎందుకు సరిపోలేదని రైతులు పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు అటు భూమి లేక, ఇటు ఉపాధి లేక నానా ఇబ్బంది పడుతున్నామని జననేత వద్ద తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు మొర పెట్టుకున్నారు. తమకు కనీసం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కూడా అందలేదని విపక్షనేతకు రైతులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అడ్డాపుశీల చేరుకున్న  వైఎస్‌ జగన్‌కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. జననేతను చూసేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు తరలి వచ్చారు. సమానపనికి సమాన వేతనాలు చెల్లించకుండా అన్యాయం చేస్తున్నారని విద్యుత్‌ శాఖ కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పాదయాత్రలో జననేతను కలిసి మొర పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పని చేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని, సర్వీసు క్రమబద్ధీకరించడం లేదని, వేతనాలు కూడా సక్రమంగా చెల్లించటం లేదని విపక్షనేత వద్ద తమ బాధలు చెప్పుకున్నారు.

పిన్నింటి రామనాయుడు వలస వద్ద అనూహ్యంగా సెలూన్‌లోకి వెళ్లిన వైఎస్‌ జగన్! సెలూన్‌ యజమానితో కాసేపు మాట్లాడి కష్టసుఖాలు విచారించారు. అనంతరం బాచి జంక్షన్‌ మీదుగా సీతారాంపురం క్రాస్‌ చేరుకున్న వైఎస్‌ జగన్‌ను మధ్యాహ్న భోజన శిబిరం వద్ద బాబూరావు అనే ఔత్సాహిక రైతు కలిశారు. వ్యవసాయంపై మక్కువతో మెకానిక్‌ వృత్తి వీడి రైతుగా మారినట్లు జననేతకు ఆయన తెలిపారు. రైతులకు ప్రయోజనం కలిగేలా వారి కోసం పలు ఉపకరణాలు తయారు చేసినట్లు బాబూరావు వెల్లడించారు. తాను రూపొందించిన మల్టీపర్పస్‌ డ్రమ్‌ సీడర్‌తో పాటు, పలు ఉపకరణాలను ఈ సందర్భంగా విపక్షనేతకు చూపించారు. తగిన ప్రోత్సాహం అందిస్తే మరిన్ని అవిష్కరణలు కొనసాగిస్తానని బాబూరావు తెలిపారు. ఇక దారి పొడవునా వర్గాల ప్రజలు జననేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమ బిడ్డలను ఆశీర్వదించమని వైఎస్‌ జగన్‌ను పసి పిల్లల తల్లులు కోరారు. వైఎస్‌ జగన్‌ ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ యాత్రలో ముందుకు సాగిపోయారు.  

మరిన్ని వార్తలు