అన్యాయపు దర్బారులో అవినీతి మంత్రి ఉమా!

17 Apr, 2018 18:26 IST|Sakshi

చంద్రబాబు, మంత్రి ఉమపై వైఎస్‌ జగన్‌ మండిపాటు

సాక్షి, మైలవరం: అన్యాయపు రాజుగారి దర్బారులో అవినీతి మంత్రి దేవినేని ఉమా అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ముడుపులు ఎంత రావాలో నిర్ణయిస్తే.. వాటిని మూటలు గట్టి ఆయనకు చేర్చి అందులో వాటాలు తీసుకునేవారిలో ఈ మంత్రి ఒకరని నిప్పులు చెరిగారు. ఈ ఇద్దరు చేసిన అవినీతి అంతా ఇంతా కాదని, పట్టిసీమ నుంచి పోలవరం వరకు లాంచాలే లంచాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకురన్నారని ధ్వజమెత్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా మైలవరంలో మంగళవారం జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.  

పట్టిసీమ, పోలవరం, రాజధాని భూములు, ఇసుక మాఫియా.. ఇలా అన్నింటిలోనూ చంద్రబాబు, ఉమా అడ్డంగా దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకునేందుకే ఏకంగా 23, 62 జీవోలను తీసుకొచ్చారని, ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్లకు ఎస్కలేషన్‌ ఇవ్వడానికి అనుమతి లేకున్నా.. వారికి ఎస్కలేషన్‌ ఇచ్చి.. అందులో కమీషన్‌ దోచుకోవడానికి ఈ జీవోలు తీసుకొచ్చారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ఇదివరకే చేసిన పనులకు కూడా ఈ జీవోలను వర్తింపజేసి అడ్డంగా దోచుకున్నారని తెలిపారు. పట్టిసీమలో అడ్డంగా దోచేశారని కాగ్‌ నివేదికలు ఇచ్చినా.. నాకేంటి సిగ్గు అన్నట్టుగా చంద్రబాబు, మంత్రి ఉమా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కళ్లెదుటే లక్షల టన్నుల ఇసుక దోచేస్తున్నారని, సాక్షాత్తూ సీఎం చంద్రబాబే కృష్ణానది ఒడ్డున ఉన్న అక్రమ కట్టడంలో నివసిస్తున్నారని, ఆయన ఇంటిపక్కన కళ్ల ఎదుటనే ఇసుకను ఇష్టానుసారంగా దోచేస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదంటే.. అవినీతి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోందని వైఎస్‌ జగన్‌ అన్నారు.

ఎమ్మెల్యేల నుంచి కలెక్టర్ల వరకు.. కలెక్టర్ల నుంచి మంత్రుల వరకు, మంత్రుల నుంచి చినబాబు వరకు, చినబాబు నుంచి పెద్ద పెదబాబు వరకు లంచాలే, లంచాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. టూరిజం పేరుతో లైసెన్సులు లేని బోట్లను తిప్పి 23 మంది ప్రయాణికుల మరణించారని, అయినా చంద్రబాబు మాత్రం బాధ్యులపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రాజధాని ప్రాంతం నాగార్జున యూనివర్సిటీ పరిసరాల్లో వస్తుందని చెప్పి.. చివరకు తుళ్లూరు ప్రాంతంలో రైతుల నుంచి కారుచౌక ధరకు చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కొనుగోలు చేశారని, రైతులను మోసగించి చంద్రబాబు, ఆయన బినామీలు చేసిన పనికి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసు పెట్టాలని మండిపడ్డారు. తాను, తన బినామీలు కొనుగోలు చేసిన భూములకు ఎక్కువ ధర రావాలని, వాటిని రియల్‌ ఎస్టేట్‌ జోన్‌లో పెట్టారని, మిగతా భూములను మాత్రం వ్యవసాయ జోన్లలో పెట్టి.. రైతులను తీవ్రంగా మోసం చేశారని, దీంతో రాజధాని రైతులు అష్టకష్టాలు పడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానది పక్కనే ఉన్నా మైలవరం నియోజకవర్గంలో తాగడానికి నీళ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఇందుకు నీటిపారుదల శాఖ మంత్రి సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు.

చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లభించలేదని, ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. చంద్రబాబే దళారి కావడం వల్లే.. ఆయనకు హెరిటేజ్‌ షాపులు ఉండటం వల్లే రైతులకు గిట్టుబాటు రావడం లేదని, రైతుల పండించిన పంటలను తక్కువ ధరకు కొనుగోలుచేసి.. వాటినే మళ్లీ ప్యాక్‌ చేసి.. మూడింతలు, నాలుగింత ధరకు అమ్ముకుంటున్న వ్యక్తి సాక్షాత్తు మన సీఎం కాదా అని నిలదీశారు. ముఖ్యమంత్రే దళారి కావడంతో రైతులు గిట్టుబాటు ధర రాక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మరిన్ని వార్తలు