బాబూ.. ఇలాంటి పరిస్థితికి మీరు కాదా కారణం?

4 May, 2018 03:24 IST|Sakshi

సీఎం వైఖరి వల్లే దాచేపల్లి ఘటన అని వైఎస్‌ జగన్‌ ధ్వజం

బాలికపై అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించిన ప్రతిపక్ష నేత

నిందితుల్ని సరిగ్గా శిక్షించనందువల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి

మచిలీపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన పాశవిక సంఘటనకు సీఎం చంద్రబాబునాయుడుదే బాధ్యత అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పసి బాలికపై జరిగిన ఘాతుకం పట్ల ఆయన తన దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ దాచేపల్లి ఆటవిక సంఘటనపై గురువారం ట్వీటర్‌సహా సోషల్‌ మీడియాలో తీవ్రంగా స్పందించారు.

ఈ ఘటన అత్యంత దారుణమన్నారు. ఇలాంటి ఘాతుకాలు జరగడానికి చంద్రబాబు వైఖరే కారణమని దుయ్యబట్టారు. దాచేపల్లిలో తొమ్మిదేళ్ల పసి బాలికపై 55 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో ఇటీవలికాలంలో ఇలాంటి ఘోరమైన సంఘటనలు చోటు చేసుకోవడం బాగా పెరిగిపోయిందన్నారు. నిందితుల్ని సరిగ్గా శిక్షించనందువల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న దుండగుల్లో ఎక్కువగా టీడీపీ నేతలు, ఆ పార్టీకి చెందినవారే ఉండటం వల్ల ఇలాంటి నేరాలు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయన్నారు. ‘చంద్రబాబూ.. ఇలాంటి పరిస్థితికి మీరు కాదా కారణం?’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. 

టీడీపీ హయాంలో మహిళలపై దౌర్జన్యాలు, అత్యాచారాలు అధికమయ్యాయి..
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై దౌర్జన్యాలు, అత్యాచారాలు జరుగుతున్న సంఘటనలు అధికమయ్యాయని జగన్‌ అన్నారు. ఈ సంఘటనలకు పాల్పడుతున్న వారిలో అత్యధికులు అధికార టీడీపీకి చెందినవారే కావడం, వారిని పట్టుకోకుండా స్వేచ్ఛగా వదలి వేయడం వల్ల దుండగులకు ఇంకా ధైర్యం పెరిగి విర్రవీగుతున్నారని ఆయన చెప్పారు. గత నెల రోజుల్లో ఒక్క గుంటూరు జిల్లాలోనే మహిళలపై అత్యాచారం జరిగిన సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయని, అయినప్పటికీ నేరాలకు పాల్పడిన వారిమీద ఎలాంటి చర్యలూ తీసుకోలేదని దుయ్యబట్టారు. మహిళలపై పెరుగుతున్న నేరాలకు టీడీపీ నాయకత్వమే కారణమని జగన్‌ తప్పుపట్టారు.

ఇలాంటి నేరాల పట్ల కఠినంగా వ్యవహరించట్లేదని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో దాచేపల్లి దుర్మార్గం జరగడానికి కొద్దిగా ముందు.. గతవారంలోనే ఒక మహిళను దారుణంగా హింసించిన సంఘటన చోటు చేసుకుందని, కానీ ప్రభుత్వం ఏమాత్రం చలించకుండా మౌనం వహించిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం నేరస్తులకు మరింత ధైర్యాన్ని ఇచ్చిందని, ఇలాంటి నేరాలన్నింటికీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని జగన్‌ అన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా