కేంద్రంలో హంగ్‌ రావాలని దేవుణ్ణి ప్రార్థించా

28 May, 2019 03:36 IST|Sakshi

సీఎన్‌ఎన్‌ న్యూస్‌18 ఇంటర్వ్యూలో వైఎస్‌ జగన్‌

‘ఏ జాతీయ పార్టీకి అయినాసరే దేశం మొత్తమ్మీద 250 లోక్‌సభ స్థానాలకంటే ఎక్కువ రాకూడదని భగవంతుని ప్రార్థించా. అలా అయితేనే ప్రాంతీయ పార్టీల అవసరం జాతీయ పార్టీలకు తెలిసి వచ్చి మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఆశించాను’ అని సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18’ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఇలా..

సీఎన్‌ఎన్‌: హోదా ఇవ్వడం కుదరదని, రాజ్యాంగం అనుమతించదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. మరి ప్రధాని మోదీతో ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా?
వైఎస్‌ జగన్‌ : ప్రభుత్వం ఆ మాట చెప్పడం గతం. అవసరం అన్నీ నేర్పుతుందని అంటారు. ఈ ఎన్నికల్లో అదే జరుగుతుందని మేము ఆశించాము. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనంత సంఖ్యలో సీట్లు రాకపోతే ఎవరైనా సరే మాకు ప్రత్యేక హోదా ఇస్తారని మేము అనుకున్నాం. ఇలాగే జరగాలని నేను దేవుడిని ప్రార్థించాను కూడా. దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రత్యేక హోదాపై స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు. కేంద్రం కూడా తగు విధంగా ప్రతిస్పందించలేదు. హంగ్‌ పార్లమెంట్‌ ఏర్పడితే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని అనుకున్నాం. నరేంద్ర మోదీని కలసి ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేశాము. రాష్ట్రం పరిస్థితి ఏమిటి, ప్రత్యేక హోదా అవసరం అన్నది వివరించాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంకెలన్నీ వివరించి మీ సాయం కావాలని కోరాను.

సీఎన్‌ఎన్‌: మరి ఆయన స్పందన ఏమిటి? 
వైఎస్‌ జగన్‌ : ఆయన అన్ని అంశాలను ఓపికగా విన్నారు. సానుకూలంగా స్పందించారు కూడా. నేను ఇంకో అడుగు ముందుకేసి.. ఈ రోజు మీకు మా అవసరం లేకపోవచ్చు. కానీ.. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా మీరు మీ ఔదార్యాన్ని చాటుకోవచ్చునని చెప్పాను. అధికారంలో ఉన్న మీరు ఈ సాయం చేయగలిగితే ఈ దేశ ప్రజలకు, ఏపీ ప్రజలకూ ఓ చక్కటి సందేశం అందుతుందని తెలిపాను. ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకూ ఆ డిమాండ్‌ను కొనసాగిస్తాం. ప్రధానిని నేను కలవడం ఇదే మొదటిసారి. ఇకపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆయన సాయం కోరుతూ బహుశా ప్రతి నెల కలుస్తానేమో. ఇలా కలిసిన ప్రతిసారి ఆయన్ను ప్రత్యేకహోదా గురించి అడుగుతూనే ఉంటా. ఏదో ఒకరోజు ఆయన ఒప్పుకునేంత వరకూ అడుగుతూనే ఉంటా.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు