మాటకు పట్టాభిషేకం

22 Jul, 2020 10:04 IST|Sakshi
పండుల రవీంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్‌మోహన్‌రెడ్డి (ఫైల్‌)

హామీ ఇచ్చారు... నిలబెట్టుకున్నారు

పండుల రవీంద్రబాబుకు ఎమ్మెల్సీ

అంబాజీపేట సభలో జగన్‌ హామీ

గవర్నర్‌ కోటాలో మండలికి

జిల్లా నుంచి దళితులకు తొలి అవకాశం

హామీ అంటేనే హాస్యాస్పదంగా మారిపోయిన రోజులివి...ఎన్నికల ముందు ఇతర పార్టీల నేతలను ఆకర్షించడానికి ఎన్నోచెబుతారు..అధికారంలోకి వస్తే అవన్నీ నీటిమీద రాతలేనంటూపెదవి విరిచేవారే అధికం. అది వారి తప్పుకాదు... గత పార్టీలన్నీ ఇచ్చిన మాటకు తిలోదకాలిస్తూ నమ్మినవారిని నట్టేట ముంచడంతోమాటపై నమ్మకం పోయింది. ఆ సమయంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలు... అధికారంలోకి వచ్చిన తరువాత ఆచరణలో పెట్టిన తీరును చూసి ప్రతిపక్షాలకు కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. మాటకు పట్టం కడుతున్న ఆయన తీరు పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మాట ఇవ్వడమే కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే మాటలు కాదు. అందునా ప్రస్తుత రాజకీయాల్లో మరీ కష్టం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం ఆషామాషీ వ్యవహారం కానే కాదు. ఎన్నికల ముందున్న పరిస్థితులు వేరు, ఎన్నికలై అధికారంలోకి వచ్చాక పరిణామాలు అనేక మలుపులు తిరుగుతుంటాయి. రాజకీయాల్లో ఇవన్నీ సహజమనే ధోరణిలో ఇచ్చిన మాట గాలిలో కలిపేసే పార్టీలు, నాయకులే ఎక్కువగా ఉంటారు. మాట నిలుపుకోవడం ఏ రాజకీయ పార్టీలో అయినా చాలా అరుదనే చెప్పొచ్చు. ఇందుకు పూర్తి భిన్నమైన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. నాడు ప్రతిపక్ష నాయకుడిగా, నేడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒకే మాట ఒకే బాట అని మరోసారి కార్యాచరణ ద్వారా చూపించారు.

గవర్నర్‌ కోటాలో శాసనమండలికి భర్తీ చేయనున్న రెండు స్థానాల్లో ఒక స్థానానికి జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించారు. గవర్నర్‌కు సీఎం పంపించిన జాబితాలో మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబుకు అవకాశం కల్పించారు. కేవలం మాట కోసం తన తండ్రి మహానేత వైఎస్‌ çహఠాన్మరణం తరువాత పదవులను సైతం త్యాగం చేసి విశ్వసనీయ నేతగా నిలిచిన పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ను సీఎం జగన్‌ ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. నమ్మి వచ్చిన నాయకుడి గెలుపు, ఓటముల ప్రమేయం లేకుండా వరుసగా పదవులు కట్టబెట్టి మాట నిలబెట్టుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో మండపేట నుంచి పోటీచేసిన బోస్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితోపాటు రెవెన్యూశాఖను కూడా ఇచ్చారు. మండలి రద్దుయ్యే నేపథ్యంలో పదవులకు రాజీనామా చేసిన బోస్‌కు అత్యున్నతమైన రాజ్యసభ (పెద్దల సభ)కు పంపించారు.

ఆనాటి సభలో హామీ ఇలా నెరవేర్చి
ఇప్పుడు ఎమ్మెల్సీ కోటా భర్తీలో కూడా అదే ఒరవడిని కొనసాగించారు. ప్రతిపక్షనేతగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలు, ప్రధానంగా దళిత, బడుగు, బలహీనవర్గాలపై ఉన్న చిత్తశుద్ధి ఆకర్షితుడై గత సార్వత్రిక ఎన్నికల ముందు అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీని, తనను నమ్మి వచ్చి అంబాజీపేట మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల సభలో వేలాదిమంది సమక్షంలో ఇచ్చిన మాటకు కట్టుబడి రవీంద్రబాబుకు మండలిలో ప్రాతినిధ్యాన్ని ఖాయం చేశారు.  

వైద్య వృత్తి నుంచి...
దళిత సామాజికి వర్గానికి చెందిన రవీంద్రబాబు వైద్యుడిగా ఢిల్లీలో ఏడేళ్లు పనిచేశారు. అనంతరం ఐఆర్‌ఎస్‌ అధికారిగా ముంబై, కోలకతా, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో కస్ట్‌మ్స్, సెంట్రల్‌ ఎక్సైజ్‌ సర్వీసు టాక్సు కమిషనర్‌గా పనిచేసి 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందారు. ఆ తరువాత వైఎస్సార్‌సీపీలో చేరారు. రవీంద్రబాబు ఉన్నత విద్యావంతుడు కావడం, దళిత వర్గానికి చెందడం, అంబాజీపేట ఎన్నికల సభలో మాట ఇవ్వడంతో ఎమ్మెల్సీగా ఖరారు చేశారు. జిల్లా రాజకీయ చరిత్రలో తొలి సారి దళిత సామాజికవర్గానికి శాసన మండలి సభ్యత్వం ఇచ్చిన ఘనత జగన్‌మోహన్‌ రెడ్డికి దక్కింది. ఈ ఎమ్మెల్సీ ద్వారా తమ సామాజికవర్గంపై సీఎంకు ఉన్న ఆదరణను చెప్పకనే చెబుతోందని ఆ సామాజివర్గం సంతోషం వ్యక్తం చేస్తోంది. కాగా రాష్ట్రంలో మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ను మహిళా విభాగం ప్రతినిధి పెదపాటి అమ్మాజీకి కల్పించడం ద్వారా సీఎం జిల్లాపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

మరిన్ని వార్తలు