ఇంత అరాచకమా?

17 Apr, 2019 03:30 IST|Sakshi
గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌. చిత్రంలో పార్టీ నేతలు

టీడీపీ దాడులు చేస్తే మాపై కేసులా?  

తక్షణం జోక్యం చేసుకోండి

గవర్నర్‌కు వైఎస్‌ జగన్‌ వినతి

మా కార్యకర్తలపై పోలింగ్‌ తరువాత కూడా టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి

నిందితులపై కాకుండా బాధితులపైనే కేసులా?

కోడెల పోలింగ్‌ బూత్‌ ఆక్రమిస్తే వెంటనే కేసు ఎందుకు పెట్టలేదు?

మా ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిపై దాడి చేసినవారిపై కేసు పెట్టలేదు

ఓడిపోతున్నానని తెలిసే ఈవీఎంలపై చంద్రబాబు నిందలు

2014 ఎన్నికలు, నంద్యాల ఉప ఎన్నికల్లో బాబు నెగ్గింది ఈవీఎంలతో కాదా?

పార్టీ ప్రతినిధి బృందంతో కలసి గవర్నర్‌తో సమావేశమైన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

తాను (చంద్రబాబు) గెలిస్తేనేమో అన్నీ బాగున్నట్లేనా? తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓట్లేయలేదనే విషయాన్ని ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నెపాన్ని నెట్టేస్తాడు. ఆయన బుద్దే అలాంటిది. ఐదేళ్లుగా ఆయన బుద్ధి అలాగే ఉంది.

ప్రజలు చంద్రబాబు ఐదేళ్ల పాలన చూశారు, ఆయన మోసాలనూ చూశారు. ఆయన చేసిన అన్యాయాలు, అధర్మ పాలన కూడా చూశారు. చంద్రబాబు పరిపాలన చూసి విసుగెత్తిన ప్రజలు ఇక వద్దు బాబూ నీ పాలన ... బైబై బాబూ అని చెప్పేశారు. ఓడిపోతున్నాననే విషయం తెలిసి కూడా అందుకు మోసపూరిత పాలనే కారణం అనే సంగతి అంగీకరించకుండా ఈవీఎంలపైనో లేకుంటే ఇంకొకరిపైనో నెపాన్ని నెట్టేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేయటాన్ని అంతా చూస్తున్నాం. ఇటువంటి దుర్మార్గుడు, మోసగాడు, రాక్షసుడు, అన్యాయస్థుడు, ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత త్వరగా మేలు జరుగుతుంది.  

గెలిస్తేనేమో... సింధుకు నేనే బాడ్మింటన్‌ ఆడటం నేర్పించానంటాడు. బిల్‌గేట్స్‌కు కంప్యూటర్‌ ఎలా నొక్కాలో నేనే నేర్పించానంటాడు. సెల్‌ఫోన్‌ను నేనే కనిపెట్టానంటాడు. ఎక్కడైనా వీధిలైట్లు వెలగకపోతే నాకు కంప్యూటర్‌లో కనిపిస్తుంది అని చెబుతారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం సింధు కోచ్‌ది తప్పు... నా కంప్యూటర్‌ కరెక్టే కానీ బిల్‌గేట్స్‌ బటన్‌ సరిగ్గా నొక్కలేదు అనే మాటలు మాట్లాడతాడు. ఇదీ చంద్రబాబు తీరు.

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిన నేపథ్యంలో గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోలింగ్‌ రోజు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, పార్టీ అభ్యర్థులపై టీడీపీ యధేచ్ఛగా దాడులకు పాల్పడితే బాధితులపైనే కేసులు బనాయిస్తున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన 40 మందికి డీఎస్పీలుగా ఇష్టానుసారం ప్రమోషన్లు ఇవ్వడంతో వారంతా అధికార పార్టీ కనుసన్నల్లో నడుచుకున్నారన్నారు. ఏపీలో  పోలింగ్‌ అనంతరం కూడా విపక్ష నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయని వైఎస్‌ జగన్‌ గవర్నర్‌ దృష్టికి తెచ్చారు. వైఎస్‌ జగన్‌ మంగళవారం ఉదయం 11 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. పార్టీ సీనియర్‌ నేతలు, పలువురు ఎమ్మెల్యేలు జగన్‌ వెంట ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన పరిస్థితులను దాదాపు 45 నిమిషాల పాటు గవర్నర్‌కు వివరించి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వైఎస్‌ జగన్‌ రాజ్‌భవన్‌ బయట మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

హైదరాబాద్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలసి వినతి పత్రం ఇస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.చిత్రంలో పార్టీ సీనియర్‌ నేతలు మోదుగుల, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద్, ఆదిమూలపు సురేష్, పార్థసారథి

పోలింగ్‌ బూత్‌లోకి చొరబడటం నేరం కాదా?
‘’నిన్న ఎంపీలతో కూడిన మా పార్టీ బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి ఏపీలో పోలింగ్‌ రోజు, ఆ తరువాత కూడా జరుగుతున్న అరాచకాలు, దౌర్జన్యాలు, అన్యాయాలపై వినతిపత్రం ఇచ్చింది. అవే అంశాలతోపాటు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలపై ఇప్పుడు గవర్నర్‌కు వినతిపత్రం అందచేశాం. రాష్ట్రంలో దాడులు జరుగుతున్న తీరు, ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరుండి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు సంబంధించిన వ్యక్తుల ద్వారా ఎలా దొంగ కేసులు పెడుతున్నారో గవర్నర్‌ దృష్టికి తెచ్చాం. సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్‌ బూత్‌లోకి చొరబడ్డారు. ఇలా బూత్‌లోకి వెళ్లడం ఒక నేరమైతే, లోపలకు వెళ్లి పోలింగ్‌ బూత్‌ డోర్‌ను లాక్‌ చేసుకున్నారు. ఇది రికార్డు కూడా అయింది. మరి పోలింగ్‌ బూత్‌లో అధికారులు, ఏజెంట్లు లేరా? వీళ్ల సమక్షంలో కోడెల బూత్‌ లోపలికి వెళ్లి పోయి డోర్‌ లాక్‌ చేసుకుని తన చొక్కా తానే  చింపుకున్నారు. ఇదంతా వీళ్లందరి సమక్షంలో జరిగితే ఆయనపై కేసులు ఎందుకు పెట్టలేదు? ఇలా పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి డోర్‌ లాక్‌ చేసుకోవడం శిక్షార్హమైన నేరం కాదా? కేసు పెట్టదగిన నేరం కాదా? పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి డోర్‌ లాక్‌ చేసుకుని భయభ్రాంతులకు గురి చేయవచ్చా? చొక్కా చింపుకోవడం లాంటివి అక్కడ చేయొచ్చంటారా! మరెందుకు ఆయనపై కేసు పెట్టలేదు?

టీడీపీకి ఓట్లేయలేదని ముస్లింలు, ఎస్సీలపై దాడులు
గురజాల నియోజకవర్గంలో టీడీపీకి ఓట్లేయలేదని ముస్లింలు, ఎస్సీల ఇళ్లపై యధేచ్ఛగా దాడులు చేసి కొట్టవచ్చా? వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? ఇలా ప్రతి సందర్భంలోనూ దాడులు చేశారు. మా కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిని ఏకంగా గదిలో పెట్టి లాక్‌ చేసి టీడీపీ వారు దారుణంగా కొట్టారు. ఆమెపై దాడి జరిగినపుడు పోలీసులు వెళ్లి విడిపించుకుని రావాల్సిన పరిస్థితి వచ్చింది. మరెందుకు వారిపై కేసు పెట్టలేదు? పూతలపట్టు నియోజకవర్గంలో కూడా ఇదే మాదిరిగా ఎస్సీ వర్గానికి చెందిన మా అభ్యర్థి ఎం.ఎస్‌ బాబును పోలింగ్‌ రోజు కొట్టారు. బాబు తలకు కుట్లు పడ్డాయి. ఈ రోజు కూడా ఆసుపత్రిలోనే ఉన్నారు. మరి ఎందుకు కేసులు పెట్టలేదు? అసలు రాష్ట్రంలో శాంతి భధ్రతలెక్కడున్నాయి?.

టీడీపీ తొత్తుల్లా ఆ డీఎస్పీలు..
ఒకే సామాజిక వర్గానికి చెందిన నలభై మంది డీఎస్పీలకు ఇష్టమొచ్చినట్లు ప్రమోషన్లు ఇచ్చారు. మిగతా వారికెవ్వరికీ ఇవ్వలేదు. ఒకే కులానికి చెందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమోషన్లు ఇచ్చారు. దీనిపై గతంలో మేం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేశాం. ఆ డీఎస్పీలు వీళ్ల (టీడీపీ) తొత్తులుగా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. వీరికి నచ్చిన వారిని ఎస్పీలుగానూ, ఇతరత్రా స్థానాల్లోనూ, శాంతిభద్రతలు, ఇంటెలిజెన్స్‌ విభాగాల్లోనూ ఇష్టానుసారంగా పోస్టింగ్‌లు ఇచ్చారు. శాంతి భద్రతలు ఇవాళ ఇంత దారుణంగా దిగజారితే బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితుల్లోకి ఈ వ్యవస్థ దిగజారిపోయింది. అందుకనే జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు మేం విజ్ఞప్తి చేశాం.
 
అభ్యర్థులు లేకుండా స్ట్రాంగ్‌ రూం ఎందుకు తెరిచారు?

మచిలీపట్నంలో వీళ్లు (టీడీపీ) నియమించుకున్న ఆర్డీవోలు, కలెక్టర్లు ఏకంగా స్ట్రాంగ్‌ రూం డోర్లు ఓపెన్‌ చేసి ఈవీఎంలను బయటకు తీశారు. ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూంలను తెరవాలంటే పోటీ చేసిన అభ్యర్థులను అక్కడకు పిలవాలి. అదంతా అభ్యర్థుల సమక్షంలోనే జరగాలి. అభ్యర్థులను ఎందుకు పిలవలేదు? ఈ విషయాన్ని కూడా గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాం.   

కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలి..
ఈవీఎంలున్న స్ట్రాంగ్‌ రూంలకు రక్షణగా పారామిలటరీ భద్రతా బలగాలను నియమించాల్సిందే. అక్కడ భద్రత కూడా పెంచాల్సిందే. వీటి భద్రతను రాష్ట్ర ప్రభుత్వం పరిధి నుంచి తప్పించాలి. కేంద్ర బలగాలు  స్ట్రాంగ్‌ రూంలను పూర్తిగా తమ అదుపులోకి తీసుకోవాలి. అక్కడ అమర్చిన సీసీ కెమెరాల లైవ్‌ ఫీడ్‌ కలెక్టర్‌ కార్యాలయాలకు కాకుండా నేరుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. ఈవీఎంల భద్రతకు సంబంధించి గట్టి చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ దృష్టికి తీసుకు వెళ్లాం.

ఆధారాలను మాయం చేసే యత్నాలు..
చంద్రబాబు అధికారం కోల్పోతున్న తరుణంలో ఐదేళ్లుగా చేసిన కుంభకోణాలకు సంబంధించిన ఆధారాలను మటుమాయం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలా జరగకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తగిన ఆదేశాలివ్వాలని గవర్నర్‌ను కోరాం. ఇదే కాకుండా చంద్రబాబు తనకు సంబంధించిన బినామీలు, కాంట్రాక్టర్లకు విచ్చలవిడిగా చెక్కులు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ నివారించాలని కోరాం. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు చంద్రబాబు సచివాలయాన్ని దుర్వినియోగం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరాం’’

గవర్నర్‌ను కలసిన పలువురు నేతలు...
వైఎస్‌ జగన్‌తోపాటు గవర్నర్‌ను కలిసిన ప్రతినిధి బృందంలో పార్టీ సీనియర్‌ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, కె.పార్థసారథి, జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, ఆదిమూలపు సురేష్, కోన రఘుపతి, కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గుంటూరు ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి, డీవై దాస్, ఇతర నేతలు ఎం.అరుణ్‌కుమార్, కాకుమాను రాజశేఖర్‌ తదితరులున్నారు.

సరిపోలాయి కాబట్టే సంతృప్తి చెందారు...
ఈవీఎంల పనితీరుపై సీఎం చంద్రబాబు చేస్తున్న విమర్శలతోపాటు మీడియా ప్రతినిధులు ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ప్రతిస్పందించారు. ‘మీరంతా చంద్రబాబును సూటిగా ఒక ప్రశ్న అడగాలి. రాష్ట్రంలో దాదాపు 80 శాతం మంది ఓటర్లు ఈవీఎంలలో ఓట్లేశారు. ఇదొక రికార్డు స్థాయి పోలింగ్‌. ఓటర్లంతా పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంలో బటన్‌ నొక్కాక ఏ పార్టీకి ఓట్లేశారన్న విషయం వారికి వీవీ ప్యాట్లలో కనిపించింది. వారు వేసిన ఓటు, వీవీ ప్యాట్‌లో కనిపించింది రెండూ సరిగ్గా సరిపోయాయి కాబట్టే సంతృప్తిగా బయటకు వచ్చారు. ఇలా ఓట్లేసిన 80 శాతం మంది ఓటర్లలో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. నేను ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి బటన్‌ నొక్కాక వీవీ ప్యాట్‌లో సైకిల్‌ గుర్తు కనిపిస్తే ఎందుకు మౌనంగా ఉంటా? గమ్మున ఉండను కదా... అక్కడే బూత్‌లోనే ఫిర్యాదు చేసి ఉండేవాడిని కదా? ఈవీఎంపై మీట నొక్కిన తరువాత వీవీ ప్యాట్‌లో వేరే గుర్తుకు ఓటు పడినట్లు కనిపించలేదు కాబట్టే 80 శాతం మంది సంతృప్తి చెందారు. సంతృప్తి చెందారు కాబట్టే బూత్‌లో పోలింగ్‌ అధికారికి ఎక్కడా ఫిర్యాదులు చేసిన సంఘటనలు లేవు. ఇవన్నీ చంద్రబాబుకు తెలిసినా తానెవరికి ఓటు వేశానో తనకే తెలియదని చెబుతూ సినిమాలో ఒక విలన్‌ మాదిరిగా పాత్రను పోషిస్తూ డ్రామాలు చేయడం ఎంత వరకు ధర్మం? అని అడుగుతున్నా.

ఇలాంటి పనులు సీఎం స్థాయి వ్యక్తికి తగునా?
ఇక రెండో విషయం కూడా ఆయన్ను అడుగుతున్నా..  పోలింగ్‌ మొదలయ్యే ముందుగా బూత్‌లలో అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను చెక్‌ చేస్తారు. అవెలా పని చేస్తున్నాయో పరీక్షిస్తారు. పోలింగ్‌ ఏజెంట్లు 50 ఓట్లు మాక్‌ పోలింగ్‌ చేస్తారు. ఈవీఎంపై వారు బటన్‌ నొక్కిన గుర్తు వీవీ ప్యాట్‌లపై కనిపించే గుర్తు రెండూ ఒకటేనా అని సరి చూసుకుంటారు. చూసుకున్న తరువాత ఏజెంట్లందరూ సంతకాలు పెడతారు. మేం పరీక్షించాం, 50 ఓట్లను కూడా వేశాం, ఈవీఎంలు బాగా పని చేస్తున్నాయి అని సంతకాలు చేస్తారు. అలా సంతకాలు పెట్టిన తరువాతే సాధారణ ఓటర్లను పోలింగ్‌లో పాల్గొనడానికి అనుమతిస్తారు. టీడీపీ ఏజెంట్లు అంతా సరిచూసుకుని సంతకాలు చేసిన తరువాతే పోలింగ్‌ మొదలైంది. అలాంటప్పుడు మరి ఈవీఎంలలో అవి జరిగాయి...ఇవి జరిగాయి... అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ చంద్రబాబు ఎలా చెబుతారు? నేనెవరికి ఓటేశానో నాకే తెలియదంటూ ప్రజలను తప్పు దోవ పట్టించడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగిన పనేనా?

2014లో మీరు గెలిచింది ఈవీఎంలతో కాదా?
ఇక మూడోది, చంద్రబాబును మీ తరపున అడుగుతున్నా. మీరు కూడా ఆయన్ను అడగండి... ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు 2014లో గెలిచింది ఈవీఎంలతో కాదా? అప్పుడింకా వీవీ ప్యాట్లు కూడా లేవు. మరి అప్పుడు బటన్‌ ఎవరికి నొక్కామో...? ఓటెవరికి పడిందో? అని మేం అన్నామా? ఇపుడైతే వీవీ ప్యాట్‌ వచ్చింది. ఈవీఎంపై మీట నొక్కాక వీవీ ప్యాట్‌పై ఎవరికి ఓటేశామో కనిపిస్తుంది. 2014లో చంద్రబాబు గెలిచినపుడు వీవీ ప్యాట్‌ కూడా లేదు. అయినా మేమేమీ అనలేదు. ఆ తరువాత నంద్యాల ఉప ఎన్నికలు నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి 30 వేల మెజారిటీతో గెలిచాడు. అప్పుడూ ఈవీఎంలు, ఇదే వీవీ ప్యాట్‌. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమీ లేదు. అన్నీ బాగున్నట్లే! వీవీప్యాట్లు, ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నట్లే. మరి ఇవే ఈవీఎంలతో సాధారణ ఎన్నికలకు మూడు నెలల ముందు రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. కర్నాటకలో కూడా గెలిచింది. బీజేపీ ఓడిపోయింది. మరి అప్పుడు కూడా వినియోగించింది ఇవే ఈవీఎంలు కదా...? మరి అపుడెందుకు చంద్రబాబు మాట్లాడలేదు? తనకు వ్యతిరేకంగా ఓట్లేస్తున్నారని తెలిసి, ప్రజల గాలి తనవైపు లేదని తెలిసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారంటే ఆయన నిజంగా మనిషేనా? అని అడుగుతున్నా’’ అని జగన్‌ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు