వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టులపై వైఎస్‌ జగన్‌ మండిపాటు

13 Aug, 2018 18:06 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నియంతృత్వ ధోరణిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. గురజాలలో సాగుతున్న మైనింగ్ కుంభకోణాన్ని పరిశీలించడానికి వెళ్లిన తమ పార్టీ నిజనిర్దారణ కమిటీ సభ్యులను అక్రమంగా అరెస్టు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు, గురజాలలో సెక్షన్‌ 144 విధింపు వంటివి.. మైనింగ్‌ కుంభకోణంలో నిందితులు ఎవరో చెప్పకనే చెప్తున్నాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. మీ కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికి, అక్రమాలపై నినదిస్తున్న గొంతుకలను అణచివేయడానికి ఎంతకాలం ఇలా క్రూరంగా పోలీసుబలాన్ని ప్రయోగిస్తారని సీఎం చంద్రబాబును వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

గుంటూరులో ప్రభుత్వ దాష్టీకం!
గుంటూరులోని అక్రమ క్వారీలపై వైఎస్సార్‌సీపీ నిజనిర్థారణ కమిటీ పర్యటనకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డుతగిలింది. ఎక్కడికక్కడ పార్టీ నేతలను అడ్డుకుంది. అక్రమ మైనింగ్ క్వారీలను పరిశీలించేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణతోపాటు లేళ్ల అప్పిరెడ్డి, ముస్తఫాలను మంగళగిరి కాజ టోల్‌గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి దుగ్గిరాల పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున దుగ్గిరాల పోలీసుస్టేషన్‌కు తరలివచ్చారు. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు, నిజనిర్దారణలో భాగంగా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నడికుడి రైల్వేస్టేషన్ వద్ద కృష్ణారెడ్డిని బలవంతంగా రైల్లోంచి దించి అరెస్టు చేశారు. జిల్లావ్యాప్తంగా హంగామా సృష్టిస్తున్న పోలీసులు అడుగడుగునా వైఎస్ఆర్‌సీపీ నేతలను అడ్డుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఎన్ని అరెస్టులు చేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు.

మరిన్ని వార్తలు