బాబుకు ఒడిశా వెళ్లాలన్న ధ్యాస లేదు : వైఎస్‌ జగన్‌

27 Mar, 2019 11:31 IST|Sakshi

సాక్షి, విజయనగరం : తమిళనాడులో ఉన్న ఎంకే స్టాలిన్‌, పశ్చిమ బెంగాల్‌లో ఉన్న మమతా బెనర్జీ, ఢిల్లీలో రాహుల్‌ గాంధీని కలిసేందుకు ప్రత్యేక విమానాల్లో తిరిగే సీఎం చంద్రబాబుకు ప్రజల సమస్యలు పట్టవని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. దేశమంతా తిరిగే చంద్రబాబుకు పక్కనే ఉన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను కలుసుకునే ధ్యాస లేదని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తలపెట్టిన జంఝావతి రబ్బర్‌ డ్యామ్‌ను బాబు నిర్లక్ష్యం చేశాడని ఆయన మండిపడ్డారు.

ఒడిశా సీఎంతో చర్చలు జరిపి రబ్బర్‌ డ్యామ్‌ను అందుబాటులోకి తేవచ్చు కదా అని హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ జగన్‌ బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురం బహిరంగ సభలో మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఎన్నికల బరిలో దిగిన వైఎస్సార్‌సీపీ పార్వతీపురం ఎమ్మెల్యే అభర్థి ఎ.జోగారావు, అరకు ఎంపీ అభ్యర్థి గొడ్డేటి మాధవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వీరిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్‌ పిలుపునిచ్చారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే... 

‘చంద్రబాబు  ఐదేళ్ల పరిపాలన చూశాం. వెనకబడిన విజయనగరం జిల్లాకు బాబు చేసిన అభివృద్ధి ఒక పెద్ద సున్నా. 2014 ఎన్నికల్లో మాయమాటలు చెప్పాడు. ఇప్పుడు ఎన్నికల ముందు మళ్లీ అవే డ్రామాలు మొదలు పెట్టాడు. ఈ జిల్లాకు మంచి చేయాలనే ఆలోచన చేసిన ఏకైన వ్యక్తి మహానేత వైఎస్సార్‌ మాత్రమే. రైతుల కోరిక మేరకు ఆయన ప్రభుత్వం హయాంలో తోటపల్లి ప్రాజెక్టు చేపట్టారు. రూ.450 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 400 కోట్లు ఖర్చుచేసి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేయించారు. కానీ, మిగిలిపోయిన 10 శాతం పనులు చేయలేక చంద్రబాబు ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేసింది. ఈ ప్రాజెక్టు కింద లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా.. ఇంకా 80 వేల ఎకరాలకు నీళ్లివ్వని పరిస్థితి ఉంది. ఒడిషాతో వివాదం ఉన్నా కూడా నాన్నగారు జిల్లా రైతులకు మంచి చేయడానికి ముందుకొచ్చారు. జంఝావతి రబ్బర్‌ డ్యామ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు మాత్రం ఆ ప్రాజెక్టును ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రత్యేక విమానాల్లో తిరిగే చంద్రబాబు పక్కనే ఉన్న ఒడిషా సీం నవీన్‌ పట్నాయక్‌తో చర్చలు జరిపి ఉంటే జంఝావతి, వంశధార ప్రాజెక్టులు పూర్తయ్యేవి. రైతులకు మేలు జరిగేది’ అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

‘పార్వతీపురం పురపాలక సంఘంలో తాగునీటి సమస్య ఉంది. నాగవళి నేలబావులు పాడైపోతే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏరియా ఆస్పత్రిని 100 పడకల నుంచి 200 పడకల ఆస్పత్రిగా చేస్తామని చెప్పి గత ఎన్నికల్లో బాబు హామీనిచ్చాడు. కానీ, పట్టించుకోలేదు. అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉండాల్సింది పోయి.. ఆ సంస్థ ఆస్తులను కాజేయడానికి బాబు, అతని బినామీలు యత్నించారు. ఆ భగవంతుడి ఆశీస్సులు.. మీ అందరి దీవెనలతో  3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ప్రతి అడుగులో.. జిల్లాలోని ప్రతి కుటుంబం పడుతున్న ఆవేదన, కష్టాలు విన్నా. ప్రభుత్వం సాయంలేక మీ అందరూ ఎంత బాధపడుతున్నారో చూశా. ఈ వేదికపైనుంచి మీ అందరికీ చెప్తున్నా. మీ అందరికీ నేనున్నాను అని మాట ఇస్తున్నా’ అని వైఎస్‌ జగన్‌ ప్రసంగం కొనసాగించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు