తాటి చెట్టంత మంత్రి ఈత కాయంత మేలు కూడా చేయలేదు

23 Dec, 2018 08:43 IST|Sakshi
పాదయాత్రలో ఓ అవ్వ కాలి చెప్పు జారి పోవడంతో సరి చేస్తున్న జగన్‌ 

టెక్కలి సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మంత్రి అచ్చెన్నాయుడు తాటి చెట్టంత ఎదిగినా, ప్రజలకు ఈత గింజంత మేలు కూడా చేయలేదని ప్రజలు చెబుతున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతంలో ప్రతి పనికీ లంచం గుంజుతున్నారని ప్రజలు తనకు దారిపొడవునా చెబుతూ వచ్చారన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 328వ రోజు శనివారం ఆయన టెక్కలి బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. ‘టెక్కలి గత చరిత్రను చూద్దాం. ఇదే నియోజకవర్గం నుంచి 1994లో ఎన్టీ రామారావును ఇక్కడి ప్రజలు గెలిపించారు. అదే సంవత్సరంలోనే జరిగిందేమిటో మీ అందరికీ తెలుసు. ఎన్నికలు అయిపోగానే సొంత కూతురిని ఇచ్చిన మామను వెనుక నుంచి పొడిచిన వ్యక్తి ఇదే చంద్రబాబునాయుడు. ఆరోజు నుంచి ఈరోజు వరకు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కూడా పొడుస్తూనే... ఉన్నాడు.

అదే చంద్రబాబునాయుడి కొలువులో ఇక్కడి నుంచి ఎన్నుకోబడిన మంత్రి అవినీతి విశ్వస్వరూపం. ఆయనకు ఈపేరు కూడా ఇక్కడి నుంచే వచ్చిందని చెబుతుంటారు. మా మంత్రి తాటి చెట్టంత ఎత్తయితే ఎదిగాడు కానీ ప్రజలకు మాత్రం ఈత కాయంత మేలైనా చేయలేదన్నా అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ మంత్రి అచ్చెన్నాయుడు. ఈయన గురించి రకరకాలుగా చెప్పుకొస్తున్నారు. ఆమదాలవలస, నరసన్నపేట, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో జరిగే ఇసుక దందాలన్నింటికీ మా మంత్రి అచ్చెన్నాయుడే బిగ్‌బాస్‌ అని అంటున్నారు. ఇక్కడి నుంచి లంచాలు చినబాబు, పెదబాబుకు చేరవేస్తుంటాడన్నా అని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఏ కాంట్రాక్టు పని జరిగినా ఆ చేసే వ్యక్తి సాక్షాత్తు అచ్చెన్నాయుడి తమ్ముడు హరిప్రసాద్‌ మాత్రమే కనిపిస్తాడని చెబుతున్నారు. నీరు–చెట్టు అవినీతి గురించి చెబుతూ సీతా సాగరం, దిమిలాడ చెరువులు దీనికి ఉదాహరణ అని చెబుతున్నారు. ఇక్కడే ఎకరా రూ.5 కోట్లు విలువ చేసే 3 ఎకరాల ఆర్టీసీ స్థలాన్ని ఏకంగా తన బినామీలకు మంత్రి తక్కువ ధరకు ఇప్పించారన్నా అంటున్నారు. వివిధ కార్పొరేషన్‌ల ద్వారా వచ్చే డబ్బులకు కూడా కమీషన్ల కోసం కక్కుర్తి పడే మంత్రి ఎవరైనా ఉంటారా.. అంటే అది మా మంత్రే అని చెప్పుకొస్తున్నారు. చివరకు మరుగుదొడ్ల మంజూరుకు కూడా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు లంచాలు ఇచ్చుకోవలసిన అధ్వాన పరిస్థితి.

అంగన్వాడీ సహా చిన్నా చితకా పోస్టులు అమ్ముకొనే దుర్గతి ఇక్కడే కనిపిస్తోందన్నా అంటున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారన్న కారణంతో కోటబొమ్మాళి మండలం ఎలమంచిలి సహా ఏకంగా 1,500 మంది పెన్షన్లు కట్‌చేస్తే వారు కోర్టులకు వెళ్లి న్యాయం పొందిన పరిస్థితి ఇక్కడే కనిపిస్తోంది. 26 మంది వైఎస్సార్‌సీపీకి చెందిన సర్పంచుల చెక్‌పవర్‌ను అధికారంలోకి వచ్చిన వెంటనే అచ్చెన్న రద్దు చేశారు. ఈ పెద్దమనిషి మంత్రి అవుతూనే చాకిపల్లిలో దళిత మíహిళ చిన్న కిరాణాకొట్టు నడుపుకొంటూ బతుకుతుంటే ఆమెపై కూడా కక్ష కట్టి బుల్డోజరుతో కొట్టును తొలగించారన్నా అని చెబుతున్నారు. అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో ఏకంగా 20 కుటుంబాలను సాంఘిక బహిష్కరణకు గురిచేశాడన్నా ఈ సిగ్గుమాలిన మంత్రి అని చెబుతున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి గొడౌన్లు కట్టుకున్నారని, అందులో తరుగు పేరిట బస్తాకు రెండు కేజీలు చొప్పున ఏడాదికి రూ.3 కోట్ల విలువైన బియ్యం స్వాహా చేస్తున్నారని చెబుతున్నారు.  

పాలిషింగ్‌ యూనిట్లు మూత పడుతున్నాయి.. 
టెక్కలి నియోజకవర్గంలో 65 క్వారీలు, 75 పాలిషింగ్‌ యూనిట్లు ఉన్నాయి. అచ్చెన్నాయుడు మంత్రి అయ్యాక కొత్త క్వారీయింగ్‌ లైసెన్స్‌ కావాలన్నా, ఎన్‌ఓసీ ఇవ్వాలంటే ఏకంగా రూ.25 లక్షలు లంచం ముట్టచెబితేనే కానీ పని జరగడం లేదంటున్నారు. మంత్రికి భవానీ గ్రానైట్స్‌ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీకి రోజుకు 3 క్యూబిక్‌ మీటర్ల గ్రానైట్‌ రాయి ప్రతి పాలిషింగ్‌ యూనిట్‌ నుంచి పంపించకపోతే ఈ పెద్దమనిషి ఊరుకోవడం లేదన్నా అని చెబుతున్నారు. గతంలో సీనరేజి ఫీజు క్యూబిక్‌ మీటర్‌కు రూ.1,200 ఉంటే సీఎంగా చంద్రబాబు వచ్చాక రూ.2,950కి పెంచాడని చెబుతున్నారు. ఈయన సీఎం అయ్యాక సింగపూర్, జపాన్‌ అంటూ ఆయా దేశాలకు వెళ్తాడు. ఉద్యోగాలు తీసుకువçస్తున్నానంటారు. ఇక్కడ ఉన్న పాలిషింగ్‌ యూనిట్లు మూతపడుతున్న పరిస్థితి. ఇదే పాలిషింగ్‌ యూనిట్లకు గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కరెంటు యూనిట్‌కు రూ.3.15 ఉంటే చంద్రబాబు రూ.8 చేశాడంటున్నారు. ఇలాంటి స్థితిలో పరిశ్రమలు మూతపడక మిగులుతాయా అని అంటున్నారు. ఇక్కడే మెట్‌కోర్‌ ఫెర్రో అల్లాయీస్‌ సంస్థ కార్మికులు ధర్నా చేస్తూ కనిపించారు.

ఈ సంస్థ అచ్చెన్నాయుడు కార్మిక మంత్రి అయ్యాక 2017లో పూర్తిగా మూత పడింది. 2015 నుంచే ఈ ఫ్యాక్టరీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని మొర పెట్టుకుంటే, న్యాయం చేయాల్సిన ఈయన ఆ యాజమాన్యంతో కుమ్మక్కై ఏకంగా ఆఫ్యాక్టరీలోని మెటీరియల్‌ను పూర్తిగా అమ్ముకొనేలా చేశారని చెబుతున్నారు.  టెక్కలి, నందిగామ, పలాస, మెళియాపుట్టి మండలాల్లో 108 గ్రామాల్లో 24,600 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించడానికి దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.127 కోట్లతో మహేంద్రతనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులు ప్రారంభించారు. ఆయన బతికుండగానే దాదాపుగా 30 నుంచి 40 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు లంచాలు ఎలా తినాలో వెతుక్కుంటూ ఆ ప్రాజెక్టులో మిగిలిన పనులకు ఏకంగా రూ.427 కోట్లకు అంచనాలు పెంచి దోచేశారే తప్ప ప్రాజెక్టు మాత్రం ముందుకు కదల లేదంటున్నారు. 51 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తుçన్న కాకరాపల్లి పవర్‌ ప్లాంటును రద్దు చేస్తానని చెప్పిన బాబు ఇప్పటికీ ఆ ఊసే ఎత్తడం లేదు. భావనపాడు పోర్టు ప్రాజెక్టు కోసం రైతుల అంగీకారం లేకున్నా చంద్రబాబు ఏకంగా 5 వేల ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు విలువ ఉండగా రూ.12 లక్షలు ఇచ్చేలా నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇది ధర్మమేనా?’ అని జగన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు