తాడేపల్లి చేరుకున్న వైఎస్‌ జగన్‌

22 May, 2019 20:06 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లి చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి వైఎస్‌ జగన్‌ రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి వచ్చారు. తమ అభిమాన నేత వస్తున్న తరుణంలో పార్టీ శ్రేణులు దారి పొడవునా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్‌ జగన్‌కు గట్టి భద్రత, పోలీస్‌ శాఖ ఆదేశాలు
మరోవైపు తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ‘జడ్‌’ క్యాటగిరీ భద్రతలో ఉన్నందున ఆ మేరకు పోలీసు సిబ్బందిని ఇవ్వాలని, వైఎస్‌ జగన్‌ సంచారానికి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. ఆయన బుధవారం హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి బయలు దేరేటపుడు రాజీవ్‌గాంధీ విమానాశ్రయం వరకూ ఈ భద్రతా ఏర్పాట్లు సమకూర్చాలని ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖకు చెందిన అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (ఇంటెలిజెన్స్‌) ఈ నెల 21న ఒక సందేశాన్ని తెలంగాణ పోలీసులకు పంపగా వారు ఆ మేరకు భద్రతను కల్పించారు. 

అదేవిధంగా గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరులోని తాడేపల్లి నివాసానికి ఆయన చేరుకున్నపుడు, ఆ తరువాత కూడా నిబంధనలను అనుసరించి భద్రతను, బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని సమకూర్చే విధంగా విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ను, గుంటూరు రూరల్‌, అర్బన్‌ ఎస్పీలను అదనపు డీజీ ఆదేశించడంతో అక్కడ కూడా వారు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. సమాచారం కోసం ఈ సందేశాన్ని ఏపీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుకు కూడా పంపారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఫ్యాన్‌ గాలి వీస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించడంతో...రేపటి ఫలితాల తర్వాత భారీగా అభిమానులు అక్కడకు చేరుకునే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ‍్రత‍్తలు చేపట్టారు.

మరిన్ని వార్తలు