ఇలాంటి నాయకుడు అవసరమా?

15 Jul, 2018 03:07 IST|Sakshi
శనివారం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం గొల్లలమామిడాడ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఒక భాగం. ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

వెన్నుపోట్లు,అబద్ధాలు, మోసాలు.. 

చంద్రబాబు జీవితమంతా ఇంతే..

ఆలోచించాలని ప్రజలను కోరిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

బినామీలకు దోచిపెట్టడమే ఆయన లక్ష్యం 

ఎంపీ మురళీమోహన్‌ కూతురు పనిచేసే సంస్థకు ఎకరం రూ.8 లక్షల చొప్పున 32 ఎకరాలు.. 

ఈ భూముల విలువ ఎకరం రూ.50 లక్షలపైనే..

జనాన్ని ఇబ్బంది పెడుతున్న కేపీఆర్‌ ఇండస్ట్రీస్‌పై ఎందుకు చర్యలు తీసుకోరు? 

అందులో నాకు వాటా ఉందట..ఉంటే ఎందుకు అనుమతి రద్దు చేయరు?

ఇతరులపై బండలు వేయడం బాబుకు అలవాటే 

ఇక్కడ జీఎస్టీతో పాటు టీడీపీ ట్యాక్స్‌ కూడా కట్టాలట

ఎమ్మెల్యే మొదలు చినబాబు..పెదబాబు వరకు లంచాలు

తూర్పు గోదావరి జిల్లా గొల్లలమామిడాడ సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ధ్వజం

ప్రజా సంకల్ప పాదయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘వెన్నుపోట్లు పొడవడం, అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనని, ఆయన జీవితమంతా ఇంతేనని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా ఆయన బినామీలకు దోచిపెట్టడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి నాయకులు అవసరమా? ఆలోచించాలని ప్రజలను కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం 212వ రోజు ఆయన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని గొల్లల మామిడాడలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఎన్నికలప్పుడు ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అన్ని వర్గాల వారినీ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

పరిశ్రమలను పెట్టాల్సిన చోట పెట్టాలి.. 
‘‘ఇదే నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం బలభద్రపురంలో ల్యాండ్‌ సీలింగ్‌ ద్వారా ప్రభుత్వానికి దఖలు పడిన భూములను చంద్రబాబు.. ఆయన బినామీ రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ కుమార్తె పనిచేసే అసోసియేషన్‌కు ధారాదత్తం చేశారు. ఎకరం రూ.50 లక్షలు ఖరీదు చేసే భూములను ఎకరం రూ.8 లక్షల చొప్పున 32 ఎకరాలను ఆ సంస్థకు ధారాదత్తం చేస్తుంటే అడిగే నాథుడే కరువయ్యాడు. దోపిడీ ఇంత దారుణంగా జరుగుతోంది. 60 మంది నిరుపేద రైతులు ఆ భూములు అనుభవిస్తుంటే వాళ్లందరినీ తరిమేసి కబ్జాలకు పాల్పడ్డారు. అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీలుగా ఉండేవారు ఏవిధంగా చేస్తున్నారనేందుకు వేరే నిదర్శనం చెప్పక్కర్లేదు. ఈ నియోజకవర్గంలోకి వచ్చేటప్పుడు కేపీఆర్‌ ఇండస్ట్రీస్‌ కాలుష్యం గురించి చాలా బ్యానర్లు కనిపించాయి.

ఈ పరిశ్రమ వల్ల కాలుష్యం ఎక్కువగా వెలువడుతోందని, తాము అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు కావస్తోంది.. ఇంతవరకు ఆ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేశారా? పైగా ఇందుకోసం పోరాడిన 500 మందిపై కేసులు పెట్టారు. వాటిని ఇప్పటి వరకూ ఉపసంహరించలేదు. మన ప్రభుత్వం రాగానే కేపీఆర్‌ ఇండస్ట్రీస్‌ అనుమతులు రద్దు చేస్తాం. 500 మందిపై ఉన్న కేసులను ఉపసంహరిస్తాం. కేపీఆర్‌ ఇండస్ట్రీస్‌ యాజమాన్యానికి కూడా ఇదే చెబుతున్నాను.. పరిశ్రమలు చాలా అవసరం. అయితే అవి పెట్ట వలసిన ప్రదేశాల్లోనే పెట్టాలి. ప్రజలు ఇబ్బందులు పడేలా ఇలాంటి పరిశ్రమలు వద్దు. మీ పరిశ్రమను ఇక్కడి నుంచి మరొక చోటికి ప్రజలకు ఇబ్బంది లేని ప్రదేశంలో పెట్టండి. పరిశ్రమలొస్తే ఉద్యోగాలొస్తాయని ప్రజలు ఆరాట పడతారు. విశాఖపట్టణంలో ఫార్మా ఎస్‌ఈజడ్‌ ఉంది. అక్కడకు తీసుకెళ్లి ఆ యూనిట్‌ను పెట్టండి.. నేను మద్దతు ఇస్తాను.   
 
లంచాలు ఇవ్వందే ఏ పనీ జరగడం లేదు.. 
రాష్ట వ్యాప్తంగా జీఎస్టీ పేరుతో పన్నుల మోత మోగుతుంటే తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం టీడీపీ టాక్స్‌ ఉందని అనపర్తి ప్రజలు అంటున్నారు. టీడీపీ టాక్స్‌ను వసూలు చేసే బాధ్యత అనపర్తి ఎమ్మెల్యేకు అప్పగించారని, ఇక్కడ లంచాలు కలెక్టర్‌ నుంచి ఎమ్మెల్యేలకు, చినబాబు నుంచి పెదబాబు వరకూ అందున్నాయని కూడా చెబుతున్నారు. ఇదే నియోజకవర్గంలో లేఔట్లు వెయ్యాలంటే ఎకరాకు రూ.2 లక్షలు చెల్లించాల్సిందే. మద్యం షాపు నుంచి ఎమ్మెల్యేకు నేరుగా టాక్స్‌ వెళుతోందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో మద్యాన్ని విచ్చల విడిగా తాగిస్తున్నారు. ప్రతి మద్యం షాపు నుంచి ఎమ్మెల్యేకు రూ.2 లక్షలు మామూళ్లుగా కట్టిస్తున్నారు. చంద్రబాబు.. ఎన్నికల సమయంలో మద్యాన్ని తీసేస్తాను, బెల్టు షాపులు లేకుండా చేస్తాను అన్నారు.

ఇవాళ ఈ పెద్ద మనిషి పాలనలో మినరల్‌ వాటర్‌ లేని గ్రామం ఉందేమో గానీ మద్యం షాపు లేని గ్రామమే లేదన్నా.. అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. మా గ్రామంలో మా ఇంటి ముందరే మా వీధి చివరలోనే మద్యం షాపులు పెట్టి మా పిల్లలను తాగుబోతులుగా మారుస్తున్నారని అక్క చెల్లెమ్మలు వాపోతున్నారు. ఇక్కడ రైస్‌ మిల్లరు ధాన్యం కొనుగోలు చేస్తే చెయ్యని రవాణా చేసినట్లుగా చూపించి రూ.30 పన్ను విధిస్తున్నారు. అందులో రూ.10 ఎమ్మెల్యే వాటా కింద వెళుతోంది. మరో 20 రూపాయలు జిల్లా కలెక్టర్‌ ద్వారా చినబాబుకు చేరుతోందన్నా.. అని ఇక్కడి వారు చెబుతున్నారు. ఇక్కడ ల్యాండ్‌ కన్వర్షన్‌ చేస్తే ఎకరాకు లక్ష రూపాయలు లంచం ఇవ్వాల్సి వస్తోంది. ఇలా ఏది ముట్టుకున్నా లంచాలు తప్ప మరేమీ కనిపించని పరిస్థితి నెలకొని ఉంది.  
 
ఏం చెప్పారు? ఏం చేశారు? 
తమ రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత ఆ విషయాన్నే మరచిపోయారని రైతులు వాపోతున్నారు. రుణమాఫీ చేసేశానని చంద్రబాబు చెబుతుండటం మోసపూరితమేనని, ఆ మాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. ఈ పెద్దమనిషి పుణ్యమా అని ఇప్పుడు రైతులకు వడ్డీ లేని రుణాలే లభించడం లేదు. మరోవైపు వరికి మద్దతు ధర రూ.1550 అని చెబుతారు.. కానీ రైతు తన పంటను తీసుకుని వెళ్లి అమ్మాలని చూస్తే కొనే నాథుడే కనిపించడు. కొనుగోలు కేంద్రాల్లో బినామీలను పెట్టి అక్రమంగా ధాన్యాన్ని కొనిపిస్తారు. వారు చెప్పిందే ధర. మార్కెట్లో రైతన్న రూ.1130కి మించి అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాయి. నాలుగేళ్లుగా ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు.

ఇలా రైతులకు మద్దతు ధర రాకపోవడానికి కారణం చంద్రబాబు హెరిటేజ్‌ సంస్థను కలిగి ఉండటమే. రైతుల దగ్గరనుంచి చౌకగా అన్నీ కొనుగోలు చేసి, వాటిని ప్యాక్‌ చేసి హెరిటేజ్‌లో మూడు నాలుగు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతూ ఉంటారు. దళారీలను తీసెయ్యాల్సిన ముఖ్యమంత్రి తానే దళారీలకు నాయకుడై రైతులకు గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం సబబేనా? ఇదే నియోజకవర్గంలో లింగాల చెరువు, రాళ్ల కాండ్రిక చెరువు, వెంకటరాయ చెరువుల్లో మట్టి తవ్వుకుని మట్టిని కూడా సొమ్ము చేసుకుంటున్నారు. మట్టి తవ్వినందుకు ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకుంటారు, ఆ తర్వాత మట్టి అమ్మినందుకు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి మట్టి చుట్టుపక్కల ప్రాంతాలకే కాకుండా నేరుగా రావులపాలెం వరకూ పోతోంది.  
 
పేదలనూ వదల్లేదు.. 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అనపర్తి మండలంలో 36 ఎకరాలు, బిక్కవోలులో 19 ఎకరాలు పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. గొల్లల మామిడాలలో దాదాపు 800 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇదే నియోజకవర్గంలో 16 వేల పక్కా ఇళ్లు కట్టించిన ఘనత కూడా దివంగత నేతదేనని చెబుతున్నారు. అప్పుడు నాన్నగారు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఇప్పుడు టీడీపీ వారు లాక్కుంటున్నారు.

పేదలకు ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్లు కట్టించాల్సింది పోయి వాటిని లాక్కోవడం ధర్మమేనా? నాలుగేళ్లుగా చంద్రబాబు అన్యాయమైన పాలనను చూశారు కాబట్టి మీ గుండెలపై చేతులు వేసుకుని ఎలాంటి నాయకుడు కావాలో అని ఆలోచించండి. అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసాలు చేసేవాళ్లు మీకు నాయకుడుగా కావాలా? ఇలాంటి చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఈ వ్యవస్థలో నిజాయితి, విశ్వసనీయతను తీసుకురావాలంటే అది జగన్‌ ఒక్కరి వల్లనే సాధ్యం కాదు. మీ అందరి తోడు, దీవెనలు కావాలి. అబద్ధాలు చెప్పే, మోసం చేసే నాయకులను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకురావాలి’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.  

ఊళ్లకు ఊళ్లే తరలివచ్చిన వేళ.. 
ఊలపల్లి.. బిక్కబోలు.. గొల్లల మామిడాడ.. ఒక ఊరికి మరో ఊరు ఎడంగా ఉన్నప్పటికీ శనివారం జగన్‌ యాత్ర సందర్భంగా అన్ని ఊర్లూ జనంతో కలిసి పోయాయి. ఉదయాన్నే ఊలపల్లి నుంచి జగన్‌ నడకను ప్రారంభించేటప్పటికే ఎటు చూసినా ఆ పల్లెలో జనమే జనం. జగన్‌కు ఎదురొచ్చి అభినందించే వారు కొందరైతే, వెంట నడిచే వారు మరికొందరు. జగన్‌ ముందుకు సాగుతుంటే జన సందోహం వెనకాలే వెల్లువలా అనుసరించింది. దారి పొడవునా వేలాది మంది జననేతను అనుసరించారు. బిక్కవోలు దాటాక సంప్రదాయక రీతిలో రైతులంతా జగన్‌కు స్వాగతం పలకడం హైలైట్‌గా నిలిచింది. గొల్లలమామిడాడ బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకునేటప్పటికి అక్కడ కూడలిలో ఇసకేస్తే రాలనంతగా జనం గుమికూడారు. చిరుజిల్లులతోనే వర్షం ప్రారంభమైనా జనం లెక్క చేయలేదు. అలాగే నుంచుని జగన్‌ ప్రసంగం విన్నారు. కానీ వర్షం పెరిగేటప్పటికి తడిస్తే తనకు ఎలాంటి భాద లేదు కానీ.. జనానికి అసౌకర్యం కలిగకూడదని చెబుతూ జగన్‌ తన ప్రసంగాన్ని త్వరగా ముగించారు. నాలుగేళ్లుగా అన్నీ కష్టాలేనంటూ వివిధ వర్గాల వారు దారిపొడవునా సమస్యలు చెప్పుకున్నారు.   

కాలుష్యం వెదజల్లుతోన్న కేపీఆర్‌ ఇండస్ట్రీస్‌ అనుమతులు రద్దు చేయరు. ఇందుకోసం పోరాడిన వారిపై కేసులను ఉపసంహరించరు. కానీ ఓట్ల కోసం మోసపూరితంగా మాట్లాడతారు. పైగా ఆ ఇండస్ట్రీస్‌లో జగన్‌కు భాగస్వామ్యముందని ప్రచారం చేస్తారు. నాకే భాగస్వామ్యముందంటున్నారు కనుక ఆ ఇండస్ట్రీస్‌ అనుమతులు ఎందుకు రద్దు చేయరు? ఈ ఇండస్ట్రీని రద్దు చేయడానికి మీరెందుకు వెనుకడుగు వేస్తున్నారు బాబూ? 
 
తుని దగ్గర, కాకినాడ చుట్టుపక్కల ఎస్‌ఈజడ్‌ ఉంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాగలి పట్టి ఆ భూములన్నీ తాను అధికారంలోకి వచ్చాక రైతులకు తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు. ఆ రోజు ఆ ఎస్‌ఈజడ్‌ భూముల్లో జగన్‌కు భాగస్వామ్యం ఉందన్నారు. ఇప్పుడు ఆయన అధికారంలోవచ్చి నాలుగేళ్లయింది. ఎందుకు ఆ భూములను రైతులకు తిరిగి ఇవ్వలేదు? నోరు తెరిస్తే అవతలి వారిపై బండలు వేయడం, అబద్ధాలు ఆడటం చంద్రబాబుకు అలవాటైపోయింది. ఆయన జీవితమంతా వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు చెప్పడంలోనే గడిచి పోతోంది.  

మరిన్ని వార్తలు